సమీక్ష : బందిపోటు – అల్లరోడి డిఫరెంట్ ఎంటర్టైనర్

సమీక్ష : బందిపోటు – అల్లరోడి డిఫరెంట్ ఎంటర్టైనర్

Published on Feb 20, 2015 8:00 PM IST
Bandipotu-Movie-Review

విడుదల తేదీ : 20 ఫిబ్రవరి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ

నిర్మాత : నరేష్ – రాజేష్

సంగీతం : కళ్యాణ్ కోడూరి

నటీనటులు : అల్లరి నరేష్, ఈశ, సంపూర్నేష్ బాబు…

‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ తో హిట్ అందుకున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ మరోసారి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడానికి చేసిన మరో విభిన్న ప్రయత్నమే ‘బందిపోటు’. ‘దొంగలని దోచుకో’ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. అల్లరి నరేష్ – ఈశ జంటగా నటించిన ఈ సినిమాకి రొటీన్ కి భిన్నంగా సినిమాలు చేసే మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్టర్. చాలా రోజులు తర్వాత ఈవివి సినిమా బ్యానర్ ని రీ లాంచ్ చేసి రాజేష్ – నరేష్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. నరేష్ మొదటి సారి ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో సంపూర్నేష్ బాబు ఓ ముఖ్య పాత్ర పోషించాడు. మరి అల్లరి నరేష్ ఇంత వైవిధ్యంగా చేసిన ఈ బందిపోటు ప్రేక్షకుల హృదయాలను ఎంతవరకూ దోచుకున్నాడనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

సొసైటీలో ఎంతో మంది పేరున్న వారు కూడా దొంగలే అని అలాంటి వారిని దోచుకోవడమే మన హీరో విశ్వ(అల్లరి నరేష్) పని. విశ్వ గురించి తెలుసుకున్న జాహ్నవి(ఈశ) ఓ రోజు విశ్వని కలిసి తన ఫ్యామిలీ ఫేస్ చేసిన సమస్య గురించి చెప్పి, సొసైటీలో బాగా పలుకుబడి ఉన్న మకరంద్రరావు(తనికెళ్ళ భరణి) – శేషగిరి(రావు రమేష్) – భలే బాబు(పోసాని కృష్ణమురళి)లను మోసం చేసి వాళ్ళని నుంచి అందినంతా డబ్బు దోచుకోమని, అంతే కాకుండా వారి పరువు ప్రతిష్టలకి భంగం కలిగించాలని కోరుతుంది. జాహ్నవి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న విశ్వ తను చెప్పిన పని చేయడానికి ఒప్పుకుంటాడు. అక్కడి నుంచి సొసైటీలో ఎంతో పలుకుబడి ఉన్న ఈ ముగ్గురినీ ఎలా మోసం చేసాడు.? వాళ్ళ దగ్గర నుంచి ఎంత దోచుకున్నాడు.? అలాగే వాళ్ళని ఎలా రోడ్డు మీదకి లాగాడు.? ఇవన్నీ చేయడానికి విశ్వకి ఎవరెవరు సపోర్ట్ చేసారు.? అసలు జాహ్నవి ఫ్లాష్ బ్యాక్ ఏమిటి.? అనే ఆసక్తికర విషయాలను మీరు సిల్వర్ స్క్రీన్ పై చూసి తెలుసుకోండి.

ప్లస్ పాయింట్స్ :

అల్లరి నరేష్ తన గత సినిమాలకు భిన్నంగా ట్రై చేసిన ఈ బందిపోటు సినిమాలో అల్లరి నరేష్ పెర్ఫార్మన్స్ కూడా ఎంతో వైవిధ్యంగా ఉంది. చెప్పాలంటే మనం ఇందులో ఓ కొత్త తరహా నరేష్ ని చూస్తాం., అంటే అల్లరి అల్లరిగా చిలిపి పనులు చేసే నరేష్ ని కాకుండా కాస్త ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేసే నరేష్ ని చూస్తాం. నరేష్ చాలా రోజుల తర్వాత పూర్తి నటనా ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసి అందులో ఒదిగిపోయాడు. అతనే తన భుజాలపై ఈ సినిమాని నడిపించాడు. ఇక నవ్వించడం అనేది ఎలాగూ అల్లరి నరేష్ చేసేదే కదా.. ఇందులో ఫుల్ లెంగ్త్ నవ్వించకపోయినా ఇంస్టాల్ మెంట్స్ లో బాగానే నవ్వించాడు. ఈశ నరేష్ కి పర్ఫెక్ట్ జోడీలా అనిపించింది. ఈశ జస్ట్ గ్లామర్ అట్రాక్షన్ గానే కాకుండా కథకి అవసరం ఉన్న ఓ మంచి పాత్ర చేసి ఆ పాత్రకి న్యాయం చేసింది. కానీ ఈ సినిమాలో తనకి స్క్రీన్ పైన ఎక్కువ రన్ టైం దొరకలేదు. ముఖ్యంగా సెకండాఫ్ లో ఎక్కువ పాటలకే పరిమితం అయ్యింది. ఇక ఎక్స్ పోజ్ చెయ్యకపోయినా మోడ్రన్ లుక్ లో కూసింత గ్లామరస్ యాంగిల్ ని ఈ సినిమాలో చూపించింది.

ఈ సినిమాలో అల్లరి నరేష్ తర్వాత ఎంటర్టైన్ చేసేది మాత్రం సంపూర్నేష్ బాబు. సంపూర్నేష్ ఎక్కడా ఓవరాక్షన్ చెయ్యకుండా చాలా సెటిల్ పెర్ఫార్మన్స్ ఇస్తూ నవ్వించాడు. ఇక ముఖ్యమైన పాత్రలు చేసిన రావు రమేష్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, చంద్ర మోహన్ లు తన పాత్రలకు న్యాయం చేసారు. ప్రేక్షకులను కాసేపు నవ్వించారు. టీవీ రిపోర్టర్ గా సప్తగిరి అక్కడక్కడా కనిపించి నవ్విస్తాడు. ఇకపోతే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. సినిమా మొదట్లో వరుసగా పాత్రలని పరిచయం చేసిన విధానం, అల్లరి నరేష్ – తనికెళ్ళ భరణి ఎపిసోడ్ బాగానే నవ్విస్తుంది. అలాగే ఇంటర్వల్ తర్వాత వచ్చే బాంగ్ కూడా బాగానే ఆకట్టుకుంటుంది. పోసాని కృష్ణ మురళి ఎపిసోడ్ చివర్లో బాగా నవ్వుకుంటారు. శ్రద్ధ దాస్ స్పెషల్ సాంగ్ ముందు బెంచ్ వారిని ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

అల్లరి నరేష్ బందిపోటు రూపంలో తను ఇది వరకూ చేయని ఓ కొత్త తరహా సినిమాని ట్రై చేసాడు కానీ పాత్రలో కొత్త దనం చూసాడే కానీ కథలో చూసుకోలేదు. ఎందుకంటే కథ చాలా రొటీన్ రివెంజ్ స్టొరీ. చెప్పాలంటే ఇలాంటి రొటీన్ కథని ఇంద్రగంటి మోహన కృష్ణ నుంచి అస్సలు ఎవరూ ఊహించారు. అలాగే కథనం కూడా చాలా స్లోగా ఉండేలా రాసుకున్నారు. సినిమాలో అక్కడక్కడా కామెడీ బాగా ఉన్నా, అల్లరి నరేష్ సినిమా అంటే ఫుల్ లెంగ్త్ కామెడీ ఆశిస్తారు. కానీ ఆ ఫీల్ ఇందులో మిస్ అయినట్టు అనిపిస్తుంది.

అల్లరి నరేష్ నుంచి ఓ పర్ఫెక్ట్ పుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ని ఆశించి వెళ్ళే వారిని ఈ సినిమా అంత మెప్పించకపోవచ్చు. అలా అని మరీ అంత నిరాశాపరిచేలా కూడా లేదు. సినిమాలో సంపూర్నేష్ పాత్రని ఇంకాస్త ఎక్కువగా వాడుకొని కామెడీ చేయించాల్సింది. ఇకపోతే పాటలు వినడానికి మరియు విజువల్ పరంగా సూపర్ కానీ సందర్భానుసారంగా అయితే ఏదీ సింక్ అవ్వలేదు. సినిమా ఫ్లోని మరింత దెబ్బతీసేలా సాంగ్స్ ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో డైరెక్టర్ అనుకున్నదానికి ప్రాణం పోసిన వారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళే సినిమాటోగ్రాఫర్ పిజి విందా మరియు మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కోడూరి. పిజి విందా సినిమాలో ప్రతి ఫ్రేంని చాలా డిఫరెంట్ గా, లుక్స్ పరంగా చాలా గ్రాండ్ గా చూపించాడు. చెప్పాలంటే అల్లరి నరేష్ సినిమాల్లో ఈ రేంజ్ విజువల్స్ మనం ఇంతక ముందు చూసి ఉండకపోవచ్చు. అల్లరి నరేష్ – ఈశలను సాంగ్స్ లో చాలా బాగా చూపించాడు. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ కి కళ్యాణ్ కోడూరి మ్యూజిక్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. కళ్యాణ్ కోడూరి అందించిన ఆల్బంలో 3 పాటలు పెద్ద సక్సెస్ అయ్యాయి, కానీ విజువల్స్ పరంగా ఆన్ స్క్రీన్ అన్నీ సక్సెస్ అయ్యాయి. అలాగే నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంది. ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల సినిమాని వేగవంతంగా సాగేలా చెయ్యడానికి ఇంకాస్త కేర్ఫుల్ గా కట్ చేసి ఉంటే బాగుండేది. కిరణ్ కుమార్ ఈ సినిమా కోసం వేసిన కొన్ని సెట్స్ బాగున్నాయి.

ఇక ఈ సినిమాకి హెడ్ మరియు కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం విభాగాలను డీల్ చేసిన ఇంద్రగంటి మోహన కృష్ణ విషయానికి వస్తే.. కథ – ప్రతిసారి డిఫరెంట్ కథలు రాసుకునే మోహనకృష్ణ ఈ సారి రెగ్యులర్ కమర్షియల్ కథని ట్రై చేసాడు. కావున కథలో కొత్త దానం లేకపోగా రొటీన్ గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే – ఇంకాస్త వేగంగా ఉండాల్సింది, ఇప్పుడైనా పాటలని తీసేస్తే ఇంకాస్త స్పీడ్ గా సినిమా ఉంటుంది. మాటలు – బాగున్నాయి, ముఖ్యంగా కొన్ని చాలెంజింగ్ సీన్స్ లో రాసిన డైలాగ్స్ బాగున్నాయి. దర్శకత్వం – నటీనటుల నుంచి మంచి నటనని రాబట్టుకున్నాడు. కానీ కామెడీ పరంగా ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది, ఎందుకంటే సినిమా తీసింది అల్లరి నరేష్ తో కాబట్టి.. ఈవివి సినిమా బ్యానర్ ని మళ్ళీ పునః ప్రారంభించి, ఆ బ్యానర్ కి పూర్వ వైభవాన్ని చేకూర్చాలని రాజేష్ – నరేష్ కలిసి చేసిన బందిపోటు సినిమా నిర్మాణ విలువలు హై రేంజ్ లో ఉన్నాయి. తమ సినిమా అనుకొని డబ్బులు కుమ్మరించి ఈ సినిమా తీయకపోయినా సినిమా చూస్తున్నంత సేపు ఓ భారీ బడ్జెట్ ఫిల్మ్ చూస్తున్నాం అనే ఫీలింగ్ కలిగించే రేంజ్ లో నిర్మాణ విలువలు ఉన్నాయి.

తీర్పు :

అల్లరి నరేష్ కెరీర్ లో తన ఇమేజ్, తన మార్క్ ని పక్కన పెట్టి చేసిన డిఫరెంట్ మూవీ ‘బందిపోటు’. ఈ సినిమాలో మీరు ఓ కొత్త అల్లరి నరేష్ ని చూస్తారు. సినిమాలో కామెడీ ఉంది కానీ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా కాస్త స్లో అనిపిస్తుంది. స్లో అయినా పరవాలేదు ఓవరాల్ గా కంటెంట్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆడియన్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. పాత్రల పరిచయాలు, అల్లరి నరేష్ కొత్త తరహా పాత్ర, అక్కడక్కడా నవ్వించే కొన్ని సీన్స్, బ్యూటిఫుల్ విజువల్స్, మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అయితే రొటీన్ గా కనిపించే కథ, కాస్త స్లోగా అనిపించే కథనం చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా మీరు థియేటర్ కి వెళ్లి ఓ సారిచూసి ఎంజాయ్ చేయగలిగే మూవీ ‘బందిపోటు’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు