సమీక్ష : అభిమన్యుడు – స్మార్ట్ ఫోన్లతో జాగ్రత్త

సమీక్ష : అభిమన్యుడు – స్మార్ట్ ఫోన్లతో జాగ్రత్త

Published on Jun 2, 2018 9:50 AM IST
Abhimanyudu movie review

విడుదల తేదీ : జూన్ 01, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : విశాల్, సమంత, అర్జున్

దర్శకత్వం : పిఎస్. మిత్రన్

నిర్మాత : విశాల్

సంగీతం : యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫర్ : జార్జ్. సి.విలియమ్స్

ఎడిటర్ : రూబెన్

స్క్రీన్ ప్లే : పిఎస్. మిత్రన్

విశాల్, సమంతలు జంటగా నటించిన ‘ఇరుంబు తిరై’ చిత్రం ‘అభిమన్యుడు’ పేరుతో ఈరోజే విడుదలైంది. మరి తమిళనాట ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఆవేశపరుడైన ఆర్మీ ఆఫీసర్ కరుణాకర్ (విశాల్) తన కోపం కారణంగా ఆర్మీ నుండి సస్పెండ్ అయి యాంగర్ మేనేజ్మెంట్ టెస్ట్ కోసం సైకియాటిస్ట్ లత(సమంత)ను కలుస్తాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆ తరుణంలోనే తన చెల్లి పెళ్లి కోసం తీసుకున్న లోన్ తాలూకు డబ్బును అతని తండ్రి అకౌంట్ నుండి హ్యాకర్స్ కొట్టేస్తారు.

దాంతో ఆలోచనలోపడ్డ కరుణాకర్ ఆ డబ్బును ఎవరు దోచేశారు అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ పోగా తనలాగే కొన్ని వేలమంది ప్రజల డబ్బును వైట్ డెవిల్ (అర్జున్) వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా హ్యాక్ చేసి దొంగిలించాడని తెలుస్తుంది. అలా వైట్ డెవిల్ గురించి తెలుసుకున్న విశాల్ అతన్ని ఎలా ఎదురుకున్నాడు, అతన్నుండి ప్రజల డబ్బును ఎలా వెనక్కు రాబట్టాడు అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్ అంటే రాసుకున్న కథనే చెప్పాలి. దర్శకుడు మిత్రన్ ప్రస్తుతం సమాజానికి అతిపెద్ద ప్రమాదంగా పరిణమించిన సైబర్ క్రైమ్ ఆధారంగా రాసుకున్న కథ స్మార్ట్ ప్రపంచంలో పూర్తిగా టెక్నాలజీ మీదే ఆధారాపడి బ్రతికే మనుషుల్ని ఆలోచింపజేస్తుంది.

వ్యక్తిగత సమాచారం ఎంత విలువైనది దాన్ని మనం ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాం, ఆ నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఎలా అక్రమాలకు పాల్పడుతున్నారు, డిజిటల్ టెక్నాలజీలోని లొసుగులేమిటి, మనకి తెలీకుండా మన జీవితాన్ని కొందరు వాళ్లకు కావాల్సిన విధంగా ఎలా మానిటర్ చేస్తున్నారు వంటి అంశాలను చాలా క్షుణ్ణంగా చెబుతూ వాటిని వివరించడానికి కథలో మిత్రన్ రూపొందించిన కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

ఇక సైబర్ నేరస్తుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ నటన చాలా బాగుంది. ఆయన పాత్ర వలనే సినిమాలో తీవ్రత కనబడింది. ఇక ద్వితీయార్ధంలో అర్జున్, విశాల్ కు మధ్యన నడిచే ఇంటిలిజెంట్ వార్ తాలూకు సీన్లు కొన్ని ఆసక్తికరంగా సాగుతూ మంచి థ్రిల్ ఇచ్చాయి. విశాల్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేయగా సమంత తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అలరించారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు కథనాన్ని హీరో పాత్ర మీద ఆరంభించిన తీరు బాగానే ఉన్నా ఆ పాత్రలో క్లారిటీ లోపించడం ఇబ్బందికరంగా అనిపించింది. మిత్రన్ కథానాయకుడి పాత్రను ఒక తరహాలో కాకుండా కాసేపు ఆవేశపరుడైన సైనికుడిగా, ఇంకాసేపు సామాన్యుడిలా, మరికాసేపు దేశం వదిలి వెళ్లిపోవాలనుకునే స్వార్థపరుడిగా పలు విధాలుగా మారుస్తూ నడపడంతో కథలో తీవ్రత లోపించింది.

ఇక మొదటి అర్థ భాగం హీరో కుటుంబం మీదే ఎక్కువసేపు నడవడంతో కొంతసేపటికి నీరసం కలిగింది. హీరో ఫ్యామిలీ ద్వారా దర్శకుడు పండిద్దామనుకున్న ఎమోషన్ పెద్దగా వర్కవుట్ కాలేదు. సెకండాఫ్లో కూడా వచ్చే ఇలాంటి కొన్ని సీన్లు ఇబ్బందిపెట్టాయి.

ఇక దర్శకుడు మిత్రన్ మంచి పాయింట్ ను మాటల రూపంలో చెప్పడంలో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యారు కానీ సన్నివేశాల రూపంలో వివరించడంలో పూర్తిగా ప్రేక్షకుడ్ని సంతృప్తిపరచలేకపోయారు.

సాంకేతిక విభాగం :

సినిమా యొక్క నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ వర్క్ సక్రమంగా కుదరడంతో హై స్టాండర్డ్స్ ఉన్న సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. సైబర్ క్రైమ్ ను వివరించడానికి తయారుచేసిన విజువల్స్ బాగున్నాయి. జార్జ్. సి.విలియమ్స్ ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ స్పష్టంగా కనిపించింది. యువ శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటర్ రూబెన్ ఫస్టాఫ్లో కొన్ని ఫ్యామిలీ సన్నివేశాల్ని తొలగించాల్సింది.

ఇక దర్శకుడు మిత్రన్ విషయానికొస్తే పైన చెప్పినట్టు అతను ఎంచుకున్న కథ, సైబర్ సమస్యను వివరించిన తీరు చాలా బాగున్నా బలమైన సన్నివేశాలతో కథనాన్ని తయారుచేసుకుని దాన్ని ఆకట్టునే రీతిలో థ్రిల్లింగా చూపించడంలో పూర్తిగా సఫలం కాలేకపోయారు.

తీర్పు :

‘అభిమన్యుడు’ చిత్రం కాన్సెప్ట్ పరంగా చాలా గొప్పగానే ఉంది. ఈరోజుల్లో సైబర్ నేరగాళ్లు ఎలా ఉన్నారు, మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఎలా అక్రమాలకు పాల్పడుతున్నారు, మనమంతా గొప్పగా ఫీలవుతున్న టెక్నాలజీ మన వినాశనానికే ఎలా కారణమవుతోంది, స్మార్ట్ ఫోన్లతో ఎంత జాగ్రత్తగా ఉండాలి వంటి అంశాలను మిత్రన్ వివరించడం, ఆకక్తికరంగా సాగే సినిమా ద్వితీయార్థం, అర్జున్ పాత్ర ఆకట్టుకోగా ముఖ్యమైన సన్నివేశాల్లో తీవ్రత లోపించడం, ఫస్టాఫ్ బోర్ కొట్టించడం వంటివి నిరుత్సాహానికి గురిచేశాయి. మొత్తం మీద ఆలోచన గొప్పగా ఆచరణ అంతంత మాత్రంగా ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులకు పర్వాలేదనిపిస్తుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు