వర్టికల్ ఫార్మాట్‌లో వచ్చిన ‘దందా’ సిరీస్ డిజిటల్ స్పేస్‌లో ఆకట్టుకుంటోంది. చాయ్ షాట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సిరీస్‌తో ఆదిత్య దేవులపల్లి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రయాణంతో పాటు ‘దందా’ విశేషాలను వెల్లడించారు.
జర్నలిజం నుంచి దర్శకత్వం వైపు..
సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇంజనీరింగ్ మధ్యలోనే ఆపేసి ఫోటోగ్రఫీ, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు చేసినట్లు ఆదిత్య తెలిపారు. ఆ తర్వాత జర్నలిస్టుగా పనిచేస్తూ చిత్రపరిశ్రమలో పరిచయాలు పెంచుకున్నానన్నారు. ఆ క్రమంలోనే చాయ్ బిస్కెట్ బృందానికి కథ చెప్పే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. చాయ్ షాట్స్‌లో క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన అనుభవంతో, వర్టికల్ ఫార్మాట్‌లో సరికొత్తగా ప్రయత్నించాలనే ఆలోచనతోనే ‘దందా’ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు చెప్పారు.
కథలో మార్పులు.. మైక్రో డ్రామా మేకింగ్ సవాళ్లు
విజయ్ కుమార్ రాసిన మూల కథకు పాత్రల నేపథ్యాలు, కొన్ని సన్నివేశాలలో మార్పులు చేస్తూ దాదాపు 40 శాతం స్క్రిప్ట్‌ను తిరగరాసినట్లు ఆదిత్య స్పష్టం చేశారు. మైక్రో డ్రామా ఫార్మాట్ గురించి ఆయన మాట్లాడుతూ.. “సాధారణ సినిమాల్లో సన్నివేశాన్ని నిర్మించడానికి సమయం ఉంటుంది. కానీ వర్టికల్ కంటెంట్‌లో మొదటి సెకన్ నుంచే వీక్షకులను ఆకట్టుకోవాలి. సరైన పేసింగ్ లేకపోతే బిగ్ స్క్రీన్ డైరెక్టర్లు కూడా ఈ ఫార్మాట్‌లో ఇబ్బంది పడతారు. అందుకే సినిమాల కంటే మైక్రో డ్రామాలు తీయడమే చాలా కష్టం” అని వివరించారు.
ఒకే టేక్‌లో సుదీర్ఘ సంభాషణ..
కథానాయకుడు దొరసాయి తేజ కాస్టింగ్ గురించి చెబుతూ.. కథ వినగానే తేజ ఈ ప్రాజెక్ట్‌ను బలంగా నమ్మాడని తెలిపారు. చిత్రీకరణ సమయంలో తన విజన్‌ను అనుసరిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచాడని ప్రశంసించారు. ముఖ్యంగా 28వ ఎపిసోడ్‌లోని ఒక సుదీర్ఘ సంభాషణను (మోనోలాగ్) సింగిల్ టేక్‌లోనే పూర్తి చేశాడని ఆదిత్య వెల్లడించారు. భవిష్యత్తులో తేజతో మరో ప్రాజెక్ట్ చేసే ఆలోచన ఉందన్నారు.
సాంకేతిక బృందం ప్రతిభ
సైబర్ నేరాల నేపథ్యంతో సాగే ఈ కథకు దృశ్యాలు, సంగీతం అత్యంత కీలకమని, ఛాయాగ్రాహకుడు అశ్విన్ లెనిన్, సంగీత దర్శకుడు రిషి అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారని చెప్పారు. సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూనే, వినోదాత్మకంగా ఉండేలా ఈ సిరీస్‌ను మలిచినట్లు తెలిపారు.
ఇక తన తర్వాతి ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం 50 ఏళ్ల నేరస్థుడి చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన కథపై పనిచేస్తున్నానని, రాబోయే రెండు మూడు నెలల్లో దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని ఆదిత్య ముగించారు.


