Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : అలౌకిక – భయపెట్టలేకపోయిన హర్రర్ మూవీ.!

Aloukika

విడుదల తేదీ : 23 ఏప్రిల్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

దర్శకత్వం : భానుకిరణ్ చల్లా

నిర్మాత : జె. రామారావు

సంగీతం : ప్రమోద్ కుమార్

నటీనటులు : మనోజ్ నందం, మిత్ర, మాదాల రవి….


హర్రర్ కామెడీ జోనర్ లో ఈ మధ్య తెలుగులో చాలా సినిమాలు వస్తున్నాయి.. అదే దారిలోనే ఆడియన్స్ కాస్త భయం, కాస్త కామెడీ, కాస్త టెన్షన్ పడే అన్ని అంశాలను మేళవించి భానుకిరణ్ చల్లా చేసిన సినిమానే ‘అలౌకిక’. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ ఫేం మనోజ్ నందం హీరోగ్ మిత్ర హీరోయిన్ గా మాదాల రవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని జె. రామారావు నిర్మించాడు. ఈ రోజు ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ హర్రర్ కామెడీ ఎంత వరకూ ప్రేక్షకులను నవ్వించి, భయపెట్టిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

విశ్వ(మనోజ్ నందం), సౌమ్య(మిత్ర), పీకే(రాఘవ), స్నిగ్ద (హరిని), గణేశ్ మంచి ఫ్రెండ్స్. ఈ ఐదుగురు కలిసి తమ ఫ్రెండ్ సంధ్య పెళ్లి కోసం వైజాగ్ బయలుదేరుతారు. షార్ట్ కట్ అని అడవి మార్గంలో వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అడవి మార్గ మధ్యంలో సడన్ గా వారి కారు ఆగిపోతుంది. వారి కారు ఆగిన ప్లేస్ కి దగ్గరలో ఒక భవనం ఉంటుంది.

ఆ రాత్రి అక్కడే ఉందాం అని లోపలికి వెళ్తారు. ఆ ఇంట్లో అన్ని సదుపాయాలు ఉన్నా ఎవరూ కనిపించరు, సడన్ గా వాళ్ళకి చిత్ర విచిత్రమైన సౌండ్స్, అరుపులు వాళ్ళని భయపెడుతుంటాయి.. అసలు అలా ఎందుకు జరుగుతుందా అని తెలుసుకోవాలని ట్రై చేసిన వారికి కొన్ని విషయాలు తెలుస్తాయి. వారు తెలుసుకున్న విషయం ఏమిటి? అసలా ఇంట్లో ఎందుకు అలా జరుగుతుంది? అసలు దెయ్యం ఉందా? లేదా? అన్నది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే…

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్లస్.. ప్లస్.. ప్లస్ అంటే… ఒకటి రెండు ఉన్నాయి కానీ అవి సినిమా కథకి ఏ మాత్రం సంబంధం ఉండవు. సినిమాలో ది బెస్ట్ రిలీఫ్ పాయింట్ అంటే సెకండాఫ్ లో వచ్చే తాగుబోతు రమేష్ పాత్ర. తను ఉన్న 15 నిమిషాలు ఆడియన్స్ కాస్త నవ్వుకుంటారు. జబర్దస్త్ గ్యాంగ్ తో కలిసి తాగుబోతు రమేష్ చేసిన ఎపిసోడ్ బాగుంది. కానీ సినిమాలో ఎందుకు వస్తుంది అని మాత్రం అడగకండి. ఇకపోతే అవసరం లేని పాటల్లో హీరోయిన్ మిత్ర మరియు ఐటెం గర్ల్ ఒలకబోసిన అందాలు ముందు బెంచ్ వారిని ఆకట్టుకుంటాయి. ఇకపోతే మనోజ్ నందం, కమెడియన్ రాఘవ, మాదాల రవి, బ్రహ్మాజీ, ఉత్తేజ్ లు తమ పెర్ఫార్మన్స్ లతో పరవాలేధనిపించారు. చివర్లో ఇచ్చే మెసేజ్ – ‘ఏదో బాధ కలిగిందని క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు’ అని చెప్పడం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే.. సినిమాకి కథే ప్రాణం అంటారు.. ఇందులో కథలేదు, కథ ఎంచుకున్న పాయింట్ స్ట్రాంగ్ గా లేదు. చివరికి అట్టట్ట చూపించాలనుకున్న పాయింట్ అన్నా కొత్తదా అంటే అదీ కాదు.. రొటీన్ అనే పదానికే సిగ్గేసేలా ఈ సినిమా పాయింట్ ఉంది. సరే కథలేకపోయినా కథనంతో అన్నా ఆకట్టుకున్నాడా అంటే అదీ లేదు. పోనీ హర్రర్ ఎలిమెంట్స్ లేదా కామెడీ ఎలిమెంట్స్ అన్నా కథలో ఉన్నాయా అంటే అదీ లేదు. ఏ ఒక్క పాత్రకి సరైన జస్టిఫికేషన్ లేదు. అసలు ఎవరి పాత్ర ఎందుకు వస్తుంది, ఏం చేస్తుంది అన్న క్లారిటీ లేదు. కథలో కంటెంట్ లేకపోయినా పాటలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకి ఇంటర్వెల్ ముందు ఏదో సస్పెన్స్ చూపించడం మొదలు పెడతాడు, ఎందుకు కట్ చేస్తారో తెలియదు మధ్యలో హీరో – హీరోయిన్ డ్యూయెట్ వస్తుంది.

అసలు ఇది హర్రర్ సినిమా అన్నారు, ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఆడియన్స్ ని భయపెట్టేలా లేనప్పుడు అదెందుకు హర్రర్ సినిమా అవుతుంది. ఒక్క పాట కూడా సందర్భానికి తగ్గట్టు రాదు. చివరి వరకూ దాచి పెట్టిన సస్పెన్స్ కూడా ఆకట్టుకునేలా లేదు. ఇదే పాయింట్ ని దాదాపు 40 సంవత్సరాల నుంచి వస్తున్న మన సినిమాల్లో చూస్తుంటాం.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం ఇవి డీల్ చేసింది భానుకిరణ్ చల్లా.. కథ – కొత్తదనం లేదు. స్క్రీన్ ప్లే – ఆసక్తికరంగా లేదు. డైలాగ్స్ – కొన్ని బాగున్నాయి, దర్శకత్వం – ఇంకాస్త బెటర్ గా ఉండి, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇంకాస్త స్ట్రాంగ్ గా చూపించాల్సింది. సినిమాటోగ్రఫీ అంతగా లేదు. ఎడిటింగ్ బాలేదు. ఇక ప్రమోద్ కుమార్ మ్యూజిక్ సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. హర్రర్ మూవీ అంటే మ్యూజిక్ తోనే ఆడియన్స్ లో భయం క్రియేట్ చెయ్యాలి, కానీ ఈయన కంపోజ్ చేసిన మ్యూజిక్ మాత్రం ఆ ఫీల్ కలిగించలేదు. ఇక పాటలంటారా.. మన సూపర్ హిట్ సినిమాల్లో వచ్చిన ట్యూన్స్ నే అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేసారు. రామారావు నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

ఈ మధ్య కాలంలో హిట్ ఫార్ములా అనిపించుకున్న హర్రర్ కామెడీ నేపధ్యంలో వచ్చిన చాలా సినిమాలలో ‘అలౌకిక’ కూడా ఒకటి. హర్రర్ కామెడీ అని చెప్పుకొని వచ్చిన సినిమా స్పెషాలిటీ ఏమిటి అంటే హర్రర్ మరియు కామెడీ ఈ సినిమాలో లేకపోవడమే. ఆడియన్స్ ని 15 నిమిషాలు నవ్వించగల తాగుబోతు రమేష్ పాత్ర తప్ప ఈ సినిమాలో ఇది బాగుంది అని చెప్పుకునే అంశాలు ఏమీ లేకపోవడం సినిమాకి ఉన్న మైనస్. కావున ఈ వారం ఈ సినిమాకి వెళ్ళాలా.? వద్దా.? అన్నది మీరే నిర్ణయించుకోండి…

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
123తెలుగు టీం


సంబంధిత సమాచారం :