ఆడియో సమీక్ష : డమరుకం : అదే జోరు కొనసాగించిన దేవీ శ్రీ ప్రసాద్

‘కింగ్’ నాగార్జున మొట్టమొదటి సాటిగా చేస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం’. యోగా బ్యూటీ అనుష్క కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దరశాకత్వం వహించారు. అక్టోబర్లో విడుదల కానున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ‘డమరుకం’ దేవీ శ్రీ సంగీతం అందించిన 50వ చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం యువత కోరుకుంటున్న ఫాస్ట్ బీట్, మెలోడీ పాటలతో మరియు హిస్టారికల్ పాటలు కూడా కలగలిపి దేవీ శ్రీ ఇచ్చిన ‘డమరుకం ఆడియో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

1) పాట : ఓంకారం
గాయకుడు : వెంకట్ సాయి
రచయిత : జొన్నవిత్తుల


ఇది ఒక నిమిషం పాటు సాగే బిట్ సాంగ్. ఈ పాట ఓంకారం మరియు హిందూమత గొప్పతనాన్ని చెప్పేలా ఉంటుంది. వెంకట్ సాయి గాత్రానికి దేవీ శ్రీ సంగీతం చాలా బాగా కుదిరింది.

 

2) పాట : అరుణ ధవళ
గాయకుడు : కార్తీక్
రచయిత : జొన్నవిత్తుల


ఇది రెండు నిమిషాలు సాగే బిట్ సాంగ్. సూర్యుడి పై రాసిన ఈ పాటకి దేవీ శ్రీ ఎంతో ఉత్తేజకరమైన సంగీతాన్ని అందించారు. ఈ పాటలో శివుడి డమరుఖ నాదాన్ని బాగా ఉపయోగించారు. జొన్నవిత్తుల రాసిన మంచి సాహిత్యానికి కార్తీక్ తన గాత్రంతో పూతి న్యాయం చేసారు.

 

3) పాట : నేస్తమా నేస్తమా
గాయనీ గాయకులు: సాయికృష్ణ, హరిణి
రచయిత : భాస్కరభట్ల


ఈ ఆల్బం లో వినిపించే మొదటి డ్యూయెట్ సాంగ్. వినసొంపైన గిటార్ సౌండ్స్ తో ప్రారంభమయ్యే ఈ పాటలో సితార్ ని చాలా బాగా వినియోగించారు. రొమాంటిక్ గా సాగే ఈ పాటని అదే ఫీల్ తో సాయికృష్ణ మరియు హరిణి చాలా బాగా ఆలపించారు. భాస్కరభట్ల రాసిన సాహిత్యం చాలా బాగుంది. వినడానికి వినసొంపుగా మరియు ఒక్కసారి వినగానే శ్రోతలను ఆకట్టుకునే ఈ పాట ఆల్బంలో హిట్ పాటల లిస్టులో చేరుతుంది. ఈ పాటలో నాగార్జున మరియు అనుష్కలను తెరపై చాలా బాగా చూపిస్తారని ఆశించవచ్చు.

 

4) పాట : రెప్పలపై రెప్పలపై
గాయనీ గాయకులు: హరి హరన్, చిత్ర
రచయిత : రామజోగయ్య శాస్త్రి


తెలుగు సినిమాల్లో వస్తున్న మంచి ఎనర్జిటిక్ పాటల్లో ‘రెప్పలపై’ పాట మొదట్లో నిలుస్తుంది. మంచి ఫామ్ లో ఉన్న హరి హరన్ మరియు చిత్ర ఈ పాటకి అద్భుతమైన తమ గాత్రాన్ని అందించారు. ఈ పాటలో దేవీ శ్రీ సంగీతం చాలా ఆసక్తికరంగా ఉంటుంది మరియు ఈ పాట కొంత మాస్ ఫీల్ ని కూడా కలుగజేస్తుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం పరవాలేదనిపిస్తుంది. కొంచెం మెలోడీగా మరియు కొంచెం మాస్ ఫీల్ తో సాగే ఈ పాటకి మంచి చిత్రీకరణ జోడైతే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

 

5) పాట : ధీంతన
గాయకుడు : శంకర్ మహదేవన్
రచయిత : కరుణాకర్, శ్లోకాలు – జొన్నవిత్తుల


శివుడిని పొగుడుతూ సాగే ఈ పాట కూడా రెండు నిమిషాల పాటు సాగే బిట్ సాంగ్. ఈ పాటని శంకర్ మహదేవన్ అద్భుతంగా ఆలపించారు, ముఖ్యంగా కష్టమైన పదాలతో కూడిన ఈ పాటని ఎలాంటి తప్పులు లేకుండా ఎంతో బాగా పాడారు. ఈ భక్తిరసమైన పాటకి పూర్తిగా సరిపోయే సంగీతాన్ని దేవీశ్రీ అందించారు.


6) పాట : సక్కుబాయి గరం చాయ్
గాయనీ గాయకులు: సుచిత్ సురేసన్, మమత శర్మ
రచయిత : రామజోగయ్య శాస్త్రి

ఈ చిత్రంలో ఐటెం సాంగ్ గా వచ్చే ‘సక్కుబాయి గరం చాయ్’ పాట ఇప్పటికే మంచి ప్రాచుర్యాన్ని పొందింది. ఈ పాట అందరినీ వశపరుచుకునేలా ఉంటుంది మరియు పాటలోని బీట్స్ బి మరియు సి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కొంచెం మోటుగా ఉండే మమత శర్మ గాత్రం మరియు ఆమె ఎనర్జీ ఈ పాటకి హైలైట్, అలాగే సుచిత్ సురేసన్ వాయిస్ కూడా బాగా సెట్ అయ్యింది. దేవీ శ్రీ సంగీతం చాల తొందరగా ఎక్కేసేలా ఉంటుంది మరియు ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి మాస్ మసాలాతో కూడిన సాహిత్యాన్ని అందించారు. ఈ పాటలో నాగార్జునతో కలిసి చార్మింగ్ బ్యూటీ ఛార్మి చిందేసింది. ఇది విని మరియు చూసి బాగా ఎంజాయ్ చేసే పాట.

 

7) పాట : లాలి లాలి
గాయకురాలు : గోపికా పూర్ణిమ
రచయిత : చంద్రబోస్


తన బిడ్డ కోసం ఒక తల్లి పాడే ఈ లాలి పాట చాలా నిధానంగా మరియు సున్నితంగా ఉంటుంది. ఈ పాటకి గోపిక పూర్ణిమ వాయిస్ చాల బాగా కుదిరింది మరియు చంద్రబోస్ సాహిత్యం అందరికీ నచ్చేలా ఉంది. దేవీ శ్రీ పాటకి సరిపోయే బాణీలను అందించారు. అయినా ఈ పాటలో సాఫ్ట్ డ్రం బీట్స్ కూడా ఉపయోహించి ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది.

 

8) పాట : భూన భోంతాలకే
గాయకుడు : ఎం.ఎల్.ఆర్ కార్తికేయన్
రచయిత : జొన్నవిత్తుల


ఇది కీలక మైన సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా ఉపయోగించుకోదగిన మరో బిట్ సాంగ్. ఈ పాటలోని సాహిత్యం శివుడి రూపాన్ని పొగిడేలా ఉంటుంది.

 

9) పాట : కన్యాకుమారీ
గాయనీ గాయకులు : జాస్ప్రీత్ జాస్, సునీత
రచయిత : సాహితి


ఫాస్ట్ బీట్ తో సాగే డ్యూయెట్ సాంగ్ ఇది. ఈ పాటలో సునీత గారి వాయిస్ వినడానికి చాలా బాగుంటుంది అలాగే జాస్ప్రీత్ వాయిస్ కూడా బాగుంది. సాల్సా సాంగ్స్ మాదిరిగా సాగే ఈ పాటలో దేవీ శ్రీ కొన్ని ఇండియన్ వాయిద్యాల బీట్స్ ని మిక్స్ చేసారు. సాహితి సాహిత్యం బాగుంది మరియు ఆల్బంలో వినదగిన ఈ పాట వినగా వినగా బాగుంటుంది.

 

10) పాట : శివ శివ శంకర
గాయకుడు : శంకర్ మహదేవన్
రచయిత : జొన్నవిత్తుల


ఎంతో ఆసక్తికరంగా శివుడి మీద వచ్చే ఈ పాటని చివర్లో ఆపదలో ఉన్నప్పుడు హీరో శివుడి సహాయం కోసం పాడే సన్నివేశాల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ పాటలో దేవీ శ్రీ మ్యూజిక్ బాగా ఉద్రేకంగా ఉంటుంది మరియు పాటకి సరిపోయేలా సంగీతం ఇచ్చారు. శంకర్ మహదేవన్ తన వాయిస్ తో పాటకు పూర్తి న్యాయం చేసారు. ఈ పాటలో హై విజువల్ ఎఫ్ఫెక్ట్స్ ఉంటాయని ఆశించవచ్చు.

 

తీర్పు :

‘డమరుకం’ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మంచి ఆల్బం అందించారు. అన్ని రకాల పాటలు మేళవించిన ఈ ఆల్బంలో ‘నేస్తమా నేస్తమా’, ‘సక్కుబాయి గరం చాయ్’ మరియు ‘శివ శివ శంకర’ పాటలు నాకు బాగా నచ్చాయి. డ్యూయెట్ పాటలు పక్కన పెడితే ‘డమరుకం’ లో దేవీ శ్రీ శివుడి పై చేసిన 4 బిట్ సాంగ్స్ మాత్రం సినిమాకి బలాన్ని ఇస్తాయి. ఈ చిత్రానికి సంగీతం పరంగా దేవీ శ్రీ పూర్తి న్యాయం చేసారని చెప్పుకోవాలి, ఇక శ్రీనివాస్ రెడ్డి ఎలా తీశాడన్నది తెరపై చూడాల్సిందే.

Click Here For Audio Review in English

సంబంధిత సమాచారం :

More