సమీక్ష : 83 – క్రికెట్ గత స్మృతుల విజయకేతనం !

83 Movie Review In Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 24, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకుణే, జీవ, చిరాగ్ పాటిల్, పంకజ్ త్రిపాఠీ, సకీబ్ సలీమ్
దర్శకత్వం : కబీర్ ఖాన్

నిర్మాతలు: మధు మంతెన, విష్ణు ఇందూరి

సంగీత దర్శకుడు: ప్రీతమ్ చక్రవర్తి

సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా

 

బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 83. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ :

భార‌త క్రికెట్ చరిత్ర‌లో ఎప్పటికి మర్చిపోలేని సంవత్సరం ‘1983’. ఈ కథ కూడా 1983 నాటి ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకున్న క్రమాన్ని, ఆ క్రమంలో ఎదురుకున్న ఇబ్బందులను, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అలాగే కపిల్ దేవ్ జీవితం గమనం ఏమిటి ? ఆయన సాధించిన విజయాల వివరాలు తాలూకు సంఘటనల ఏమిటి అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

రణ్ వీర్ సింగే ఈ సినిమాకు ప్రధాన బలం అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. కపిల్ దేవ్ హావభావాలను, నడక తీరును అన్నింటినీ సరిగ్గా పట్టుకొని నటించిన రణ్ వీర్ సింగ్ ను తెరపై చూస్తున్నంతసేపూ కపిల్ దేవ్ కనిపిస్తున్నట్లే అనిపించింది. ముఖ్యంగా కొన్ని భావోద్వేగపూరిత సన్నివేశాల్లో రణ్ వీర్ సింగ్ ను అలా చూస్తూండిపోవాలనేంత అద్భుతంగా ఆయన కపిల్ దేవ్ పాత్రలో జీవించాడు.

ఇక కపిల్ భార్యగా నటించిన దీపికా పడుకోణె కూడా బాగా నటించింది. జీవా, హార్డీ సంధు ఇలా అందరూ నటీనటులు తమ పాత్రలతో, నటనతో సినిమాకు ఓ స్థాయి తీసుకొచ్చారు. ఫస్టాఫ్ మొత్తం అప్పటి ఇండియన్ క్రికెట్‌ కు ఎదురైనా అవమానాలను కష్టాలను ప్రస్తావిస్తూ ఎమోషనల్‌గా సాగింది. అదేవిధంగా 1983 వరల్డ్ కప్‌ ను గెలవడం క్లైమాక్స్ సన్నివేశంగా పెట్టడంతో సినిమా అదిరిపోయే టైమింగ్‌తో ముగిసి మంచి ఫీల్ ఇచ్చింది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ అంటే వరల్డ్ కప్ కి సంబంధించిన భాగాన్ని చూపించినంత బాగా కపిల్ దేవ్ పర్సనల్ లైఫ్ గురించి చెప్పకపోవడమే! కపిల్ దేవ్ కెప్టెన్‌గా ఎలా ఎదిగాడు? లాంటివి కోరే ప్రేక్షకులకు ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు లేవడం నిరాశపరచే అంశమే!

పైగా ఒక్క వరల్డ్ కప్ మీదే చాలా డీటైలింగ్‌తో కథ చెప్పే సరికి సినిమా అంతా బాగా స్లోగా సాగినట్టు అనిపించింది. అదేవిధంగా ఇంట్రెస్ట్ గా సాగని సినిమా రన్‌ టైమ్ కూడా కాస్త ఇబ్బంది పెట్టేదే!

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు కబీర్ ఖాన్ గురించి ప్రస్తావించుకుంటే, ఈ సినిమాతో మరోసారి తన స్థాయికి తగ్గ ప్రతిభ చూపారు. కోట్లాది క్రికెట్ అభిమానులను సంపాదించుకున్న కపిల్ దేవ్ కథను ఎవ్వరికీ తెలియని కోణంలో చెప్పాలన్న ప్రయత్నంలో కబీర్ ఖాన్ తన స్క్రీన్‌ప్లేతో విజయం సాధించాడు. మేకింగ్ పరంగా కూడా సినిమా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కి ఎక్కడా వంక పెట్టడానికి లేదు. సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఒక ఫీల్ తీసుకొచ్చింది. ఎడిటింగ్ కూడా బాగుంది. టెక్నికల్‌గా చూస్తే 83 చాలా రిచ్‌గా ఉందనే చెప్పాలి.

తీర్పు :

లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో ఎలా విజయం సాధించిందనే కోణంలో వచ్చే ఈ చిత్రం ఆకట్టుకుంది. కాకపోతే సినిమా స్లోగా సాగడం, పెద్దగా కమర్షియల్ అంశాలు లేకపోవడం ఈ సినిమాకి మైనస్. కానీ కపిల్ దేవ్ తన ఆటతో గ్రౌండ్‌లో ఎలా కట్టిపడేస్తాడో ఈ సినిమాలో బాగా చూపించారు. ఒక్క మాటలో ఈ సినిమా ‘క్రికెట్ గత స్మృతుల విజయకేతనం’.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :