సమీక్ష : చిత్రాంగద – అంజలి మాత్రమే ఆకట్టుకుంది !

విడుదల తేదీ : మార్చి 10, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం :జి. అశోక్

నిర్మాతలు :రెహమాన్, గంగ పట్నం శ్రీధర్

సంగీతం :వి. సెల్వగణేష్

నటీనటులు :అంజలి

హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చిత్రాంగద’ ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా ఎన్నో వాయిదాలుపడి చివరకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇంత ఆలస్యంగా వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

చిత్ర(అంజలి) కాలేజీ ప్రొఫసర్ గా పనిచేస్తూ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటుంది. కొంత కాలం గడిచిన తరువాత చిత్ర వింతగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. ఆమె ప్రవర్తనకి హాస్టల్ లోని వారంతా ఆశ్చర్యపోతుంటారు. ఆమె ప్రవర్తనకు భయపడిన హాస్టల్ లోని అమ్మాయిలు ఖాళీ చేసి వెళ్లిపోవడం ప్రారంభిస్తారు.

తాను ఇలా ప్రవర్తించడానికి కారణం తన కళ్ల ముందే జరిగిన ఓ హత్య వలన అని తనకు వచ్చిన కల ద్వారా చిత్రకు అర్థమవుతుంది. ఓ మహిళ ఓ వ్యక్తిని హత్య చేసినట్లు ఆమెకు కల వస్తుంది. అనేక విధాలుగా ప్రయత్నించి ఆ హత్య అమెరికాలోని ఓప్రదేశం లో జరిగినట్లు ఆమె గుర్తిస్తుంది.

ఇక తన సమస్యని పరిష్కరించుకోవడానికి అమెరికాకు పయనమవుతుంది. ఆ హత్య మిస్టరీ ఏంటి ? చిత్రను వేధిస్తున్న సమస్యలు ఏంటి ? అసలు ఆమెకు వచ్చిన కల సంగతేమిటి ? అనేదే తెరపై నడిచే సినిమా..

ప్లస్ పాయింట్స్ :

ఓ మంచి కథ తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పాలి. అంజలి వెనుక జరిగే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఓ బలమైన పాత్రలో నటించిన అంజలి తన నటన ప్రతిభతో చిత్రాన్ని ముందుకు నడిపించడానికి చాలా వరకు ప్రయత్నించింది. డాక్టర్ పాత్రలో జయప్రకాశ్ బాగా నటించారు.

హిందీ నటుడు అర్జున్ బజ్వా నెగిటివ్ రోల్ ల బాగా నటించారు. కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ మెప్పించాడు. ముఖ్యంగా సింధుతులానికి అతనికి మధ్య వచ్చే సన్నివేశాలు చివరి పదిహేను నిమిషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ చిత్ర నిర్మాణ విలువలు బావున్నాయి. ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చేయడంతో ఆ లొకేషన్లు తెర మీద ఆహ్లాదకరంగా అనిపించాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రాన్ని ఆసక్తి కరంగా మలచడంలో సాదాసీదా ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. బలమైన కథ ఉన్నపటికీ చిత్రాన్ని ఆకట్టుకునేలా మలచడం లో దర్శకుడు విఫలమయ్యాడు. సింపుల్ గా సాగే ఈ థ్రిల్లర్ చిత్రం 2 గంటల 20 నిమిషాలు అంటే అది ప్రేక్షకులను పరీక్షా సమయమే.

అంజలి వింతగా ప్రవర్తిస్తూ నటించించడం, ఆ సన్నివేశాలలో ఆమె ధరించిన దుస్తులు అంతగా ఆకట్టుకోలేదు. మాస్ ఆడియన్స్ ను మెప్పించడానికి అంజలి ఓవర్ యాక్షన్ చేయడం వంటివి మైనస్ గా మారాయి.

అసందర్భంగా వచ్చే పాటలు చిత్ర ఫ్లో ని అడ్డుకున్నాయి. స్వాతి దీక్షిత్ పాత్ర సినిమాకు అస్సలు అవసరం లేదనే భావన కలిగింది. సప్తగిరి పై నడిచే కామెడీ సన్నివేశాలు చాలా చోట్ల విసుగు పుట్టిస్తాయి.

సాంకేతిక విభాగం :

ఈ చిత్రం లోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అసలు బాగాలేదు. ఎడిటింగ్ విభాగం కూడా సరిగా లేదు. రన్ టైమ్ ను కాస్త తగ్గించాల్సింది. డైలాగ్స్ పర్వాలేదనిపించే విధంగా ఉన్నాయి. కెమెరా మెన్ పనితనం బావుంది. అమెరికా మరియు ఇతర లోకెషన్లలో చిత్రీకరించిన సన్నివేశాలు బావున్నాయి.

ఇక దర్శకుని విషయానికి వస్తే.. అశోక్ ఈ చిత్రం ద్వారా పూర్తిగా నిరాశపరిచాడు. ఓ మంచి కథతో అశోక్, అంజలిని ఈ చిత్రానికి ఒప్పించినట్లు తెలుస్తోంది కానీ ఆ కథని ఆసక్తి కరమైన చిత్రంగా దర్శకుడు మలచలేకపోయాడు. కేవలం చివరి 10 నిమిషాలు మాత్రమే ఆసక్తికరంగా ఉంటుంది.

తీర్పు :

‘చిత్రాంగద’ కథపరంగా మంచిదే కానీ దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు అస్సలు బాగోలేదు. ఒక సాధారణమైన, ఎంటర్టైన్మెంట్ ఉన్న ప్లాట్ ను సాగదీసి, ఆకట్టుకోని కథనంతో బోరింగ్, విసుగు పుట్టించే విధంగా తయారు చేశాడు దర్శకుడు. అంజలి మాత్రం తన నటనతో మెప్పిస్తూ సినిమాను తన భుజాలపైనే మోసే ప్రయత్నం చేసింది కానీ దర్శకత్వ లోపాల వలన ఈ చిత్రం బిలో యావరేజ్ గా మిగిలింది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More