సమీక్ష : నా లవ్ స్టోరీ – స్లోగా.. రొటీన్ గా సాగింది

సమీక్ష : నా లవ్ స్టోరీ – స్లోగా.. రొటీన్ గా సాగింది

Published on Jun 29, 2018 3:55 PM IST
 Tik Tik Tik movie review

విడుదల తేదీ : జూన్ 29, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : మహీధర్, సోనాక్షి సింగ్

దర్శకత్వం : శివ గంగాధర్

నిర్మాత : జి. లక్ష్మి

సంగీతం : వేద నివాన్

సినిమాటోగ్రఫర్ : వై.ఇ. కిరణ్

ఎడిటర్ : నందమూరి హరి

స్క్రీన్ ప్లే : శివ గంగాధర్

మహీధర్, సోనాక్షి సింగ్ జంటగా నటించిన చిత్రం ‘నా లవ్ స్టోరీ’. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :

ప్రశాంత్(మహీధర్) బి.టెక్ చదివి ఏ పని చెయ్యకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ తాగుతూ తిరుగుతున్న ప్రశాంత్ లైఫ్ లో అనుకోకుండా జరిగిన కొన్ని కారణాల వల్ల నందినితో (సోనాక్షి సింగ్) ప్రేమలో పడతాడు. ఐతే అప్పటికే అఖిలేష్ (విలన్) నందిని వెంట పడుతూ ఏడిపిస్తుంటాడు. అది చూసిన ప్రశాంత్, నంది కోసం అఖిలేష్ తో గొడవ పడతాడు. ఇంప్రెస్ అయిన నందిని ప్రశాంత్ ని ప్రేమిస్తుంది. కానీ వారి మధ్య గిడవలు ఏర్పడి విడిపోతారు.

ప్రశాంత్ అసలు ప్రేమంటే ఏంటో అర్ధం తెలుసుకున్నాడా ? తిరిగి నందిని కలుసుకున్నాడా ? ప్రశాంత్ ని, అతని ప్రేమను నందిని యాక్సెప్ట్ చేసిందా ? నందిని మీద పగ, కోరిక పెంచుకున్న అఖిలేష్ నందినిని ఏం చేశాడు ? అఖిలేష్ నుండి నందినిని ఎలా కాపాడుకున్నాడు ? అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్:

హీరోగా నటించిన మహీధర్ లుక్స్ పరంగా చాలా బాగున్నాడు. ఎంతో అనుభవం ఉన్న నటుడిలా ఈజ్ తో చక్కగా సెటిల్డ్ గా నటించాడు. ఆసాంతం బోర్ కొట్టించే ఈ సినిమాలో తన టైమింగ్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా తన తండ్రితో (తోటపల్లి మధు) సాగే సన్నివేశాల్లో , హీరోయిన్ కోసం సన్నివేశంలో మహీధర్ నటన చాలా బాగుంది. ఇక పద్దతి సగటు అమ్మాయిలా సోనాక్షి సింగ్ హావభావాలను బాగా పలికించింది. క్లైమాక్స్ లో తన ప్రేమ కోసం తండ్రిని ఎదిరించి మాట్లాడే సన్నివేశంలో తన నటనతో ఆకట్టుకుంటుంది.

హీరో తండ్రిగా నటించిన తోటపల్లి మధు, హీరోయిన్ ఫాదర్ గా చేసిన శ్రీ మన్నారాయణ తమ తికమక వ్యవహారంతో నవ్వించడంతో పాటు, బాధ్యత గల తండ్రులుగా కథలో కాస్త సీరియస్ నెస్ తో పాటుగా కాస్త సెంటిమెంట్ ను కూడా పండించారు. మేనేజర్ గా నటించిన చమ్మక్ చంద్ర తన కామెడీ శైలీతో అక్కడక్కడ నవ్వులు పూయించారు. మిగిలిన నటీనటులు కూడా ఉన్నంతలో బాగానే చేశారు.

మైనస్ పాయింట్స్:

యూత్ కనెక్ట్ అయ్యే అంశాలు పెడుతున్నామనుకొని దర్శకుడు శివ గంగాధర్ అక్కడక్కడా పేలని జోకులు పెట్టి చికాకు పుట్టించారు. ప్రతి సీన్ కథలో మిళితమయ్యే ఉంటుందిగాని కథను మాత్రం పరుగులు పెట్టించదు. కథనం బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. హాస్యంతో అక్కడక్కడ నవ్వించారు గాని అది సహజంగా ఉండదు.

ప్రేమించేది ఎంజాయ్ చెయ్యటానికే అని నమ్మే హీరో, ప్రేమంటే మనసుకు సంబధించింది అని నమ్మే హీరోయిన్.. ఈ కాన్ ఫ్లిట్ ఈ ఆసక్తికరమైన ఎలిమెంట్ చాలు సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రస్ట్ పుట్టించడానికి, కానీ దర్శకుడు ఈ పాయింట్ వదిలేసి అనవసరమైన కామెడీ ట్రాక్ లతో సినిమాని నింపేశాడు. దీనికి తోడు బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి సినిమా మీద ఇంట్రస్ట్ కలగకుండా చేశారు.

ముఖ్యంగా హీరోహీరోయిన్ల నటన బాగున్నా వాళ్ళ పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు సినిమాని బలహీనపరిచింది. హీరోకి కూడా ఒక ఆలోచన గాని ఒక క్లారిటీ గాని ఉండదు. ఫస్ట్ అంతా ఫ్రెండ్స్ చెప్పినట్టు చేసుకుంటూ పోతాడు, ఆ తర్వాత హీరోయిన్ చెప్పింది చేస్తాడు. దాంతో హీరో పాత్ర ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ కాకపోగా చికాకు కలిగిస్తుంది. ఈ చిత్రంలో తెర మీద పాత్రల్ని నిలబెట్టి అసలు సంఘటనంటూ సన్నివేశమంటూ ఏది లేకుండా.. ఏదోకటి మాట్లాడమని ఆర్టిస్ట్ లకు పేజీలకు పేజీలు డైలాగులిచ్చి ప్రేక్షకుల మీదకు వదిలిపెట్టినట్లు అనిపిస్తుంది. పైగా ప్రతి సన్నివేశం రొటీన్ వ్యవహారాలతోనే చాలా ఊహాజనితంగా సాగుతుంటుంది.

సాంకేతిక విభాగం:

ఈ సినిమాలో సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సినిమాటోగ్రఫి చేసిన వై.ఇ. కిరణ్ కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించి ప్రేక్షకులకు కొంత ఊరట కలిగించాడు. వేద నివాన్ తన నేపధ్య సంగీతంతో సినిమాని కొంత నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయన అందిచిన పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటర్ నందమూరి హరి తన కత్తెరకి ఇంకొంచెం పనిచెప్పి ఉంటే బాగుండేది.

డైలాగ్ రైటర్ మల్కారి శ్రీనివాస్ ఓవర్ గా డైలాగ్స్ రాసినప్పటికీ అక్కడక్కడ కొన్ని పంచ్ లు పేలాయి. కూతుర్ల విషయంలో ఒక తండ్రి పడే బాధను కొన్ని డైలాగులు ద్వారా అర్ధవంతంగా చెప్పించారు. దర్శకుడు శివ గంగాధర్ తనే స్వయంగ రాసుకున్న ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే ఇంకా పగడ్బందీగా రాసుకోని ఉంటే బాగుండేది.

తీర్పు:

ప్రేమ కథలని డీల్ చేసేప్పుడు కథ, కథనం, పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేసి ఒక ఫీల్ గుడ్ మూవీని చూసిన భావన కలిగించాలి. కానీ ఈ సినిమా వ్యవహారం అలా లేదు. ఇందులో హీరో హీరోయిన్ల నటన, కొన్ని కామెడీ సన్నివేశాలు బాగుండగా బలహీనమైన కథనం, అవసరం లేని సన్నివేశాలు సినిమాను నిధానమైన, బోర్ కొట్టించే రీతిలో తయారుచేశాయి. మొత్తం మీద పండని భావోద్వేగాలని రంగరించినప్పటికీ ఈ ప్రేమకథ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయిందనే చెప్పాలి.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు