సమీక్ష : “మీటర్” – బోర్ గా సాగే సిల్లీ యాక్షన్ డ్రామా!

సమీక్ష : “మీటర్” – బోర్ గా సాగే సిల్లీ యాక్షన్ డ్రామా!

Published on Apr 8, 2023 3:03 AM IST
Meter Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 07, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పవన్, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి తదితరులు

దర్శకుడు : రమేష్ కాడూరి

నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు

సంగీత దర్శకులు: సాయి కార్తీక్

సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్

ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ ఆర్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “మీటర్”. దర్శకుడు రమేష్ కాడూరి తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) తండ్రి ఒక సిన్సియర్ పోలీస్. అయితే, ఆ నిజాయితీ వల్ల తన తండ్రి పడిన కష్టాలను, అవమానాలను చిన్న తనం నుంచి చూసి.. పోలీస్ జాబ్ పైనే అసహ్యం పెంచుకుంటాడు. అలాంటి అర్జున్ కళ్యాణ్ తన తండ్రి కోరిక కోసం పోలీస్ గా మారాల్సి వస్తోంది. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ కళ్యాణ్ ఇష్టం లేని జాబ్ ను ఎలా చేశాడు ?, నిర్లక్ష్యంగా చేసిన తన జాబ్ కారణంగా జరిగిన సంఘటనలు ఏమిటి ?, ఈ మధ్యలో అతుల్య రవితో ఎలా ప్రేమలో పడ్డాడు?, అసలు మగాళ్లు అంటేనే విరుచుకు పడే ఆమెను ఎలా ప్రేమలో పడేశాడు?, చివరకు అర్జున్ కళ్యాణ్ జాబ్ ఉందా?, పోయిందా?, అలాగే అర్జున్ కళ్యాణ్ లో ఫైనల్ గా ఎలాంటి మార్పు వచ్చింది ?, మారాకా అతను ఏం చేశాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం సాగింది. ఇష్టం లేని జాబ్ చేస్తూ సరదగా తిరిగే ఓ కుర్రాడి జీవితంలో జరిగిన ఓ బాధాకరమైన సంఘటన ప్రభావంతో.. ఒక బలమైన ఆశయంగా మారి నిజమైన పవర్ ఫుల్ పోలీస్ గా మారితే ఎలా ఉంటుందనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో.. ఒకటి రెండు సీన్స్ పర్వాలేదు. పోలీస్ గా కిరణ్ అబ్బవరం సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి న్యాయం చేశాడు. కాకపోతే ఓవర్ యాక్షన్ మూమెంట్స్ ను తగ్గించుకుంటే బాగుండేది.

హీరోయిన్ పాత్రలో నటించిన అతుల్య రవి కూడా చాలా బాగా నటించింది. నటనతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. సప్తగిరి పాత్ర కేవలం సపోర్టింగ్ రోల్ కే పరిమితమైంది. కానీ ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు సప్తగిరి బాగా నటించాడు. విలన్ గా ప్రధాన పాత్రలో కనిపించిన నటుడు ధనుష్ పవన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. పోసాని కృష్ణ మురళిలతో పాటు ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు రమేష్ కాడూరి రాసుకున్న కథాకథనాలలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అయింది. దీనికి తోడు సినిమాలోని కీలక సన్నివేశాలన్నీ పూర్తి సిల్లీగా సినిమాటిక్ గా సాగాయి. ఏ సీన్ బలంగా ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించదు. ఇక ఫస్ట్ హాఫ్ లో ఒకటి రెండు సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. పైగా చాలా సన్నివేశాల్లో ఓవర్ బిల్డప్, కథకు అవసరం లేని యాక్షన్ సీన్స్ ఎక్కువైపోయాయి.

కిరణ్ అబ్బవరంకి యాక్షన్ పై ఉన్న మమకారం కారణంగా చాలా సీన్స్ లో బిల్డప్ షాట్స్ బలవంతంగా ఇరికించబడ్డాయి. దాంతో కథనంలో నాటకీయత ఎక్కువవడంతో సహజత్వం చాలా వరకు లోపించింది. దీనికితోడు ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకోవు. ముఖ్యంగా ప్లే వెరీ రొటీన్ గా సాగింది. పైగా అవసరానికి మించి యాక్షన్ సీన్స్ ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలు అయితే ముందే అర్థం అయిపోతుంటాయి.

పైగా కొన్ని యాక్షన్ సీన్స్ కోసమని కథకు అవసరం లేని సీన్స్ ను క్రియేట్ చేయడం సినిమాకి మరో మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద ఇంట్రస్ట్ కలిగించేలా ఎలివేట్ చేయలేకపోయారు. ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ముందు చెప్పుకున్నట్లుగానే దర్శకుడు రమేష్ కాడూరి ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. ఇక వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం బాగున్నా… పాటలు మాత్రం పూర్తిగా ఆకట్టుకోవు. కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

 

మీటర్ అంటూ యాక్ష‌న్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ పర్వాలేదు. అయితే, లాజిక్ లెస్ గా సాగే సిల్లీ సీన్స్ ఎక్కువుగా ఉండటం, , ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకోకపోవడం, అన్నిటికి మించి సినిమాలో రొటీన్ కంటెంట్ తో పాటు అనవసరమైన యాక్షన్ సీన్స్ చాలా బోర్ గా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు