సమీక్ష : నీ జతలేక – ప్రేమ లేదు.. రొమాన్స్ లేదు

Nee Jathaleka review

విడుదల తేదీ : అక్టోబర్ 1, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : లారెన్స్ దాసరి

నిర్మాత : జి.వి. చౌదరి

సంగీతం : స్వరాజ్ జెడిదయ్య

నటీనటులు : నాగ శౌర్య, పరుల్ గులాఠి

వరుస విజయాలతో పరిశ్రమలోని నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిన నటుడు నాగ శౌర్య. ‘చందమామ కథలు,ఊహలు గుసగుసలాడే’ వంటి చిత్రాల కన్నా ముందు ఆయన హీరోగా నటించిన సినిమా ఒకటుంది. అదే ‘నీ జతలేక’ అనే చిత్రం. పూర్తై ఇన్నేళ్లయినా ఏవో కారణాల వల్ల విడుదలకాని ఈ చిత్రం ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి నాగ శౌర్య మొదటి చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

అఖిల్ (నాగ శౌర్య) అనే కుర్రాడికి బాగా డబ్బున్న గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు స్వప్న (సరయు). ఎప్పుడు గొడవపడే వీరిద్దరూ ఒకరోజు పెద్ద గొడవ జరిగి విడిపోతారు. దీంతో అఖిల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అఖిల్ పరిస్థితి చూసిన అతని ఫ్రెండ్ అతనికి ‘నీ లవర్ ని ఈర్ష్యగా ఫీలయ్యేలా చేస్తే ఆమె నిన్ను వెతుక్కుంటూ వస్తుంది’ అని ఓ సలహా ఇస్తాడు.

ఫ్రెండ్ ఇచ్చిన సలహాను అడ్వాంటేజ్ గా తీసుకున్న అఖిల్ సలహా ఇచ్చిన ఫ్రెండ్ లవర్ (పరుల్) ని హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ అనుకోకుండా అఖిల్, పరుల్ ఇద్దరూ ప్రేమలో పడతారు. అలా ప్రేమలో పడ్డ వారిద్దరూ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ? వాళ్ళ లవర్స్ ని ఎలా మేనేజ్ చేశారు ? చివరికి తమ ప్రేమను గెలుచుకున్నారా లేదా ? అన్నదే ఈ చిత్రం…

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది హీరోయిన్ పరుల్ గురించి. పరుల్ తన పాత్రలో అందంగా కనిపిస్తూ చాలా బాగా నటించింది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఆమె పెర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే సంగీతం కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. పాటలు చిన్నవే అయినా కూడా వాటిలోని సంగీతం బాగా ఆకట్టుకుంది.

అలాగే సెకండాఫ్ చివరి అరగంటపాటు సాగే ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి . నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేలా ఉండి ఆకట్టుకున్నాయి. ప్రధాన పాత్రల మధ్య వచ్చే ఏమోషనల్ లవ్ బ్రేకప్ కు సంబందించిన సన్నివేశాల్ని చాలా బాగా చూపించారు.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ విషయంలో ముందుగా చెప్పాల్సింది డైరెక్షన్ గురించి. డైరెక్షన్ సరిగా లేకపోవడం వలన నాగ శౌర్య వంటి మంచి నటుడు కూడా సినిమాని కాపాడలేకపోయాడు. ముఖ్యంగా సినిమా మొత్తం హీరో నిరాశక్తి కొట్టొచ్చినట్టు కనబడింది. దీంతో సినిమా రొటీన్ బోరింగ్ సినిమాగా మిగిలింది.

సినిమా కథ కూడా చాలా పాతదిగా ఉండటంతో తరువాతి సీన్ ను సులభంగా ఊహించేయొచ్చు. అలాగే సినిమాలో ప్రేమకు సంబందించిన డైలాగులు కూడా తలనొప్పి తెప్పించేవిగా ఉన్నాయి. చాలా సన్నివేశాల్లో ప్రధాన పాత్రల ప్రవర్తన చూస్తే అసలు వారి పాత్రల ముఖ్య ఉద్దేశ్యమేమిటో అర్థం కాదు. కొన్ని సన్నివేశాల్లో ప్రేమికులుగా ఉండి మరికొన్ని సన్నివేశాల్లో స్నేహితులనడం చూస్తే దర్శకత్వ లోపం ఎంతలా ఉందో తెలిసిపోతుంది.

సాంకేతిక విభాగం :

ముందుగా చెప్పినట్టు సినిమా నిర్మాణ విలువలు, సంగీతం చాలా బాగున్నాయి. ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ పరవాలేదనిపించే స్థాయిలోనే ఉన్నాయి. సినిమా కథనం బాగలేకపోవడం వలన సాధారణ ప్రేమ కథ సంతృపికరమైన స్థాయికి చేరుకోలేదు. డబ్బింగ్ కూడా సరిగా లేదు. ఇక దర్శకుడు లారెన్స్ దాసరి విషయానికొస్తే దర్శకుడిగా అతని పనితనం బాగోలేదు. మామూలు ప్రేమ కథని సూటిగా సుత్తిలేకుండా చెప్పాల్సింది పోయి మధ్యలో అనవసరమైన సన్నివేశాలను, అంశాలను కలిపి బోరింగ్ సినిమా తీశారు.

తీర్పు :

మొత్తం మీద ‘నీ జతలేక’ అనే ఈ చిత్రం నాగ శౌర్య తన జ్ఞాపకాల్లోంచి వీలైనంత త్వరగా తొలగించవలసిన చిత్రం. పాత కథ, బోరింగ్ కథనం, మెప్పించలేని నటన అన్నీ కలిసి సినిమాని పూర్తిగా చెడగొట్టాయి. ఒకవేళ నాగ శౌర్యకి పెద్ద అభిమాని అయినప్పటికీ ఈ సినిమాని దూరం పెట్టడం మంచిది.

Click here for English Review

123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం :