ఇంటర్వ్యూ : వెంకటేష్ – ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ అంటే అదొక నంబర్ మాత్రమే!

Venkatesh
విక్టరీ వెంకటేష్ సినిమా అంటే కుటుంబమంతా చూడదగ్గ సినిమా అన్న పేరు ఏళ్ళుగా కొనసాగుతూ వస్తోంది. కొద్దికాలంగా ఎక్కువగా ప్రయోగాత్మక కథలకే ప్రాధాన్యం ఇస్తూ వస్తోన్న వెంకటేష్, సంవత్సరం పైగా గ్యాప్ తీసుకొని ‘బాబు బంగారం’ అన్న కమర్షియల్ సినిమాతో, తన పాత స్టైల్ కామెడీతో మెప్పించేందుకు ఈ శుక్రవారమే (ఆగష్టు 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాబు బంగారం’ గురించి, తన కెరీర్ గురించి వెంకటేష్ పంచుకున్న విశేషాలు..

ప్రశ్న) ‘అయ్యో.. అయ్యో..’ అంటూ ‘బొబ్బిలి రాజా’ స్టైల్లో ‘బాబు బంగారం’ అన్న టైటిల్‌తో వస్తున్నారు. బాబు బంగారం టైటిల్ ఎలా వచ్చింది?

స) (నవ్వుతూ..) ఈ అయ్యో అయ్యయ్యో.. అన్నది ఇప్పుడు కూడా ఇంతలా ఆదరిస్తారని అనుకోలేదు. విచిత్రమేమంటే, బొబ్బిలిరాజాతో సంబంధం లేని ఈతరం పిల్లలు కూడా ఈ డైలాగ్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. మారుతికి బొబ్బిలి రాజా సినిమా అంటే చాలా ఇష్టమట. ఈ సినిమాలో ఆ రిఫరెన్స్ వాడాలని మొదట్నుంచీ అనుకొని ఈ ఐడియా తీసుకొచ్చాడు. ఈ కథలో నా పాత్రకు పోలీసాఫీసర్ అయినా ఎక్కడిలేని జాలి ఉంటుంది. దానికి ఈ అయ్యో అయ్యయ్యో.. రిఫరెన్స్, టైటిల్ కూడా సరిగ్గా కుదిరి అలా పెట్టేశాం. ఈ రెండూ దర్శకుడి ఆలోచన నుంచి పుట్టినవే!

ప్రశ్న) ‘గోపాల గోపాల’ తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం?

స) ఈ గ్యాప్ కావాలని తీసుకున్నదే! ఏదో సినిమాలు చేసేస్తున్నాం అనుకోకుండా, ఇప్పటి ప్రేక్షకుల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎలాంటి సినిమా చూస్తున్నారు? లాంటివి గమనించి ఇప్పటికి సినిమాతో వచ్చా. మధ్యలో నాన్న చనిపోవడం వల్ల కూడా కొన్నాళ్ళు అన్నీ పక్కన పెట్టేశా.

ప్రశ్న) కొన్నాళ్ళుగా చేస్తూ వస్తున్నట్లు, రీమేక్ కాకుండా ఈ సారి స్ట్రైట్ సినిమా ఎంచుకున్నారు. కారణం?

స) ప్రత్యేకించి కారణమేమీ లేదు. నాకు స్ట్రైట్ సినిమా, రీమేక్ సినిమా అన్న బేధం లేదు. మారుతి చాలాకాలంగా నాతో సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. అతడి ఆసక్తి నచ్చింది. ‘బాబు బంగారం’ కథ చెప్పినప్పుడు క్యారెక్టర్ చాలా కొత్తగా కనిపించి వెంటనే పూర్తి కథ సిద్ధం చేయించి సినిమా చేసేశా. ఏదీ అనుకోని చేయం కదా, అన్నీ అలా జరిగిపోతుంటాయి.

ప్రశ్న) మారుతితో గతంలో ‘రాధ’ అనే ఒక సినిమా మధ్యలో ఆపేశారు. మళ్ళీ సినిమా అనుకున్నప్పుడు దానిగురించి ఆలోచించలేదా?

స) చూడండీ. నేను దేనిగురించైనా వెంటనే మర్చిపోతుంటా. ఈ సక్సెస్, ఫెయిల్యూర్ అన్నింటినీ సాధారణంగా తీసుకోవడం అలవాటైపోయింది. ఆ సినిమా ఆగిపోయినా, ఎప్పటికప్పుడు కొత్త కథలతో మారుతి వస్తూనే ఉన్నాడు. అతడి కమిట్‌మెంట్ నచ్చింది. సినిమా చేసేశా. నన్నడిగితే మారుతి నాకు రాసిన క్యారెక్టర్ చాలా చాలా కొత్తది. అలాంటి పాత్రలో నటించాలని నాకూ ఉంటుంది కదా!

ప్రశ్న) మీకు అంతగా నచ్చిన ఆ క్యారెక్టర్ గురించి కొంత చెప్పండి?

) బాబు బంగారంలో ఓ పోలీసాఫీసర్‌గా కనిపించా. పోలీసాఫీసర్ అంటే సాధారణంగానే కాస్త సీరియస్‌నెస్ ఉంటుంది. అయితే ఇందులో ఆ పాత్ర అందుకు భిన్నంగా ఉంటుంది. తరాలుగా ఓ కుటుంబానికి జాలి అనేది ఎక్కువ ఉండడం పోలీసాఫీసర్ అయిన వ్యక్తికీ ఉంటే ఎలా ఉంటుందన్నది కథకు కనెక్ట్ అయిన పాయింట్. రేపు సినిమా చూశాక మీకూ ఈ క్యారెక్టరైజేషన్ నచ్చుతుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) మీరు, నయనతార స్క్రీన్‌పై మళ్ళీ కొత్తగా, యంగ్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో మీ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది?

స) యంగ్‌గా కనిపిస్తున్నామంటే అంతవరకూ ఓకే! అలా అని నేను కూడా హీరోయిన్ వెంట పరిగెత్తడం చేస్తే నవ్వుతారు!!( గట్టిగా నవ్వుతూ..). అందుకే ‘ఏజికి ఏజి’ అనే సెటైర్ కూడా ఉంది. వెల్, మా కెమిస్ట్రీ బాగుంటుంది. కాకపోతే అదేమీ యంగర్ జనరేషన్ సినిమాల్లో ఉన్నట్లుగా కాకుండా, నా వయసుకు తగ్గట్టు ఉంటుంది.

ప్రశ్న) ఓ దర్శకుడి పనిలో మీ జోక్యం ఎంతవరకు ఉంటుంది?

స) దర్శకుడి పనిలో నా జోక్యం అస్సలుండదు. నా పని నటించడం మాత్రమే. ఏదైనా సన్నివేశం నచ్చకపోతే బాగోలేదని చెప్పడం, ఏవైనా మార్పులు చేయొచ్చేమో సూచించడం వరకూ చేస్తూంటా కానీ, క్రియేటివ్‌గా నా జోక్యం ఉండదు.

ప్రశ్న) మీరు ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. ఈ కెరీర్ అంతా చూస్తే ఏమనిపిస్తుంది?

స) అదంతా కేవలం నంబర్ మాత్రమే! మనమేదో 30 ఏళ్ళు కొనసాగాం అని గొప్పగా చెప్పుకోవడానికి లేదు. కెరీర్ మొదలుపెట్టకముందు నాకే అయోమయం ఉండేది. కొన్నాళ్ళకు మెల్లిగా నా డెస్టినీ ఏంటో అర్థమైంది, చేస్తూ వచ్చా. ఇప్పటికి 30 ఏళ్ళు పూర్తయ్యాయి. ఇన్నేళ్ళుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ సక్సెస్, ఫెయిల్యూర్.. అన్నీ వస్తూంటాయి, పోతూంటాయి. వాటినుంచి ఏం నేర్చుకున్నాం? ఎలా ముందుకు వెళ్ళాం? అన్నదే ముఖ్యం.

ప్రశ్న) రానాతో ఓ సినిమా చేస్తున్నారని విన్నాం. అదెప్పుడు?

స) ఇద్దరు, ముగ్గురు కథలు రాస్తున్నారు. ఇప్పుడే వాటి గురించి ఇంకా ఏమీ చెప్పలేను!

ప్రశ్న) తదుపరి సినిమాలు ఏంటి?

స) ప్రస్తుతానికి ‘ఇరుదు సట్రు’ తెలుగు రీమేక్ ఒకటి చేస్తున్నా. అందులో బాక్సర్‌గా కనిపిస్తా. ఇక దర్శకుడు కిషోర్ తిరుమలతో ‘ఆడవాళ్ళూ.. మీకు జోహార్లు’ అని ఇంకో సినిమా చేస్తున్నా.

ప్రశ్న) ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ నుంచి నేరుగా కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి వస్తోంది. వారికి ఎటువంటి సలహాలు ఇస్తారు?

స) కొత్త టాలెంట్ ఎప్పటికప్పుడు రావాలి. వాళ్ళు వస్తూంటేనే ఇండస్ట్రీలో కొత్త సినిమాలు వస్తాయి. వాళ్ళకు తెలిసిన, వాళ్ళచుట్టూ ఉన్న కథలని చెప్పే ప్రయత్నం చేస్తే మంచి విజయం సాధిస్తారు. ముందు మన ఆలోచనలు ఎలా ఉన్నాయీ? మన డెస్టినీ ఏంటన్నది తెలుసుకుంటే ఆ తర్వాత ఏ వృత్తైనే సంతోషంగా చేసుకుంటూ పోవచ్చు.