సమీక్ష : మోసగాళ్ళకు మోసగాడు – సరదాగా సాగిపోయే క్రైమ్ కామెడీ.!

365 Days

విడుదల తేదీ : 22 మే 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : బోస్ నెల్లూరి

నిర్మాత : చక్రి చిగురుపాటి

సంగీతం : మణికాంత్ ఖాద్రి

నటీనటులు : సుధీర్ బాబు, నందిని..


సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన యంగ్ హీరో సుధీర్ బాబు చేసిన మొదటి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’. బోస్ నెల్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ‘స్వామి రారా’ నిర్మాత అయిన చక్రి చిగురుపాటి నిర్మించారు. స్వామి రారా కి సీక్వెల్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో కూడా హీరో సుధీర్ బాబు దొంగగా కనిపిస్తాడు. నందిని రాయ్ హీరోయిన్ గా పరిచయం కానుంది. కథా పరంగా సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అలనాటి కృష్ణ గారి సూపర్ హిట్ ఫిల్మ్ ‘మోసగాళ్ళకు మోసగాడు’ టైటిల్ ని ఈ సినిమాకి పెట్టారు. మరి ఈ సినిమా కూడా అలనాటి సినిమాలా సూపర్ హిట్ అయ్యిందా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

క్రిష్(సుధీర్ బాబు) చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ హ్యాపీ గా లైఫ్ ని గడిపే కుర్రాడు. ఇలా రోజులు గడిపేస్తున్న క్రిష్ ఓ రోజు జానకి(నందిని రాయ్)ని చూసి ప్రేమలో పడతాడు. అదలా సాగుతుంటే హైదరాబాద్ లోకల్ దాదా అయిన కౌశిక్(జయప్రకాశ్ రెడ్డి) గ్యాంగ్ లో క్రిష్ చేరతాడు. అప్పుడే కౌశిక్ క్రిష్ బ్యాచ్ కి ఒక విలువైన విగ్రహాల సెట్ ని కొట్టేయాలనే డీల్ ని అప్పగిస్తాడు. కానీ ఎప్పుడైతే క్రిష్ విగ్రహాలను కొట్టేసి ఎవ్వరికీ ఇవ్వకుండా తను ఎస్కేప్ అవ్వాలనుకుంటాడో అప్పుడే కథ అసలైన మలుపు తిరుగుతుంది. క్రిష్ చేసిన పనివల్ల కౌశిక్ కి పెద్దనష్టం రావడంతో తన బాస్ మరియు ఇంటర్నేషనల్ స్మగ్లర్ అయిన రుద్ర(అభిమన్యు సింగ్) రంగంలోకి దిగుతాడు. అక్కడి నుంచి ఏం జరిగింది.? డీల్ ప్రకారం విగ్రహాలను కౌశిక్ కి ఇవ్వకుండా క్రిష్ ఎందుకు కొట్టేసాడు.? ఆ విగ్రహాల వెనకున్న కథ ఏమిటి.? ఈ క్రైమ్ కథలో క్రిష్ – జానకిల లవ్ స్టొరీ ఏమైంది? అనే అంశాలను మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మెయిన్ హీరో అయిన సుధీర్ బాబు మునుపెన్నడూ కనపడనంత స్టైలిష్ గా ఈ సినిమా లో కనిపించాడు. ఇక నటుడిగా తన పెర్ఫార్మన్స్ లో చాలా పరిపక్వత కనిపించింది. సినిమా మొత్తాన్ని తనొక్కడే నడిపించి సక్సెస్ అయ్యాడు. ఇక హీరోయిన్ గా కనిపించిన తెలుగమ్మాయి నందిని రాయ్ క్యూట్ లుక్స్ తో డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవాల్సింది జయప్రకాశ్ రెడ్డి – దువ్వాసి మోహన్ – ఫిష్ వెంకట్ కామెడీ ట్రాక్. వీరి మధ్య వచ్చే కామెడీ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. మెయిన్ గా దువ్వాసి మోహన్ డైలాగ్స్ మరియు టైమింగ్ సూపర్బ్.

ఇక హడావిడి చేసే పాత్రల్లో కనిపించే సప్తగిరి ఈ సినిమాలో కూడా బాగానే నవ్వించాడు. సప్తగిరి ఇంట్రడక్షన్ చాలా బాగుంది. స్కూల్ టీచర్ పాత్రలో చంద్ర మోహన్ పర్ఫెక్ట్ గా సరిపోవడమే కాకుండా మంచి నటనని కనబరిచాడు. మెయిల్ విలన్ గా అభిమన్యు సింగ్ పెర్ఫార్మన్స్ డీసెంట్ గా ఉంది. సుధీర్ బాబు ఫ్రెండ్ పాత్రలో ప్రవీణ్ అక్కడక్కడా బాగానే నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వల్ ముందు నుంచి మొదలైన కథ సెకండాఫ్ లో ఆడియన్స్ కి ఆసక్తిని కలిగిస్తుంది. సెకండాఫ్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. అలాగే డైరెక్టర్ క్లైమాక్స్ ని డిజైన్ చేసుకున్న విధానం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

మోసగాళ్ళకు మోసగాడు సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఫస్ట్ హాఫ్. సినిమా స్టార్టింగ్ బాగానే మొదలైనప్పటికీ ఆ తర్వాత బాగా స్లో అయిపోతోంది. కథా పరంగా పెద్దగా ముందుకు వెళ్ళదు. చెప్పాలంటే సుధీర్ బాబు – నందిని రాయ్ లవ్ ట్రాక్ బాగా సాగదీసినట్టు ఉంటుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ కానీ ఇందులో థ్రిల్స్ తక్కువ కావడం వలన సినిమా చాలా వరకూ ఊహాజనితంగా తయారవుతోంది. అందుకే ఉన్న ట్విస్ట్ లని కూడా మనం చాలా వరకూ ఊహించేయవచ్చు.

ఈ సినిమాని స్వామి రారా సినిమాకి సీక్వెల్ గా ప్రమోట్ చేసారు. కానీ సినిమా పరంగా దానికి దీనికి పెద్దగా సంబందం ఉండకపోవడమే కాకుండా అందులో ఉన్న థ్రిల్స్ ఇందులో లేకపోవడం చెప్పదగిన
మైనస్ పాయింట్స్. హీరోయిన్ పాత్రకి సెకండాఫ్ లో అస్సలు ప్రాముఖ్యత ఉండదు. మొదటి నుంచి చంద్ర మోహన్ పాత్ర కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. దానిని క్లైమాక్స్ లో క్లియర్ చెయ్యడానికి ట్రై చేసారు. మరో మేజర్ డ్రా బ్యాక్ సినిమా వేగవంతంగా లేకపోవడం. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అంటే చాలా వేగంగా ఆసక్తికరంగా సాగుతాయి. అలాంటి అంశాలు ఈ సినిమాలో చాలా తక్కువగా ఉన్నాయి. ఇక లాజికల్ గా లూప్ హోల్స్ ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. ఈ సినిమాకోసం ఎంచుకున్న లొకేషన్స్, విజువల్స్ ఆడియన్స్ కొత్తగా ఫీలయ్యేలా చేసాయి. మణికాంత్ ఖాద్రి అందించిన మ్యూజిక్ పెద్దగా లేదు, కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ఎడిటింగ్ చెప్పుకునేంత లేదు. ఫస్ట్ హాఫ్ పరంగా కేర్ తీసుకోవాల్సింది. డైలాగ్స్ బాగున్నాయి. ఇక డైరెక్టర్ గా నెల్లూరు బోస్ మంచి కథనే ఎంచుకున్న స్క్రీన్ ప్లే విషయంలో కాస్త తడబడినట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ గా ఓకే అనిపించుకున్నాడు. ఫస్ట్ హాఫ్, నేరేషన్, థ్రిల్స్ పరంగా ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. చక్రి చిగురుపాటి ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

సమ్మర్ కానుకగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమా సుధీర్ బాబు కెరీర్లో డీసెంట్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సినన్ని థ్రిల్స్ లేకపోయినప్పటికీ కామెడీని మాత్రం బాగా పండించాడు. అదే ఈ సినిమాకి పెద్ద సేవింగ్ పాయింట్ అయ్యింది. స్లోగా సాగే ఫస్ట్ హాఫ్, బాగా ఊహాజనితంగా అనిపించే స్క్రిప్ట్ మేజర్ డ్రా బాక్స్ అయితే, ఆ తర్వాత వచ్చే కామెడీ, సెకండాఫ్ లో వ్వచ్చే ట్విస్ట్ లు మరియు ఎంటర్టైన్మెంట్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. ఓవరాల్ గా మొదటి 30 నిమిషాలు స్లో అయినా కూర్చుని, లాజిక్స్ ని లైట్ తీసుకుంటే ఈ సినిమాలోని ఎంటర్టైన్మెంట్ వలన మీరు ఓ సారి ఎంజాయ్ చెయ్యచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :