సమీక్ష : అ…ఆ – త్రివిక్రమ్ దిద్దిన అందమైన ప్రేమకథ!

a..aa review

విడుదల తేదీ : 02 జూన్, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

దర్శకత్వం : త్రివిక్రమ్

నిర్మాత :  ఎస్. రాధాకృష్ణ

సంగీతం : మిక్కీ జే మేయర్

నటీనటులు : నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్..

తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు త్రివిక్రమ్ సినిమా వస్తోందంటే దానిపై సినీ అభిమానుల్లో మంచి ఆసక్తి కనిపిస్తూంటుంది. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ..’ కూడా మొదట్నుంచీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. నితిన్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే ఉందా? చూద్దాం..

కథ :

అనసూయ రామలింగం (సమంత) ఓ సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన యువతి. తన తల్లి మహాలక్ష్మి (నదియా) ఇష్టం మేరకే అందరూ నడుచుకోవాల్సిన పరిస్థితుల్లో బతికే అనసూయకు ఈ జీవితం బోరింగ్‍గా కనిపిస్తూంటుంది. ఈ క్రమంలోనే ఓ సారి తండ్రి రామ లింగం (నరేష్) సలహా మేరకు, కొన్ని రోజులు ప్రశాంతంగా గడపాలని అనసూయ తన అత్త ఇంటికి వెళుతుంది. అక్కడే ఆమెకు బావ ఆనంద్ విహారి (నితిన్) పరిచయమవుతాడు. కొద్దిరోజుల్లోనే అనసూయ, ఆనంద్ విహారికి చాలా దగ్గరవుతుంది.

కాగా ఇదే సమయంలో ఆనంద్ విహారి కుటుంబం మాత్రం కొన్ని ఇబ్బందుల్లో ఉంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఆనంద్, పల్లం వెంకన్న (రావు రమేష్) కూతురు నాగవల్లి (అనుపమ)తో పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా అనసూయ తల్లి మహాలక్ష్మికి, ఆనంద్ కుటుంబానికి ఏళ్ళుగా వైరం ఉంటుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అనసూయ, ఆనంద్ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చెప్పుకున్నారా? ఆ ప్రేమ ఫలించిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సున్నితమైన భావోద్వేగాలను, ప్రేమకథల్లో ఉండే కన్ఫ్యూజన్‍ను చాలా తెలివిగా చెప్పడంలో త్రివిక్రమ్ చూపిన ప్రతిభనే ఈ సినిమాకు అన్ని విధాలా ప్రధాన అనుకూలాంశంగా చెప్పుకోవాలి. ఒక పూర్తి స్థాయి ప్రేమకథలో, కుటుంబ బంధాలను కలిపి చెప్పడానికి ఏయే అంశాలు అవసరమో వాటన్నింటినీ త్రివిక్రమ్ పొందిగ్గా పొందుపర్చిన విధానం అబ్బురపరుస్తుంది. ముఖ్యంగా త్రివిక్రమ్‍లోని రచయిత ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరచే స్థాయిలోనే ఉంటాడు. ఈ సినిమాలో క్లైమాక్స్‌లో ఈశ్వరి చెప్పే చిన్న డైలాగ్ కానీ, ఇంటర్వెల్‍లో సమంత పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు కథను పరిచయం చేయడం కానీ, ఇలాంటివి రచయితగా త్రివిక్రమ్ చేసిన మ్యాజిక్కే!

ఇక మొదట్నుంచీ, చివరివరకూ ఈ సినిమాలో వచ్చే సన్నివేశాలన్నీ నవ్విస్తూనో, కదిలిస్తూనో, ఏదో ఒక భావోద్వేగాన్ని బలంగా స్పృశిస్తూనో సాగుతూ ఆద్యంతం ఒక ప్రయాణం చూసిన అనుభూతిని కలిగిస్తాయి. ఇది ఈ సినిమాకు రిపీట్ వ్యాల్యూ తెచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. సినిమా పరంగా చూస్తే, ఈ సినిమాలో ఇంటర్వెల్, క్లైమాక్స్, రావు రమేష్ నేపథ్యంలో సాగే ఉపకథ.. వీటిని హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు.

నటిగా సమంత ఈ సినిమాతో తన స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా కొన్ని చిన్న చిన్న ఎమోషన్స్ పండించడంలో సమంత చూపిన ప్రతిభ కట్టిపడేసేలా ఉంది. నితిన్, ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ నటన ప్రదర్శించాడు. ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబంలో, బాధ్యతలు మోయాల్సిన పరిస్థితుల్లోని ఓ యువకుడిగా నితిన్ నటన చాలా బాగుంది. ఇక రావు రమేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే! ఓ పాత్రతో సినిమాకు స్థాయి తేవాలంటే ఆ పాత్రతో పాటు, అందులో నటించిన నటుడికి కూడా ఆ స్థాయి తీసుకొచ్చేటంత విషయం ఉండాలి. రావు రమేష్ ఈ విషయంలో తెలుగు సినిమాకు దొరికిన మంచి నటుల్లో ఒకరని చెప్పొచ్చు. మళయాలి భామ అనుపమ పరమేశ్వరన్ చూడముచ్చటగా ఉంది. స్క్రీన్‍పై అనుపమ కనిపించినప్పుడల్లా కళ్ళుతిప్పుకోనివ్వనంత అందంగా, తెలివిగా నటించింది. నరేష్, నదియా, ప్రవీణ్, ఈశ్వరి.. ఇలా అందరూ తమ పాత్ర పరిధిమేర బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

అ..ఆ..’ లో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే కొన్ని చోట్ల సినిమా చాలా నెమ్మదిగా సాగడం గురించే మొదట చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు కనిపించాయి. ఇక త్రివిక్రమ్ సినిమాలన్నింటిలానే ఇందులోనూ యాక్షన్ ఎపిసోడ్స్ అక్కడక్కడా కథ స్థాయికి మించి, అసహజంగా కనిపించాయి. అలాగే సినిమా కూడా చాలా నెమ్మదిగా మొదలై అంతే నెమ్మదిగా మొదటి పది నిమిషాలు సాగుతుంది.

ఇక పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్‍స్టోరీలోని కన్ఫ్యూజన్‍ చుట్టూనే తిరిగే ఈ సినిమా, మాస్ అంశాలను, హై లెవెల్ హీరోయిజాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ‘అ..ఆ..’ అన్ని విషయాల్లో పూర్తి స్థాయిలో ఆకట్టుకుందనే చెప్పాలి. తాను చెప్పాలనుకున్న అంశాన్నే తెలివిగా, తాను బాగా అర్థం చేసుకున్న పద్ధతిలోనే అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు త్రివిక్రమ్ చూపిన ప్రతిభ అద్భుతమనే చెప్పాలి. త్రివిక్రమ్ సినిమాల్లో ఎక్కువగా రచయిత దర్శకుడిపై పైచేయి సాధించడం చూస్తూంటాం. ఈ సినిమాలోనూ అదే కనిపిస్తుంది. లోతైన సంభాషణలను అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో త్రివిక్రమ్ ఎప్పటికప్పుడు చూపే నేర్పు సినిమా చూస్తున్నంత సేపూ ముచ్చటగొలిపేలా ఉంటుంది. దర్శకుడిగానూ త్రివిక్రమ్ కొన్నిచోట్ల తన ప్రతిభ చూపారు. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లలో త్రివిక్రమ్‍లోని రచయిత, దర్శకుడు పోటీపడి బయటకొచ్చినట్లు కనిపించింది.

ఇక మిక్కీ జే మేయర్ అందించిన పాటలన్నీ వినసొంపుగా ఉండడంతో పాటు సాహిత్యం పరంగానూ అద్భుతంగా ఉన్నాయి. ఇక ఆయా పాటలు సినిమాలో వచ్చే సందర్భాలు, నేపథ్యాలు కూడా బాగున్నాయి. నటరాజన్ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ఓ స్థాయిని తెచ్చిపెట్టేంత అందంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విజువల్స్‌లో డీటైలింగ్‌ను ఎక్కువ చూపించే త్రివిక్రమ్‌తో కలిసి నటరాజన్ చాలాచోట్ల మ్యాజిక్ చేశారు. ఇక కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ వర్క్ బాగుంది. ఎస్.రాధాకృష్ణ నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టలేం.

తీర్పు :

త్రివిక్రమ్ సినిమాల్లో అందమైన భావోద్వేగాలుంటాయి. ప్రేమలు, బంధాలు, అలకలు, అసూయలు, ఇవన్నీ కలిసిన మనుషులు.. అన్నీ ఉంటాయి. వీటి చుట్టూ తిరిగే కథల గురించి చెప్పినప్పుడల్లా త్రివిక్రమ్‍లోని రచయిత ఎప్పటికప్పుడు కొత్తగా బయటకు వస్తుంటాడు. అ..ఆ..లోనూ త్రివిక్రమ్ ఎప్పుడూ చేసే ఆ మ్యాజిక్ ఉంది. బంధాల్లో గీసుకున్న గీతలు, ప్రేమలోని కన్ఫ్యూజన్ చుట్టూ త్రివిక్రమ్ చెప్పిన ఈ కథ, చెప్పాలనుకున్న విషయాన్ని పొందిగ్గా, అందంగా అల్లిన సన్నివేశాలతో కట్టిపడేసే స్థాయిలోనే ఉందని చెప్పొచ్చు. సమంత, నితిన్, రావురమేష్‍ల నటన, త్రివిక్రమ్ రచన, ప్రాక్టికల్‍గా కనిపించే క్లైమాక్స్.. లాంటి అనుకూల అంశాలతో వచ్చిన ఈ సినిమాలో సెకండాఫ్‍ కాస్త నెమ్మదించడం అన్నది ఒక్కటే చెప్పుకోదగ్గ ప్రతికూలాంశం. ఒక్క మాటలో చెప్పాలంటే.. త్రివిక్రమ్ తన రచనతో అందంగా దిద్దిన ప్రేమకథే ’అ..ఆ..’!!

123telugu.com Rating : 3.5/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More