సమీక్ష : ‘డబ్‌శ్మాష్‌’ – బోర్ గా సాగే లవ్ డ్రామా !

 dubmash review

విడుదల తేదీ : జనవరి 30, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు :  పవన్ కృష్ణ, సుప్రజ, గెటప్ శ్రీను త‌దిత‌రులు.

దర్శకత్వం : కేశవ్ దేపూర్

నిర్మాత‌లు : సుబ్రమణ్యం మలసాని, ఓంకార లక్ష్మీ.

సంగీతం :  వంశీ బి

సినిమాటోగ్రఫర్ : ఆర్ రమేష్

 

కేశవ్ దేపూర్ దర్శకత్వంలో పవన్ కృష్ణ, సుప్రజ హీరో హీరోయిన్లుగా గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డబ్‌శ్మాష్‌’. వీత్రి ఫిలిమ్స్ పతాకం పై సుబ్రమణ్యం మలసాని సమర్పణలో ఓంకార లక్ష్మీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

పెద్దగా కథాకథనాలు లేని ఈ సినిమాని కథగా చెప్పుకంటే.. సెర్విన్ (పవన్ కృష్ణ) డబ్‌శ్మాష్‌ చేస్తూ ఎనిమిది లక్షల ఫాలోవర్స్ తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటాడు. అలాగే మేఘన (సుప్రజ) కూడా డబ్‌శ్మాష్‌ చేస్తూ బాగా పాపులర్ అవుతుంది. అయితే తనకొచ్చిన ఓ సమస్య కారణంగా సెర్విన్ చదివే కాలేజీలోనే మేఘన కూడా జాయిన్ అవుతుంది. అలా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆ తరువాత వారిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనల అనంతరం ఇద్దరూ ఒకర్ని ఒకరు బాగా ఇష్ట పడతారు. ఆ విషయం ఒకరికి ఒకరు వ్యక్తపరుచుకునే క్రమంలో అనుకోకుండా మేఘనను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ చేసిన గ్యాంగ్ ను సెర్విన్ ఎలా పట్టుకున్నాడు ? అసలు మేఘనను కిడ్నాప్ చేసింది ఎవరు ? అలాగే ఆమెకు వచ్చిన సమస్య ఏమిటి ? చివరికీ మేఘన – సెర్విన్ ఇద్దరూ ఒక్కటవుతారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

కాలేజీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ అండ్ సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన పవన్ కృష్ణ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇంటర్వెల్ సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ సన్నివేశంలో కూడా పవన్ కృష్ణ నటన కొంతవరకు బాగుంది.

ఇక హీరోయిన్ గా నటించిన సుప్రజ నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది. మెయిన్ గా తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ తో సినిమాకే ఆమె హైలైట్ గా నిలిచింది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన గెటప్ శ్రీను కూడా తనకిచ్చిన డైరెక్టర్ పాత్రలో అవలీలగా నటించాడు. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన నటీనటులతో పాటు హీరోకి ఫ్రెండ్స్ గా నటించిన నటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపిస్తారు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు కేశవ్ దేపూర్ రాసుకున్న పేలవమైన స్క్రిప్ట్ కారణంగా ఈ సినిమా ఆసక్తికరంగా సాగదు. కథాకథనాల్లో సరైన ప్లోను కూడా దర్శకుడు మెయింటైన్ చేయలేకపోయాడు. అనవసరమైన కామెడీ సీన్స్ పెట్టి.. పైగా కథకు అవసరం లేని అవే సీన్లను అటు తిప్పి, ఇటు తిప్పి.. చాలా టైమ్‌ వేస్ట్‌ చేసారు. సినిమాలో చాలా భాగం బోరింగ్ తంతుగానే సాగుతుంది.

అయితే సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి. కానీ, స్క్రీన్ ప్లే లో ఆకట్టుకునే కంటెంట్ లేకపోవడంతో అవి కూడా పూర్తిగా తేలిపోయాయి. ముఖ్యంగా పేలని సస్పెన్స్ సీన్స్ తో కథను డైవర్ట్ చేసారు. దానికి తోడు ఆ సన్నివేశాలు అన్ని స్లోగా లాజిక్ కి దూరంగా సాగడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది.

అసలు.. డబ్‌శ్మాష్ మీద కూడా సినిమా తీయాలనే ఆలోచన దర్శకుడికి ఎందుకొచ్చిందో.. అయినా ఎలాంటి కాన్సెప్ట్ తీసుకున్నా ట్రీట్మెంట్ తో ఆ కాన్సెప్ట్ ను ఎలివేట్ చేసి ఇంట్రస్టింగ్ ప్లేతో కన్విన్స్ గా చెప్పాలి. కానీ దర్శకుడు స్క్రిప్ట్ పై కనీస స్థాయిలో కూడా వర్క్ చేయలేదనిపిస్తోంది. సాంగ్స్ మీద పెట్టిన శ్రద్ధ అండ్ పెట్టుబడిలో సగం స్క్రిప్ట్ మీద పెట్టినా ఈ సినిమా బెటర్ గా వచ్చేది.

క్లైమాక్స్ ను కూడా డబ్‌శ్మాష్‌ తో మమ అనిపించేసారు. ఓవరాల్ గా సినిమా ఇంట్రస్ట్ కలిగించలేని సీన్స్ తో సాగుతూ బోర్ కొడుతోంది.

 

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందు ముచ్చటించుకున్నట్లుగానే దర్శకుడు ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు. సంగీత దర్శకుడు వంశీ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. ఇక ఎడిటింగ్ బాగుంది. అయితే సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ను ఇంకా ట్రీమ్ చెయ్యొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. సినిమాలో కొన్ని విజువల్స్ ను కెమెరమెన్ చాలా సహజంగా చూపించారు. నిర్మాతలు సుబ్రమణ్యం మలసాని, ఓంకార లక్ష్మీ పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

 

తీర్పు :

‘డబ్‌శ్మాష్‌’ అంటూ కేశవ్ దేపూర్ దర్శకత్వంలో పవన్ కృష్ణ, సుప్రజ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా ఏ మాత్రం ఆసక్తికరంగా సాగదు. కథా కథనాలు బాగాలేకపోవడం, సినిమాలో సరైన ప్లో లేకపోవడం, మరియు రొటీన్‌ తంతు వ్యవహారంతో ఇంట్రస్ట్ కలిగించలేని సీన్స్ తో సినిమా విసిగించే విధంగా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మొత్తంగా ఈ సినిమా నిరాశ పరుస్తోంది.

 

123telugu.com Rating : 1.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :