సమీక్ష: లక్కున్నోడు – కొన్ని నవ్వుల్ని మాత్రమే పంచగలిగాడు

Lakkunnodu review

విడుదల తేదీ : జ‌న‌వ‌రి 26, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : రాజ్ కిర‌ణ్

నిర్మాతలు : ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ

సంగీతం : అచ్చు, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు

నటీనటులు : మంచు విష్ణు, హన్సిక

‘ఈడో రకం – ఆడో రకం’ లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత హీరో మంచు విష్ణు తన లక్కీ జోడీ హన్సికతో కలిసి చేసిన చిత్రం ‘లక్కున్నోడు’. ‘గీతాంజలి’ ఫేమ్ రాజ్ కిరణ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ వారంలో ఎలాంటి పోటీ లేకుండా సోలోగా విడుదలైంది. మరి ట్రైలర్లతో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

లక్కుతో పాటే బ్యాడ్ లక్ ని కూడా వెంటబెట్టుకుని తిరిగే లక్కీ (మంచు విష్ణు) ఎప్పటికప్పుడు తన తండ్రి దగ్గర బ్యాడ్ అవుతూ ఎప్పటికైనా నాన్న చేత లక్కీ అని పేరుపెట్టి పిలిపించుకోవాలనే కోరికతో ఉంటాడు. అలా ఉన్న అతను ఒకరోజు పాజిటివ్ పద్మావతి (హన్సిక)ని చూసి ప్రేమలో పడతాడు.

పద్మావతి కూడా అతన్ని ప్రేమిస్తుంది. అలా అతని లైఫ్ నడుస్తుండగా అనుకోకుండా అతని దగ్గరికి రూ. 25 కోట్లు వచ్చి చేరతాయి. ఆ డబ్బు ఎవరిది ? ఆ డబ్బుని లక్కీ ఏం చేశాడు ? ఆ 25 కోట్లు లక్కీ లైఫ్ ని ఎలాంటి మలుపు తిప్పింది ? లక్కీ వాళ్ళ నాన్న ప్రేమను పొందగలిగాడా లేదా ? అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెపుకోవలసింది ఫస్టాఫ్ గురించి. సినిమా మొదలుపెట్టడమే కాస్త డిఫరెంట్ గా, ఆసక్తికరంగా స్టార్ట్ చేశాడు దర్శకుడు రాజ్ కిరణ్. పైగా ఫస్టాఫ్ లో వచ్చే ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ ల కామెడీ చాలా చోట్ల నవ్వించింది. ఇక ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీక్వెన్స్ రెండూ బాగున్నాయి. సూపర్ టైమింగ్ తో నడిచే ఆ రెండు సన్నివేశాలు కొత్తగా ఉండి కథను మలుపు తిప్పుతూ బాగా కనెక్టయ్యాయి.

అలాగే సెకండాఫ్ లో ఎంట్రీ ఇచ్చే పోసాని కృష్ణ మురళీ కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయింది. హీరో మంచు విష్ణు ట్రై చేసిన పాత్ర కాస్త కొత్తగానే అనిపించింది. ఇక హీరో ఫ్లాష్ బ్యాక్ లో తండ్రీ, కొడుకుల మధ్య దూరం ఎలా పెరిగిందో చూపడానికి రన్ చేసిన సన్నివేశాలు, ప్రస్తుతంలో హీరో అకారణంగా తండ్రి ముందు మరింత లోకువ అయ్యే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్ హన్సిక కనిపించిన ప్రతి ఫ్రేమ్ లో అందంగా ఉంటూ ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో పెద్ద మైనస్ పాయింట్ అంటే సెకండాఫ్ అనే చెప్పాలి. ఒక్క పోసాని కృష్ణ మురళీ కామెడీ మినహా రెండవ అర్థ భాగం ఎక్కడా ఆకట్టుకోలేదు. ఆద్యంతం రొటీన్ స్క్రీన్ ప్లేతో నడుస్తూ ప్రతి సీన్ ఊహాజనితంగా ఉంటూ బోర్ కొట్టించింది. విలన్ పాత్ర కూడా సినిమాకి మరో పెద్ద డ్రా బ్యాక్. ఆ పాత్రలో ఎక్కడా బలం కనిపించలేదు. దీంతో సినిమా సీరియస్ గా నడవాల్సిన చోట సైతం బలహీనపడిపోయి చాలా చోట్ల తేలిపోయింది.

ఫస్టాఫ్ లో హీరో హీరోయిన్ల మధ్య నడిచే లవ్ ట్రాక్ లో ఎక్కడా రొమాంటిక్ యాంగిల్ అనేదే కనిపించలేదు. చాలా సాదాసీదాగా ఉంటూ కాస్త విసిగించింది కూడా. కథ మధ్యలో వచ్చే పాటలు కూడా ఏమంత గొప్పగా లేక సినిమాకి పెద్దగా ఉపయోగపడలేకపోయాయి. కథలో హీరో చుట్టూ మంచి కుటుంబపరమైన ఎమోషన్ ను బిల్డప్ చేసి క్లైమాక్స్ లో ప్రేక్షకులకు కనెక్టయ్యే విధంగా రిజల్ట్ ఇవ్వడంలో దర్శక రచయితలు విఫలమయ్యారు. దీంతో ప్రేక్షకుల్లో అసంతృప్తి బలంగా మిగిలింది. సెకండాఫ్ లో కథ పూర్తిస్థాయిలో ఏదైనా ఒక అంశం మీద పోకుండా పలు విధాలుగా నడుస్తూ కన్ఫ్యూజ్ చేసింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు రాజ్ కిరణ్ ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితికి తగ్గట్టు కథను బాగానే ఆరంభించినా దాన్ని పూర్తి స్థాయిలో ప్రేక్షకుడికి కనెక్టయ్యే విధంగా చెప్పడంలో విఫలమయ్యాడు. ఇక రచయిత డైమండ్ రత్నబాబు మాటలు, ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే బాగున్నా సినిమాకు సెకండాఫ్ కు ఆయన అందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేకపోయింది. పి.జి.విందా సినిమాటోగ్రఫీ బాగుంది. అచ్చు, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజుల సంగీతం పర్వాలేదు. ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

మంచి విజయం తర్వాత లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ జానర్లో మంచు విష్ణు చేసిన ఈ ‘లక్కున్నోడు’ చిత్రంలో రొమాన్స్ లేదుగాని కామెడీ కంటెంట్ ఉంది. ఆసక్తికరమైన ఫస్టాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్, నవ్వించే సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, పోసాని కృష్ణ మురళిలు కామెడీ ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా ఏమాత్రం బలంలేని విలన్ పాత్ర, బోర్ అనిపించే సెకండాఫ్ కథనం, పాటలు, ఆఖరున ఫ్యామిలీ ఎమోషన్ ను సరిగ్గా ఎలివేట్ చేయకుండా అసంతృప్తిగా ముగించడం ఇందులో మైనస్ పాయింట్స్. మొత్తం మీద ఈ చిత్రం థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు కొన్ని నవ్వుల్ని మాత్రమే పంచగలదు.

Click here for English Review

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం :