సమీక్ష : ఎం.ఎస్.ధోని – ‘రియల్ హీరో’ జీవిత కథ!

M.S. Dhoni review

విడుదల తేదీ : సెప్టెంబర్ 30, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : నీరజ్ పాండే

నిర్మాత : అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్ స్టూడియోస్

సంగీతం : అమాల్ మాలిక్, రోచక్ కోహ్లి

నటీనటులు : సుశాంత్ సింగ్ రాజ్‍పుత్, దిశా పటాని

ఎం.ఎస్.ధోని.. భారతదేశంలో క్రికెట్ తెలిసిన ప్రతివ్యక్తికీ పరిచయం ఉన్న పేరు. భారత క్రికెట్‌కు తిరుగులేని విజయాలను అందించిన ధోని జీవిత కథతో బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే, ‘ఎం.ఎస్.ధోని – ది అన్‌టోల్డ్ స్టోరీ’ అనే సినిమాను తెరకెక్కించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోనీ పాత్రలో నటించిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ధోనీ కథ తెరపై ఎలా ఆవిష్కరించబడిందో చూద్దాం..

కథ :

ధోనీ విజయాలు, ఇండియన్ క్రికెట్‌కు ఆయన తీసుకొచ్చిన ఓ స్థాయి, 28 ఏళ్ళ తర్వాత ఇండియాకు క్రికెట్ వరల్డ్ కప్ సాధించడం.. ఇలా ధోనీ సాధించిన ఘనత అందరికీ తెలిసిందే! ‘ఎం.ఎస్.ధోనీ : ది అన్‌టోల్డ్ స్టోరీ’, ధోనీ జీవిత కథను ఎవ్వరూ చూడని కోణం నుంచి చెప్పే ప్రయత్నం చేసిన సినిమా. ఇండియన్ క్రికెట్‌లో చోటు కోసం ధోనీ ఎలా కష్టపడ్డాడు? ఆ తర్వాత కెప్టెన్‌గా ఎలా ఎదిగాడు? వరల్డ్ కప్ సాధించడంలో అతడి వ్యూహాలేంటి? లాంటి అంశాలను ఎమోషనల్‌గా, ఎక్కువగా ధోనీ వ్యక్తిగత జీవితాన్నే స్పృశిస్తూ చెప్పిన కథే క్లుప్తంగా ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఈ సినిమాకు నిస్సందేహంగా ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. ధోనీ హావభావాలను, నడక తీరును అన్నింటినీ సరిగ్గా పట్టుకొని నటించిన సుశాంత్‌ను తెరపై చూస్తున్నంతసేపూ ధోనీ కనిపిస్తున్నట్లే అనిపించింది. ముఖ్యంగా కొన్ని భావోద్వేగపూరిత సన్నివేశాల్లో సుశాంత్‌ను అలా చూస్తూండిపోవాలనేంత అద్భుతంగా ఆయన ధోనీ పాత్రలో జీవించాడు. ధోనీ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించిన దిశా పటాని బాగా చేసింది. అనుపమ్ ఖేర్, భూమిక అందరూ తమ పాత్రలతో, నటనతో సినిమాకు ఓ స్థాయి తీసుకొచ్చారు.

ఫస్టాఫ్ మొత్తం ఇండియన్ క్రికెట్‌కు సెలెక్ట్ అవ్వడంలో ధోనీ పడిన కష్టాలను ప్రస్తావిస్తూ, ఎమోషనల్‌గా నడుస్తూ కట్టిపడేసింది. సినిమాలో వచ్చే రెండు ప్రేమకథలు కూడా ఎంతో బాగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా 2011 వరల్డ్ కప్‌ను క్లైమాక్స్ సన్నివేశంగా పెట్టడంతో సినిమా అదిరిపోయే టైమింగ్‌తో ముగిసి మంచి ఫీల్ ఇచ్చింది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ అంటే ధోనీ వ్యక్తిగత జీవితాన్ని చూపించినంత బాగా కెరీర్ గురించి చెప్పకపోవడమే! ధోనీ కెప్టెన్‌గా ఎలా ఎదిగాడు? ఆ తర్వాత అతడిపై వచ్చిన వివాదాలను ఎలా ఎదుర్కొన్నాడు? లాంటివి కోరే ప్రేక్షకులకు ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు లేవడం నిరాశపరచే అంశమే! ఫస్టాఫ్‌లో చాలా డీటైలింగ్‌తో కథ చెప్పి సెకండాఫ్‌కి వచ్చేసరికి అంతా హడావుడిగా ముగించినట్లు అనిపించింది. అదేవిధంగా మూడు గంటల రన్‌టైమ్ కూడా కాస్త ఇబ్బంది పెట్టేదే!

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు నీరజ్ పాండే గురించి ప్రస్తావించుకుంటే, బాలీవుడ్‌లో తీసిన మూడు సినిమాలతోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థాయి తెచ్చుకున్న ఆయన, ఈ సినిమాతో మరోసారి తన స్థాయికి తగ్గ ప్రతిభ చూపారు. కోట్లాది క్రికెట్ అభిమానులను సంపాదించుకున్న ధోనీ నిజ జీవిత కథను ఎవ్వరికీ తెలియని కోణంలో చెప్పాలన్న ప్రయత్నంలో నీరజ్ పాండే తన స్క్రీన్‌ప్లేతో విజయం సాధించాడు. మేకింగ్ పరంగా నీరజ్ స్టైల్‌ను అడుగడుగునా చూడొచ్చు. ధోనీ కెరీర్ గురించి కాస్త తక్కువ ప్రస్తావించడం విషయంలో మాత్రం నీరజ్ తడబడ్డట్లనిపించింది. ఏదేమైనా ఒక ఇండియన్ హీరో కథను తెరపై ఆవిష్కరించడంలో మాత్రం మంచి మార్కులే కొట్టేశాడు.

ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కి ఎక్కడా వంక పెట్టడానికి లేదు. సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఒక ఫీల్ తీసుకొచ్చింది. ఎడిటింగ్ కూడా బాగుంది. టెక్నికల్‌గా చూస్తే ధోనీ చాలా రిచ్‌గా ఉందనే చెప్పాలి.

తీర్పు :

ఇండియాలో క్రికెట్ అనేది ఒక మతంలాంటిదని అంటూ ఉంటారు. అలాంటి క్రికెట్‌లో ఇండియాకు తిరుగులేని విజయాలను అందించిన ధోనీ కథను సినిమాగా ఆవిష్కరించాలన్న ప్రయత్నం వినడానికి ఎంత బాగుందో, ఆచరణలోకి పెట్టడం అంతే సాహసం. అలాంటి సాహసాన్ని దర్శకుడు నీరజ్ పాండే చేపట్టడమే కాక, తన శక్తిమేర ఆ సాహసాన్ని విజయ తీరానికి తీసుకొచ్చాడు. టైటిల్‌లోనే చెప్పేసినట్లు ధోనీ గురించి అందరికీ తెలిసిన కథ కాకుండా, ఎవ్వరూ చెప్పని కథనే సినిమాగా చెప్పే ప్రయత్నం ఈ సినిమాతో జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ధోనీ తన ఆటతో గ్రౌండ్‌లో ఎలా కట్టిపడేస్తాడో, ఆ స్థాయిలో కాకపోయినా అతడి కథ కూడా తెరపై కట్టిపడేసేదిగానే ఉంది.

123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :