సమీక్ష : బాహుబలి 2 – రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం !

విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 4/5

దర్శకత్వం : ఎస్.ఎస్ రాజమౌళి

నిర్మాత : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని

సంగీతం : ఎమ్.ఎమ్ కీరవాణి

నటీనటులు : ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్

2015 జూలై 10 నాడు ఆరంభమైన ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే విశ్వ ప్రశ్నకు సమాధానంగా, దర్శక ధీరుడు రాజమౌళి విజన్ కు ప్రతి రూపంగా రూపొందిన దృశ్య కావ్యమే ఈ ‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం. సుమారు 5 ఏళ్ళ పాటు రాజమౌళితో సహా 900 మంది కాస్ట్ అండ్ క్రూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి రూ. 450 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి రూపొందించిన ‘బాహుబలి’ ప్రాంచైజీలో రెండవ, ఆఖరి భాగమైన ఈ చిత్రం శిఖరాగ్ర స్థాయి అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజే థియేటర్లలోకి అడుగుపెట్టింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఏయే అద్భుతాలు చూపింది, ఎలాంటి అనుభవాలను మిగిల్చింది ఇప్పుడు చూద్దాం…

కథ :

అమరేంద్ర బాహుబలిని(ప్రభాస్) చంపిన నీచుడ్ని నేనే అంటూ కట్టప్ప(సత్యరాజ్) చెప్పే నిజంతో మొదటి భాగం ముగియగా రెండవ భాగం అమరేంద్ర బాహుబలి రాజమాత శివగామి(రమ్య కృష్ణ) ఆజ్ఞ మేరకు మాహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడవడానికి సన్నద్ధమయ్యే సన్నివేశాలతో మొదలుతుంది. రాజు కాబోతున్న బాహుబలి దేశయాటనకు బయలుదేరి కుంతలదేశం చేరుకొని ఆ దేశపు యువరాణి అయిన దేవసేనను ప్రేమిస్తాడు. కానీ బాహుబలి రాజు కావడం ఏమాత్రం ఇష్టంలేని భల్లలాదేవుడు తన కుట్రతో శివగామే బాహుబలిని రాజు కాకుండా ఆపేలా చేస్తాడు.

అలా కుట్రతో రాజైన భల్లాలదేవుడు బాహుబలిని, అతని భార్య దేవసేనను ఎలాంటి కష్టాలు పెట్టాడు ? అసలు శివగామి బాహుబలిని రాజు కాకుండా ఎందుకు ఆపింది ? బాహుబలిని కట్టప్పే ఎందుకు చంపాల్సి వచ్చింది ? కన్నతల్లి అయిన శివగామిదేవిని కూడా భల్లాలుడు ఎందుకు చంపాలనుకుంటాడు ? తన తండ్రి మరణానికి కారకులెవరో తెలుసుకున్న మహేంద్ర బాహుబలి భల్లలాదేవుడ్ని ఎలా ఎదుర్కున్నాడు ? వారి మధ్య యుద్ధం ఎలా సాగింది ? చివరికి భల్లాలుడు ఎలా అంతమయ్యాడు ? అనేదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్:

‘బాహూబలి’ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది భారీతనం. రాజమౌళి విజన్ కు తగ్గట్టు ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ మాహిష్మతి సామ్రాజ్యాన్ని, కుంతల దేశాన్ని చాలా అద్భుతంగా రూపొందించారు. ఇక వాటిని సిల్వర్ స్క్రీన్ మీద గొప్పగా కనబడేలా ఆర్.సి. కమల్ కణ్ణన్ ప్రపంచస్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ను, సెంథిల్ కుమార్ అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. వీరి నలుగురి పనితనం వలన సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఆశించిన భారీతనం ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తూ ఆశ్చర్యపడేలా చేసింది. దర్శకుడు రాజమౌళి అయితే సినిమా మొత్తం ప్రతి 15 నిముషాలకొక అదిరిపోయే సీన్ చూపించి సీట్ల నుండి కదలకుండా చేశాడు. ఒక సీన్ అవగానే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ సినిమా పూర్తయ్యే వరకు ప్రేక్షకుల్లో కొనసాగేలా చేయడంలో ఆయన శభాష్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీక్వెన్సుల్లో రమ్యకృష్ణ, అనుష్క, ప్రభాస్ ల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా కట్టిపడేస్తుంది.

ఆయన కథనంతో పాటు ఒక్కో పాత్రను మరింత లోతుగా ఎలివేట్ చేస్తూ సినిమాను నడిపిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ లోని హీరోయిజాన్ని తెరపై వీరోచితంగా చూపించడంలో జక్కన్న నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగే అతి ముఖ్యమైన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానాన్ని ఇన్నేళ్లు ప్రేక్షకులు తలలు బద్దలు కొట్టుకున్నా ఊహించలేని స్థాయిలో చూపించి అదుర్స్ అనిపించారు. అంతకు మించి కట్టప్ప బాహుబలిని చంపడానికి కారణాలు, దారి తీసిన పరిస్థితులు వంటి అంశాలను నడిపిన విధానం మొదటి రోజు ట్విస్ట్ రివీల్ అయిపోయినా కూడా ఆసక్తికరంగా, కొత్తగానే అనిపిస్తాయి.

రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక్కో పాత్రను శ్రద్ధతో ప్రాణం పెట్టి చాలా బలంగా రూపొందించారు. అమరేంద్ర బాహుబలి, కట్టప్ప, దేవసేన, బిజ్జలదేవుడు, శివగామి వంటి క్యారెక్టర్స్ సినిమా అయిపోయాక కూడా మనల్ని వెంబడిస్తున్నట్టే అనిపిస్తాయి. ఆన్ స్క్రీన్ మీద ప్రభాస్, అనుష్కల కెమిస్ట్రీ చాలా అందంగా పండింది. రాజమౌళి వీరిద్దరి ట్రాక్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఒకవైపు కథనంలోని భీభత్సం రసం మనల్ని ఉత్కంఠకు గురిచేస్తున్నా కూడా ప్రభాస్, అనుష్కలు కలిసి కనిపించే ప్రతి సీన్ ప్రేమతో నిండి రొమాంటిక్ గానో, అన్యోన్యతతో ఉండి అందంగానో, బాధతో కూడి ఉద్వేగంగానో ఫీలయ్యేలా చేసింది. ఇక నటీనటుల నటన విషయానికొస్తే ఒక్కొరి గురించి కాస్త వివరంగా చెప్పుకోవాల్సిందే.

కట్టిపడేసే నటీనటుల నటన :

ప్రభాస్:

రాజమౌళి నటీనటుల నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకోవడంలో పూర్తి విజయం సాధించారు. నటీనటుల ఒక్కొక్కరు తమ పాత్రల మేర ఎవరికి వారే పోటాపోటీగా నటించారు. ముందుగా ప్రధాన పాత్రధారి ప్రభాస్ విషయానికొస్తే ఫ్లాష్ బ్యాక్ లో అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ రాజసాన్ని, మంచితనాన్ని, యుద్ధంలో వీరత్వాన్ని, అనుష్క సాన్నిహిత్యంలో ప్రేమను, ధర్మం కోసం తల్లినే ఎదిరించే కొడుకుగా తనలోని సంఘర్షణను చాలా బాగా వ్యక్తపరిచాడు. అలాగే ప్రస్తుతంలో దుష్టుడైన పెదనాన్నను పడగొట్టి, తల్లి పగను తీర్చి, తన తండ్రిని నమ్ముకున్న ప్రజలకు విముక్తి కలిగించే మహేంద్ర బాహుబలి అలియాజ్ శివుడి పాత్రలో కూడా వీరోచితమైన పెర్ఫార్మెన్స్ కనబర్చాడు.

రానా దగ్గుబాటి:

అలాగే భల్లాదేవుని పాత్రలో రానా చాలా బాగా నటించాడు. ఒక స్వార్థపూరితమైన వ్యక్తిగా, బలవంతుడిగా అతని నటన, హావభావాలు చాలా రోజుల తర్వాత అసలైన విలనిజం అంటే ఏమిటో చూపించాయి. ప్రభాస్ తో ముఖాముఖి తలపడే సన్నివేశాల్లో, యుద్ధ సన్నివేశాల్లో రానా బల ప్రదర్శన, బాడీ లాంగ్వేజ్, ఉద్రేకపూరితమైన నటన చాలా బాగున్నాయి. ప్రతి నాయకుడు బలంగా ఉంటేనే కథా నాయకుడి స్థాయి పెరిగి సినిమా పండుతుందనే ధర్మాన్ని చాలా ఖచ్చితంగా పాటించాడు రానా.

అనుష్క :
కుంతలదేశపు యువరాణిగా అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ కట్టిపడేసింది. ఒక అందమైన, ఆత్మగౌరవం, చిన్నపాటి అహంకారం కలిగిన యువరాణిగా ఆమె నటన చాలా బాగుంది. ఆమె ప్రభాస్ తో కలిసి యుద్ధంలో పోరాడే సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి.

రమ్య కృష్ణ :
రాజమాత శివగామి దేవిగా రమ్యకృష్ణ రెండవ భాగంలో కూడా ఆకట్టుకుంది. కనిపించే ప్రతి ఫ్రేములో రాజసం ఉట్టిపడేలా నటించారు. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాల్లో అయితే తిరుగులేదనే స్థాయిలో నటించారు.

సత్యరాజ్ :

కట్టప్ప పాత్రలో సత్యరాజ్ ఒదిగిపోయి నటించాడు. సినిమా ఆద్యంతం హీరోతో పాటే కీలకమైన సన్నివేశాల్లో కనిపిస్తూ మెప్పించాడు. మొదటి అర్థ భాగంలో ప్రభాస్ తో కలిసి మంచి హాస్యాన్ని కూడా పండించాడు. ఇక బాహుబలిని చంపే సన్నివేశంలో, చంపాక శివగామిదేవితో మాట్లాడే సన్నివేశంలో ఆయన గొప్ప స్థాయి నటనను కనబర్చారు.

మైనస్ పాయింట్స్:
ఈ అద్భుత దృశ్య కావ్యంలో చెప్పుకోడానికి పెద్దగా పొరపాట్లేమీ లేవు. అంత జాగ్రత్తగా ప్రతి విభాగం చేత పనిచేయించాడు రాజమౌళి. అయినా కూడా సినిమాపై ఉన్న భారీ అంచనాలు కొన్ని చిన్న చిన్న పొరపాట్లని పట్టుకునేలా చేస్తాయి. అలాంటి పొరపాట్లలో ముఖ్యమైనది క్లైమాక్స్ వార్ ఎపిసోడ్. ఇందులో రానా, ప్రభాస్ ల మధ్య జరిగే పోరాటం భారీ స్థాయిలో గొప్పగానే ఉన్నా కూడా మిగిలిన సైన్యం చేసే యుద్ధం మొదటి భాగంలో క్లైమాక్స్ లో వచ్చే యుద్దమంత భీభత్సంగా అయితే లేదు. అలాగే సినిమా చివర్లో అనుష్క పాత్రకు ఇంకాస్త ఎమోషనల్ టచ్, తమన్నా పాత్రకు కనీసం డైలాగ్స్ చెప్పే ఛాన్స్ అయినా ఇచ్చి ఉంటే ఇంకాస్త ఎక్కువ సంతృప్తికరంగా ఉండేది.

సాంకేతిక విభాగం :

ఈ విజువల్ వండర్ రూపుదిద్దుకోవడానికి దర్శక, రచయితలతో పాటు సాంకేతిక విభాగాల పనితీరు కూడా గోప్ప స్థాయిలోనే ఉంది. వాటి గురించి మాట్లాడితే..

రాజమౌళి విజన్, డైరెక్షన్:

రాజమౌళి తన ఆకాశమే హద్దుగా ఉండే తన ఊహల్లో ప్రతి సన్నివేశాన్ని ఎంత గొప్పగా అయితే ఊహించుకున్నాడో అంతే గొప్పగా తెరపై ఆవిష్కరించాడు. ఒక చారిత్రక నైపథ్యంలో ఉన్న కథకు డ్రామాతో పాటు నేటి వ్యాపార ప్రపంచంలో ముఖ్యమైన వాణిజ్య అంశాలైన హాస్యం, రొమాన్స్ వంటి వాటిని కలిపి అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమా తీయడమంటే మాటలు కాదు. కానీ రాజమౌళి అదే పని చేశాడు. తన ప్రధాన బలమైన హీరో యొక్క హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం దగ్గర నుండి గొప్ప కథను, గొప్ప కథనంతో ఎక్కడా ఆసక్తి తగ్గడం కాదు కదా సీను సీనుకి ఉత్కంఠ ఇంకా పెరిగేలా, కళ్ళు చెదిరే దృశ్యాలతో ప్రపంచస్థాయి సినిమాను చేశాడు. సినిమాకు కీలకమైన ఓపెనింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ లను అద్భుతంగా రూపొందించి సినిమా విజయాన్ని కత్తి దింపినట్టు ఖాయం చేసేశాడు.

అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్ :

ముందుగానే చెప్పినట్టు ఆర్. సి. కమల్ కణ్ణన్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ ప్రపంచస్థాయిలో ఉంది కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉన్నాయి. ఇలాంటి గ్రాఫికల్ వర్క్ ను ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలోనూ మనం చూడలేదు. నటీ నటులను ఎలివేట్ చేయడంలో, అద్భుతమైన మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఆణువణువూ కళ్ళకు కట్టేలా చూపడంలో, పోరాట సన్నివేశాలని స్పష్టంగా చూపడంలో మంచి పనితనం కనబర్చారు విఎఫ్ఎక్స్ టీమ్. ముఖ్యంగా ‘హంస నావ’ పాటలోని విజువల్స్ మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాయి.

సంగీతం :
ఎమ్. ఎమ్ కీరవాణి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకున్నప్రధాన బలాల్లో ఒకటి. సందర్భానుసారంగా వచ్చే పాటలకు ఆయన చేసిన సంగీతం చాలా వినసొంపుగా ఉంది. ‘హంస నావ, దండాలయ్యా’ పాటల సంగీతం చాలా బాగుంది. ఇక ప్రభాస్ కనిపించే సీన్లలో బ్యాక్ గ్రౌండ్లో రన్ అయ్యే ‘హైస్స ముద్రస్స’ అనే పాట వినబడినప్పుడల్లా ఒళ్ళు పులకరించేలా చేసింది.

సినిమాటోగ్రఫీ:
రాజమౌళి విజన్ ను ఖచ్చితంగా అర్థం చేసుకుని దాన్ని అలానే తన కెమెరాలో బందించి తెరపై ఆవిష్కరించగల సమర్థుడు సెంథిల్ కుమార్. అందుకే వీరి కలయిక బ్రహ్మాండమైన విజయాల్ని సాధించింది. ఈ సినిమాలో కూడా సెంథిల్ కుమార్ నటీ నటుల చిత్రం దగ్గర్నుంచి పరిసరాలు, వార్ సీన్స్ వంటి వాటిని చాలా హుందాగా చూపించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లను బాగా క్యాప్చర్ చేశాడు.

నిర్మాణ విభాగం :
నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ లు సినిమా కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనబడింది. ఒక చిత్రాన్ని అద్భుత స్థాయిలో ప్రేక్షకులకు అందివ్వడానికి నిర్మాతలు పడే తపన ఎటువంటిదో, అన్ని విభాగాలకు బడ్జెట్ పరంగా సమాన న్యాయం చేస్తే ఫలితం ఎంత గొప్ప స్థాయిలో ఉంటుందో ఈ సినిమా చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

ఇక కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ కూడా ఎక్కడా ఎక్కువ తక్కువలు లేకుండా బాగా కుదిరింది.  అలాగే ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ మొదటి అర్థ భాగంలో డిజైన్ చేసిన వార్ సీన్, క్లైమాక్స్ లో ప్రభాస్, రానా ల మధ్య కంపోజ్ చేసిన భీభత్సమైన పోరాటం ఆకట్టుకుంది.

తీర్పు:

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుతం అందరి ఊహలను అందుకుంటూ, ప్రపంచ స్థాయిలోనే ఉంది. ఆకట్టుకునే కథ కథనాలు, వాటిని ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించిన తీరు, విజువల్స్ లో మాటల్లో చెప్పలేనంత భారీతనం, నటీనటుల గొప్ప నటన, ఆకట్టుకునే ఓపెనింగ్, ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్, ఎమోషనల్ డ్రామా ఈ సినిమాలో కట్టిపడేసే అంశాలు కాగా కాస్తంత అసంతృప్తిగా తోచిన క్లైమాక్స్ వార్ ఎపిసోడ్, పెద్దగా ప్రాముఖ్యతలేని తమన్నా పాత్రలు చిన్నపాటి లోటుగా కనిపించాయి. మొత్తం మీద చెప్పాలంటే రాజమౌళి సృష్టించిన ఈ అద్భుత దృశ్య కావ్యం అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరచడమేగాక ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి, తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి ఖ్యాతిని తెచ్చిపెడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

123telugu.com Rating : 4/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More