సమీక్ష : కిట్టు ఉన్నాడు జాగ్రత్త – ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ

Kittu Unnadu Jagratha movie review

విడుదల తేదీ : మార్చి 03, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం :వంశీ కృష్ణ

నిర్మాతలు :అనిల్ సుంకర

సంగీతం :అనూప్ రూబెన్స్

నటీనటులు :రాజ్‌త‌రుణ్‌, అను ఇమ్మాన్యుయ‌ల్‌

గతేడాది ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ ఏడాది ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ అనే భిన్నమైన సినిమాతో ప్రేక్షకులముందుకొచ్చాడు. దర్శకుడు వంశీ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం…

కథ :

కార్ కేర్ నడుపుకునే కుర్రాడు కిట్టు (రాజ్ తరుణ్) జానకి (అను ఇమ్మాన్యుయేల్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇంతలోనే అతని ప్రేమకు అనుకోని కష్టం ఎదురై డబ్బు కోసం కుక్కల్ని కిడ్నాప్ చేసే పని మొదలుపెడతాడు. అలా కిట్టు కుక్కల్ని కిడ్నాప్ చేస్తున్న విషయం జానకికి తెలిసి ఆమె అతనికి దూరమైపోతుంది. అంతలోనే జానకిని సిటీలోనే పెద్ద క్రిమినల్(అర్బాజ్ ఖాన్) కిడ్నాప్ చేస్తాడు.

ఆ విషయం తెలుసుకున్న కిట్టు జానకిని కాపాడే ప్రయత్నం మొదలుపెడతాడు. మరోవైపు పోలీసులు కూడా కిట్టుని పట్టుకోవాలని ట్రై చేస్తుంటారు. గ్యారేజ్ నడుపుకునే కిట్టు ఎందుకు కుక్కల్ని కిడ్నాప్ చేయాలనుకుంటాడు ? అసలు జానకి ఎవరు ? ఆమెని విలన్ ఎందుకు కిడ్నాప్ చేస్తాడు ? పోలీసులు కిట్టు వెంట ఎందుకు పడుతుంటారు ? ఇన్ని చిక్కుల మధ్య కిట్టు తన ప్రేమను ఎలా గెలిపించుకుంటాడు ? అనేదే తెరపై నడిచే కథ…

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో ప్రధాన ప్లస్ పాయింట్స్ లో ముఖ్యమైనది సెకండాఫ్ ఆఖరి 35 నిముషాల్లో పృథ్వి పండించే కామెడీ. రోటీన్ స్పూఫ్ కామెడీ కాకుండా రేచీకటి ఉన్న రౌడీగా పృథ్వి చేసిన పెర్ఫార్మెన్స్ కడుపు చెక్కలయ్యేలా నవ్వించింది. ఈ మధ్య కాలంలో పృథ్వి నుండి వచ్చిన బెస్ట్ కామెడీ కంటెంట్ ఇదే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సెకండాఫ్ లో పృథ్వి నటన, అతని పాత్రకు ఇంకొన్ని రౌడీ పాత్రలకు మధ్య నడిచే సన్నివేశాలు, సంభాషణలు చాలా బాగున్నాయి. హీరో కుక్కల్నికిడ్నాప్ చేయడం అనే అంశం వినడానికి సిల్లీగానే ఉన్నా స్క్రీన్ మీద మాత్రం చాలా కన్విన్సింగా ఉంది. కుక్కల్ని కిడ్నాప్ చేసే సన్నివేశాలు కూడా కాస్త ఫన్నీగా బాగున్నాయి.

దర్శకుడు వంశీ కృష్ణ ఫస్టాఫ్ మొత్తాన్ని పర్వాలేదనిపించేలా నడిపినా ఇంటర్వెల్ సస్పెన్స్ ను మాత్రం చాలా ఆసక్తికరంగా, ఊహించని విధంగా ప్లాన్ చేసి మంచి సప్రైజ్ ఇచ్చాడు. దాంతో సెకండాఫ్లో ఏం జరుగుతుందో అనే ఆసక్తి రేకెత్తిచడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అలాగే హీరో – హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ అక్కడక్కడా కాస్త రొటీన్ గా అనిపించినా అను ఇమ్మాన్యుయేల్ స్క్రీన్ ప్రెజెన్స్ వలన చాలా చోట్ల ఇంప్రెస్ చేసింది.

ఇక సెకండాఫ్లో పాటల మీద పెద్దగా ఫోకస్ చేయకుండా ఫన్నీ కథనాన్ని నడపడం ద్వారా ఎక్కడా పెద్దగా నిరుత్సాహం అనిపించకుండా ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా అలా అలా సాగిపోతూ క్లైమాక్స్ లో ఒక్కసారిగా పృథ్వి కామెడీ ఎలివేట్ అవడంతో మంచి ఫన్ దొరికింది. హీరో స్నేహితులుగా ప్రవీణ్, సుధర్శన్ ల పెర్ఫార్మెన్స్, విలన్ అర్బాజ్ ఖాన్ నైపథ్యం, అతని నటన, రాజ్ తరుణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో నిరుత్సాహపరిచే అంశాల్లో ఫస్టాఫ్ కథనం ఒకటి. ఫస్టాఫ్లో అక్కడక్కడా వచ్చే కొన్ని ఫన్నీ సీన్స్ బాగున్నాయనిపించేలోపు ప్రభాకర్ రౌడీ బ్యాచ్ మీద నడిచే కొన్ని రొటీన్ సీన్లు బోర్ తెప్పించాయి. అంతేగాక కథనం ఇంటర్వెల్ ముందు వరకు కాస్త సాదా సీదాగానే నడవడంతో సంథింగ్ మిస్సింగ్ అనే భావన కలిగింది. అలాగే ఫస్టాఫ్ నుండి సినిమా ఎండింగ్ వరకు మధ్యలో తగిలే రఘు బాబు, వెన్నెల కిషోర్ల ట్రాక్ ఆశించిన స్థాయిలో కామెడీని పండించకపోవడమే గాక కథానానికి కూడా అడ్డు తగులుతున్నట్లు అనిపించింది.

సెకండాఫ్లో నడిచే ఫన్నీ స్క్రీన్ ప్లే బాగున్నా అది కాస్త ఎక్కువవడంతో కథ ఓ కొలిక్కి వచ్చి మెయిన్ ట్రాక్లో ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూడాల్సి వచ్చింది. క్లైమాక్స్ లో విలన్ పాత్రకు ఎండింగ్ ఇంకాస్త వెరైటీగా, బలంగా ఇచ్చి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

శ్రీకాంత్ విస్సా అందించిన స్టోరీలైన్ కాస్త రొటీన్ గానే ఉన్నా దానికి దర్శకుడు వంశీ కృష్ణ కుక్కల కిడ్నాప్ అనే నైపథ్యాన్ని, పృథ్వి కామెడీని, మంచి కథనాన్ని జోడించి సినిమాను ప్రేక్షకులకు కావాల్సిన విధంగా బాగానే తయారు చేశాడు. సినిమాకు ముఖ్యమైన ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లను చాలా బాగా రూపొందించాడు.

అనూప్ రూబెన్స్ సంగీతం పర్వాలేదు. బి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ను అందంగా కనిపించేలా చేసింది. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ బాగుంది. అనిల్ సుంకర నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి.

తీర్పు :

హీరో రాజ్ తరుణ్ భిన్నమైన కాన్సెప్ట్ తో చేసిన ఈ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రం అతనికి మరో విజయాన్ని అందిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. పర్వాలేదనిపించే ఫస్టాఫ్, ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్యాంగ్, సరదాగా సాగే సెకండాఫ్ కథనం, పిచ్చిగా నవ్వించే పృద్వి కామెడీ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా లవ్ ట్రాక్, ప్రభాకర్ గ్యాంగ్, రఘుబాబు – వెన్నెల కిషోర్ల ట్రాక్ లలో వచ్చే రొటీన్ సన్నివేశాలు, విలన్ పాత్రకు బలమైన ఎండింగ్ లేకపోవడం ఇందులో మైనస్ పాయింట్స్. మొత్తం మీద కొన్ని రొటీన్ సన్నివేశాలను పక్కనబెట్టి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ను కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పక నచ్చుతుంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Reiew

సంబంధిత సమాచారం :