సమీక్ష : లజ్జ – ‘అసలు కథ’ దారితప్పింది!

సమీక్ష : లజ్జ – ‘అసలు కథ’ దారితప్పింది!

Published on Feb 6, 2016 9:50 AM IST
lajja review

విడుదల తేదీ : 05 ఫిబ్రవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : నరసింహ నంది

నిర్మాత : బూచేపల్లి తిరుపతి రెడ్డి

సంగీతం : సుక్కు

నటీనటులు : మధుమిత, వరుణ్..

‘1940లో ఒక గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’ లాంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు, జాతీయ, ప్రాంతీయ అవార్డులు అందుకున్న దర్శకుడు నరసింహ నంది తాజాగా ‘లజ్జ’ అనే మరో సంచలన కథాంశంతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వరుణ్, మధుమిత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

సుశీల (మధుమిత) ఒక సాధారణ గృహిణి. అన్నీ తన మాట ప్రకారమే జరగాలనుకునే భర్తతో నిరంతరం బాధపడుతూ కాలాన్ని గడిపే ఆమె జీవితంలోకి సలీం (వరుణ్) అనే వ్యక్తి రావడంతో సినిమా అసలు కథ మొదలవుతుంది. పరిచయమైన కొన్నాళ్ళకే సలీంతో ప్రేమలో పడిపోయిన సుశీల, ఆ తర్వాత అతడితో వెళ్ళిపోయి కొత్త జీవితం మొదలుపెడుతుంది. ప్రేమ కోసం సలీంను నమ్ముకొని వెళ్ళిన సుశీల జీవితం తర్వాత ఏమైంది? వాళ్ళిద్దరి జీవితాలు ఏయే మలుపులు తిరిగాయన్నది ‘లజ్జ’ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే స్త్రీ వాదాన్ని, స్త్రీ ప్రేమను బలంగా చెప్పిన వారిలో ఒకరుగా పేరు తెచ్చుకున్న రచయిత చలం రాసిన క్లాసిక్ నవల ‘మైదానం’ కథనే బేసిక్ స్టోరీగా చెప్పాలని చేసిన ప్రయత్నం గురించి చెప్పుకోవచ్చు.ఈ ప్రయత్నంలో కొన్నిచోట్ల బాగానే సక్సెస్ సాధించారు. స్త్రీ తత్వాన్ని, ఆలోచనా విధానాన్ని కొన్నిచోట్ల బాగానే ప్రతిబింబించారు. ఎక్కడా కమర్షియాలిటికీ తావివ్వకుండా పూర్తిగా న్యాచురాలిటికి దగ్గరగా చెప్పిన విధానం చాలా బాగుంది.

సుశీలగా నటించిన మధుమిత తన నటనతో కట్టిపడేసింది. వరుణ్ ఆమెకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఎక్కువగా వీరిద్దరి చుట్టూనే తిరిగే కథ కావడం, ఇద్దరూ బాగా నటించడం సినిమాకు మంచి ప్లస్‌గా చెప్పుకోవచ్చు. సినిమా పరంగా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం సుశీల పాత్ర ఆలోచనా విధానాన్ని పరిచయం చేస్తూ బాగుంది. సెకండాఫ్‌లో కూడా ప్రీ క్లైమాక్స్ ముందు వరకూ సినిమా ఫర్వాలేదు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే క్లైమాక్స్ దగ్గర తేలిపోవడం గురించి చెప్పుకోవాలి. అంతవరకూ సినిమాను బాగానే లాక్కొచ్చి, చివర్లో సినిమాను ఎటో తీసుకెళ్ళి ‘లజ్జ’ను ఒక అర్థం పర్థం లేని సినిమాగా మార్చేశారు. చలం ‘మైదానం’ కథకు హైలైట్ అయిన క్లైమాక్స్‌ని సినిమాలో పూర్తిగా మార్చేసి సినిమాకు ఉండాల్సిన అర్థాన్నే మార్చేశారు. దీన్ని ఆ కథకు చేసిన అవమానంగానే చెప్పుకోవచ్చు. చివర్లో సినిమా స్త్రీ వాదాన్ని చెప్పకపోగా, ఫక్తు ఫార్ములా కథలా మారిపోయింది. దీంతో సినిమాలోని ఏ పాత్రకు ఓ అర్థం లేకుండా పోయింది.

ఇక మొదట్నుంచీ, చివరివరకూ సినిమా చాలా నెమ్మదిగా, నెమ్మదైన డైలాగులతో నడుస్తుంది. కమర్షియల్ అంశాలను బలంగా కోరుకునే వారికి ఈ సినిమాలో నచ్చే అంశాల్లేవ్. పోస్టర్స్, ట్రైలర్స్‌ను కేవలం కమర్షియాలిటీ కోసం వాడటం, అలాంటి సన్నివేశాలనే కోరి వచ్చినవారికి నచ్చకపోవచ్చు. ఇక సినిమాను ప్రస్తుత కాలంలో నడుపుతూ, చాలాచోట్ల 1950ల వాతావరణాన్ని ఎందుకు సౄష్టించారో అర్థం కాదు.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు నరసింహ నంది గురించి చెప్పుకుంటే, ఇలాంటి ఒక కథను సినిమాగా చెప్పాలన్న దర్శకుడి ఆలోచనను అభినందించాల్సిందే. అయితే ఒక క్లాసిక్ స్టోరీని సినిమాగా చెప్తున్నప్పుడు అసలు కథను పక్కదోవ పట్టించకూడదన్న విషయాన్ని విస్మరించి సినిమాకు ఒక అర్థం లేకుండా చేశారు. ఉన్నంతలో దర్శకుడి ప్రయత్నాన్ని మాత్రం ఓకే అనొచ్చు. దర్శకుడిగా నరసింహ చాలాచోట్ల మెరిశాడు. ఎక్కడా అసభ్యత వైపుకు సినిమాను నడిపించకుండా అతడు చేసిన కృషి బాగుంది.

ఇక సినిమాటోగ్రాఫర్ పనితనం చాలా బాగుంది. అయితే ప్రస్తుత కాలంలో నడుపుతున్న సినిమాకు చాలాచోట్ల పాతకాలం మూడ్‌ను చూపించే విషయంలో దర్శకుడితో కలిసి మరింత క్లారిటీగా పనిచేస్తే బాగుండేది. ఎడిటింగ్ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదనేలా ఉన్నా, పాటలన్నీ వినడానికి, చూడడానికి బాగున్నాయి, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

తన ప్రతి సినిమాతో ఏదో ఒక సంచలమైన కథాంశాన్ని ఎంచుకునే దర్శకుడు నరసింహ నంది, ఈసారి ఏకంగా తెలుగులో క్లాసిక్ అనదగ్గ నవలగా పేరు తెచ్చుకున్న చలం రాసిన ‘మైదానం’ కథను ఎంచుకున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా, మైదానం అసలు కథలో బలమైన క్లైమాక్స్‌ను ఇక్కడ పూర్తిగా మార్చేసి చివరకు సినిమాను ఒక అర్థం లేని వ్యవహారంలా ముగించారు. ఏదో చెప్పాలని మొదలుపెట్టి, ఎక్కడో ముగించిన సినిమాగా లజ్జను చెప్పుకోవచ్చు. ఎక్కడా కమర్షియాలిటీకి పోకుండా సహజంగా ఒక సినిమాను చెప్పడం, క్లాసిక్ నవలను సినిమాగా చెప్పాలనుకోవడం, లీడ్ యాక్టర్స్ కట్టిపడేసే నటన లాంటివి ఈ సినిమాకు హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. ఇక అంతకుమించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అసలు కథను చెప్పకా, ప్రమోట్ చేసుకున్న అంశాన్నీ చూపక అర్థం లేని వ్యవహారంలా నిలిచిన సినిమా ‘లజ్జ’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు