సమీక్ష : దొర – పూర్తిగా నిరాశపరిచాడు..!

Dora review

విడుదల తేదీ : 01 జూలై, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : ధరణి దరన్

నిర్మాత : జక్కం జవహర్ బాబు

సంగీతం : సిద్ధార్థ్ విపిన్

నటీనటులు : సత్యరాజ్, సిబిరాజ్, బిందు మాధవి..

ప్రస్తుతం సౌతిండియన్ సినిమాలో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన నాటితరం హీరో సత్యరాజ్, తెలుగులో పలు మంచి పాత్రలతో ఎనలేని గుర్తింపు తెచ్చుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళంలో ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘జాక్సన్ దొరై’ సినిమాను తెలుగులో ‘దొర’ పేరుతో డబ్ చేశారు. సిబిరాజ్, బిందు మాధవి ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఏ మేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

దొరపురం అనే గ్రామంలో ఓ పాడుబడ్డ బంగ్లాలో వందల సంవత్సరాలుగా దయ్యాలున్నాయన్నది ఆ ఊరి వాళ్ళ నమ్మకం. ఈనేపథ్యంలోనే అటువైపు వెళ్ళాడానికి కూడా ఎవ్వరూ సాహసించరు. ఇక ఈ విషయం గురించే తెలుసుకోవాలంటూ ప్రభుత్వం సత్య (సిబి సత్యరాజ్)ను అక్కడికి పంపిస్తుంది. ఈ పనిమీదే దొరపురం వచ్చిన సత్య, అదే ఊర్లో ఉండే విజ్జి (బిందు మాధవి)ని ప్రేమిస్తాడు. అదేవిధంగా విజ్జి బావ అయిన వీర (కరుణాకరన్) కూడా ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు.

కాగా తన ప్రేమ విషయం సత్య, విజ్జి తండ్రికి చెప్పగా ఆయన వీరతో కలిసి దయ్యాల బంగ్లాలో వారంరోజులు గడిపి రావాలన్న నిబంధన విధిస్తాడు. మరి సత్య ఆ దయ్యాల బంగ్లాలో ఎలా ఉండగలిగాడు? అక్కడ నిజంగానే దయ్యాలు ఉన్నాయా? ఇంతకీ ఈ కథలో సత్యరాజ్ ఎవరు? ఆ బంగ్లా కథేంటీ? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొన్నిచోట్ల కామెడీ సన్నివేశాలు బాగా పండడం గురించే చెప్పాలి. నిజం చెప్పాలంటే ఈ సినిమాను కొంతలో కొంత నిలబెట్టింది ఏదైనా ఉందీ అంటే అది ఈ కామెడీనే! ఇక హీరోగా నటించిన సిబిరాజ్ లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా పెద్దగా మెప్పించలేదు. అతడి క్యారెక్టర్‌ కూడా చాలా నీరసంగా ఉంది. సత్యరాజ్ మాత్రం సాదాసీదా పాత్రనే అద్భుతంగా పండించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ బిందు మాధవి అక్కడక్కడా ఫర్వాలేదనిపించినా, ఆమె పాత్ర కూడా ఆకట్టుకునేలా లేదు. కమెడియన్ వీర మాత్రం నవ్వులు పూయించాడు.

ఈ సినిమాకు ఎంచుకున్న అసలు కథ చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి కథాంశాలతో సినిమాలు చేయాలన్న ఆలోచనను మెచ్చుకోవచ్చు. సినిమా పరంగా ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :

ఎంచుకున్న కథాంశం చాలా కొత్తగా ఉన్నా, దాన్ని పూర్తి స్థాయిగా సినిమాగా మలిచే క్రమంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. అటు హర్రర్ సినిమాగా కాక, ఇటు కామెడీ సినిమాగా కాక ‘దొర’ అన్నింటికీ దూరంగా ఆగిపోయింది. దర్శకుడికి కథపై ఎక్కడా క్లారిటీ అన్నదే లేకపోవడంతో సినిమా అంతా గజిబిజి గందరగోళంగా ఉంది.

హీరోయిన్ తండ్రి చాలెంజ్ చేయడం, హీరో ఓ దయ్యాల బంగ్లాలో ఉండాల్సి రావడం ఇవేవీ సరిగ్గా కనెక్ట్ అయ్యేలా చెప్పలేకపోయారు. ఇక సెకండాఫ్ అయితే మరీ సాగదీసి బోరింగ్‌కే బోరింగ్ కొట్టేలా చేశారు. ఇక అసలు కథలోకి వెళ్ళడానికి కూడా చాలా సమయం పట్టింది. లాజిక్ పరంగా చూసినా కథలో ఎక్కడా పొంతన అన్నదే ఉండదు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. వీటన్నింటికి తోడు ఈ సినిమా రన్‌టైమ్ కూడా ఎక్కువ ఉండడం మరో మైనస్.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శక, రచయిత ధరణి ధరన్ గురించి చెప్పుకుంటే, ఒక పూర్తి స్థాయి హర్రర్ సినిమాకు సరిపడా కొత్త కథాంశాన్నే ఎంచుకున్నా, దాన్ని సినిమాగా తీయడంలో మాత్రం ధరణి ఫెయిలయ్యారు. ఎక్కడా హర్రర్, కామెడీ రెండింటికీ మధ్య లింక్ కుదరకపోవడంతో సినిమా అంతా అర్థం పర్థం లేని వ్యవహారంలా తయారైంది. ఇదే కథాంశంతో దర్శకుడు ధరణి ఇంకొంచెం లాజికల్‌గా సినిమా తీసి ఉంటే వ్యవహారం వేరేలా ఉండేది.

సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీతో హర్రర్ సినిమా మూడ్ బాగానే క్యారీ అయింది. సంగీతం ఫర్వాలేదు. ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. తెలుగు డైలాగ్స్ కూడా అంతంతమాత్రమే. ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నంతలో ఫర్వాలేదనిపిస్తాయి.

తీర్పు :

తెలుగులో హర్రర్ కామెడీలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఈ జానర్‌లో హర్రర్‌ను, కామెడీని సరిగ్గా మిక్స్ చేస్తేనే గానీ ప్రేక్షకుడు ఆ సినిమాకు కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. ‘దొర’ సరిగ్గా ఇదే అంశాన్ని మరచి మన ముందుకు వచ్చిన సినిమా. ఇటు హర్రర్ సరిగ్గా లేక, కామెడీ కూడా సరిగ్గా లేక సినిమా అంతా ఏమాత్రం ఆకట్టుకోకుండా సాగిపోతుంది. కొన్ని కామెడీ సన్నివేశాలను మినహాయిస్తే ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘దొర’, పూర్తిగా నిరాశపరిచాడు.

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :