సమీక్ష : ‘ఆత్రేయ’ – పిల్లలతో కలసి తప్పకుండా పెద్దలు చూడాల్సిన సినిమా.

aatreya విడుదల తేదీ : 14 నవంబర్ 2014
దర్శకత్వం : శాంతికుమార్ చిలుముల
నిర్మాత : శాంతికుమార్ చిలుముల
సంగీతం : శ్రిని ప్రభల
నటీనటులు : ఆదిత్య, అనూహ్య, శ్రీ రాజ్, ప్రణయ్, స్పూర్తేష్, జీవా తదితరులు

ఆధునిక జీవన శైలి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? అనే కథాంశంతో రూపొందిన బాలల చిత్రం ‘ఆత్రేయ’. స్టార్ట్ హెల్ప్ ఫౌండేషన్ & డాట్‌కామ్ ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ద్వారా వచ్చే లాభాలను అనాథ బాలలకు వినియోగిస్తామని దర్శకనిర్మాత శాంతికుమార్ చిలుముల చెప్పారు. లాభాపేక్ష లేకుండా సదుద్దేశ్యంతో తెరకెక్కించిన ఈ ప్రయత్నం ఎంతవరకు విజయవంతం అయ్యిందో..? ఒకసారి చూద్దాం.

కథ :

ఆత్రేయ (ఆదిత్య) అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగబ్బాయి. తమ కుమారుడికి మన సంస్కృతి సంప్రదాయాలు, అనుబంధాలు, ఆప్యాయతలు తెలియాలనే ఉద్దేశ్యంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అయిన అతని తల్లిదండ్రులు ఇండియాకి తిరిగి వచ్చేస్తారు. హైదరాబాద్ లో నిర్మల హృదయాలయ హై స్కూల్ లో ఆదిత్యను జాయిన్ చేస్తారు. ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడడానికి ఆదిత్య కొంత ఇబ్బంది పడతాడు. ఆదిత్య ప్రవర్తన కూడా కొందరికి ఇబ్బంది కలిగిస్తుంది. తండ్రి సలహాతో ఆ ఇబ్బందులను అధిగమించి అందరి వాడు అవుతాడు. తర్వాత తన ప్రవర్తనతో తొటి విద్యార్ధులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకుల ఆలోచనలలో ఆదిత్య మార్పు తీసుకొస్తాడు.

ఇండియా వచ్చిన తర్వాత ఆదిత్య ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులు ఏంటి..? తన చుట్టూ ఉన్నవారిలో అతను ఎటువంటి మార్పు తీసుకొచ్చాడు..? అనేది మిగతా సినిమా కథ. ఆ ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

ఇటీవల పిల్లలకు మంచి విలువల తెలియజేసే, సమాజం పట్ల అవగాహన కల్పించే సినిమాలు కరువయ్యాయి. ఈ సినిమా ఆ లోటు తీరుస్తుంది. ఎటువంటి కమర్షియల్ అంశాలు, అసభ్యత కలిగించే అంశాలకు చోటు ఇవ్వకుండా అత్యంత సహజంగా తెరకెక్కించిన సినిమా ‘ఆత్రేయ’.

‘ఆత్రేయ’ పాత్రలో ఆదిత్య మంచి నటన కనబరిచాడు. కథలో ఎమోషన్ ను ప్రేక్షకులకు చేరువయ్యేలా నటించడంలో సఫలం అయ్యాడు. అతనికి మొదటి సినిమా అయినా ఎటువంటి తడబాటుకి గురవ్వలేదు. నాయనమ్మ పాత్రలో నటించిన ముసలావిడ నటన కథను ముందుకు తీసుకువెళ్ళడంలో ఉపయోగపడింది.

తల్లి ప్రేమకు నోచుకోని అల్లరిపిల్ల ఆలీస్ గా నటించిన బేబీ అనూహ్య నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ‘చల్తా రే’ అంటూ అనూహ్య చెప్పిన డైలాగ్, తన నటన, ఆమె నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వినోదంతో పాటు భావోద్వేగాన్ని చక్కగా పండించింది. ప్రతి స్కూల్ లో అనూహ్య లాంటి అమ్మాయి ఒక్కరైనా ఉంటారు. ఆమె తల్లిదండ్రుల లాంటి వారు సమాజంలో కోకొల్లలు. ఆదిత్య స్నేహితులు, స్కూల్ ప్రిన్సిపాల్, తల్లిదండ్రులు, జీవా తదితరులు కథకు అనుగుణంగా, పాత్రల పరిధి మేరకు నటించారు.

మైనస్ పాయింట్స్ :

కథ బాగున్నా కథనం అంత ఆసక్తికరంగా సాగదు. కొన్ని సన్నివేశాలకు లాజిక్ ఉండదు. మరికొన్ని సన్నివేశాలలో ఎంతో భావోద్వేగం ఆవిష్కరించే అవకాశం ఉన్నా దర్శకుడు సరిగా సన్నివేశాలను డీల్ చేయలేకపోయాడు. అక్కడక్కడా దర్శకుడు కొంత తడబాటుకి లోనయ్యాడు. ఫీచర్ ఫిల్మ్ అయినా డాక్యుమెంటరీలా చిత్రీకరించారు. అదే సినిమాకు ముఖ్య అవరోధం.

ఉదాహరణకు.. ఆదిత్య నాయనమ్మ గుడిలో తమ కుమారుడిని అమెరికా పంపాలనుకునే తల్లిదండ్రులకు కథ చెప్పడం ప్రారంభిస్తుంది. వారికి నటించడం అసలు రాలేదు. సినిమా ప్రారంభంలో వారి నటన సినిమాపై ప్రేక్షకులకు అనాశక్తిని కలిగిస్తుంది. వారి నటన సినిమాలో ఫీల్ ను చెడగొట్టింది.

సాంకేతిక విభాగం :

అతి తక్కువ నిర్మాణ వ్యయంలో రూపొందించిన సినిమా ‘ఆత్రేయ’. అయినా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ పరంగా లో బడ్జెట్ లో మంచి ప్రతిభ కనబరిచిన ఆరిఫ్ లలాని, ఎడిటింగ్ విభాగంలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. సినిమా నిడివి కాస్త తగ్గించాల్సింది. ప్రతి సన్నివేశాన్ని సాగదీశాడు. సినిమాలో ఉన్న రెండు పాటలు బాగున్నాయి. శ్రిని ప్రభల నేపధ్య సంగీతం కూడా బాగుంది.

దర్శకనిర్మాతగా మంచి సినిమాను సమాజానికి అందించాలని ప్రయత్నించిన శాంతికుమార్ చిలుములను మొదట అభినందించాలి. సమాజానికి ఉపయోగపడే చక్కని కథతో సినిమా తీశారు. కథనంలో కొంత తడబడినా చెప్పాలనుకున్న పాయింట్ ను స్ట్రెయిట్ గా చెప్పారు. కథ పరిధి దాటకుండా హాస్యాన్ని పండించారు. సెంటిమెంట్ సన్నివేశాలను మరింత బాగా డీల్ చేయవలసింది.

తీర్పు :

ఈ టెక్నాలజీ యుగంలో తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో ఎంత శ్రద్ధ వహిస్తున్నారు..? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు..? అనే ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా. ఇటువంటి సినిమాలలో కమర్షియల్ అంశాల గురించి ఆలోచించకూడదు. బాల కార్మికుల కష్టాల మొదలుకుని.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ప్రవర్తన శైలి, సంపన్నుల పిల్లల చేష్టలు తదితర అంశాలను ‘ఆత్రేయ’ సినిమాలో సున్నితంగా స్పృశించారు. పని ఒత్తిడిలో ఎందరో తల్లిదండ్రులు రూల్స్ పాటించారు. అటువంటి అంశాలు చిన్నారుల మనసులలో ఎటువంటి ప్రభావం చూపుతాయో ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు. తమ తోటి విద్యార్ధులతో ఎలా మెలగాలో..? పిల్లలు చేసే తప్పులతో పాటు వారి ప్రవర్తన ఎలా ఉండాలో సినిమాలో చూపించారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా చూపించవలసిన సినిమా ఇది.

123తెలుగు.కామ్ రేటింగ్ : రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు రేటింగ్ ఇచ్చినట్టు ఈ సినిమాకు 1 నుంచి 5 లోపు రేటింగ్ ఇవ్వలేము. ‘ఆత్రేయ’ ఆ తరహా సినిమా కాదు, ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్. కావున ఈ సినిమాకి మేము రేటింగ్ ఇవ్వడం లేదు.

123తెలుగు టీం

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook