సమీక్ష : ‘డి కంపెనీ’ (స్పార్క్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారం)

D COMPANY movie review

విడుదల తేదీ : మే 15, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : అశ్వంత్ కాంత్ , రుద్ర కాంత్, నైనా గంగూలీ, అప్సర రాణి, ఇర్రా మోర్

దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ

నిర్మాత‌లు : సాగర్ మాచనూరు

సంగీతం : పాల్ ప్రవీణ్

సినిమాటోగ్రఫీ : మల్హర్ భట్ జోషి

ఎడిటర్ : సంఘ ప్రతాప్ కుమార్

ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ గా పేరుపొందిన దావూద్ ఇబ్రహీం జీవిత కథ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా సినిమా ‘డి కంపెనీ’. కాగా ఈ సినిమాను స్పార్క్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా ఈ రోజు రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

దావూద్ ఇబ్రహీం (అశ్వంత్ కాంత్), సాబీర్ (రుద్ర కాంత్) ఇద్దరూ ఒక కానిస్టేబుల్ కొడుకులు. అయినప్పటికీ ఈ అన్నదమ్ములు ట్రాక్ తప్పుతారు. ఇద్దరు కలిసి ఒక గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తూ ఎలా ఎదిగారు ? గ్యాంగ్ వార్స్ కారణంగా వీళ్లు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? ఈ మధ్యలో దావూద్ ప్రేమించిన సుజాత ( నైనా గంగూలీ)తో అతని ప్రేమ ఎలా సాగింది ?, అసలు ముంబైలో దావూద్ ఇబ్రహీం సొంతంగా దావూద్ గ్యాంగ్ ను ఎలా ఏర్పరిచాడు ? తన అన్న సాబీర్ ను చంపిన వారి పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు ? అనేది మొదటి పార్ట్ కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

అండర్ వరల్డ్ కింగ్ గా ఎదిగిన దావూద్ ఇబ్రహీం ప్రయాణం ఎలా మొదలైంది ? అతని కుటుంబ నేపథ్యం ఎలాంటిది ? ఒక కానిస్టేబుల్ కొడుకు ఈ గ్యాంగ్ వార్స్ కి ఎందుకు ప్రభావితం అయ్యాడు ? లాంటి అంశాలను వర్మ చక్కగా తెరకెక్కించాడు. అలాగే నలభై ఏళ్ళ క్రితం ముంబై ఎలా ఉండేదో, దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ లో తక్కువ కాలంలోనే లీడర్ గా ఎలా ఎదిగాడు అనేది కూడా చాల ప్రాక్టికల్ గా చూపించాడు రామ్ గోపాల్ వర్మ.

ఇక తన అన్నతో కలిసి దావూద్ చేసే దందా సీన్స్, అలాగే కొంత యాక్షన్ డ్రామా కూడా సినిమాలో ప్రధాన హైలైట్స్ గా నిలుస్తాయి. దావూద్ ఇబ్రహీం పాత్రలో అశ్వంత్ కాంత్ జీవించాడు. లుక్స్ దగ్గర నుండి గెటప్ వరకూ చేసే ప్రతి యాక్షన్ లో అచ్చం దావూదే అనే ఫీలింగ్ కలిగేలా అతను నటించాడు. నైనా గంగూలీ బోల్డ్ గా నటించింది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు. వారి మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంటుంది. అలాగే సాబీర్ గా రుద్ర కాంత్ నటన, అప్సర రాణి, ఇర్రా మోర్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

వర్మ ఎప్పటిలాగే టేకింగ్ తో ఆకట్టుకున్నా.. మిగిలిన విషయాల్లో నిరాశ పరిచాడు. వర్మ సినిమాలో ట్రైలర్ లో ఏమి ఉంటుందో.. సినిమాలో కూడా అంతకు మించి కొత్తగా ఏమి ఉండదనే టాక్ కి తగ్గట్టుగానే ఈ సినిమా కూడా సాగుతుంది. ఈ సినిమాలో బిల్డప్ షాట్స్ కి మించి కనీస ఆసక్తి లేకుండా సాగిన ఈ సినిమాలో దావూద్ గురించి కొత్తగా తెలుసుకోవడానికి కూడా ఏమి లేదు.

దావూద్ గురించి చిన్నపాటి ఆర్టికల్ చదివినా ఇంతకుమించిన ఎక్కువ సమాచారం దొరుకుతుంది. మొత్తానికి వర్మ, కథ కంటే కూడా, అనవసరపు సౌండ్ ఎఫెక్ట్స్, చికాకు పెట్టించే వాయిస్ ఓవర్, అలాగే రొటీన్ ఓవర్ బిల్డప్ షాట్స్, ఇక యూత్ వీక్ నెస్ ను క్యాష్ చేసుకోవటానికి అవసరం లేకపోయినా ఓవర్ ఎక్స్ పోజింగ్ ను మరియు కిస్ సీన్స్ ఇరికించిన విధానం సినిమా స్థాయిని తగ్గించింది.

పైగా కథనం కూడా రెగ్యూలర్ మాస్ మసాలా సన్నివేశాలతోనే సాగుతుంది. అండర్ వరల్డ్ సన్నివేశాలు కూడా రొటీన్ వ్యవహారంతోనే సాగడం, అలాగే అక్కడక్కడ ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ విసుగు తెప్పిస్తాయి. గ్యాంగ్స్ చేసే పనులు కూడా మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే ..దర్శకుడు ఆర్జీవీ కొన్ని సన్నివేశాలను విజువల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన కథా కథనాలని రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాల బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

తీర్పు :

 

మొత్తమ్మీద, ‘డి కంపెనీ’ అంటూ ఆర్జీవీ అందించిన ఈ అండర్ వరల్డ్ డాన్ చిత్రం రొటీన్ తంతు గానే సాగుతుంది. అయితే, వర్మ నుండి ఈ మధ్యకాలంలో వస్తోన్న సినిమాల కంటే, ఈ సినిమా బాగున్నా.. పూర్తి స్థాయిలో మాత్రం ఆకట్టుకోదు. కానీ, నటీనటుల నటన, కొన్ని యాక్షన్ సన్నివేశాలు క్లైమాక్స్ లోని ఎమోషన్ పర్వాలేదనిపిస్తాయి. ఓవరాల్ గా మాత్రం ఈ చిత్రం మెప్పించదు.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :