సమీక్ష : విఐపి 2 – బోరింగ్ సీక్వెల్

విడుదల తేదీ : ఆగష్టు 25, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : సౌందర్య రజనీకాంత్

నిర్మాత : ధనుష్

సంగీతం : సేన్ రోల్డన్

నటీనటులు : ధనుష్, కాజోల్, అమలాపాల్

ధనుష్ చేసిన ‘రఘువరన్ బి.టెక్’ కు సీక్వెల్ గా రూపొందిన చిత్రమే ఈ ‘విఐపి 2’. రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ నెల 11న తమిళంలో విడుదలై తెలుగులో ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

పట్టుదలతో ఉద్యోగం సంపాదించి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడుపే బెస్ట్ ఇంజనీర్ అవార్డును అందుకుని సౌత్ ఇండియాలోనే అతి పెద్ద కంపెనీకి ఎండీ అయిన వసుంధర పరమేశ్వరన్ (కాజోల్) దృష్టిలో పడతాడు రఘువరన్ (ధనుష్). కాజోల్ అతన్ని ఎలాగైనా తమ కంపెనీలో ఉద్యోగంలో పెట్టుకోవాలని అనుకుంటుంది.

కానీ రఘువరన్ మాత్రం తనకు మొదటి అవకాశం ఇచ్చిన కంపెనీని వదిలి రావడానికి ఇష్టపడక ఆమెను నో చెప్తాడు. అంతేగాక ఆమె సొంతం చేసుకోవాలనుకున్న ప్రాజెక్ట్ ను కూడా దక్కించుకుంటాడు. దీంతో అహం దెబ్బతిన్న వసుంధర రఘువరన్ మీద కక్ష కడుతుంది. అలా కోపం పెంచుకున్న వసుంధర రఘువరన్ ను ఎలా దెబ్బ తీసింది ? రఘువరన్ ఆమెను ఎదుర్కొని ఎలా నిలబడ్డాడు ? ఆమెకు ఎలా బుద్ది చెప్పాడు ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్రధానంగా అలరించే అంశం ఫస్టాఫ్ కథనం. మొదటి భాగంలో ఉద్యోగం లేక నిరుద్యోగిగా, పక్కింటి అమ్మాయిని ప్రేమించే అబ్బాయిగా కనబడ్డ రఘువరన్ ఇందులో మాత్రం మంచి ఉద్యోగం చేస్తూ, ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్న బాధ్యతగల వ్యక్తిగా కనిపించడం బాగుంది. ధనుష్ కూడా సాధారణంగా కనిపిస్తూ మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చాడు. అంతేగాక అతనికి, అతని భార్య షాలిని (అమలా పాల్)కు మధ్య నడిచే సరదా, చిలిపి సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

ఇక మరొక ప్రధాన పాత్రధారి కాజోల్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగా ఆకట్టుకుంది. 40 ఏళ్ళ వయసు దాటినా కూడా ఆమె చాలా అందంగా ఉంటూ కనిపించే ప్రతి సన్నివేశాన్ని బ్యూటిఫుల్ గా తయారుచేశారు. ఈగో కలిగిన బిజినెస్ ఉమెన్ గా ఆమె నటన కూడా చాలా బాగుంది. ఆమె రఘువరన్ మీద పంతం పెంచుకోవడం, అణగదొక్కాలని చూడటం, రఘువరన్ ఆమెను ఎదిరించి నిలబడటం వంటి అంశాల తాలూకు సన్నివేశాలు కొన్ని మెప్పించాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఆరంభం బాగానే ఉన్నా కథనం పోను పోను మరీ చప్పగా తయారైంది. రఘువరన్ వసుంధరను ఎదిరించే సన్నివేశాల వరకు బాగున్నా హీరో ఎలివేషన్ సీన్లలో కొత్తదనం కనబడలేదు. పైగా కొన్ని మొదటి పార్ట్ లో ఉన్నట్టే ఉన్నాయి. ఇక ఆరంభం నుండి సినిమాను రఘువరన్ వెర్సెస్ వసుంధర అన్నట్టు చూపించి చివర్లో హీరో పెద్ద విజయాన్నే సాధిస్తాడు అనుకునేలోపు చిన్న కాన్వెర్జేషన్ తో వసుంధరకు కనువిప్పు కలగడం, సినిమా ముగియడం భారీ నిరుత్సాహాన్ని కలిగించింది.

అంతేగాక వారిద్దరి మధ్యన చెప్పుకోదగ్గ రీతిలో ఘర్షణ కూడా జరగలేదు. కుట్రలు, ఎత్తుకు పైఎత్తులు, కదిలించే గెలుపోటముల వంటివి ఎక్కడా కనబడలేదు. అలాగే సెకండాఫ్ కథనంలో ఎక్కడా ఫన్ అనేదే లేదు. ఇక పాటలైతే మరీ విసిగించాయి. ఒక్కటి కూడా హాయిగా వినదగిన రీతిలో లేదు. రితు వర్మ పాత్ర కూడా ఏదో ఉంది అనడమే తప్ప ఎక్కడా ప్రభావం చూపలేదు. మొత్తగా చెప్పాలంటే మొదటి పార్ట్ లో ఉన్న ఫన్, సెంటిమెంట్, రొమాన్స్, రైవల్టీ ఇందులో పెద్దగా కనబడలేదు.

సాంకేతిక విభాగం :

రచయిత ధనుష్ మొదటి పార్ట్ కు సీక్వెల్ తీయాలన్న ఉద్దేశ్యంతో రాసుకున్న కథలో కేవలం కాజోల్ పాత్ర తప్ప వేరే కొత్తదనమేమీ లేదు. కనీసం కథానమైన గొప్పగా ఉందా అంటే ఫస్టాఫ్ కొంచెం తప్ప మిగతా అంతా చప్పగానే సాగింది. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వ ప్రతిభ, ప్రత్యేకత ఇందులో ఎక్కడా కనబడలేదు.

సేన్ రోల్డన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంతమేర బాగున్నా పాటల సంగీతం మాత్రం అస్సలు బాగోలేదు. పాత్రల డబ్బింగ్ బాగానే కుదిరింది. సమీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ మాత్రం బాగా ఆకట్టుకుంది. ప్రతి సన్నివేశం, ఫ్రేమ్ క్లిస్టర్ క్లియర్ గా అనిపించాయి.

తీర్పు :

‘రఘువరన్ బి.టెక్’ కు సీక్వెల్ గా రూపొందిన ఈ ‘విఐపి-2’ లో మొదటి భాగంలో ఉన్న దమ్ము, వేగం, ఎమోషన్ ఆకట్టుకునే స్థాయిలో కనబడలేదు. కేవలం ఫస్టాఫ్ కథనం, ధనుష్, కాజోల్ పెర్ఫార్మెన్స్ మాత్రమే బాగుండగా సెకండాఫ్ కథనం, సినిమా ముగింపు, ప్రధాన పాత్రల మధ్య వైరం వంటివి భారీ స్థాయిలో నిరుత్సాహపరిచాయి. మొత్తం మీద చెప్పాలంటే ‘రఘువరన్ బి.టెక్’ కు సీక్వెల్ గా ధనుష్ రూపొందించిన ఈ చిత్రం బోరింగ్ సీక్వెల్ గా తయారైంది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

X
More