సమీక్ష : అలా ఎలా? – ఓన్లీ ఫర్ యూత్

Ala-Ela-review1 విడుదల తేదీ : 28 నవంబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : అనీష్ కృష్ణ
నిర్మాత : అశోక్‌ వర్ధన్
సంగీతం : భీమ్స్
నటీనటులు : రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, షాని, భానుశ్రీ మెహ్రా, ఖుషి, హెబ్బా పటేల్

‘అందాల రాక్షసి’ సినిమా తర్వాత సోలో హీరోగా విజయం కోసం ఎదురుచూస్తున్న యువ హీరో రాహుల్ రవీంద్రన్ ఈ శుక్రవారం ‘అలా ఎలా ?’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెన్నెల కిషోర్, షానిలు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ద్వారా అనీష్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అశోక్ వర్ధన్ నిర్మాత. రాహుల్ కోరుకున్న విజయాన్ని ఈ సినిమా అందించిందా..? లేదా..? ఒకసారి చూడండి.

కథ :

కార్తీక్ (రాహుల్ రవీంద్రన్) హైదరాబాద్ లోని ఓ ఐటి కంపెనీలో ఉద్యోగి. రాజోలులోని తన స్నేహితుడి కుమార్తె దివ్య ను పెళ్లి చేసుకుని తన చివరి కోరిక తీర్చమని చనిపోయే ముందు కార్తీక్ చేత తాతయ్య ఒట్టు వేయించుకుంటాడు. మొదట ఈ పెళ్లి చేసుకోవడానికి అయిష్టత వ్యక్తం చేసిన కార్తిక్… కట్నం ఎక్కువ ఇస్తున్నారని ఓకే అంటాడు. ఈ-మెయిల్ లో అందమైన పెళ్లి కూతురు ఫోటో చూసిన తర్వాత వెంటనే పెళ్ళికి రెడీ అయిపోతాడు. అయితే పెళ్ళికి 10 రోజులు ముందు తన క్లోజ్ ఫ్రెండ్స్ కీర్తన్ (వెన్నెల కిషోర్), కళ్యాణ్ (షాని)లతో కలసి ఒక ప్లాన్ వేస్తాడు. తనే పెళ్లి కొడుకు అని చెప్పకుండా దివ్య మనసులో స్థానం సంపాదించాలని ఫ్రెండ్స్ తో కలసి రాజోలు ప్రయాణం అవుతాడు.

కార్తీక్ వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యిందా..? లేదా..? మధ్యలో ఈ శృతి ఎవరు..? శృతిని కార్తీక్ ఎందుకు ప్రేమించాడు..? చివరికి కార్తీక్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు..? ఎవరు వేసిన ప్లాన్ లో ఎవరు చిక్కుకున్నారు..? అనేది మిగతా సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

క్యారెక్టర్లకు సూటయ్యే నటులను ఎంపిక చేసుకోవడంలో దర్శకుడు అనీష్ కృష్ణ 100% సక్సెస్ అయ్యాడు. అతని నమ్మకాన్ని రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, షానిలు ఎక్కడా వమ్ము చేయలేదు. చక్కని నటన కనబరిచారు. కార్తీక్ పాత్రలో రాహుల్ ఒదిగిపోయాడు. షాని గెటప్, అతని క్యారేక్టరైజేషన్ బాగున్నాయి. వెన్నెల కిషోర్ సినిమా స్టార్టింగ్ నుండి ఎండ్ కార్డు పడేవరకూ తన పంచ్ డైలాగులతో నవ్వించాడు. అత్యంత సహజంగా నటించాడు. అతని కామెడీ టైమింగ్ సింప్లీ సూపర్బ్. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలలో వీరు ముగ్గురూ కలసి చేసిన హడావుడి థియేటర్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. పాత్ర పరిధి తక్కువైనా కృష్ణ భగవాన్, కొండవలసలు తమ నటనతో, పంచ్ డైలాగులతో ఆకట్టుకున్నారు.

భీమ్స్ మ్యూజిక్, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం పోశాయి. ఒక్క ఐటెం సాంగ్ మినహా మిగతా పాటలన్నీ సంగీత పరంగా, సాహిత్య పరంగా బాగున్నాయి. కథను ముందుకు తీసుకువెళ్ళడంతో తమ తోడ్పాటును అందించాయి. అందమైన పాటలను అంతే అందంగా చిత్రీకరించాడు సాయి శ్రీరామ్. ప్రతి ఫ్రేమ్ ను బ్యూటిఫుల్ పెయింటింగ్ లా చిత్రీకరించాడు. గోదావరి అందాలను, పల్లెటూరి సొగసులను తెరపై అందంగా, అద్బుతంగా చూపించాడు.

మైనస్ పాయింట్స్ :

సరదా కామెడీ సన్నివేశాలతో సినిమా సాగిపోతున్నా ఇంటర్వెల్ వరకూ అసలు కథలోకి వెళ్ళలేదు. హీరోయిన్లు ఖుషి, హెబ్బా పటేల్, భానుశ్రీ మెహ్రాల నటన సినిమాకు మైనస్ పాయింట్. ఒక్క హీరోయిన్ నటన కూడా ఆకట్టుకునేలా లేదు. సినిమా పాయింట్ చిన్నది కావడంతో ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులపై అంతగా ఇంప్రెషన్ చూపలేకపోయింది. ప్రేక్షకులలో ఏదో తెలియని వెలితి.

రొమాంటిక్ సన్నివేశాలలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు, ఎక్కడా లవ్ ఫీల్ కలగలేదు. ఇన్ ఫాక్ట్, అక్కడ కూడా కామెడీ రొమాన్స్ ను డామినేట్ చేసింది. ప్రీ క్లైమాక్స్ తర్వాత ఏం జరుగుతుందో..? ప్రేక్షకులు ఈజీగా ఊహించగలరు.

సాంకేతిక విభాగం :

సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా ఒక లో బడ్జెట్ సినిమా అనే ఫీలింగ్ ప్రేక్షకులలో కలగదు. భారి బడ్జెట్ కమర్షియల్ సినిమాలకు తీసిపోని రీతిలో ‘అలా ఎలా?’ సినిమాను తీర్చిదిద్దారు. ప్రతి ఒక్క టెక్నీషియన్ నుండి తన కావలసిన అవుట్ పుట్ రాబట్టుకున్నాడు దర్శకుడు. పాటలతో పాటు భీమ్స్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. శృతి పాత్రకు పాత్రకు చిన్మయి చెప్పిన డబ్బింగ్ సన్నివేశాలలో ఫీల్ ను మరింత ఎలివేట్ చేసింది. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ డీసెంట్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్రతి సన్నివేశంలో దర్శకుడి ముద్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. తనకున్న బడ్జెట్ పరిమితులలో ఒక చక్కని అందమైన కథ రాసుకున్నాడు అనీష్ కృష్ణ. అతను కథను నడిపించిన తీరు, కామెడీ సన్నివేశాల్లో రాసిన పంచ్ డైలాగులు సినిమాను పరుగులు పెట్టించాయి. అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమా తెరకెక్కించాడు. కథలో సస్పెన్స్ ఎలిమెంట్ ను చివరి వరకు మెయింటైన్ చేసి థ్రిల్ కలిగించాడు.

తీర్పు :

రాహుల్ రవీంద్రన్ నటన, వెన్నెల కిషోర్ పంచ్ డైలాగులు, భీమ్స్ మ్యూజిక్, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్స్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ నవ్విస్తుంది. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు పండగ. హీరోయిన్ల నటన, ఫస్ట్ హాఫ్ కొంత మైనస్ గా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా థియేటర్ కు వెళ్ళిన ప్రేక్షకులకు నవ్వుల విందు భోజనం పెట్టి పంపిస్తుంది. అందులో సందేహం అవసరం లేదు. కేవలం యూత్ ను అట్రాక్ట్ చేస్తూ సినిమా ఇది. మొత్తానికి ‘అలా ఎలా?’ సినిమాతో రాహుల్ రవీంద్రన్ హిట్ కొట్టాడు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :