Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : అనగనగా ఒక దుర్గ – మహిళల కోసం చేసిన వినూత్న ప్రయత్నం

Vunnadi Okate Zindagi movie review

విడుదల తేదీ : అక్టోబర్ 27, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : ప్రకాష్ పులిజాల

నిర్మాత : గడ్డంపల్లి రవీందర్ రెడ్డి

సంగీతం : విజయ్ బాలాజీ

నటీనటులు : ప్రియాంక నాయుడు

స్త్రీలపై జరుగుతున్న ఆరాచకాల్ని నిరసిస్తూ, ఆడవాళ్లకు ఈ సమాజంలో సమాన హక్కులున్నాయని, వాళ్ళు తిరగబడితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాల్ని గుర్తుచేసే ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. ఇప్పుడుఈ అదే నైపథ్యంతో వచ్చిన మరొక చిత్రమే ఈ ‘అనగనగా ఒక దుర్గ’. ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఒక మారుమూల గ్రామంలోని పేద కుటుంబంలో పుట్టిన ఆడపిల్లే దుర్గ (ప్రియాంక). పురిటిలోనే తండ్రి చేతిలో హత్యకు గురికాబోయి బ్రతికి బయటపడిన ఆమె చిన్నతనం నుండి ఆత్మవిశ్వాసంతో పెరిగి మగాళ్లకు ధీటుగా తయారవుతుంది. అన్నిటిలోను ముందుంటూ మంచి పెను తెచ్చుకుంటుంది. ఆ సమయంలోనే భూస్వామి, దుర్మార్గుడైన బావూజీ కన్ను ఆమె మీద పడుతుంది.

బావూజీ, అతని మనుషులు కలిసి ఆమె మీద చేయాలని ఘోరాలన్నింటినీ చేస్తారు. చివరికి ఊళ్ళోంచే వెళ్ళగొడతారు. అలా సర్వం కోల్పోయిన దుర్గ అందుకు కారణమైన వారిపై పగ తీర్చుకోవాలనుకుంటుంది. ఆ క్రమంలో ఆమె ఎంచుకున్న మార్గం ఏమిటి ? ఎలా పగతీర్చుకుంది ? అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ నైపథ్యం. కమర్షియల్ సినిమాలకే సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న ఈరోజుల్లో కూడా సమాజానికి ఉపయోగపడే చిత్రం చేయాలనే తపనతో దర్శకుడు ప్రకాష్ పులిజాల అతి ముఖ్యమైన సామాజిక కోణాన్ని ఈ చిత్రం కోసం ఎంచుకున్నారు. సినిమాలో మారుమూల గ్రామాల్లో ఆడవాళ్లపై ఎలాంటి అకృత్యాలు జరుగుతున్నాయి, వాటికి స్త్రీలు ఏలా బలవుతున్నారు అనే అంశాలను బాగా విశదీకరించి చూపించారు.

అలాగే అన్యాయానికి గురైన స్త్రీ ఎలా ఎదురుతిరుగుతుందో, ఏ విధంగా పోరాడుతుందో చెప్పడానికి చరిత్రలో స్థానం సంపాదించుకున్న పూలన్ దేవి కథను స్ఫూర్తిగా చేసుకుని కథనం రాసుకోవడం బాగుంది. అలాగే సెకండాఫ్ ఆరంభం నుండి హీరోయిన్ ప్రతిఘటనకు దిగడం, పగ తీర్చుకోవడం వంటి సన్నివేశాలని బాగానే చూపించారు. దుర్గగా ప్రియాంక పెర్ఫార్మెన్స్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్ దర్శకుడి అత్యుత్సాహమనే చెప్పాలి. చాలా జాగ్రత్తగా తీయాల్సిన సున్నితమైన సన్నివేశాలను వేగంగా, నటనపై ఏమాత్రం అదుపులేని నటుల బృందంతో మరీ ఎక్కువైందన్నట్టు అనిపించేలా తీశారు. దీంతో చాలా సందర్భాల్లో సినిమా చూస్తుంటే కొంత మొహమాటం కలిగింది. కథనానికి తీసుకున్న స్ఫూర్తి బాగున్నా దాన్ని రాసుకున్న తీరు చాలా పేలవంగా ఉంది. చాలా సన్నివేశాలకు మధ్యన ఎలాంటి కనెక్టివిటీ లేదు.

పైగా మధ్యలో వచ్చే పాటలు మరింత విసిగించాయి. కొన్ని సన్నివేశాలైతే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయా అన్నంత రొటీన్ గా అనిపించాయి. ముఖ్యంగా సెకండాఫ్ చాలా బోర్ అనిపించింది. చాలా వరకు అసహజమైన, మరీ పాత రీతిలో ఉన్న సీన్లు ఇబ్బంది కలిగించాయి. ఇక ప్రధాన పాత్ర దుర్గ మినహా మిగతా పాత్రలన్నీ అతిగా ప్రవర్తిస్తుండటంతో సినిమా చూడాలన్న ఆసక్తి సన్నగిల్లింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ప్రకాష్ పులిజాల హీరోయిన్ ఎంచుకున్న కథ సామాజిక పరంగా బాగానే ఉన్నా దానికి కొద్దిగా కమర్షియల్ అంశాలని జోడించి, మంచి కథనాన్ని రాసుకుని, కొంత అనుభవం కలిగిన నటీనటుల్ని ఎంచుకుని ఉంటే బాగుండేది. విజయ్ బాలాజీ సంగీతం అక్కడక్కడా మెప్పించింది. సినిమాటోగ్రఫీ చెప్పుకోదగిన స్థాయిలో లేదు. ఎడిటింగ్ ద్వారా కొన్ని అనవసరమైన సీన్లను తొలగించి ఉండాల్సింది. నిర్మాత గడ్డంపల్లి రవీందర్ రెడ్డి నిర్మాణ విలువలు పర్వాలేదనే స్థాయిలో ఉన్నాయి.

తీర్పు :

ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ, స్త్రీ చైతన్యం ముఖ్యమని చెప్పడానికి తీసిన ఈ సినిమా ‘అనగనగా ఒక దుర్గ’ సినిమా నైపథ్యం పరంగా మెచ్చుకోదగ్గదిగా ఉన్నా తీసిన విధానం, హీరోయిన్ మినహా మిగతా నటీనటుల నటన సరిగా లేకపోవడంతో ఔట్ ఫుట్ గొప్ప స్థాయిలో రాలేదు. మొత్తం మీద చెప్పాలంటే రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్సుకు ఈ సినిమా నచ్చకపోవచ్చు కానీ సామాజిక చైతన్యాన్ని ప్రస్తావించే సినిమాల్ని ఇష్టపడే వారికి పర్వాలేదనిపించవచ్చు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team


సంబంధిత సమాచారం :