Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : కొరియర్ బాయ్ కళ్యాణ్ – డిఫరెంట్ ప్రయత్నమే కానీ..!

Courier-Boy-Kalyan-review

విడుదల తేదీ : 17 సెప్టెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ప్రేమ్ సాయి

నిర్మాత : గౌతమ్ మీనన్, వెంకట్ సోమసుందరం, రేష్మా ఘంటాల, సునీత తాటి

సంగీతం : కార్తీక్, అనూప్ రూబెన్స్

నటీనటులు : నితిన్, యామి గౌతమ్..

‘కొరియర్ బాయ్ కళ్యాణ్’.. వరుస హిట్స్‌తో జోరు మీదున్న నితిన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాణంలో రూపొంది చాలా కాలంగా విడుదలకు నోచుకోకుండా ఎదురుచూయించిన సినిమా. ఎట్టకేలకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, నితిన్ కెరీర్లో డిఫరెంట్ సినిమాగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకునేలా ఉందీ? చూద్దాం..

కథ :

కళ్యాణ్ (నితిన్).. బీఏ ఫెయిలై ఏ ఉద్యోగమూ దొరక్క సాదాసీదా జీవితం గడిపే ఓ యువకుడు. ఉద్యోగాల వేటలో ఉన్నపుడే కళ్యాణ్, కావ్య (యామి గౌతమ్) అనే అమ్మాయిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కోసమే ఓ కొరియర్ కంపనీలో కొరియర్ బాయ్‌గా చేరతాడు. ఈ క్రమంలోనే కళ్యాణ్, కావ్యలు ఒకరినొకరు రోజూ కలుసుకోవడం, ఆ తర్వాత ప్రేమలో పడడం జరిగిపోతుంది. ఇదిలా ఉండగానే కళ్యాణ్ జీవితాన్ని అనుకోని మలుపులు తిప్పుతుంది.

విదేశాల్లో ఓ పెద్ద డాక్టర్ అయిన అశుతోష్ రానా, తన స్వలాభం కోసం ఒక పరిశోధన చేస్తాడు. ఆ పరిశోధనలో తమ లాభం కోసం ఇండియాలోని కొన్ని ఆసుపత్రుల్లో తన సీక్రెట్ ప్లాన్‌ను అమలుచేస్తుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక ఆసుపత్రిలో పనిచేసే వార్డు బాయ్ హైద్రాబాద్‌లో ఉండే సామాజిక కార్యకర్త అయిన సత్యమూర్తి (నాజర్)కు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక కొరియర్ చేస్తాడు. ఆ కొరియర్ చేరాల్సిన చోటుకు చేరిందా? అశుతోష్ చేసే అక్రమం బయటి ప్రపంచానికి తెలిసిందా? సీక్రెట్ రీసెర్చ్ ఏంటీ? అన్న ప్రశ్నలకు సమాధానమే ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొత్తదనమున్న కథను గురించి చెప్పుకోవాలి. ఒక మామూలు కొరియర్ బాయ్ జీవితంలో ఒక కొరియర్ పార్సిల్ అనుకోని పరిస్థితులు తెచ్చిపెట్టడం, అందులో ఓ పెద్ద అక్రమార్కుడి ప్లాన్స్ ఉండడం, దాని చుట్టూ ఒక కథ అల్లడం ఇదంతా డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వారికి చాలా బాగా నచ్చే అంశం. ఇక ముఖ్యంగా కొరియర్‌లో ఉండే అసలైన విషయం కూడా తెలుగు సినిమాకు కొత్తది అనే చెప్పాలి. సెకండాఫ్‌లో కొరియర్ చుట్టూ సస్పెన్స్ ఎలిమెంట్‌తో కథను తిప్పడం బాగుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. హీరో నితిన్ పాత్ర అక్కడక్కడా గతంలో నితిన్ చేసిన పాత్రలు గుర్తు తెచ్చినా, ఓవరాల్‌గా క్యారెక్టర్, సినిమా పరంగా నితిన్ ట్రై చేసిన డిఫరెంట్ అటెంప్ట్‌గా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ నిలుస్తుందని చెప్పుకోవచ్చు. కళ్యాణ్‌గా నితిన్ నటన చాలా బాగుంది. ఇటు లవర్ బాయ్‌గా తన చలాకీతనం చూపుతూనే, సీరియస్ సన్నివేశాల్లోనూ బాగా మెప్పించాడు. యామి గౌతమ్‌ అందం విషయంలో వంక పెట్టలేం. పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలో ఉన్నంతలో బాగా నటించింది. ఇక నాజర్, అశుతోష్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సినిమా పరంగా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తాన్నీ సరదా సరదాగా లాగేసినట్లు కనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం చాలా బాగుంది. ఇక సెకండాఫ్‌లో సినిమా మేజర్ కథ నడుస్తుంది. ఇక్కడ ఒక సస్పెన్స్ ఎలిమెంట్‌ను చివరివరకూ కంటిన్యూ చేసే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే.. ఒక డిఫరెంట్ కథను సినిమాగా చెప్పేందుకు కావాల్సినంతగా కథను విస్తరించకపోవడం గురించి చెప్పుకోవాలి. కథ చాలా కొత్తదే అయినా, సింగిల్ పాయింట్ కావడంతో సబ్‌ప్లాట్స్‌పై ఆధారపడి సినిమాను అర్థవంతంగా చెప్పాల్సిన ప్రయత్నంలో స్క్రీన్‌ప్లేలోని తప్పిదాలు కనిపిస్తాయి. దీంతో సినిమాలో ఇంటరెస్టింగ్ పాయింట్స్ ఏవీ లేక, ఒకదాని తర్వాత ఒక సన్నివేశం పెద్దగా ప్రాధాన్యం లేకుండా వచ్చేస్తున్నట్లు కనిపిస్తుంది.

ఇక పాటలు వినడానికి, చూడడానికి బాగున్నా కూడా అవి వచ్చే సందర్భాలే అర్థరహితంగా ఉండి సినిమా ఫ్లోను దెబ్బతీశాయి. ఇక కొన్ని విషయాల్లో డీటైలింగ్ ఇచ్చినా చాలావరకూ త్వరత్వరగా అర్థాంతరంగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ వరకూ సినిమా కథలోకి వెళ్ళకుండా లవ్‌ట్రాక్‌తోనే నడిపించారు. సెకండాఫ్‌లో కొద్దిసేపు సినిమా ఆసక్తికరంగా నడిచినా, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చేసరికి సినిమాను చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో మరికొంత డీటైలింగ్ ఇచ్చి, అనవసరమైన పాటలను తీసేసి, ఇదే కథను ఏమాత్రం ఆసక్తికరంగా చెప్పినా కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా ఎక్కడో ఉండేది. ఇవన్నీ మిస్ అవ్వడం చేతే ఎటూపోని ఒక సాదాసీదా సినిమాగా నిలిచింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ముందుగా దర్శక, రచయిత ప్రేమ్ సాయి గురించి చెప్పుకుందాం. కథగా ఒక కొత్త అంశాన్ని చెప్పాలన్న విషయంలో ప్రేమ్ సాయి మంచి మార్కులే కొట్టేస్తాడు. అయితే ఒక కొత్త కథనే స్క్రీన్‌ప్లే ద్వారా కట్టిపడేసే విషయంలో మాత్రం దర్శకుడు చాలా చోట్ల విఫలమయ్యాడు. దర్శకత్వం పరంగా అక్కడక్కడా ప్రేమ్ సాయి ప్రతిభను చూడొచ్చు. అయితే అనవసర అంశాల జోలికి పోకుండా నేరుగా చెప్పాలనుకున్న విషయాన్నే చెప్పేస్తే దర్శకుడిగా ప్రేమ్ సాయి ఒక మార్క్ చూపెట్టగలిగేవాడేమో!

కార్తీక్, అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ బాగుంది. బంగారమా పాట వెంటనే రిజిస్టర్ అయిపోతుంది. సందీప్ చౌతా అందించిన బ్యాక్‌గ్రౌడ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. చాలాచోట్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నిలబెట్టింది. ఇక సినిమాటోగ్రాఫర్ పనితనం బాగుంది. ఎడిటింగ్ విషయంలో సినిమా ఇంకా బాగా ఉండాల్సింది. నెరేషన్‌ను మరింత అందంగా చూపాల్సిన సన్నివేశాల్లో ఎడిటింగ్ సాదాసీదాగా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

తెలుగు సినిమాల్లో ప్రయోగాలు ఎప్పుడో కానీ కనబడవు. అలాంటి పరిస్థితుల్లో ఓ సరికొత్త ప్రయోగం పేరుతో ప్రచారం పొందుతూ వచ్చిన సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. ఓ సరికొత్త కథ, దానిచుట్టూ అల్లుకున్న ఆసక్తికర బ్యాక్‌డ్రాప్, నితిన్ లాంటి హీరో ఈ ప్రయోగం చేయడంతో పాటు తన పాత్రను బాగా పండించడం వంటి విషయాలన్నీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఇక కొత్త కథే అయినా కథనంలో మాత్రం అనవసర విషయాలు జొప్పించడం, అనవసరమైన పాటలు ఇవన్నీ సినిమాకు ప్రతికూలంగా నిలిచే అంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రయోగాత్మకంగా ఏ సినిమా చేయాలన్నా బలమైన కథతో పాటు అంతకుమించి కథనంలో ఆసక్తికర అంశాలు ఉండాలన్నది గతంలో వచ్చిన చాలా సినిమాలు ఋజువు చేసి చూపించాయి. ‘కొరియర్ బాయ్ కళ్యాణ్‌’లో అలాంటి అంశాలు ఉన్నా కూడా ఓవరాల్‌గా వాటన్నింటినీ కలిపి ఆసక్తికరమైన సినిమాగా మలచడంలో చేసిన తప్పిదాలతో ఈ సినిమా ఓ సాధారణ ప్రయోగంగానే మిగిలింది.

123తెలుగు రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :