సమీక్ష : గుంటూర్ టాకీస్ – అడల్ట్, కామెడీ.. జస్ట్ ఓకే!!

Guntur Talkies review

విడుదల తేదీ : 04 మార్చ్ 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు

నిర్మాత : రాజ్ కుమార్. ఎమ్

సంగీతం : శ్రీ చరణ్

నటీనటులు : సిద్ధు, నరేష్, శ్రద్ధా దాస్, రష్మి..


‘చందమామ కథలు’ సినిమాతో జాతీయ అవార్డు పొందిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు తాజాగా ‘గుంటూర్ టాకీస్’ అన్న సినిమాతో మెప్పించేందుకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పోస్టర్స్, ట్రైలర్స్‌తో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా తెలుగులో ఓ సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్ అన్న ప్రచారం పొందుతూ వచ్చింది. మరి సినిమా నిజంగానే కొత్తదనమున్న కామెడీతో మెప్పించిందా? చూద్దాం..

కథ :

గిరి (నరేష్), హరి (సిద్ధు).. గుంటూర్‌లోని ఓ మెడికల్ షాప్‌లో చాలీచాలని జీతాలకు పనిచేస్తూ మధ్యతరగతి జీవితాలను వెల్లదీస్తుంటారు. ఇక తమ అవసరాలను తీర్చుకునేందుకు చిన్న చిన్న దొంగతనాలు చేసే ఈ ఇద్దరూ, ఒకానొక దశలో పెద్ద దొంగతనమే చేయాలని నిర్ణయించుకొని ఓ ఇంట్లో 5 లక్షల రూపాయలను దోచేస్తారు. ఆ డబ్బుతో దర్జాగా బతికేద్దామనుకున్న వారి జీవితాలు ఆ తర్వాత కొన్ని అనుకోని మలుపులు తిరుగుతాయి.

ఈ క్రమంలోనే జాకీ (మహేష్ మంజ్రేకర్), రివాల్వర్ రాణి (శ్రద్ధా దాస్) అనే ఇద్దరు డాన్‌లతో పాటు పోలీసులు కూడా గిరి, హరిల వెంటపడుతుంటారు. జాకీకి వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? రివాల్వర్ రాణి ఎవరు? సువర్ణ (రష్మి) అనే అమ్మాయిని ప్రేమించిన హరి ఆమె ప్రేమను దక్కించుకున్నాడా? చివరికి ఈ ఇద్దరి కథ ఎటుపోయిందీ? అన్న ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే నరేష్, సిద్ధు, మహేష్ మంజ్రేకర్‌ల కామెడీ టైమింగ్, యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఓ మధ్య తరగతి తండ్రిగా, దొంగతనం చేసైనా జీవితాన్ని బాగుపరచుకోవాలనే వ్యక్తిగా పాట్లు పడే నరేష్ నటన అద్భుతంగా ఉంది. తనదైన కామెడీ టైమింగ్‌తో హీరోగా మెప్పించిన నరేష్, సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తన స్థాయిని నిలబెట్టుకుంటూనే ఈ స్థాయిలో నవ్వించే పాత్రలు చేయడం బాగుంది. ఇక హీరో సిద్ధు కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలాచోట్ల సిద్ధు బాగా మెప్పించాడు. మహేష్ మంజ్రేకర్ ఎప్పట్లానే కామెడీ విలన్‌గా బాగా మెప్పించాడు. అతడికి రాసిన డైలాగ్స్‌లో బూతు ఎక్కువైనా, ఆ పాత్రలో ఆయన బాగానే మెప్పించాడు.

ఇక బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్న రష్మికి ఈ సినిమాలో పెద్దగా నటించే అవకాశం ఏమీ లేదు. అయితే గ్లామర్ పరంగా మాత్రం రష్మి కనులవిందు చేసింది. ‘ఓ సువర్ణా’ పాటలో అందంగా కనిపించి, ‘నీ సొంతం’ పాటలో హాట్‌గా కనిపించి ఈ తరహా అంశాలను ఇష్టపడేవారికి రష్మి అందాల ప్రదర్శన చేసింది. ఇక ఓ బోల్డ్ పాత్రలో నటించిన శ్రద్ధా దాస్ పాత్రలో సినిమాలో కేవలం రెండు మేజర్ ఎపిసోడ్స్‌లో మాత్రమే వస్తుంది. ఉన్నంతలో శ్రద్ధా దాస్.. తన అందం, స్టైల్‌తో కట్టిపడేసింది. స్వయంగా శ్రద్ధానే చెప్పిన డబ్బింగ్ కూడా బాగుంది. సినిమా పరంగా చూసుకుంటే, ఇంటర్వెల్ తర్వాతి పది నిమిషాలు, ప్రీ క్లైమాక్స్‌లో కామెడీ, ఫస్టాఫ్‌లో అక్కడక్కడా బాగుందనిపించే రొమాన్స్‌లను ప్లస్ పాయింట్స్‌గా చెప్పొచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ఎంచుకున్న నేపథ్యం, కథ చెప్పాలనుకున్న విధానం.. ఈ రెండూ కొత్తవే అయినా కూడా వాటికి ఓ సరైన కథ కానీ, కథనం కానీ లేకపోవడాన్ని మేజర్ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా క్రైం కామెడీల్లో పరమ రొటీన్ అయిన కాన్సెప్ట్‌తో, బోరింగ్ కథనంతో తెరకెక్కిన ఈ సినిమాలో జెన్యూన్‌గా నవ్వించే సన్నివేశాలు చాలా తక్కువ. నరేష్ తన మార్క్‌తో చాలా చోట్ల సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా, కథలో బలం లేకపోవడంతో అది వృథా ప్రయత్నమే అయింది. రష్మి, శ్రద్ధా దాస్ పాత్రలకు ఓ అర్థం లేదు. ఆ రెండు పాత్రలకూ సరైన క్లారిటీ లేకపోవడమే కాక, ఆ పాత్రల చుట్టూ వచ్చే సన్నివేశాలు కూడా సిల్లీగా ఉన్నాయి.

ఇక వాస్తవానికి దగ్గరగా సినిమాను నడుపుతున్నామన్న ఆలోచనను మొదట్లో రేకెత్తించి ఆ తర్వాత అన్నింట్లోనూ అతి చేయడం బాగోలేదు. సినిమా అసలు కథలోకి ఫస్టాఫ్ వరకూ వెళ్ళకపోవడం అటుంచితే, అప్పటివరకూ బలమైన సన్నివేశం ఒక్కటీ లేకపోవడం నిరుత్సాహపరుస్తుంది. క్లైమాక్స్ పార్ట్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఇక అడల్ట్ కామెడీనే ప్రధానంగా నమ్ముకున్న సినిమా కావడంతో ఈ సినిమా సాధారణ కుటుంబ ప్రేక్షకులకు నచ్చదనే చెప్పొచ్చు. బాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన క్లాస్ అడల్ట్ కామెడీకి మాస్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేసిన సినిమాగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కొన్నిచోట్ల సినిమా మరీ బీ-గ్రేడ్ సినిమాలా కనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ఈ సినిమాకు సంగీత దర్శకుడు శ్రీ చరణ్‌ను హైలైట్‌గా చెప్పుకోవచ్చు. పాటల కంపోజింగ్‌లో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో శ్రీ చరణ్ చేసిన ప్రయోగం బాగుంది. ఇక రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. కథ చెప్పాలనుకున్న విధానానికి, అడల్డ్ కామెడీ మూడ్‌కు సరిగ్గా కుదిరే మూడ్‌ను క్యాప్చర్ చేశారు. ఎడిటర్ ధర్మేంద్ర ఎడిటింగ్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఆర్ట్ వర్క్ బాగుంది.

ఇక దర్శకుడు ప్రవీణ్ సత్తారు విషయానికి వస్తే.. ఎంచుకున్న నేపథ్యం, కథ చెప్పాలనుకున్న విధానంలో తప్ప ఎక్కడా దర్శకుడిగానూ, రచయితగానూ ప్రవీణ్ సత్తారు చేసిందేమీ లేదు. ఒక సాధారణ కథను, బోరింగ్ కథనంతో, ఎక్కడా ఆసక్తికరంగా కూడా లేని సన్నివేశాలతో నడిపి దర్శక రచయితగా ప్రవీణ్ నిరుత్సాహ పరచాడనే చెప్పాలి. మొదట్లో రియాలిటీకి దగ్గరగా ఉన్న కొన్ని సన్నివేశాలు, కొన్నిచోట్ల ఫర్వాలేదనిపించే కామెడీ సన్నివేశాల్లో తప్ప ప్రవీణ్ ఈ సినిమాలో మరెక్కడా మెప్పించలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

‘గుంటూర్ టాకీస్’.. జాతీయ అవార్డు పొందిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు నిర్మించిన ఈ సినిమా చాలాకాలం నుంచే విపరీతమైన అంచనాలను మూటగట్టుకుంది. కొత్త కథాంశం, నేపథ్యంతో రూపొందిన సినిమా అన్న ప్రచారం పొందిన గుంటూర్ టాకీస్‌లో ఆ కొత్తదనమే అర్థం లేనిదవ్వడం మేజర్ మైనస్. నరేష్, సిద్ధుల కట్టిపడేసే నటన, రష్మి, శ్రద్ధా దాస్‌ల అందాల ప్రదర్శన, అక్కడక్కడా నవ్వించే సన్నివేశాలను ఈ సినిమాకు హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఒక బలమైన కథంటూ లేకపోవడం, బోరింగ్ కథనం, జెన్యూన్ కామెడీ అన్నదే లేకపోవడం, అర్థం లేని కొన్ని పాత్రల చిత్రణ.. లాంటి మైనస్‌లను నింపుకున్న ఈ సినిమా అడల్డ్ కామెడీని ఎంజాయ్ చేసి, సినిమా అయిపోగానే మరచిపోవచ్చనుకుంటే ఒకసారి చూసేయొచ్చు. మిగతా వారికి ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలేమీ లేవు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘గుంటూర్ టాకీస్’లో అతి సాదాసీదా సినిమానే పడింది!

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :