సమీక్ష : దాగుడుమూత దండాకోర్ – ఈ దాగుడుమూతలు జస్ట్ ఓకే.!

Dagudumootha Dandakor

విడుదల తేదీ : 9 మే 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : ఆర్.కె మలినేని

నిర్మాత(తెలుగు) : రామోజీరావు

సంగీతం : ఇ.ఎస్ మూర్తి

నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, సార అర్జున్..

ప్రతి భాషలోనూ రీమేక్ సినిమాలు రావడం చాలా కామన్.. ఒక భాషలో హిట్ అయిన సినిమా మన నేటివిటీకి కూడా మార్చి తీయగలం అంటే ఆ సినిమాని రిమేక్ చేసేస్తుంటారు. అలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా గత ఏడాది తమిళంలో విడుదలైన ‘శైవం’ సినిమాని తెలుగులో ‘దాగుడుమూత దండాకోర్’. ప్రముఖ నిర్మాత రామోజీ రావు – డైరెక్టర్ క్రిష్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, బేబీ సారా అర్జున్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఆర్.కె మలినేని దర్శకుడు. మరి తెలుగువారికి బాగా సరిపోతుంది, అలాగే నచ్చుతుంది అని తీసిన ఈ దాగుడుమూత దండాకోర్ ప్రేక్షకులతో ఆడిన దాగుడు మూతల్లో ఎవరు విజయం సాధించారు అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఓ అందమైన పల్లెటూరు.. ఆ ఊరందరికీ పెద్దగా వ్యవహరించే రాజు(రాజేంద్ర ప్రసాద్) గారికి తన కుమారుడి కుమార్తె, అనగా మనవరాలు బంగారం (సారా అర్జున్) అంటే ఎంతో ఇష్టం. మరి బంగారంకి కుటుంబ సభ్యులతో పాటు తను చిన్నప్పటి నుంచి రంతో ప్రేమతో పెంచుకున్న నాని(కోడిపుంజు) అంటే చాలా చాలా ఇష్టం. రాజుగారు ఎంతగానో ప్రేమించే ముగ్గురు పిల్లలు వృత్తి రిత్యా ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి ఉంటారు. వీరందరూ రాజు గారి కోరిక మేరకు తమ ఊర్లో జరగనున్న పోలేరమ్మ జాతరకి తమ పిల్లలతో కలిసి అందరూ ఆ పల్లెటూరికి వస్తారు.

కానీ వీరందరూ పైకి నవ్వుతూ ఉన్నా పలు సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అంతే కాకుండా ఆ ఊరికి వచ్చాక వాళ్ళ ప్రాణాలకి ప్రమాదమైన కొన్ని సంఘటనలు జరగుతాయి. దానికి కారణం వాళ్ళు ఎప్పుడో పోలేరమ్మకి మొక్కుకున్న మొక్కు తీర్చకపోవడమే కారణమని, పోలేరమ్మకి నానిని బలి ఇచ్చి మొక్కు తీర్చుకోవాలనుకుంటారు. అలా అనుకున్న మరుసటి రోజు నుంచి నాని కనపడకుండా పోతుంది. దాంతో ఫ్యామిలీ మొత్తం కంగారు పడి నానిని వెతకడం మొదలు పెడతారు. అసలు సడన్ గా నాని ఎందుకు కనపడకుండా పోయింది.? నాని కనపడకుండా పోవడానికి ఏదన్నా కారణం ఉందా.? అలాగే నాని మిస్సింగ్ లో ఎవరి హస్తం అన్నా ఉందా.? చివరికి నాని దొరికిందా.? లేదా.? ఒకవేళ దొరికితే దాంతో మొక్కు తీర్చుకుని వా సమస్యలను పోగొట్టుకున్నారా.? లేదా.? అన్నది మీరు వెండితెరపైన చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సమ్మర్ సీజన్ లో మనల్ని అందరినీ ఓ అందమైన పల్లెటూరి వాతావరణంలోకి తీసుకెళ్ళి అక్కడున్న బందాలు అనుబంధాలని ఎంతో అందంగా చూపించడం దాగుడుమూత దండాకోర్ కి ప్రధాన బలం. సినిమా చూస్తున్నంత సేపు ఒక చక్కటి వాతావరణాన్ని ఫీలవుతాం. అలాగే కుటుంబంలోని బంధాలను, వారిమధ్య ఆప్యాయత, అనురాగాలను బాగా చూపించారు. ఈ అనుభందాలను చూపిస్తూ తీసిన మొదటి అర్థ భాగం ప్రేక్షకులను ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. మొదటి అర్ధభాగంలో ఎక్కువ భాగం నవ్వించారు, అలాగే పల్లెటూర్లని చిన్న చూపు చూసే నేటి తరాల వారిపై ప్రయోగించిన వ్యంగ్యాస్తాలు కూడా ఆడియన్స్ కి గట్టిగా తగులుతాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగల సీనియర్ యాక్టర్. ఆయన అనుభవాన్ని ఉపయోగించి డైరెక్టర్ అనుకున్న రాజుగారి పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ని కూడా డామినేట్ చేసేలా పెర్ఫార్మన్స్ చేసింది బేబీ సారా అర్జున్. సారా అర్జున్ ది చాలా ఎక్స్ ప్రెసివ్ ఫేస్, అందుకే తను డైలాగ్స్ ఎక్కువగా లేకపోయినా, అన్ని హావ భావాలను కళ్ళతో, ముఖ కవలికలతోనే అద్భుతంగా పలికించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాకి ప్రాణమైన పాత్రని సారా అర్జున్ ఎంతో అద్భుతంగా చేసింది. వీరిద్దరితో పాటు సన్యాసి రాజుగా చేసిన బేబీ బాయ్ కూడా తన అల్లరి చిల్లర పనులతో ఆడియన్స్ ని బాగా నవ్వించాడు. ఇక యంగ్ నటీనటులైన సిద్దార్థ్ వర్మ – నిత్యా శెట్టిలు డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

ఇకపోతే ఈ సినిమాలో నటించిన రవిప్రకాష్, ప్రభు, శ్రీహర్ష, సంధ్యా జనక్, బాలు తదితర నటీనటులు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. ఇకపోతే చెప్పుకోవాల్సింది సినిమాలో రాజేంద్ర ప్రసాద్ దగ్గర పనివాడిలా చేసినతను ఆడియన్స్ ని బాగా నవ్విస్తాడు. జబర్దస్త్ శ్రీను, సత్యం రాజేష్ లు చేసింది రెండే రెండు సీన్స్ అయినా ఆడియన్స్ ని బాగా నవ్వించారు. కేవలం రెండు గంటలే ఈ సినిమా రన్ టైం కావడం కూడా సినిమాకి ప్లస్ అవుతుంది.

మైనస్ పాయింట్స్ :

‘దాగుడుమూత దండాకోర్’ సినిమాకి మొదటి మైనస్ పాయింట్ సెకండాఫ్.. ఫస్ట్ హాఫ్ ని అలా అలా నవ్వులతో ముగించేసిన దర్శకుడు సెకండాఫ్ లో ఆ మేజిక్ ని రిపీట్ చేయలేకపోయాడు. దానికి ప్రధాన కారణం కథలో ఉన్న ఒకే ఒక్క పాయింట్ ని ఫస్ట్ హాఫ్ లో చెప్పేయడం. దాంతో సెకండాఫ్ మొదలవ్వగానే బాగా స్లో అయిపోవడం, సీన్స్ అన్నీ చాలా బోరింగ్ గా నడుస్తూ ఉంటాయి. సెకండాఫ్ లో అవసరం లేని సీన్స్ ఉన్నాయి, అలాగే లిమిటెడ్ గా ఉండాల్సిన సీన్స్ ని బాగా తీసారు. దీనివలన ఆడియన్స్ బాగా బోర్ ఫీలవుతారు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కాస్త ఎంటర్టైన్మెంట్ వలన కథ, కథనం పెద్దగా లేకపోయినా చూసిన ఆడియన్స్ సెకండాఫ్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేది ఇట్టే చెప్పేయగలరు.

స్టొరీ లైన్ మరియు కథా విస్తరణ పరంగా ఎఎల్ విజయ్ చాలా సింపుల్ లైన్ ని తీసుకోవడం మరో మైనస్. దానికి తోడు సెకండాఫ్ సినిమా చాలా ఎమోషనల్ గా సాగాలి. కానీ ఎక్కడా ఆడియన్స్ కి ఎమోషన్ ని కలిగించలేదు. ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యగల ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి, కానీ ఎక్కడా డీప్ గా చెప్పకుండా డైరెక్టర్ పైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదంతా ఒక ఎత్తైతే క్లైమాక్స్ మరొక ఎత్తు. క్లైమాక్స్ ని బాగా సాగదీయడమే కాకుండా అప్పటి వరకూ సినిమాని నడిపించిన మేజర్ పాయింట్ కి సరైన జడ్జ్ మెంట్ ఇవ్వకుండా హడావిడిగా ముగించేసారు. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు కావున 5 పాటలు, నాలుగు డిష్యుం డిష్యుం ఫైట్స్, వరుస బెట్టి వచ్చే పంచ్ డైలాగ్స్ లాంటివి కోరుకునే రెగ్యులర్ కమర్షియల్ మూవీ అభిమానులకు ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ఒకరిద్దరు తప్ప అందరు టెక్నీషియన్స్ ది బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి. ముందుగా నిర్మాతలైన రామోజీ రావు – క్రిష్ లు ఈ సినిమాని నమ్మి ఎంతో గ్రాండ్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. అందుకే విజువల్స్ చూస్తున్న ప్రేక్షకులు తమ పల్లెటూరిలో ఉన్నట్టు ఫీలవుతారు. సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ప్రతి ఫ్రేంని చాలా అందంగా చూపించాడు. చూసే ప్రతి ఒక్కరూ పల్లెటూరిలో సేదతీరుతున్నామా అనే ఫీలింగ్ ని కలిగించాడు. పల్లెటూరిలో ఉండే స్వచ్చతని, సొభగుల్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఇఎస్ మూర్తి అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. పాటలన్నీ సందర్భానుసారంగా వస్తాయి, అది పక్కన పెడితే ఆయన నేపధ్య సంగీతం సూపర్బ్. పెద్దింటి అశోక్ కుమార్ రాసిన మీనింగ్ ఫుల్ డైలాగ్స్ కూడా బాగున్నాయి.

ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల ఫస్ట్ హాఫ్ విషయంలో తీసుకున్న కేర్ సెకండాఫ్ మీద కూడా తీసుకొని కొంత పార్ట్ కట్ చేసి ఉండే సినిమా ఇంకాస్త బెటర్ ఫీల్ ని కలిగించేది. పల్లెటూరిని మరిపించేలా సురేష్ సాహి వేసిన ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. ఇక మిగిలినవి 3… కథ – ఎఎల్ విజయ్ స్టొరీ లైన్ చాలా సింపుల్ గా ఉంది. కథనం – సెకండాఫ్ లో కథని ఊహాజనితంగా మార్చేసి బాగా బోర్ కొట్టించేలా ఉంది. ఆర్.కె మలినేని దైరేక్సహ్న్ విషయానికి వస్తే.. నటీనటుల నుంచి మంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు, కానీ రీమేక్ సినిమాలో మేజర్ గా ఉండాల్సిన ఎమోషన్స్ ని మాత్రం డీల్ చేయలేకపోయాడు. అందుకే డైరెక్టర్ మలినేని ఈ సినిమా విషయంలో సగ భాగం సక్సెస్ అయితే, సగ భాగం ఫెయిల్ అయ్యాడు.

తీర్పు :

తమిళం నుంచి తెలుగుకు వచ్చిన చక్కని పల్లెటూరి కుటుంబ కథా చిత్రం ‘దాగుడుమూత దండాకోర్’ ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు కాబట్టి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది. సారా అర్జున్, రాజేంద్ర ప్రసాద్ ల లైవ్లీ పెర్ఫార్మన్స్ మరియు అక్కడక్కడా నవ్వించే డీసెంట్ ఫస్ట్ హాఫ్ ఈ సినిమాని కాపాడితే, బోరింగ్ సెకండాఫ్, సింపుల్ కథ, ఊహాజనితమైన కథనం, క్లైమాక్స్ ఎపిసోడ్, ఎమోషనల్ డెప్త్ లేకపోవడం ఈ సినిమాని కాపాడలేకపోయాయి. చివరిగా పల్లెటూరి నేపధ్యంలో వచ్చే కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగుంటుంది. ఇది కాకుండా రెగ్యులర్ మాస్ మసాల ఎంటర్టైనర్ సినిమాలు కోరుకునే వారికి ఈ సినిమా నిరాశనే మిగిల్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఓ మంచి ఫీలున్న సినిమా చూడాలి అనుకునే వారు హ్యాపీగా ‘దాగుడుమూత దండాకోర్’ ని ఓ సారి చూడచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :