సమీక్ష : ఎక్స్‌ప్రెస్ రాజా – కామెడీ ఎక్స్‌ప్రెస్!

Express Raja Review

విడుదల తేదీ : 14 జనవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : మేర్లపాక గాంధీ

నిర్మాత : వంశీ, ప్రమోద్

సంగీతం : ప్రవీణ్ లక్కరాజు

నటీనటులు : శర్వానంద్, సురభి, సప్తగిరి, ప్రభాస్ శ్రీను…

తెలుగులో విలక్షణ సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్, తాజాగా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ పేరుతో ఓ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేను నమ్మి సంక్రాంతి కానుకగా సినిమాను మన ముందుకు తెచ్చారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో మెప్పించిన దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వరుస హిట్స్‌తో దూసుకుపోతోన్న యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ప్రమోషన్స్‌తో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

రాజా (శర్వానంద్) అల్లరి చిల్లరిగా పనిపాటా లేకుండా తిరిగే ఓ యువకుడు. తన సేవా కార్యక్రమాలతో సమాజంలో మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకున్న వ్యక్తికి కొడుకైనా కూడా సరదాగా కాలం వెళ్ళదీసే రాజా, అమ్ము (సురభి) అనే అమ్మాయిని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. తరువాత అమ్ము కోసం రాజా స్నూపీ అనే ఓ కుక్క పిల్లను ప్లాన్ చేసి కిడ్నాప్ చేయాల్సి వస్తుంది. అక్కణ్ణుంచి మొదలైన కథ బినామీ బ్రిటీష్ (సుప్రీత్), ఇనుము (ధన్‍రాజ్), మావయ్య శీను (ప్రభాస్ శీను), పొల్యూషన్ గిరి (సప్తగిరి), బిల్‌గేట్స్ (బ్రహ్మాజీ), వసంత కోకిల (ఊర్వశి), నటరాజ్ (షకలక శంకర్).. ఇలా విచిత్రమైన పాత్రల రాకతో ఏయే మలుపులు తిరిగిందీ? అసలు ఈ పాత్రలన్నింటికీ రాజాకు ఉన్న సంబంధం ఏంటి? ఈ జర్నీ ఎటు పోతుంది? రాజా ప్రేమకథ ఏమవుతుంది? అసలు రాజా ఓ కుక్క పిల్ల కోసం ఎందుకు ప్లాన్ గీస్తాడు? రాజాకి కుక్కలంటే ఎందుకు పడదు? ఓ సమస్యలో చిక్కుకున్న తన తండ్రిని రాజా ఎలా కాపాడాడు? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమే ‘ఎక్స్‌ప్రెస్ రాజా’

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ హైలైట్ అంటే అది తెలుగు సినిమాకు కొత్తదీ, విచిత్రమైనదీ అయిన స్క్రీన్‌ప్లేను ఎక్కడా బోర్ కొట్టించకుండా, అందరికీ అర్థమయ్యే తరహాలో రాసుకున్న విధానం గురించి చెప్పుకోవచ్చు. ఒక విచిత్రమైన సంఘటనతో సినిమాను మొదలుపెట్టి అక్కణ్ణుంచి కథలో రకరకాల పాత్రలను పరిచయం చేస్తూ, అన్నింటినీ కథకూ, కథ ప్రయాణానికీ కలుపుతూ చేసిన ప్రయోగం గురించి చెప్పుకోవచ్చు. అదే విధంగా ఆ పాత్రలన్నింటికీ ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉండేలా చేసుకొని, అన్ని పాత్రల్లోనూ కొత్తదనం ఉండేలా చూసుకోవడం కట్టిపడేస్తుంది. ఫస్ట్ సీన్ నుంచి మొదలుకొని చివరివరకూ ఎక్కడా టెంపో తగ్గకుండా కామెడీని ఎక్కడా మిస్ చేయకపోవడం ఈ సినిమాకు హలైట్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

నటీనటుల విషయానికి వస్తే.. శర్వానంద్ తన పాత్రను చాలా బాగా పోషించాడు. ‘రన్ రాజా రన్’ తరహా పాత్రతో శర్వానంద్ మరోసారి విపరీతంగా ఆకట్టుకుంటాడు. అతడి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. సురభి అందంగా ఉండి ఫర్వాలేదనిపించేలా నటించింది. ఇక సప్తగిరి తనదైన టైమింగ్‌తో ఆద్యంతం కట్టిపడేస్తాడు. ఊర్వశిని ఈ తరహా పాత్రలో చూడడం చాలా కొత్తగా ఉంది. వసంత కోకిల పాత్రలో ఆమె తనదైన మార్క్ చూపెట్టారు. ఇక సుప్రీత్, ప్రభాస్ శీను, షకలక శంకర్, బ్రహ్మాజీ, ధన్‌రాజ్ అందరూ తమ తమ పాత్రల్లో సినిమాకు మంచి ప్లస్ పాయింట్స్‌గా నిలిచారు. ఈ పాత్రలన్నింటికీ కథలో ఒక ప్రాధాన్యత ఉండడం ఇక్కడ విశేషం.

సినిమా పరంగా చూసుకుంటే ఓపెనింగ్ సీక్వెన్స్, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్, ఇంటర్వెల్ తర్వాతి ఇరవై నిమిషాల ఎపిసోడ్, లాజిక్స్ మిస్ అయినా సరదాగా సాగిపోయే క్లైమాక్స్‌లను హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే హీరో, హీరోయిన్ల ప్రేమకథ అసహజంగా, ఏమాత్రం పరిణతి లేని ఇద్దరి సరదా వ్యవహారంలో చూపడం గురించి చెప్పాలి. ఈ పోర్షన్ మరీ అసహజంగా కనిపించి ఫస్టాఫ్‌లో సినిమా ఫ్లోను ఓకే ఓకే అన్నట్లు నడిపించింది. ఇక హీరోకు ఏ పనీ లేకపోవడం, హీరోయిన్‌ని చూడగానే ప్రేమలో పడిపోవడం దగ్గర్నుంచి చాలా విషయాల్లో లాజిక్ పెద్దగా లేదు. హీరో అంటే చివరకు అన్నీ అనుకున్నట్లు అనుకున్నది జరిగిపోవడం, చివర్లో ఒక సమస్య నుంచి తండ్రిని భయపడేయడం వంటివి మరీ రొటీన్‌గా కనిపిస్తాయి.

హీరోయిన్ అమ్ము పాత్ర సాదాసీదాగా ఉంది. అదే విధంగా మొదట్నుంచీ, చివరివరకూ కామెడీనే నమ్ముకున్న సినిమాలో వచ్చే కొన్ని క్యారెక్టర్స్ మధ్యన వచ్చే ఎమోషన్ ఆకట్టుకునేలా లేదు. ఇలా విచిత్రమైన క్యారెక్టర్స్ అన్నింటి వల్లా ఎప్పటికప్పుడు కథ ఒక్కో టర్న్ తీసుకోవడం కూడా ఫార్ములాకు అలవాటుపడిన ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వకపోవచ్చు. సీరియస్ కథాంశాన్ని, ఎమోషన్‌ను, డ్రామాను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు లేవు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో అందరికంటే ముందుగా దర్శకుడు మేర్లపాక గాంధీ గురించి చెప్పుకోవాలి. రచయితగా ఒక ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేను, క్యారెక్టర్స్‌ను తయారు చేసిన గాంధీ, దాన్ని ఒక ఔట్ అండ్ ఔట్ కామెడీగా తెరకెక్కించడంలో దర్శకుడిగా చాలాచోట్ల మంచి సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్, డైలాగ్స్ పరంగా గాంధీ కట్టిపడేశాడు. హీరో, హీరోయిన్ల లవ్‌ట్రాక్‌ను మరోలా ప్లాన్ చేసి, కొంత ఎమోషన్‌కు కూడా చోటు కల్పించి ఉంటే మరింత బాగుండేది.

కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ టెక్నికల్ అంశాల్లో మంచి హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక జర్నీలో ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండే మూడ్‌ను చాలా బాగా క్యాప్చర్ చేశాడు. ఇక ప్రవీణ్ లక్కరాజు అందించిన పాటలు సినిమాతో కలిపి చూసినప్పుడు మంచి ఫీల్ ఇస్తాయి. ఎడిటింగ్ ఫర్వాలేదనేలా ఉంది. కొన్ని చోట్ల వేగంగా ఒక సీన్ నుంచి ఇంకో సీన్‌కి వెళ్ళిపోవడం ఇబ్బంది పెడుతుంది. యూవీ క్రియేషన్స్ ఎప్పట్లానే ప్రొడక్షన్ వ్యాల్యూస్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

తీర్పు :

కామెడీ అనే జానర్‌కు ఏ భాషలో అయినా ఎప్పుడూ మంచి ఆదరణ కనిపిస్తుంది. ఆ కామెడీ అర్థవంతంగా ఉండి, దానికి లాజిక్, కొంత డ్రామా కూడా తోడైతే అవి మర్చిపోలేని సినిమాలుగా నిలుస్తాయి. అదే లాజిక్ మిస్ అయి, డ్రామా లేని సినిమాలైతే సరదాగా అప్పటికి నవ్వుకొని, అప్పుడప్పుడూ ఎంజాయ్ చేసే సినిమాలుగా నిలుస్తాయి. ఎక్స్‌ప్రెస్ రాజా సరదాగా సాగిపోయే రెండో రకం సినిమా! సరికొత్త స్క్రీన్‌ప్లే, విచిత్రమైన పాత్రలతో ఆద్యంతం నవ్వించే పాత్రలు, మంచి కామెడీ టైమింగ్ నింపుకొని వచ్చిన సన్నివేశాలు, నటీనటులంతా బాగా నవ్వించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఇక హీరో, హీరోయిన్ల లవ్‌ట్రాక్ సాదాసీదాగా ఉండడం, లాజిక్ అన్న మాటకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఎమోషన్ లేకపోవడం వంటివి మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే సరదాగా, పెద్దగా లాజిక్ లేకున్నా ఫర్వాలేదు కానీ మంచి కామెడీ ఉంటే చాలు అనుకునేవారికి ఈ సినిమా పర్ఫెక్ట్ ఆప్షన్. లాజిక్ వెతకకుండా చూస్తే హాయిగా నవ్వించే సినిమా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’!

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :