సమీక్ష : కళావతి – టైం పాస్ హర్రర్ కామెడీ

Kalavathi review

విడుదల తేదీ : 29 జనవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : సుందర్.సి

నిర్మాత : గుడ్ ఫ్రెండ్స్ సంస్థ

సంగీతం : హిప్ హాప్ తమిజ

నటీనటులు : సిద్దార్థ్, త్రిష, హన్సిక, పూనం బజ్వా..

2014లో తమిళంలో హిట్ అయిన ‘అరన్మనై’కి డబ్బింగ్ వెర్షన్ గా తెలుగులోకి వచ్చి హిట్ అయిన సినిమా ‘చంద్రకళ’. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా చేసిన ‘అరన్మనై 2’ ని తెరకెక్కించారు. ఈ సినిమాని తెలుగులో ‘కళావతి’గా డబ్ చేసారు. సుందర్ సి డైరెక్షన్ లో సిద్దార్థ్, త్రిష, హన్సిక ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ హర్రర్ కామెడీ సినిమా ఈ రోజు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. మరి చంద్రకళ కి సీక్వెల్ గా వచ్చిన ఈ కళావతి ఎంత వరకూ నవ్వించి, భయపెట్టిందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

కోవిలూర్ గ్రామంలోని అమ్మవారి విగ్రహం చాలా మహిమ కలది. అందుకే ఆ ఊరిలో దెయ్యం, భూతం అనే భయం ఉండదు. కానీ ఆ అమ్మవారికి కుంభాభిషేకం చేయాలని నిర్ణయించి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి పక్కన పెడతారు. దాంతో ఆ ఊర్లోని ప్రేత శక్తికి పవర్ వస్తుంది. అక్కడి నుంచి కట్ చేస్తే ఆ ఊరి జమిందార్(రాధా రవి) ఇంట్లో భయానక సంఘటనలు మొదలవుతాయి. ఓ ఆత్మ ఆ ఇంట్లోకి ప్రవేశించి జమిందార్ ని కోమాలోకి వెళ్ళేలా చేస్తుంది. దాంతో ఆయన కుమారుడు మురళి(సిద్దార్థ్), తను పెళ్లి చేసుకోబోయే అనిత(త్రిష) కూడా వెంటనే ఇంటికి వస్తారు. వీరికి కూడా అంతు చిక్కని కొన్ని భయానక సంఘటనలు జరుగుతునతాయి.

అసలు ఏంజరుగుతున్నాయో అర్థం కాని టైంలో అనిత అన్నయ్య అయిన రవి(సుందర్.సి) వస్తాడు. అలా వచ్చిన రవి అక్కడ జరుగుతున్నవిషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అసలు రవి తెలుసుకున్న విషయాలేమిటి? ఆ ఆత్మ ఎవరిదీ? అసలు ఆ జమిందార్ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేసింది? చివరికి వారిని చంపేసిందా లేక రవి వారిని ఆత్మ నుంచి కాపాడాడా అన్నది తెలుసుకోవాల్సిన కథ..

ప్లస్ పాయింట్స్ :

హిట్ అయిన ‘చంద్రకళ’ సినిమాకి సీక్వెల్ అని చెప్పుకొని రిలీజ్ చేయడం, అలాగే ఇందులో స్టార్స్ ఎక్కువ మంది ఉండడమే ఈ సినిమాకి మేజర్ అట్రాక్షన్. ఇక ఈ సినిమాలోకి వస్తే.. సినిమా ప్రారంభం చాలా ఆసక్తికరంగా, కాస్త ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఉండడంతో చూసే అందరిలోనూ ఉత్కంటని క్రియేట్ చేయడమే. ఆ తర్వాత జమిదార్ ప్యాలెస్ లో వచ్చే కొన్ని హర్రర్ సన్నివేశాలు ఆడియన్స్ ని భయపెడతాయి. చిన్న పిల్లాడు, త్రిష మీద వచ్చే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. అలాగే ఇంటర్వల్ బ్లాక్ బాగుంది. ఇక సెకండాఫ్ కి వస్తే ఆ ఆత్మ గురించి తెలియగానే దాని నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు దాని చుట్టూ అల్లుకున్న కామెడీతో పాటు క్లైమాక్స్ అంశాలు సినిమాకి పెద్ద హైలైట్ గా నిలిచాయి.

ఇక సినిమాలో నటీనటుల విషయానికి వస్తే.. త్రిష, హన్సికల పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్. త్రిష సిద్దార్థ్ లవర్ గా, ఆత్మ వచ్చే అమ్మాయిలా చాలా మంచి నటనని కనబరిచింది. ముఖ్యంగా మొదటి బీచ్ సాంగ్ లో తన కెరీర్లో మునుపెన్నడూ లేనంతగా బికినీలో అందాలను ఆరబోసింది. ఈ సాంగ్ మాత్రం విజువల్ ట్రీట్. ఇక మెయిన్ లీడ్ రోల్ లో హన్సిక నటన బాగుంది. మెయిన్ గా సీరియస్, భయపెట్టే, ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా చేసింది. వీరిద్దరూ సెకండాఫ్ ని సేవ్ చేసారని చెప్పాలి. ఇక సుందర్ సి తనదైన నటనతో ఆకట్టుకుంటే, సిద్దార్థ్ తన పాత్రకి న్యాయం చేసాడు. గ్లామర్ అట్రాక్షన్ అయిన పూనం బజ్వా ఓకే ఓకే అనిపించుకుంది. ఇక కమెడియన్స్ అయిన సూరి, కోవై సరళ, మనోబాలలు అక్కడక్కడా నవ్వించారు. ముఖ్యంగా సెకండాఫ్ లో వీరి మధ్య వచ్చే బస్ మరియు హోటల్ ఎపిసోడ్ అందరినీ బాగా నవ్విస్తుంది. ఇక మిగతా నటులలో రాధారవి, రాజ్ కపూర్, అతిధి పాత్రలో వైభవ్ బాగా చేసారు. త్రిష – సూరి కాంబినేషన్ లో వచ్చే ఓ సీన్ బాగా నవ్విస్తుంది.

ఇక సినిమా పరంగా చూసుకుంటే ఈ సినిమాకి సెకండాఫ్ మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఇంటర్వల్ బ్లాక్ తర్వాత అసలు కథలోకి ఎంటర్ కావడం, అక్కడి నుంచి చకచకా సినిమాని ముందుకు తీసుకెళ్లడం, అలాగే కామెడీ, హర్రర్ రెండిటినీ బాలన్స్ చేస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లడం వలన ఆడియన్స్ సినిమాలో లీనమవుతారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని హర్రర్ సన్నివేశాలు, సెకండాఫ్ లోని చివరి 40 నిమిషాలు సినిమాని నిలబెట్టాయి.

మైనస్ పాయింట్స్ :

కళావతి హర్రర్ కామెడీ జానర్లో వచ్చిన సినిమా.. కావున టేకింగ్ ఇప్పటి వరకూ వచ్చిన అన్ని హర్రర్ కామెడీ సినిమాల ఫార్మాట్ లోనే ఉంటుంది. సినిమా మొదటి 10 నిమిషాల తర్వాత సినిమా ఎలా ముగుస్తుంది అనేది మీరు ఊహించేయవచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్ లో హర్రర్ తోపాటు రాసుకున్న కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వించలేకపోయాయి. అందువలన సినిమా ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ గా, మీరేమైతే అనుకుంటారో అదే పొల్లు పోకుండా జరుగుతూ ఉండడం వలన మీరు బోర్ ఫీలవుతారు. ముఖ్యంగా చంద్రముఖి, చంద్రకళ ఫేవర్ లోనే ఈ సినిమా ఉంటుంది.

ఇక సినిమాకి చాలా పెద్ద ప్లస్ కావాల్సిన పాయింట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. కానీ అది చాలా సింపుల్ గా ఉండడంతో పెద్ద కిక్ ఇవ్వదు. ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండి ఉంటే బాగుండేది. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గౌరవం సినిమాలో లానే ఉంటుంది. దీని వలన సినిమా మొత్తం ఊహాజనితంగా ఉండడం వలన ట్విస్ట్ లు అనేవి మీరు ముందే ఊహించేయగలరు. అలాగే సినిమాలో పాటలు పెద్ద మైనస్. దాదాపు అన్ని పాటలు సినిమాని సాగాదీయడానికే వచ్చినట్లు ఉంటాయి.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి కీలకమైన కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం విభాగాలను డీల్ చేసిన కెప్టెన్ సుందర్.సి. ఆయన కథలో కొత్తదనం లేదు. తన చంద్రకళ సినిమాలానే ఉంటుంది. కథ పెద్దగా లేదని తెలియడం వలన కథనంలో కూసింత మేనేజ్ చేయడానికి ట్రై చేసాడు కానీ అక్కడా పూర్తిగా సక్సెస్ కాలేదు. అంత ఆసక్తికర స్క్రీన్ ప్లే లేనందువల్ల సినిమా చాలా అంటే చాలా బోర్ కొడుతుంది. కథ – కథనంలో మిస్ అయిన చాలా వాటిని దర్శకుడిగా సెకండాఫ్ లో బాలన్స్ చేసుకుంటూ సినిమాని నడిపించడమే పెద్ద హైలైట్. కావున డైరెక్టర్ గా సుందర్ సి సక్సెస్ అయ్యాడు. కానీ విజువల్స్ ఎఫెక్ట్స్ పరంగా ఇంకాస్త బెటర్ మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది.

యుకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. నైట్ అండ్ డే ఎఫెక్ట్స్ ని బాగానే చూపించాడు. హిప్ హాప్ తమిజ అందించిన పాటలు తెలుగులో పెద్ద సెట్ కాలేదు. కానీ నేపధ్య సంగీతం మాత్రం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఎడిటర్ శ్రీకాంత్ ఇంకాస్త కేర్ తీసుకొని మొదటి అర్థభాగంలో కొన్ని సీన్స్ ని కత్తిరించి ఉండాలి. ఇక గుడ్ ఫ్రెండ్స్ డబ్బింగ్ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘చంద్రకళ’ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ ‘కళావతి’ కూడా అదే ఫార్మాట్ లో రూపొంది, ప్రేక్షకులను థియేటర్స్ లో నవ్వించి, భయపెట్టి.. బాగుందే సినిమా అనుకునే ఫీల్ తో బయటకి పంపుతుంది. హర్రర్ కామెడీ జానర్లో ఇప్పుడొస్తున్న చాలా సినిమాల కోవలేనే ఇదీ ఉన్నప్పటికీ సినిమాలో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే అంశాలు ఉండడం వలన సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. సినిమా కథ రెగ్యులర్ అవ్వడం వలెనే డైరెక్టర్ సుందర్ సి తెలివిగా స్టార్ కాస్టింగ్ మరియు హిట్ సినిమాకి సీక్వెల్ అని చెప్పి చాలా సేఫ్ గేమ్ ఆడి సక్సెస్ అయ్యాడు. కళావతి సినిమాలోని హర్రర్ ఎలిమెంట్స్ మరియు సెకండాఫ్ లోని చివరి ౪౦ నిమిషాలు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే.. అదే రొటీన్ హర్రర్ కామెడీ కథ, కథనాలకి వీక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోడవ్వడం సినిమాకి మైనస్. ఓవరాల్ గా ఈ వారం టైం పాస్ కోసం ఓ సారి చూసి ఎంజాయ్ చేయదగిన హర్రర్ కామెడీనే ‘కళావతి’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :

More