సమీక్ష : మేడ మీద అబ్బాయి – ఎంటర్టైన్ చేయలేకపోయాడు !

Meda Meedha Abbayi movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 8, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : జి. ప్రజీత్

నిర్మాత : బొప్పన్న చంద్రశేఖర్

సంగీతం : షాన్ రహమాన్

నటీనటులు : అల్లరి నరేష్, నిఖిల విమల

హీరో అల్లరి నరేష్ కొంత కాలం గ్యాప్ తర్వాత తాన్ రెగ్యులర్ కామెడీ ఫార్మాట్ ను వదిలి చేసిన చిత్రం ‘మేడ మీద అబ్బాయి’. ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే మలయాళ చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన జి.ప్రజీత్ ఈ రీమేక్ ను కూడా తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

చదువంటే పెద్దగా ఇష్టంలేని ఇంజనీరింగ్ కుర్రాడు శ్రీను (అల్లరి నరేష్) ఫైనల్ ఇయర్ పూర్తయ్యేనాటికి 24 పేపర్లను బ్యాలెన్స్ పెట్టుకుని ఊళ్లోకి అడుగుపెడతాడు. ఇంట్లో వాళ్ళు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనే పోరు పడితేతట్టుకోలేక ఎన్నాళ్ల నుండో దర్శకుడవ్వాలనే తన కోరిక మేరకు ఇంట్లోంచి వెళ్ళిపోయి హైదరాబాద్ చేరుకొని సినిమా ప్రయత్నాలు మొదలుపెడతాడు.

అలా శ్రీను హైదరాబాద్ వెళ్లేప్పుడు ట్రైన్లో తాను ఇష్టపడిన, ఇంటి పక్కనే ఉండే అమ్మాయి సింధు (నిఖిల విమల) మూలాన అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి ? దాన్ని శీను ఎలా పరిష్కరించుకున్నాడు ? అసలు సింధు హైదరాబాద్ ఎందుకు వెళ్ళింది ? పరిష్కరించుకునే పనిలో అతను, సింధు, అతని స్నేహితులు కలిసి చేసిన ప్రయాణం ఎలా సాగింది ? అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. సినిమా ఆరంభం కొంచెం బోరింగానే ఉన్నా హీరో తన ఊళ్లోకి అడుగుపెట్టిన దగ్గర్నుంచి కథనం కొంచెం ఊపందుకుని కాస్త ఎంటర్టైన్మెంట్ అందిన ఫీలింగ్ కలిగింది. దాంతో పాటు హీరో ఫ్రెండ్స్ పై పండించిన కామెడీ కొన్ని చోట్ల నవ్వించింది. ‘జబర్దస్త్’ ఫేమ్ హైపర్ ఆది వేసిన పంచులు ఆరంభంలో బాగానే పేలాయి.

ముఖ్యంగా అల్లరి నరేష్ కు, హైపర్ ఆదికి నడుమ సాగే సన్నివేశాలు కొన్ని మంచి ఫన్ అందించాయి. ఎవరు ఏది చెప్పినా నమ్మే నరేష్ పాత్రకు, తన గొప్పతనం కోసం ఫ్రెండ్ ను ఇరికించే ఆది పాత్రకు బాగా సింక్ అయింది. ఇక హీరో హీరోయిన్ తో తీసుకున్న ఒక సెల్ఫీ మూలాన తీవ్రమైన ఇబ్బందుల్లో పడటమనే పాయింట్ బాగుంది. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వచ్చే ఈ చిన్నపాటి ట్విస్ట్ కొంత ఎగ్జైటింగా అనిపించింది. మొదటి పాట, రెండవ పాట అలరించగా రొటీన్ స్పూఫ్ కామెడీని పక్కనబెట్టిన అల్లరి నరేష్ తన నటనతో కొంతమేర ఆకట్టుకున్నాడు.

మైనస్ పాయింట్స్ :

సినిమా సెకండాఫ్ మరీ విసిగించేసింది. కేవలం సామాజిక మాధ్యమం ద్వారా ఒక అమ్మాయి ప్రేమలో పడి చిన్నపాటి మోసానికి గురవడం అనే సిల్లీ పాయింట్ ద్వారా సినిమాను నడిపిన తీరు పరమ బోరింగా సాగింది. కథ తీసుకునే మలుపులకు ఒక్క చోట కూడా సరైన, బలమైన కారణం కనిపించదు. ఇక హీరోయిన్ లవ్ ట్రాక్ అయితే సిల్లీగా అనిపించింది. ఒక చదువుకున్న అమ్మాయి కేవలం పేస్ బుక్ ద్వారా పరిచయమైన, కొన్నిసార్లు మాత్రమే ఫోన్లో మాట్లాడిన అబ్బాయి కోసం అమ్మానాన్నలను వదిలేసి ఇంట్లోంచి వెళ్లిపోవడం చూస్తే దర్శక రచయితలు ఇంకా పూర్వ కాలంలోనే ఉన్నారా అనిపిస్తుంది.

పైగా కథలో అసలు నిందితుడు ఎవరో చివరి వరకు చూపకుండా దాచిపెట్టడం, శ్రీనివాస్ అవసరాల పాత్రకు అవసరంలేని, కావాలనే ప్రేక్షకుల మైండ్ ను డైవర్ట్ చేయడానికి అన్నట్టు అనవసరమైన ట్విస్టులు, ఎలివేషన్లు ఇచ్చి ఎందుకిదంతా అనుకునేలా చేశారు. అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఏ కోశానా ప్రేమ అనే భావనే కనబడకపోవడం, హీరోయిన్ వ్యక్తిగత ప్రేమ కూడా బలహీనంగా ఉండటం ఎక్కడా రొమాంటిక్ ఫీల్ కలగలేదు. పోనీ సెకండాఫ్లో కామెడీ అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు. సినిమా ఆరంభం నుండి చివరి వరకు ఒకే తరహా పంచులు, ప్రాసలు ఉండటంతో ఆరంభంలో బాగానే ఉన్నా తర్వాత తర్వాత రొటీన్ అయిపొయింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు జి. ప్రజీత్ పనితనం సినిమాను నిలబెట్టే స్థాయిలో లేదు. సోషల్ మీడియా ద్వారా మోసం అనే చిన్న అంశాన్ని తీసుకున్న అతను సినిమాను మెప్పించే విధంగా తీయలేకపోయారు. ఫస్టాఫ్ పర్వాలేదనిపించినా సెకండాఫ్ మరీ మొత్తేసింది. కథ, కథనాల్లో ఎక్కడా కొత్తదనం, ఆకర్షణ కనబడలేదు. కుంజుని ఎస్. కుమార్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నందమయూరి హరి తన ఎడిటింగ్ ద్వారా సెకండాఫ్లో కొన్ని అనవసరమైన స్లో మోషన్ సన్నివేశాలని కత్తిరించి ఉండాల్సింది. షాన్ రహమాన్ సంగీతం పర్వాలేదు. బొప్పన్న చంద్రశేఖర్ నిర్మాణ విలువలు తక్కువ బడ్జెట్లో పర్వాలేదనిపించాయి.

తీర్పు :

అల్లరి నరేష్ ఈసారి ‘మేడ మీద అబ్బాయి’ అంటూ చేసిన ప్రయత్నం ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాలేదు. ఒక మలయాళ సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో ఫస్టాఫ్ కామెడీ , ఇంటర్వెల్ చిన్నపాటి ట్విస్ట్, నరేష్ నటన కొంత పర్వాలేదనిపించినా ఏమాత్రం వినోదం, పద్దతి లేని సెకండాఫ్ విసిగించింది. పైగా అనవసరమైన స్లో మోషన్ సన్నివేశాలు, సిల్లీగా అనిపించే డ్రామా చిరాకు పెట్టాయి . మొత్తం మీద ఈ ‘మేడ మీద అబ్బాయి’ పెద్దగా ఎంటర్టైన్ చేయకపోగా ప్రేక్షకులు కొంతమేర యాక్సెప్ట్ చేయగల అల్లరి నరేష్ మార్క్ వినోదాన్ని కూడా పూర్తిగా అందివ్వలేదు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :