సమీక్ష : అఖిల్ – అభిమానులను మెప్పించే అఖిల్

Akhil review

విడుదల తేదీ : 11 నవంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : వివి వినాయక్

నిర్మాత : నితిన్

సంగీతం : అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్

నటీనటులు : అఖిల్, సయేషా సైగల్, బ్రహ్మానందం..


గత కొద్ది రోజులుగా టాక్ అఫ్ ది టౌన్ గా మారి అక్కినేని అభిమానులతో పాటు, సినీ వర్గాలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘అఖిల్’. ఈ సినిమాకి ఎందుకింత క్రేజ్ అంటే.. అక్కినేని ఫ్యామిలీ మూడవతరం నట వారసుడు, నాగార్జున – అమలల ముద్దుల తనయుడు అఖిల్ తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ అఖిల్ ని లాంచ్ చేస్తూ చేసిన ఈ సినిమాని నితిన్ నిర్మించాడు. ‘అఖిల్’ నేడు దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్ మొదటి సినిమాతో వారి ఆశలను ఎంతవరకూ నిజం చేసాడనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఈ కథ మొత్తం జువా అనే బాల్ గురించి కాబట్టి ముందుగా దాని పరిచయం – సూర్యుడి నుంచి విడిపోయిన భూమి మళ్ళీ సూర్యునికి దగ్గరవుతూ ఉండడం వలన భవిష్యత్తులో భూమి మీద ప్రళయం వస్తుందని అప్పటి ఋషులు సూర్య కవచం ఆలియాస్ జువా అనే ఒక బాల్ ని తయారు చేసి భూమధ్య రేఖపై ఆఫ్రికాలోని ఓజా ప్రజలు నివసించే ప్రాంతంలో ప్రతిష్టిస్తారు. ప్రతి సూర్యగ్రహణం రోజు మొదటి సూర్య కిరణాలు దానిమీద పడాలి అలా పడలేదు అంటే ప్రళయం సంభవిస్తుంది.

ఇక కథలోకి వెళితే.. రష్యన్ సైంటిస్ట్ అయిన కతోర్జి ఆ జువా విలువ తెలుసుకొని దానిని దక్కించుకోవాలని చూస్తాడు. కానీ బోడో అనే అతను దానిని తీసుకెళ్ళి సీక్రెట్ ప్లేస్ లో దాచి పెట్టేస్తాడు. అక్కడి నుంచి కట్ చేస్తే.. అఖిల్(అఖిల్) నేటితరం కుర్రాళ్ళలా ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా లైఫ్ ని ఎంజాయ్ చేసే మెంటాలిటీ ఉన్న కుర్రాడు. చూడటానికి సింపుల్ గా ఉన్నా అవసరం అయితే ఎంతటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయగలిగినవాడే మన అఖిల్. అలా హైదరబాద్ లో స్ట్రీట్ ఫైట్ బెట్టింగ్స్, కాలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేసే అఖిల్ దివ్య (సయేషా సైగల్)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ దివ్యకి అప్పటికే పెళ్లి సెటిల్ అయ్యి ఉంటుంది, కానీ దానిని అఖిల్ సీక్రెట్ గా చెడగొట్టడంతో దివ్య హైదరాబాద్ వదిలి స్పెయిన్ వెళ్ళిపోతుంది. దివ్యని వెతుక్కుంటూ స్పెయిన్ వెళ్ళిన అఖిల్ ఫైనల్ గా దివ్యని ప్రేమలో పడేస్తాడు.

కానీ ఒక చిన్న విషయంలో దివ్య అఖిల్ ని వదిలి వెళ్ళిపోతాను అంటుంది. అదే టైంలో అఖిల్ గురించి తెలుసుకున్న దివ్య ఫాదర్ మహేష్ (మహేష్ మంజ్రేకర్) అఖిల్ ని చంపాలని ప్రయత్నం చేస్తాడు. అదే టైంలోనే జువా కోసం వెతుకుతున్న మోంబో దివ్యని కిడ్నాప్ చేస్తాడు. జువా కోసం దివ్యని మోంబో ఎందుకు కిడ్నాప్ చేసాడు? జువాకి దివ్యకి ఉన్న సంబంధం ఏంటి? దివ్యను కాపాడాలని మోంబో ప్రాంతానికి వెళ్ళిన అఖిల్ దివ్యను కాపాడుకోవడం కోసం జువాని తెస్తాను అంటాడు? ఫైనల్ గా అఖిల్ జువాని సాధించాడా లేదా? సాధించిన దాన్ని కత్రోజికి ఇచ్చాడా లేక భూ ప్రళయాన్ని ఆపడానికి ట్రై చేసాడా.?అన్నదే మీరు చూసి తెలుసుకోవాల్సిన సస్పెన్స్ స్టొరీ.

ప్లస్ పాయింట్స్ :

అఖిల్ మొదటి సినిమా కాబట్టి అతని నుంచే మొదలు పెడతా..అక్కినేని అభిమానులంతా అఖిల్ ని ఎలా చూపిస్తాడో ఎలా ఫైట్స్ చేస్తాడో అని ఎదురు చూసారు. అభిమానుల దాహాన్ని తీర్చేలానే అఖిల్ తన మొదటి సినిమాలో కనిపించాడు. మొదటి సినిమాలోనే అదిరిపోయే స్టంట్స్ మరియు డాన్సులతో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించుకున్నాడు. చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్ తో ఆడియన్స్ చేత విజిల్స్ వేయించిన అఖిల్ వేసిన స్టెప్స్ అందరి చేత అరుపులు పెట్టిస్తాయి. అలాగే కొన్ని పంచ్ డైలాగ్స్ లో అఖిల్ డైలాగ్ మాడ్యులేషన్ బాగుంది. ఓవరాల్ గా అఖిల్ మాత్రం పవర్ అఫ్ అఖిల్ ని చూపాడు. ప్రతి నటుడు మొదటి సినిమాకే 100% నటనని చూపించలేడు, అలాగే అఖిల్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా హాస్యం పండిచే విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలి. అక్కినేని ఫ్యామిలీలో యాక్షన్ సినిమాకి, సూపర్బ్ డాన్సులకి కేరాఫ్ అడ్రస్ గా అఖిల్ మారే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది.

ఇక అఖిల్ అనే సినిమాకి ప్రాణంగా నిలిచిన ఎపిసోడ్స్ విషయానికి వస్తే.. సినిమా ప్రారంభం. జువా ప్రాముఖ్యత గురించి చెప్పే ఆర్ట్ వర్క్ బాగుంది. అఖిల్ ఇంట్రడక్షన్ ఫైట్ అండ్ సాంగ్ చూడగానే ప్రేక్షకులు అబ్బ.. అదరగొట్టేసాడు అనకుండా ఉండలేరు. ఆ తర్వాత కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ మీ పెదాలపై నవ్వు తెప్పిస్తాయి. ఆ తర్వాత ఇంటర్వల్ యాక్షన్ ఎపిసోడ్ బాగుంది. సెకండాఫ్ లో అఖిల్ చేసిన కొన్ని రిస్కీ స్టంట్స్ బాగున్నాయి. ఓవరాల్ గా 130 నిమిషాల రన్ టైం కూడా సినిమాని ప్లస్ అయ్యింది. పాటల పిక్చరైజేషన్ చాలా బాగుంది. అక్కినేని పాటలో నాగార్జున ఎంట్రీ అండ్ నాగార్జున వేసిన ఎనర్జిటిక్ స్టెప్స్ కాసేపు మంచి ఊపు తెస్తాయి.

ఇక సినిమాలోని మిగిలిన నటీనటుల విషయానికి వస్తే.. సయేషా సైగల్ కి ఇది మొదటి మూవీ అయినప్పటికీ పెర్ఫార్మన్స్ పరంగా మంచి మార్కులే కొట్టేసింది. లిప్ సింక్, సీన్ కి తగ్గా హావభావాలని ఇస్తూ మెప్పించింది. కొన్ని సాంగ్స్ లో సయేషా డాన్సుల్లో చూపించిన ఈజ్ కొన్ని చోట్ల అఖిల్ ని డామినేట్ చేస్తుంది. అఖిల్ ఫాదర్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ మంచి నటనని కనబరిచి ఆడియన్స్ కి లైట్ గా సెంటిమెంట్ టచ్ ని ఇచ్చాడు. ఇక కమెడియన్స్ గా కనిపించిన బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరిలు ఓకే ఓకే అనిపించేలా నవ్వించారు.

మైనస్ పాయింట్స్ :

పైన చెప్పినట్టు అబ్బా అదిరింది అనే రేంజ్ లో సినిమాని మొదలు పెట్టిన వినాయక్ ఆ తర్వాత సినిమా వేగాన్ని సడన్ గా తగ్గించేసి రొటీన్ కామెడీ ఫ్లేవర్ లోకి తీసుకెళ్ళిపోయాడు. అలాగే కాలేజ్ ఎపిసోడ్స్ లో వచ్చిన సీన్స్ లో అక్కడక్కడా కామెడీ బాగానే అనిపించినప్పటికీ సీన్స్ మాత్రం యాజిటీజ్ గా మనం ఇదివరకూ ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా స్టార్టింగ్ లోనే అసలు కథ ఏంటో చెప్పేసి, దేనికోసం ఇక కథ జరుగుతుంది అనే విషయాన్ని చెప్పేయడం వలన మొదటి నుంచి చివరి దాకా అంతా ఊహాజనితంగా మారిపోతుంది. ఇక ఇంటర్వల్ బ్లాక్ లో వచ్చే ట్విస్ట్ ని కూడా ముందే మనం ఊహించేయవచ్చు. కథా పరంగా జువా అనే కాన్సెప్ట్ తప్ప మిగతా అంతా మన రొటీన్ గా రాసుకోవడం ఈ సినిమాకి మరో మైనస్ పాయింట్.

అఖిల్ సినిమాకి మరో మేజర్ మైనస్.. సెకండాఫ్.. కథనంలో అస్సలు కిక్ లేకపోవడం వలన ఊహించిందే జరుగుతోంది అని ఆడియన్స్ ఫీలవుతున్న టైంలో నవ్వించాలనే తాపత్రయంతో కామెడీని ఇరికించాలని ట్రై చేసారు. ఆ కామెడీ పెద్దగా నవ్వించలేకపోవడం సినిమాకి మైనస్. సెకండాఫ్ లో హీరోయిన్ రోల్ తక్కువ అలాగే, సెకండాఫ్ లో వచ్చే పాటలు చూడటానికి బాగున్నా అసందర్భంగా వచ్చి సినిమా వేగాన్ని దెబ్బ తీస్తాయి. సినిమా ఆలస్యానికి కారణమైన గ్రాఫిక్స్ కూడా చెప్పుకునే స్థాయిలో లేకపోవడం మరో మైనస్. సినిమాకి కీలకం అయిన మెయిన్ పాయింట్ ని క్లైమాక్స్ లో చాలా ఫాస్ట్ గా హడావిడిగా ముగించడం అంతగా ఆకట్టుకోలేదు. వినాయక్ సినిమాల్లో నెగటివ్ రోల్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది కానీ ఇందులో మాత్రం విలన్ రోల్ అనేదాన్ని పవర్ఫుల్ గా చూపే ప్రయత్నమే చేయలేదు.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ లో సినిమాకి బాగా హెల్ప్ అయిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే బాగా ఫెయిల్ అయిన డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి.. ఒక్కొక్కదాని గురించి మాట్లాడుకుంటే.. సినిమాకి మొదటి బలం స్టొరీ లైన్ మరియు పూర్తి కథ – వెలిగొండ శ్రీనివాస్ ఎంచుకున్న జువా బ్యాక్ డ్రాప్ స్టొరీ లైన్ బాగుంది, దానికోసం అనుకున్న ఆఫ్రికా నేపధ్యమూ బాగుంది. కానీ పూర్తి కథను రాసుకున్న విధానం మాత్రం చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉంది. కథ రొటీన్ అయినా కథనం బాగుంటే సరిపోయేది కానీ వినాయక్ రాసుకున్న కథనంలో ఆడియన్స్ ని కథకి హుక్ చేసే సస్పెన్స్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడం, ఉన్న జువా పాయింట్ ని సినిమా మొదట్లోనే చెప్పేయడం సినిమాకి మరో పెద్ద మైనస్ అయ్యింది. వినాయక్ ఒక కమర్షియల్ డైరెక్టర్ గా కొన్ని కమర్షియల్ అంశాలను మాత్రం పర్ఫెక్ట్ గా చూపించాడని చెప్పాలి. మిగతా కొన్ని కీలక అంశాల్లో వినాయక్ తన మార్క్ తో మెప్పించలేకపోయాడనే చెప్పాలి. ముఖ్యంగా వినాయక్ సినిమాల్లో కామెడీని బాగా పడుతుంది కానీ ఇందులో కామెడీ కూడా అనుకున్న స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు.

ఇక మిగిలిన వాటిల్లో అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ బాగుంది. స్పెయిన్ లో, బ్యాంకాక్ లో షూట్ చేసిన ప్రతి ఎపిసోడ్ ని చాలా కలర్ఫుల్ గా గ్రాండ్ గా ఉండేలా చూపించాడు. అనూప్ రూబెన్స్ – తమన్ అందించిన పాటలు బాగున్నాయి, కానీ ఆ పాటలకి మంచి లొకేషన్స్, పిక్చరైజేషన్ మరియు అఖిల్ డాన్సులు తోడవడంతో సినిమాలో చూడటానికి చాలా చాలా బాగున్నాయి. ఇకపోతే మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం సినిమాలోని చాలా సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో మ్యూజిక్ ఆడియన్స్ ని పీక్స్ కి తీసుకెళ్తుంది. గౌతంరాజు చాలా వరకూ ఎడిట్ చేసి మనకు ట్రిమ్ వెర్షన్ అందించారు. దీనివలన సినిమా సడన్ గా జంప్ అవుతూ ఉన్నట్టు ఉంటుంది, అలాగే ట్రిమ్ వెర్షన్ లో కూడా అక్కడక్కడా సాగాదీత కనపడుతుంది. ఎస్ఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. రవివర్మ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సింప్లీ సూపర్బ్.. కోన వెంకట్ డైలాగ్స్ చాలా వరకూ బాగానే పేలాయి. ఇక చాలా కర్చు పెట్టి చేసిన సిజి వర్క్ అయితే ఆకట్టుకునేలా లేదు. ఫైనల్ గా నితిన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ విలువలు కథా పరంగా బాగా రిచ్ గా కనిపిస్తాయి. వీరు అంత పెట్టినా సిజి విజువల్స్ ని కేక అనుకునేలా చూపించలేకపోవడం బాధాకరం.

తీర్పు :

‘మనం’ సినిమా చూసి అఖిల్ అభిమానులు మా అఖిల్ మొదటి సినిమాలో ఇరగదీసి ఉంటాడు అని ఎంతో దాహం మీదున్న అభిమానుల దాహాన్ని తీర్చేలా ఉంది ‘అఖిల్’. ఒక కమర్షియల్ హీరోగా లాంచ్ అవ్వడానికి కావాల్సిన అన్ని అంశాలు ఈ అఖిల్’ సినిమాలో ఉన్నాయి, వాటన్నిటినీ పర్ఫెక్ట్ గా మేనేజ్ చేసి మార్కులు కొట్టేసాడు అఖిల్. ఇప్పటి వరకూ అక్కినేని అభిమానులు చూడని స్టన్నింగ్ స్టంట్స్ మరియు సూపర్బ్ డాన్సులతో ఫ్యాన్స్ కి దీపావళి బ్లాస్ట్ ఇచ్చాడు. అఖిల్, సయేషా సైగల్, స్టొరీ లైన్ మరియు మాస్ ని మెప్పించే కమర్షియల్ అంశాలు సూపర్బ్ అనిపిస్తే.. కథా విస్తరణ, కథనం, సెకండాఫ్ సినిమాకి నెగటివ్స్ గా చెప్పుకోవాలి. కథ – కథనాలు రొటీన్ అనే విషయాన్ని పక్కన పెడితే ఓ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోని లాంచ్ చేసేటప్పుడు ఏ ఏ అంశాలు ఉండాలని అభిమానులు కోరుకుంటారో ఆయా అంశాలు ఇందులో ఉన్నాయి. కావున అఖిల్ పరంగా సినిమాని చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ గా అక్కినేని అభిమానులు మాకూ ఓ కమర్షియల్ హీరో వచ్చాడు అని చెప్పుకునే సినిమా ‘అఖిల్’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :