సమీక్ష : అతడు ఆమె ఓ స్కూటర్ – స్కూటర్ చెప్పే బోరింగ్ స్టొరీ

సమీక్ష : అతడు ఆమె ఓ స్కూటర్ – స్కూటర్ చెప్పే బోరింగ్ స్టొరీ

Published on Aug 23, 2013 4:05 PM IST
AAOS-Review విడుదల తేదీ : 23 ఆగష్టు 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : లక్ష్మణ్ గంగారావు
నిర్మాత : జగదీశ్ చంద్ర, అమరేంధర్ రెడ్డి
సంగీతం : చిన్ని కృష్ణ
నటీనటులు : ‘వెన్నెల’ కిషోర్, ప్రియాంక చాబ్రా..

తెలుగు సినిమాల్లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వెన్నెల కిషోర్ హీరోగా ప్రియాంక చాబ్రాని హీరోయిన్ గా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘అతడు ఆమె ఓ స్కూటర్’. చాలా రోజుల క్రితమే షూటింగ్, ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయినప్పటికీ సరైన రిలీజ్ డేట్ లేక చాలా రోజులుగా ఆగిపోయి ఉన్న ఈ సినిమాని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాకి లక్ష్మణ్ గంగారావు దర్శకుడు. జగదీశ్ చంద్ర – అమరేంధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి చిన్ని కృష్ణ సంగీతం అందించాడు. ఇన్ని రోజులు కమెడియన్ గా మెప్పించిన వెన్నెల కిషోర్ హీరోగా ఎంతవరకూ మెప్పించాడో ఇప్పుడు చూద్దాం..

కథ :

బిఏ పాస్ అయిన గోవిందరాజు(వెన్నెల కిషోర్) భీమవరంలో ఎలాంటి బాధ్యతలు లేకుండా తిరుగుతుంటాడు. దాంతో గోవిందరాజు మామయ్యా తన కూతుర్ని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. దాంతో గోవిందరాజు తన కూతురు కంటే అందమైన అమ్మాయని పెళ్లి చేసుకొని తన కూతురు కంటే ముందే పిలాన్ని కంటానని శపథం చేస్తాడు. అమ్మాయి అన్వేషణ కోసం తన ఫ్రెండ్ రాజేష్(తాగుబోతు రమేష్) తో కలిసి హైదరాబాద్ లో వెళతాడు. అక్కడ గోవిందరాజుకి లక్ష్మీ అలియాస్ లక్కీ(ప్రియాంక చాబ్రా) తో పరిచయం ఏర్పడుతుంది. కొద్ది రోజులకి ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటారు. అంతా సాఫీగా జరిగిపోతుందన్న టైంలో లక్కీ గోవిందరాజుకి ఓ కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్ ని బ్రేక్ చెయ్యడానికి గోవిందరాజు ఎలాంటి కష్టాలు పడ్డాడు. ఇంతకీ లక్కీ పెట్టిన ఆ కండిషన్ ఏంటి. చివరికి గోవిందరాజు తన మామతో చేసిన శబధంలో గెలిచాడా? లేదా? అనేదే మిగిలిన కథాంశం…

ప్లస్ పాయింట్స్ :

కమెడియన్ నుంచి హీరోగా మారిన వెన్నెల కిషోర్ ఒకటి రెండు సెంటి మెంట్ సీన్స్ బాగా చేసాడు. మిగతా కామెడీ సన్నివేశాల్లో పరవాలేదనిపించాడు. ప్రియాంక చాబ్రా అందాలను బాగానే ఆరబోసింది. తాగుబోతు రమేష్ మరోసారి తాగుబోతుగా నటించి అక్కడక్కడా నవ్వించడానికి ప్రయత్నించాడు. ‘చెట్టుకింద ప్లీడర్’ సినిమాలో వచ్చే ‘పాత సామాన్లు కొంటాం’ అనే కామెడీ ట్రాక్ ని ఈ సినిమాలో ధన్ రాజ్ తో చేయించారు, ఆ ఎపిసోడ్ బాగుంది. సెకండాఫ్ లో అసలు ఏమీ తెలుసుకోకుండా ఏదో ఉద్యోగం చెయ్యాలనే ఆత్రంలో మేల్ ప్రోస్టిట్యూట్ గా చేసే సన్నివేశాలు బాగున్నాయి. అలాగే ఫేమస్ సినిమా టైటిల్స్ ని వాడుకొని సినిమా భాషలో రాసిన డైలాగ్స్ పరవాలేధనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్ :

హీరోయిన్ ప్రియాంక చాబ్రా చేసిన అందాల ఆరబోతని పక్కన పెడితే నటన పరంగా ఆమెకి జీరో మార్కులు వెయ్యాలి. ఫేస్ లో అసలు సీన్ కి కావాల్సిన హావ భావాలని పలికించలేకపోయింది. చాలా చోట్ల డైలాగ్స్కి ఆమె లిప్ సింక్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు. సినిమా మొదటి నుండి చివరి వరకు చాలా నిధానంగా సాగుతుంది. సినిమాని రెండు గంటల పైన తీయాలి అనే ఉద్దేశంతో సెకండాఫ్ మొత్తాన్ని అల్లుకుంటూ వెళ్ళాడే తప్ప సినిమాకి అస్సలు ఉపయోగం లేదు. దానికి తోడు సినిమాలో మొదట 5 నిమిషాలు చూసిన ఏ చిన్న పిల్లాడైనా సరే తదుపరి సీన్ ఏంటి అని చెప్పెయ్యగలడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు స్క్రీన్ ప్లే ఎంత వీక్ గా ఉందని. ఈ సినిమా కథని ఇప్పటికి మనం పలు సినిమాల్లో చూసే ఉంటాం అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.

సినిమాలో ఎలాంటి లాజిక్ లేదు. ఉదాహరణకి సినిమాలో చూపించే ఆడొక్కు స్కూటర్ ని వేసుకొని మన హీరో హైదరాబాద్ నుండి భీమవరం కి వెళ్లి వచ్చేస్తాడు. ఇలాంటి సీన్స్ చాలా ఉంటాయి. సినిమాలో వచ్చే ఒక్క పాట కూడా సినిమాకి హెల్ప్ అవ్వలేదు. కొన్ని పాటలేమో ఏదో ఉండాలి కదా అన్నట్లు ఉంటే, కొన్ని పాటలేమో హీరోయిన్ అందాలను చూపించడానికి మాత్రమే చేసారు. కానీ ఆ పాటలు కూడా ఆడియన్స్ ని మెప్పించలేకపోయాయి. హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అస్సలు సెట్ అవ్వలేదు. కామెడీ ఎంటర్టైనర్ సినిమా అన్నప్పుడు కథ కాస్త వీక్ అయినా 90% కామెడీ 10% బోరింగ్ ఉండాలి కానీ ఈ సినిమాలో 90% బోరింగ్ 10% కామెడీ ఉండటం సినిమాకి మేజర్ మైనస్ గా చెప్పుకోవాలి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో కాస్తో కూస్తే చెప్పుకోదగినవి అంటే ఒకటి సినిమాటోగ్రఫీ, రెండు డైలాగ్స్. సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉందని చెప్పలేదు కానీ ఓకే అనేలా ఉంది. అలాగే డైలాగ్స్ సినిమా మొత్తం బాగా లేకపోయినా పుష్కరానికో రెండు డైలాగ్స్ ఆడియన్స్ కి పరవాలేధనిపిస్తాయి. జగదీష్ అందించిన కథే వీక్ అంటే దానికన్నా ఘోరంగా స్క్రీన్ ప్లే ఉంది. ఇది రెండు వీక్ అవ్వడం వల్ల డైరెక్టర్ లక్ష్మణ్ రంగారావు కూడా శ్రద్ధ తీసుకోకుండా తూతూమంత్రంగా సినిమాని తీసేసాడు. దీనికన్నా మించి డైరెక్టర్ గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. చిన్ని కృష్ణ అందించిన మ్యూజిక్ లో ఒరిజినాలిటీ కంటే ఆ ఆ సినిమా నుంచి ఈ సినిమా నుంచి తీసుకున్న బిట్ ట్యూన్స్ మన చెవులకు ఎక్కువగా వినపడతాయి. ఎడిటర్ అన్నా కనీస శ్రద్ధ తీసుకొని కొన్ని బోరింగ్ సీన్స్ ని లేపేసి ఉంటె బాగుండేది.

తీర్పు :

కమెడియన్ గా పేరు తెచ్చుకున్న వెన్నెల కిషోర్ హీరోగా చేసిన ‘అతడు ఆమె ఓ స్కూటర్’ సినిమా స్కూటర్ చెప్పిన పరమ రొటీన్ అండ్ బోరింగ్ స్టొరీ. అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్స్ తప్ప ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో కామెడీనే లేకపోవడం ఈ సినిమాకి మేజర్ మైనస్ అయితే హీరోయిన్ నటన, వీక్ కథ, స్క్రీన్ ప్లేలు, తెలిసీతెలియని డైరెక్షన్ చెప్పాల్సిన మరికొన్ని మైనస్ పాయింట్స్. ఈ వారం ఈ సినిమా చూడాలా వద్దా అనేది మీ చాయిస్ కే వదిలేస్తున్నా…

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు