సమీక్ష : 99 సాంగ్స్ – స్లోగా సాగే మ్యూజికల్ లవ్ డ్రామా !‌

విడుదల తేదీ : ఏప్రిల్ 16, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.5/5

నటీనటులు : ఇహాన్ భ‌ట్‌, ఎడిల్సీ వ‌ర్గ‌స్‌, ఆదిత్య సియోల్‌, మ‌నీషా కొయిరాలా, లీసా రే, టెంజిన్ డ‌ల్హ‌, థామ‌స్ ఆండ్రూస్ త‌దిత‌రులు

దర్శకత్వం : విశ్వేష్ కృష్ణ‌మూర్తి‌

నిర్మాత‌లు : ఎ.ఆర్‌.రెహ‌మాన్

సంగీతం : ఎ.ఆర్‌.రెహ‌మాన్

సినిమాటోగ్ర‌ఫీ : త‌నయ్‌, జేమ్స్ కౌలీ

ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ తొలిసారి ఓ సినిమాకు కథ రాసి, తనే నిర్మించిన సినిమా ’99 సాంగ్స్’. ఈ మూవీ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా శుక్రవారం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. మరి ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకుందో లేదో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

చిన్న‌ప్ప‌ట్నుంచి జయ్ (ఇహాన్ భట్) కు సంగీతమంటే ప్రాణం. జయ్… ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ సింఘానియా (రంజిత్ బారోట్) కుమార్తె సోఫియాతో ప్రేమలో పడతాడు. సంజయ్ సింఘానియా సంగీతానికి సంబంధించిన వ్యాపారాన్ని అప్ప‌జెబుతాన‌ని, అందుకు ఒప్పుకుంటే త‌న కూతురుని ఇస్తాన‌ని చెబుతాడు. కానీ, సంగీతాన్ని వ్యాపారంలా చూడ‌టం త‌న‌కి ఇష్టం లేదని, ఒక్క పాట ప్ర‌పంచాన్ని మార్చేస్తుంద‌ని చెబుతాడు. ఒక్క పాట కాదు… వంద పాట‌లు చెయ్ , వాటితో ఏం మారుస్తావో చూస్తా అంటూ స‌వాల్ విసురుతాడు సోఫీ తండ్రి. అలా పాట‌ల ప్ర‌యాణం మొద‌లుపెట్టిన జైకి జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదుర‌య్యాయి. ?చివరకు అత‌ను అనుకున్నది సాధించాడా ? లేదా ? అసలు అతని పాట ఎవ‌రిపై ఎలాంటి ప్ర‌భావం చూపించింది? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో సంగీతం గొప్పతనాన్ని అలాగే మానసికంగా మనుషుల పై సంగీతం ఎలాంటి ప్రభావం చూపించగలదు. అలాగే సంగీతాన్ని ప్రాణం అనుకున్న జయ్ పాత్ర ద్వారా అలాంటి వ్యక్తులకు ఎదురై అవమానాలను ఇబ్బందులను సినిమాలో చాలా చక్కగా చూపించారు. సంగీతం ప్రాణంగా భావించే జయ్ పాత్రలో ఇహాన్ భట్ ఒదిగిపోయాడు. అదేవిధంగా పాటలు కోసం మొదలైన ప్రయాణంలో అతని నటన కూడా పాత్రకు అనుగుణంగా మారుతూ ఆకట్టుకుంటుంది.

ఇక హీరోయిన్ గా నటించిన ఎడిల్సీ ఈ చిత్రంలో సోఫియా అనే పాత్రలో నటించింది. హీరోతో సాగే లవ్ ట్రాక్ లో అలాగే హీరో కోసం పరితపించే సీన్స్ లో ఆమె నటన చాలా బాగుంది. భావోద్వేగాల్ని ప‌లికించ‌డంలో అనుభ‌వం ఉన్న న‌టుల్లా హీరో హీరోయిన్లు ఇద్దరూ తమ పాత్ర‌ల్లో ఇమిడిపోయారు. లీసారే, మ‌నీషా కొయిరాలా త‌దిత‌ర ప్ర‌ధాన తారాగ‌ణం తమ పాత్రలకు తగ్గట్టు పర్వాలేదనిపించారు. హీరో స్నేహితుడి పాత్ర‌ పోలోకి మంచి ప్రాధాన్యం ఉంది. అలాగే మిలిగిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

చిన్నప్పటి నుండి సంగీతం అంటే ప్రాణం అనుకున్న కుర్రాడు, సంగీతం నేర్చుకోవడానికి, అలాగే ఆ సంగీతాన్ని కంపోజ్ చేయడానికి పడిన కష్టాల నేపథ్యంలో సినిమాను తెరకెక్కించిన విధానం బాగున్నప్పటికీ.. కథాకథనాలు మాత్రం నెమ్మదిగా సాగుతాయి. ఇక హీరో వంద పాటలు కంపోజ్ చేసే క్రమంలో అతను పడిన ఇబ్బందులకు సంబంధించిన సన్నివేశాలను, ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ.. దర్శకుడు మాత్రం వాట్ని సింపుల్ గా నడిపారు.

అయితే సినిమాలో కీలకమైన భాగాన్ని ఎమోషనల్ గా మరియు ఫీల్ కలిగించే విధంగా నడిపిన దర్శకుడు, కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆ ఎమోషన్ని ఆ స్థాయిలోనే కంటిన్యూ చేయలేక పోయాడు. పైగా ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం కూడా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితాన్ని దెబ్బ తీస్తోంది. ఓవరాల్ గా సినిమాటిక్ శైలిని ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లితే మాత్రం నిరాశ తప్పదు.

సాంకేతిక వర్గం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే సంగీతం, క‌థ‌ విభాగాల్లో ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు కథనాన్ని బాగా స్లోగా నడిపినా.. సంగీతానికి సంబంధించిన బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ పాటలతోనే కాకుండా, తన నేపథ్య సంగీతంతో కూడా ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుడి గుండె లోతుల్లోకి తీసుకెళ్లారు.

త‌నయ్‌, జేమ్స్ కౌలీ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. కథకి అనుగుణంగా సినిమాలోని సన్నివేశాలని వాళ్ళు కళ్ళకు కట్టినట్లు చక్కగా చిత్రీకరించారు. అలాగే ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ తొలిసారి ఈ సినిమాకు కథ రాసి, తనే నిర్మించడంతో ఈ ’99 సాంగ్స్’ పై ఆసక్తి క్రియేట్ అయింది. సంగీతం నేపథ్యంలో సాగే సన్నివేశాలు అలాగే సాంగ్స్ బాగున్నప్పటికీ.. కథనం నెమ్మదిగా సాగడం, కీలకమైన సన్నివేశాలను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నా.. వాట్ని సింపుల్ గా నడపడం, ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం వంటి అంశాలు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ప్రతికూలాంశాలుగా నిలుస్తాయి. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోదు.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :