సమీక్ష : చినబాబు – బంధాలు వర్సెస్ సమస్యలు

ChinnaBabu movie review

విడుదల తేదీ : జులై 13, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : కార్తీ, సయేష

దర్శకత్వం : పాండిరాజ్

నిర్మాత : సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి

సంగీతం : డి.ఇమాన్

సినిమాటోగ్రఫర్ : వేల్ రాజ్

ఎడిటర్ : రుబన్

స్క్రీన్ ప్లే : పాండిరాజ్

కార్తీ, సయేష జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చినబాబు’. సత్యరాజ్ ఓ ముఖ్య పాత్రలో, కార్తి మొదటిసారి రైతు పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

రుద్ర‌రాజు (స‌త్య‌రాజ్ )కు ముగ్గురు ఆడపిల్లలు పుట్టాక మగపిల్లాడు కోసం భానుప్రియను రెండో పెళ్లి చేసుకుంటాడు. అలా రుద్ర‌రాజుకు ఐదుగురు ఆడపిల్లలు పుట్టిన త‌ర్వాత మ‌గ‌పిల్లాడు (కార్తి) పుడతాడు. ఆ ఇంటి వారసుడిగా, ఐదుగురి అక్కలకు తమ్ముడిగా ఎంతో గారాబంగా పెరుగుతాడు. పెద్దయ్యాక ఊర్లోనే ఉండి ఆర్గానిక్ వ్య‌వ‌సాయం చేస్తూ ఉత్తమ రైతుగా అవార్డులు సైతం గెలుచుకుంటూ పేపర్లో పడతాడు. కానీ అదే ఊర్లో ఉండే సురేంద‌ర్ రాజుకు (శ‌త్రు), చినబాబుకు పడదు. ఇద్దరు శత్రువులుగా ఫీల్ అవుతారు. కాగా చినబాబు( కార్తి)కు రాధిక, ఇందిరా మేన‌కోడ‌ళ్లుంటారు. ఇద్దరూ మామయ్య ( కార్తి )ను చిన్నప్పటినుంచి ప్రాణంగా ప్రేమిస్తారు.

అయితే చినబాబు, నీల‌నీర‌ద (సయేష)ను ప్రేమిస్తాడు. ఆమె బావ సురేంద‌ర్ రాజు (శ‌త్రు) చినబాబు మీద ఇంకా పగను పెంచుకొని, చినబాబు కుంటుంబంలో చిచ్చులు రేపుతాడు. మేన‌కోడ‌లు రాధిక కూడా నన్నుపెళ్లి చేసుకోకపోతే చనిపోతానని బెదిరిస్తోంది. ఈ క్రమంలో అక్క‌లు చినబాబుతో గొడవ పడతారు. తమ్ముడిని కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు.

ఈ నేపథ్యంలో చినబాబు తిరిగి తన కుంటుంబాన్ని ఎలా కలిపాడు ? పెళ్లి చేసుకోకపోతే చనిపోతాను అనే మేన‌కోడ‌లను ఎలా మార్చాడు ? తన పెళ్లికి వాళ్ళను ఎలా ఒప్పించాడు ? నీలనీర‌దతో పెళ్లి కోసం ఇంకేం చేశాడు ? అడ్దు వచ్చిన సురేంద‌ర్ రాజు (శ‌త్రు) ఏం చేశాడు ? చివరికి చినబాబు కుటుంబం తిరిగి కలిసిందా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే చినబాబు చిత్రం చూడాలసిందే !

ప్లస్ పాయింట్స్ :

మొదటిసారి రైతు పాత్రలో నటించిన కార్తి, అచ్చం ఓ రైతులానే తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం చాలా బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో, ఓ పల్లెటూరి కుర్రాడిలా చాలా సహజంగా నటిస్తూ సినిమాకి హైలెట్ గా నిలచారు. హీరోయిన్ గా నటించిన సయేష, పల్లెటూరి అమ్మాయిగా, అటు ఓ సోడా కంపెనీకి ఓనర్ గా తన గ్లామర్ తో పాటు, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుంది.

హీరోకి తండ్రి పాత్రలో నటించిన సత్యరాజ్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు. మగపిల్లాడు కోసం తాపత్రయపడే ఓ సగటు తండ్రిలా ఆయన నటించిన విధానం నవ్వులు పూయించడంతో పాటు ఎమోషనల్ గానూ ఉంటుంది. హీరోకి పిన తల్లిగా నటించిన భానుప్రియ కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తన మార్క్ ను చూపించారు. అక్కలు బావలుగా నటించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. కొన్ని సన్నివేశాల్లో వాళ్ళ మ్యానరిజమ్స్ తో బాగానే నవ్వించారు.

పాండిరాజ్ స్క్రిప్ట్ , టేకింగ్ కూడా సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించడంతో పాటు కథ మన చుట్టూ జరుగుతున్నట్లుగా బాగా తెరకెక్కించారు. మొదటి అర్ధభాగాన్ని సరదాగా, కొంచెం ఎమోషనల్ గా నడిపిన ఆయన సెకండాఫ్ లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో పాటు కుటుంబ బంధాలను చాలా చక్కగా చూపించారు. ప్రధానంగా హీరోకి తన అక్కలకి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగుంటాయి

ఈ చిత్రంలో హీరో తన వెహికిల్ పై ఫార్మర్‌ అని రాసుకోని రైతు అని చెప్పుకోవటానికి గర్వపడాలి అనే సెన్స్ ను సినిమాలో హైలెట్ చెయ్యటం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు పాండిరాజ్ రైతులకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. హీరో, విలన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు బాగున్నప్పటికీ అక్కడక్కడా కొన్నిచోట్ల సాగతీసినట్లు, కొంచెం సినిమాటిక్ గా అనిపిస్తాయి.

కుటుంబ బంధాలను బాగానే ఎలివేట్ చేసినప్పటికీ , లవ్ ట్రాక్ ను ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నా, దర్శకుడు మాత్రం ఎందుకో లవ్ ట్రాక్ ను పూర్తిగా వాడుకోలేదు. సినిమాలో ముఖ్యంగా తమిళ నేటివిటీ ఎక్కువుగా కనిపిస్తోంది. ఆర్టిస్ట్ ల దగ్గరనుంచి వారి హావాభావాలు దాకా తమిళ వాసనలు స్పష్టంగా కనిపిస్తాయి. పైగా సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా సాగతీసారు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు పాండిరాజ్ రైతులకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకొని, దానికి ఉమ్మడి కుటుంబలో వచ్చే సమస్యలను మిక్స్ చేసి చూపించే ప్రయత్నం చేశారు. డి.ఇమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆయన అందించిన పాటలు కూడా ఆకట్టుకున్నేలా ఉన్నాయి.

వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా పల్లెటూరి విజువల్స్ ను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. రుబన్ ఎడిటింగ్ బాగుంది. కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను కూడా తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాత సూర్య, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

కుటుంబ బంధాలను చక్కగా చూపించిన ఈ చిత్రంలో, కొన్ని మెప్పించే అంశాలు ఉన్నప్పటికీ, ముఖ్యమైన కథనం కొత్త నెమ్మదిగా, తెలుగు నేటివిటీకి కొంచెం దూరంగా సాగుతుంది. సినిమాలో పాత్రలు కూడా మరి ఎక్కువైపోవడం, వారి గురించి ఉండాల్సిన స్థాయిలో ఎలివేషన్ లేకపోవడం నిరుత్సాహపరిచే విషయాలు. మొత్తం మీద ఏ సెంటర్ ప్రేక్షకుల్ని సినిమా పూర్తిగా మెప్పించలేకపోవచ్చు. కానీ, బీ. సీ సెంటర్ ప్రేక్షకులకు ముఖ్యంగా పల్లెటూరి ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :