సమీక్ష : బ్రహ్మాస్త్రం: మొదటి భాగం – శివ – విజువల్ గా మెప్పించినా.. కంటెంట్ పరంగా బోర్ కొడుతుంది!

సమీక్ష : బ్రహ్మాస్త్రం: మొదటి భాగం – శివ – విజువల్ గా మెప్పించినా.. కంటెంట్ పరంగా బోర్ కొడుతుంది!

Published on Sep 10, 2022 3:05 AM IST
Brahmāstra: Part One – Shiva Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 09, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని, షారూఖ్ ఖాన్, డింపుల్ కపాడియా

దర్శకత్వం : అయాన్ ముఖర్జీ

నిర్మాతలు : కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, రణబీర్ కపూర్, మారిజ్కే డిసౌజా, అయాన్ ముఖర్జీ

సంగీత దర్శకుడు : సైమన్ ఫ్రాంగ్లెన్, ప్రీతమ్

సినిమాటోగ్రఫీ : వి. మణికందన్, పంకజ్ కుమార్, సుదీప్ ఛటర్జీ, వికాష్ నౌలాఖా, పాట్రిక్ డ్యూరక్స్

ఎడిటర్ : ప్రకాష్ కురుప్

 

రణబీర్ కపూర్ – ఆలియా భట్ జంటగా నటించిన భారీ సినిమా బ్రహ్మాస్త్ర. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం నేడు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

అస్త్రాలన్నిటికీ అధిపతి బ్రహ్మాస్త్ర. ఈ బ్రహ్మాస్త్రని మూడు భాగాలుగా చేసి దుష్టుల చేతికి చిక్కకుండా బ్రహ్మాన్ష్‌ గ్రూప్ కాపాడుతూ ఉంటుంది. బ్రహ్మాస్త్ర లోని ఒక భాగం బ్రహ్మాన్ష్‌ గ్రూప్ కు చెందిన అనీష్(నాగార్జున) దగ్గర ఉంటే, రెండో భాగం శాస్త్రవేత్త మోహన్ భార్గవ్‌(షారుఖ్ ఖాన్) వద్ద ఉంటుంది. అలాగే మూడో భాగం ఎక్కడుంది ? అని కథా గమనంలో తెలుస్తోంది. మొత్తానికి విడి విడిగా ఉన్న ఈ మూడు భాగాలను కలిపి, ఆ బ్రహ్మాస్త్ర ని పొందాలని మౌనీ రాయ్‌ అండ్‌ విలన్ గ్రూప్ అనేక ప్రయత్నాలు చేస్తూ.. బ్రహ్మాన్ష్‌ గ్రూప్ కు చెందిన వ్యక్తులను చంపుకుంటూ బ్రహ్మాస్త్ర భాగాలు కోసం వెతుకుతూ ఉంటారు. అయితే, ఇదంతా డీజే శివ(రణబీర్‌ కపూర్‌)కి కళ్ళ ముందు జరుగుతున్న భావన కలుగుతుంది. తనలో తానే చిత్రవధ అనుభవిస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో శివ, ఇషా(అలియా భట్) ను చూసి ప్రేమలో పడతాడు. మరి తన ప్రేమ కోసం శివ ఏం చేశాడు?, అలాగే బ్రహ్మాస్త్ర ను కాపాడటానికి గురూజీ (అమితాబ్ బచ్చన్)తో కలిసి ఎలాంటి పోరాటం చేశాడు ?, చివరకు ఈ కథ ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

అత్యంత భారీ అంచనాలతో వచ్చిన ఈ అద్భుతమైన విజువల్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో భారీ తారాగణం ఉంది. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, అలాగే రణబీర్ – అలియా ఇలా ప్రతి సన్నివేశం స్టార్ల పైనే నడుస్తోంది. షారుఖ్, నాగార్జున, అమితాబ్ నటన హృదయాలను హత్తుకుంది. వీరి పాత్రల ఎమోషన్స్ కూడా బాగున్నాయి.

అలాగే ప్రధాన పాత్రలో నటించిన రణబీర్ కూడా చాలా బాగా నటించాడు. హీరోయిన్ గా నటించిన అలియా భట్ తన నటనతో ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించింది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఫ్యాన్స్ కు బ్రహ్మాస్త్ర రూపంలో రణబీర్ గుర్తుపెట్టుకునే మంచి యాక్షన్ విజువల్ ట్రీట్ ఇచ్చారు.

ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో రణబీర్ – అమితాబ్ తమ మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. బ్రహ్మాస్త్రం కోసం సాగే ఈ కథలో దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రతి పాత్రను బ్రహ్మాస్త్ర కోసం చేసే పోరాటంలో కలిసిపోయేలా ప్లేను రాసుకోవటం బాగా ఆకట్టకుంది.

 

మైనస్ పాయింట్స్:

అద్భుతమైన విజువల్స్ తో వచ్చిన ఈ ‘హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్’ విజువల్స్ పరంగా ఆకట్టుకున్నా.. కథ పరంగా పూర్తిగా నిరాశ పరిచింది. చాలా సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే, సినిమా స్టార్టింగ్ లో ఇచ్చినంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయడంలో పూర్తిగా విఫలం అయ్యరు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు అస్సలు ఎఫెక్టివ్ గా లేవు.

అలాగే అలియా భట్ – రణబీర్ ల మధ్య లవ్ ట్రాక్ కూడా బాగాలేదు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలతో ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లితే మాత్రం నిరాశ తప్పదు. అన్నిటికీ మించి చాలా సీన్స్ ఇంట్రెస్ట్ లేకుండా బాగా స్లోగా సాగుతాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ విజువల్స్ మరియు టేకింగ్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథనం మీద అస్సలు పెట్టలేదనిపిస్తుంది. దీనికి తోడు, సినిమా మొత్తం ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది గాని, కథలో మాత్రం ఆ కంటెంట్ అండ్ మూమెంట్ లేకుండా పోయింది.

 

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ఇక సంగీత దర్శకులు సమకూర్చిన పాటలు ఏవరేజ్ గా ఉన్నాయి. అయితే, వాటి పిక్చరైజేషన్ మాత్రం బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

 

తీర్పు :

రణబీర్ – అలియాతో పాటు అమితాబ్, షారుఖ్, నాగ్.. ఇలా భారీ తారాగణంతో విజువల్ వండర్ గా సాగిన ఈ యాక్షన్ డ్రామాలో.. గుడ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. అయితే, సినిమాలో విజువల్స్, టేకింగ్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథాకథనాల పై పెట్టలేదు. ఫలితంగా సినిమా ఆకట్టుకోలేదు. ఓవరాల్ గా ఈ సినిమా విజువల్స్ పరంగా ఆకట్టుకున్నా.. కంటెంట్ పరంగా ఫెయిల్ అయింది. మొత్తమ్మీద ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు