సమీక్ష : ఐపిసి సెక్ష‌న్ భార్యా బంధు – ఉండాల్సినంత విషయం లేదు

 Tik Tik Tik movie review

విడుదల తేదీ : జూన్ 29, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : శరత్ చంద్ర, నేహా దేశ్ పాండే

దర్శకత్వం : రెట్టడి శ్రీనివాస్

నిర్మాత : ఆలూరి సాంబ శివరావు

సంగీతం : విజయ్ కురాకుల

సినిమాటోగ్రఫర్ : శ్యామ్

ఎడిటర్ : మహేంద్రనాథ్

రాజ్యాంగంలో ఉన్న ఐపీసీ 498 ఏ భార్యా బంధు అనే చట్టాన్ని బేస్ చేసుకుని రూపొందిన చిత్రం ‘ఐపిసి సెక్ష‌న్ భార్యా బంధు’. నిన్న శుక్రవారమే ఈ చిత్రం విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

లాయర్ గా పనిచేసే వినాయకరావ్ (శరత్ చంద్ర) భార్యల చేతిలో దుర్వినియోగానికి గురవుతూ భర్తల పాలిట శాపంగా మారిన ఐపీసీ 498 ఏ భార్యా బంధు అనే చట్టాన్ని రద్దు చేయించాలని, అది రద్దయ్యాకే పెళ్లి చేసుకోవాలనే నిశ్చయంతో పనిచేస్తుంటాడు.

ఐపీసీ 498 ఏ భార్యా బంధు చట్టం భార్యల చేతిలో ఎలా దుర్వినియోగం అవుతోంది, అది భర్తలకు ఎలా చెడుగా మారింది, అసలు ఈ చట్టాన్ని రద్దు చేయాలని వినాయకరావ్ ఎందుకు అనుకుంటున్నాడు, చివరికి రద్దు చేయగలిగాడా లేదా అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :
సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ ఎంచుకున్న రాజ్యాంగంలోని చట్టాన్ని మార్చాలి అనే ప్లాట్. ఇలాంటి ప్లాట్ తో సినిమాలు చాలా అరుదుగా రూపొందుతుంటాయి. పైగా భార్య భర్తలకు సంబందించిన చట్టం కావడం సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది.

దర్శకుడు శ్రీనివాస్ సినిమాలో చాలా చోట్ల భార్యా బంధు చట్టాన్ని అడ్డుపెట్టుకుని భర్తలపై భార్యలు ఎలాంటి అబద్దపు కేసులు పెడుతున్నారో సవివరంగా చూపించారు. అంతేగాక ఈ చట్టం మూలాన కొన్ని వైవాహిక జీవితాలు ఎలా అర్థాంతరంగా ముసిపోతున్నాయో వివరించి వాటిని ఆపడానికి కొంత పరిష్కారాన్ని చూపే చిన్నపాటి ప్రయత్నం కూడ చేశారు. అసలు భార్యా భర్తల నడుమ ఎలాంటి రిలేషన్ ఉండాలో ఆమని పాత్ర ద్వారా వివరించడం కొంత బాగుంది. ఇకపోతే హీరోయిన్ నేహా దేశ్ పాండే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు ఎంచుకున్న ప్లాట్ బాగానే ఉన్నా దాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా నడపడంలో మాత్రం ఆయన విఫలమయ్యారు. ఎక్కడా ప్రేక్షకుడ్ని ఆకట్టుకునే కథాన్ని రాసుకోలేకపోయారు. పైగా కొన్ని చోట్ల మ్యాజిక్ తప్ప లాజిక్ లేదు అన్నట్టు కథనాన్ని సైడ్ ట్రాక్ ఎక్కించారు. దీంతో సినిమాపై ఉన్న కొంచెం ఆసక్తి సన్నగిల్లింది. చనిపోయిన హీరో అన్నయ్య ఫోటోలోంచి హీరోతో మాట్లాడటం వంటి సన్నివేశాలు మరీ సిల్లీగా ఉన్నాయి.

శ్రీనివాస్ సినిమా ఆరంభం నుండి క్లైమాక్స్ వరకు హీరో భార్యా బంధు చట్టాన్ని రద్దు చేయడానికి కష్టపడుతున్నాడని చెప్పడమే కానీ సరిగ్గా చూపలేదు. కీలకమైన కోర్టు సన్నివేశాలు చాలా బలహీనంగా ఉన్నాయి. దర్శకుడు 498 ఏ చట్టంపై గట్టి పరిశోధన చేసినట్టు లేదు అందుకే దాన్ని సవివరంగా ప్రేక్షకులకు వివరించడం కానీ దానిపై సమగ్ర స్థాయిలో చర్చించడం కానీ చేయలేదు.

ఇంటర్వెల్ సమయానికి అసలు గమ్యాన్ని మర్చిపోయి ప్రయాణించడం మొదలుపెట్టిన సినిమా చివరికి ఇదే గమ్యం అంటూ సాధారణ స్థాయి ముగింపును ఆశ్రయించింది. దీంతో శ్రీనివాస్ తీసుకున్న ప్లాట్ కు పూర్తి న్యాయం చేకూర్చలేకపోయారు. హీరో హీరోయిన్లకు నడుమ కెమిస్ట్రీ అస్సలు కుదరలేదు. వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ పాత మూస ధోరణిలోనే ఉంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ ధైర్యంగా మంచి ప్లాట్ ను తీసుకున్న దాన్ని ఆకట్టుకునే కోర్ట్ డ్రామాతో, వాదోపవాదాలతో, ప్రేక్షకులకి 498 ఏ భార్యా బంధు చట్టం మీద సరైన అవగాహన కలిగిస్తూ ఆసక్తికరంగా మలచలేకపోయారు. దీంతో సినిమా ఆద్యంతం బోర్ కొట్టించింది.

విజయ్ కురాకుల సంగీతం జస్ట్ ఓకే అనేలా మాత్రమే ఉంది. మహేంద్రనాథ్ తన ఎడిటింగ్ ద్వారా మధ్యన నడిచే సన్నివేశాలను తొలగించాల్సింది. శ్యామ్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఆలూరి సాంబ శివరావుగారు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

సమాజానికి సంబందించి అంశాలని సినిమాగా చెప్పాలనుకున్నప్పుడు ఆ అంశాలపై పూర్తిస్థాయి పరిశోధన చేసి, అందులో ఉన్న సమస్యలకి ఎంతో కొంత పరిష్కారం చూపాలి, సినిమా చూసేవారిని ఎడ్యుకేట్ చేయాలి. కానీ దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ మాత్రం అలాంటివి ఏవీ లేకుండా చివర్లో భార్యా బంధు చట్టంలో ఏదో చిన్నపాటి మార్పులు చేస్తే సరిపోతుందని చేతులు దులిపేసుకోవడంతో ఫలితం బెడిసికొట్టింది. సినిమాలో మెచ్చుకోదగిన ప్లాట్ లైన్, భార్య భర్తల అనుబంధాన్ని వివరిస్తూ వచ్చే కొన్ని సన్నివేశాలు మినహా పెద్దగా ఆకట్టుకొనే అంశాలేవీ ప్రేక్షకులకు దొరకవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్తగా ఇచ్చే విషయం పరిజ్ఞానం ఏమీ లేదు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

  • 3
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook