సమీక్ష : ‘చైతన్యం’ – సందేశంతో సాగినా.. ఆకట్టుకొని ఎమోషనల్ డ్రామా !

సమీక్ష : ‘చైతన్యం’ – సందేశంతో సాగినా.. ఆకట్టుకొని ఎమోషనల్ డ్రామా !

Published on Aug 16, 2021 12:05 AM IST
Chaitanyam movie review

విడుదల తేదీ : ఆగస్టు 15, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

తారాగణం: కౌటిల్య, యాషిక, సుందరం, రఘునాధ,్‌ ఈశ్వర్‌ రెడ్డి, రామారావు, శివప్రసాద్‌, విష్ణుప్రియ తదితరులు

దర్శకత్వం:  సూర్య

సంగీతం : అర్జున్‌ రాము

స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ : మీరఖ్‌

నిర్మాతలు : మురళీ మోహన్‌ రెడ్డి, రఘునాధ్‌ ఈశ్వర్‌ రెడ్డి

కౌటిల్య, యాషిక జంటగా సూర్య దర్శకత్వంలో జెఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళీ మోహన్ రెడ్డి, రఘునాధ్ ఈశ్వర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘చైతన్యం ‘. కాగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

ప్రకాష్ (కౌటిల్య) పుట్టి పెరిగిన పరిస్థితుల కారణంగా డబ్బు ఉంటేనే జీవితం అని బలంగా నమ్మి.. డబ్బు కోసం తండ్రి కిడ్నీ అమ్మి దుబాయ్ కి వెళ్తాడు. అక్కడ సమస్యల వలయంలో చిక్కుకుని ఎన్నో ప్రయత్నాలు కష్టాల తర్వాత పూర్తిగా మారిపోయి, ఇండియాకి తిరిగి వస్తాడు. మరోపక్క మధు (యాషిక) విజయ్ అనే అబ్బాయి చేతిలో మోసపోయి కొన్ని కారణాల చేత, కొన్ని రోజుల పాటు ప్రకాష్ ఇంట్లో ఉండాల్సి వస్తోంది. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ప్రకాష్ కుటుంబంతో మధు ఎలా కలిసిపోయింది ? ప్రకాష్ జీవితంలో ఎదగడానికి ఏమి చేశాడు ? చెత్త పురంలా ఉన్న చైతన్య పురాన్ని టూరిజం స్పాట్ గా ఎలా అభివృద్ధి చేశాడు ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఎవరో వస్తారు, ఏదో చేస్తారని బద్దకాన్ని వదలండి, చైతన్యం లేకుంటే మనిషి బతుకు దుర్భరం అనే కథాంశంతో వచ్చిన ఈ సినిమా సందేశం పరంగా మాత్రం నిజంగా స్ఫూర్తినిచ్చే సినిమానే. ఇక వెనుకబడిన ప్రాంతాల్లోని గ్రామంలో జరిగే దారుణాలను చాల క్లారిటీగా చూపించారు. ముఖ్యంగా పేదవాళ్ళు పథకాల మత్తులో ఎలా జీవితాన్ని వృధా చేసుకుంటున్నారో లాంటి అంశాల్ని కూడా చాలా ఎమోషనల్ గా చూపించారు.

అలాగే సమాజం చుట్టూ ఉన్న పరిస్థితులను అవకాశాలను హైలైట్ చేస్తూ చెప్పడం బాగుంది. ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్ర‌లో నటించిన కౌటిల్య తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా నటించిన యాషిక స్క్రీన్ ప్రెజెన్సీతో పాటు ఆమె పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో కూడా దర్శకుడు సూర్య మంచి ప్రతిభ కనబర్చాడు.

 

మైనస్ పాయింట్స్ :

మంచి మెసేజ్ తో కూడుకున్న కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు సూర్య ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సన్నివేశాలను రాసుకోలేకపోయాడు. అయితే, కొన్ని సీన్స్ ను తెర మీదకు ఆసక్తికరంగా మలిచినప్పటికీ.. స్లో నేరేషన్ కారణంగా కొన్ని చోట్ల సినిమా చాలా బోర్ గా సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్‌ ఇంట్రస్ట్ లేని సీన్లతో మరియు సాగతీత సన్నివేశాలతో, పండిన ఎమోషన్ తో ప్లే సాగింది.

అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ కాన్సెప్ట్ కి సంబంధించిన సన్నివేశాల్లో కొన్ని ఆకట్టుకోవు. ఇక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా నమ్మశక్యంగా ఉండదు. అలాగే హీరో పాత్ర కూడా చాలా బలహీనంగా ఉంది. అతని పెయిన్ తో పాటు అతని క్యారెక్టర్ లోని ఆర్క్ అండ్ మోటివ్ ను ఇంకా బలంగా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది.

పైగా ఎక్కువగా అనుభవం లేని నటీనటులు నటించడం కూడా సినిమాలోని ఎమోషన్ని ఎలివేట్ చేయలేకపోయింది. చాలా సన్నివేశాల్లో కొందరి నటీనటుల హావభావాలు, వారి నటన కూడా పాత్ర స్థాయికి తగ్గట్టు లేదు.

 

సాంకేతిక వర్గం :

సినిమాలో మంచి కాన్సెప్ట్ ని తీసుకున్న దాన్ని తెర మీద చూపెట్టడంలో మాత్రం దర్శకుడు కొన్ని చోట్ల విఫలమయ్యాడు. కెమెరామెన్ పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. విజువల్స్, మరియు కొన్ని షాట్స్ బాగున్నాయి. అర్జున్‌ రాము అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. కాకపోతే పాటల్లో చాలా చోట్ల పాత చిత్రాల్లోని బిట్స్ గుర్తువస్తాయి. ఇక ఎడిటర్ పనితనం పర్వాలేదు. నిర్మాతలు మురళీ మోహన్‌ రెడ్డి, రఘునాధ్‌ ఈశ్వర్‌ రెడ్డి సినిమాకి తగ్గట్టు ఖర్చు పెట్టారు.

 

తీర్పు :

చైతన్యం తెచ్చుకుని ముందడుగు వేస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో సందేశాత్మకంగా సాగిన ఈ సినిమా.. మెసేజ్ పరంగా మెచ్చుకో తగినది. అయితే ఆకట్టుకోని కథ కథనాలు, మెప్పించలేకపోయిన సన్నివేశాలు, బలం లేని బలహీన పాత్రలు వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. కానీ, తీసుకున్న నేపథ్యం, చెప్పిన మెసేజ్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. మొత్తమ్మీద ఈ సినిమా అతి సాధారణ సగటు ప్రేక్షకుడికి నచ్చే అవకాశం ఉంది. కానీ, మిగిలిన వర్గాల ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోదు.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు