Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : కీచక – మెప్పించలేకపోయిన యదార్థ సంఘటన

Keechaka-review

విడుదల తేదీ : 30 అక్టోబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : ఎన్.వి.బి.చౌదరి

నిర్మాత : కిషోర్ పర్వత రెడ్డి

సంగీతం : జోశ్యభట్ల

నటీనటులు : యామినీ భాస్కర్, జ్వాలా కోటి, రఘుబాబు, వినోద్..


ఒక బస్తీలో అతి కిరారకంగా 300 మంది మహిళలపై అత్యాచారం చేసిన ఓ మానవ మృగం జీవితంలోని యదార్థ సంఘటనల ద్వారా తెరకెక్కించిన సినిమా ‘కీచక’. చెడ్డవారి జీవితం నుంచే మనం తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయనే పాయింట్ ని హైలైట్ చేస్తూ చేసిన ఈ రియలిస్టిక్ సినిమాకి ఎన్.వి.బి.చౌదరి డైరెక్టర్. కిషోర్ పర్వత రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో యామినీ భాస్కర్, జ్వాలా కోటి, రఘుబాబు, నాయుడు, వినోద్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరి యదార్థ సంఘటన ఆధారంగా వచ్చిన ఈ ‘కీచక’ పర్వం ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

అది మే 2001., గాంధీ నగర్ బస్తీ వాసులు కోటి(జ్వాలా కోటి) అనే మానవ మృగం చేతుల్లో అష్టకష్టాలు అనుభవిస్తున్న సమయం. కోటి ఓ కామ పిశాచి, చిన్నా పెద్దా తేడా ఉండదు.. కనపడిన ప్రతి మహిళని అతి దారుణంగా రేప్ చేస్తుంటాడు. ఎవడన్నా ఎదురు తిరిగితే వారిని అతి కిరాతకంగా చంపేస్తుంటాడు. కోటికి రాజకీయంగా సపోర్ట్ ఉండడంతో 20 ఏళ్ళ నుంచి ఎవరూ ఏమీ చేయలేక కోటి చేతుల్లో బలైపోతుంటారు. కట్ చేస్తే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన సుజాత(యామిని భాస్కర్) తన వేషం మార్చుకొని అదే ఏరియాకి వస్తుంది.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన సుజాత వేషం మార్చుకొని ఆ ఏరియాకి రావడానికి ప్రధాన కారణం కోటిని ఎలాగైనా చంపాలి. అసలు ఎక్కడో హైటెక్ సిటీలో జాబ్ చేసుకునే సుజాతకి గాంధీ నగర్ బస్తీ కోటికి ఉన్న సంబంధం ఏమిటి.? అసలెందుకు సుజాత కోటిని చంపాలనుకుంది.? 20 ఏళ్ళుగా సాగుతున్న కోటి అరాచాకాల్ని ఆపడానికి సుజాత ఏం చేసింది.? ఈ పోరాటంలో సుజాత ఏం కోల్పోయింది.? ఫైనల్ గా కోటిపై సుజాత గెలిచిందా లేదా.? అన్నదే మీరు వెండితెరపై చూడాల్సిన మిగిలిన ‘కీచక’ పర్వం..

ప్లస్ పాయింట్స్ :

కీచక అనే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ గా నిలిచేది ఇద్దరే.. వారే హీరోయిన్ యామిని భాస్కర్ అండ్ విలన్ జ్వాలా కోటి. ముందుగా యామిని భాస్కర్ విషయానికి వస్తే.. తన గతంలో జరిగిన ఓ సంఘటన వలన సఫర్ అవుతూ, శత్రువుని చంపటం కోసం ఎంతటి బాధనైనా భరించే అమ్మాయిగా చాలా మంచి నటనని కనబరిచింది. అమాయకత్వం, అందం, కోపం ఇలా కలగలిపిన అన్ని హావ భావాలను యామిని చాలా బాగా పలికించింది. ముఖ్యంగా ఇంటర్వల్ సీన్ లో తన పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. వీటితో పాటు ఈ సినిమాలో కథానుసారంగా యామిని చేసిన అందాల ఆరబోత కూడా సినిమాకి మరో ప్లస్. ఇకపోతే విలన్ గా నటించిన జ్వాలా కోటి నిజంగానే కోటి అనేవాడు ఇలానే ఉండేవాడేమో అన్న ఫీలింగ్ ని మనకు కలిగించాడు. నెగటివ్ షేడ్స్ మరియు ఫేస్ లో క్రూరత్వాన్ని చాలా బాగా చూపించాడు. పాత్రల పరంగా వీరిద్దరి పెర్ఫార్మన్స్ లో మాత్రం ఎలాంటి మిస్టేక్ లేదు. యామినికి డబ్బింగ్ చెప్పిన సాహితి వాయిస్ చాలా బాగా సెట్ అయ్యింది. అలాగే కోటి పాత్రకి చెప్పిన రమేష్ వాయిస్ కూడా పాత్రకి తగ్గట్టు రౌద్రంగా ఉంది.

ఇకపోతే రఘుబాబు మీద వచ్చే రెండు మూడు సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే సినిమా స్టార్టింగ్ మరియు ఇంటర్వల్ బ్లాక్స్ కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఇక వీటితో పాటు బి, సి సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకునే మాస్ మరియు అత్యాచారాల ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. అలాగే సినిమాకి మెయిన్ స్టొరీ లైన్ మరియు యామిని విలన్ కోటిని ఎందుకు చంపాలి అనుకుంటుంది అనే రియలిస్టిక్ పాయింట్ (యదార్థ సంఘటన) కూడా బాగుంది..

మైనస్ పాయింట్స్ :

మామూలుగా మనం ‘ఆపరేషన్ సక్సెస్ కానీ ఫేషంట్ డైడ్’ అనే సామెతను పలు చోట్ల వింటూ ఉంటాం. ఈ సామెత ఈ సినిమాకి చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకు అంటే సినిమా కోసం ఎంచుకున్న రియల్ లైఫ్ స్టొరీ లైన్ మరియు నటీనటుల పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. కానీ ఆ పాయింట్ ని సినిమాగా తీసేటప్పటికి చాలా మిస్టేక్స్ చేసేసాడు. ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్.. ఇదొక యదార్థ సంఘటనని బేస్ చేసుకొని చేసిన సినిమా.. అలాంటప్పుడు దర్శకుడు కోటీ వల్ల బస్తీ వాసులు పడుతున్న బాధని ఆడియన్స్ ఫీలయ్యేలా కంటెంట్ ని కనెక్ట్ చెయ్యాలి, కానీ డైరెక్టర్ చౌదరి ఎక్కడా సినిమాని ఆడియన్స్ కి కనెక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. డైరెక్టర్ సీన్ ని రియల్ గా ఉండేలా తీస్తున్నామా లేదా అన్నది ఆలోచించాడే తప్ప ఆ సీన్ లోని ఎమోషన్ లేదా పెయిన్ ని ఆడియన్స్ ఫీలయ్యేలా చేయలేకపోయాడు. అలాగే సినిమా మొదట్లోనే యామిని ఎందుకు బస్తీకి వస్తోందని చెప్పేయడం మరియు యామిని గతాన్ని కూడా మొదటి 30 నిమిషాల్లోనే రివీల్ చేసెయ్యడం వలన ఇక సినిమాలో ఆడియన్స్ తెలుసుకోవాల్సింది ఉండదు. దాంతో సినిమా అక్కడ నుంచి బాగా బోరింగ్ గా సాగుతుంది.

చౌదరి కథ కోసం ఎంచుకున్న స్టొరీ లైన్ బాగుంది, కానీ దానిని పూర్తి కథగా రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. 111నిమిషాల కథలో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే రెండు మూడు బ్లాక్స్ కూడా లేకపోవడం మైనస్. అలాగే కథకి రాసుకున్న కథనంలో ఆడియన్స్ థ్రిల్ ఫీలయ్యేలా చేసే పాయింట్ ఒక్కటి కూడా లేదు. అలాగే సినిమా నేరేషన్ సినిమా మొదటి నుంచి చివరి దాకా చాలా స్లోగా సాగుతుంది. పైన చెప్పినట్టు మొదటి 30 నిమిషాలలోనే మేజర్ ట్విస్ట్ ని రివీల్ చేసెయ్యడం వలన నెక్స్ట్ 30 నిమిషాల్లో సినిమాని ఫినిష్ చెయ్యాలి కానీ సాగదీసి అక్కడి నుంచి 80నిమిషాల పాటు పొడిగించారు. దాంతో సెకండాఫ్ అంతా ఆడియన్స్ తలపట్టుకునేలా చేస్తుంది. సినిమానే బాలేదు బాబోయ్ అంటున్న టైంలో కమర్షియాలిటీ కోసం పెట్టిన ఐటమ్ సాంగ్ ని భరించలేము. సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ పాత్రని స్ట్రాంగ్ గా చూపించి, సెకండాఫ్ లో ఆ పాత్రని ఓ గెస్ట్ రోల్ కింద మార్చేయడం బాలేదు. అలాగే సినిమా మొదట్లో చాలా రేప్ సీన్స్ ని కంటిన్యూగా రీల్ నెగటివ్ ఫార్మాట్ లో చూపడం చూసే వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో సినిమాకి మెయిన్ ప్లస్ జోశ్యభట్ల మ్యూజిక్ అని చెప్పాలి.. సినిమా చాలా వరకూ బోరింగ్ గా సాగుతున్నా ఆయన మాత్రం తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా సినిమాలో ఏదో జరుగుతోంది, ఏమో జరగబోతోంది అనే ఫీలింగ్ ని కలగచేయడానికి ట్రై చేసాడు. ఇక కమలాకర్ సినిమాటోగ్రఫీ డీసెంట్ గా అనిపిస్తోంది. రాంబాబు ఎడిటింగ్ బాలేదు.. మరీ స్లోగా ఉండేలా ఎడిట్ చేసారు. యదార్థ సంఘటనకి మ్యాచ్ అయ్యేలా చేసిన మురళి ఆర్ట్ వర్క్ బాగుంది. రాంప్రసాద్ యాదవ్ డైలాగ్స్ కొన్ని చాలా బాగుంటే, మిగతావి మాత్రం ఓకే అనేలా ఉన్నాయి.

ఇక కీచక అనే సినిమాకి కెప్టెన్ గా నిలిచిన ఎం.వి.బి చౌదరి ఈ సినిమాకి ఇచ్చిన బెస్ట్ పాయింట్స్ రెండే.. అవే ఒరిజినల్ స్టొరీ లైన్, లీడ్ యాక్టర్స్ ఎంపిక మరియు వారి నటన. ఇకపోతే ఈ సినిమాకి ఆయన రాసుకున్న పూర్తి కథ, కథనం, నేరేషన్ మరియు డైరెక్టర్ గా స్టొరీ లైన్ లో ఉన్న పెయిన్ ని అస్సలు కనెక్ట్ చేయకపోవడం బిగ్గెస్ట్ మైనస్. నిర్మాత కిషోర్ పర్వతరెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఒక బస్తీలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని చేసిన కీచక సినిమా ఆడియన్స్ కి ఆ రియలిస్టిక్ ఫీల్ ని ఇవ్వలేకపోయింది. చూడటానికి విజువల్స్ పరంగా రియలిస్టిక్ అనిపించినా, కంటెంట్ అండ్ ఎమోషనల్ పరంగా మాత్రం ఇంతటి గోరం నిజంగా జరిగిందా అనే ఫీలింగ్ ని ఆడియన్స్ కి కలిగించలేకపోయింది. యామిని భాస్కర్, జ్వాల కోటిల పెర్ఫార్మన్స్ సినిమాకి ప్లస్ అయితే ఒరిజినల్ స్టొరీలోని ఫీల్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోవడం, అలాగే సినిమాని స్లోగా చెబుతూ సినిమాని సాగదీయడం బిగ్గెస్ట్ మైనస్. రిలీజ్ కి ముందే ఫుటేజ్ లీక్ అయ్యి, చర్చల్లో నిలిచిన పలు వివాదాస్పద వీడియోలతో ఈ సినిమాకి వచ్చిన ప్రీ ప్రమోషన్స్ ద్వారా ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చినా., ఒక సినిమాగా ప్రేక్షకులకు సంతృప్తిని ఇవ్వలేని యదార్థ సంఘటనే ఈ ‘కీచక’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

123తెలుగు టీం


సంబంధిత సమాచారం :