Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : అజ్ఞాతవాసి – అంచనాలను అందుకోలేకపోయాడు

Agnyaathavaasi movie review

విడుదల తేదీ : జనవరి 10, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్

దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్

నిర్మాత : ఎస్. రాధాకృష్ణ

సంగీతం : అనిరుద్ రవిచందర్

సినిమాటోగ్రఫర్ : వి. మణికందన్

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, యావత్ తెలుగు సినీ లోకం ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ ల హిట్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇన్ని భారీ అంచనాలు నడుమ ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ:

ఏబి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని అయిన విందా (బోమన్ ఇరానీ), అతని కొడుకును చైర్మన్ పదవి కోసం కొందరు హత్య చేస్తారు. దాంతో విందా భార్య ఇంద్రాణి (ఖుష్బు) అజ్ఞాతంలో ఉన్న తమ పెద్ద కుమారుడు అభిషిక్త్ భార్గవ్ (పవన్ కళ్యాణ్) ను కంపెనీని కాపాడమని, తండ్రిని చంపిన వాళ్ళను కనిపెట్టమని వెనక్కి పిలుస్తుంది.

అలా తండ్రి, తమ్ముడి మరణానికి కారణమైన వారిపై పగ తీర్చుకునేందుకు బయటికొచ్చిన అభిషిక్త్ భార్గవ్ నేరస్తుల్ని ఎలా కనిపెడతాడు, వారి మీద పగ ఎలా తీర్చుకుంటాడు, అసలు అభిషిక్త్ భార్గవ్ అజ్ఞాతంలో ఎందుకు ఉండవలసి వస్తుంది అనే అంశాల సమాహారమే ఈ చిత్రం.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్. ఆయన కనిపించే సన్నివేశాలు చాలా వరకు అభిమానుల్ని అలరిస్తాయి. ఫుల్ ఎనర్జీతో, తన ట్రేడ్ మార్క్ మ్యానరిజంతో పవర్ స్టార్ సినిమాను నెట్టుకురావడానికి చాలానే ప్రయత్నించాడు. ఇక హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్, పవన్ కళ్యాణ్ ల మధ్య నడిచే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. సినిమా ఆరంభం నార్మల్ గానే ఉన్న ఇంటర్వెల్ సమయంలో రివీల్ అయ్యే ట్విస్ట్ కొద్దిగా ఎగ్జైట్మెంట్ కలిగిస్తుంది.

ఆరంభం నుండి చివరి వరకు హీరోతో పాటే ఉండే శర్మ (మురళీ శర్మ), వర్మ (రావు రమేష్) లా పాత్రల పై నడిచే కామెడీ చాలా చోట్ల సఫలమై బోర్ కొట్టించే కథనం నుండి కొంతలో కొంత రిలీఫ్ కలిగించింది. ముఖ్యంగా రావు రమేష్ పాత్ర యొక్క డైలాగులు త్రివిక్రమ్ స్టైల్లో ఉండి అలరించాయి. అలాగే సెకండాఫ్లో వచ్చే కొడకా కోటేశ్వర్ రావ్ పాటలో మాత్రమే పవన్ కొద్దిగా మాస్ స్టెప్పులు వేయడంతో హుషారు కలిగింది. ఇక మధ్య మధ్యలో వచ్చే పాటలు, ఫైట్స్ పర్వాలేదనిపించాయి.

ఇక కుష్బు, పవన్ ల మధ్య ఉండే తల్లి, కొడుకుల రిలేషన్ ను ఎలివేట్ చేసే సన్నివేశాలు, వాటిలో ఇద్దరి నటన మెప్పించాయి. చిత్ర నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొత్తంలో త్రివిక్రమ్ మార్క్ అనేదే కనబడకపోవడం పెద్ద బలహీనత. చూస్తున్నంతసేపు అసలిది త్రివిక్రమ్ సినిమానేనా అనిపిస్తుంది. ఎంత పాత కథనైనా ఆసక్తికరమైన కథనం, బలమైన పాత్రలు, పదునైన మాటలతో రక్తికట్టించి ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా తయారుచేయగల త్రివిక్రమ్ ఈ సినిమాలో పూర్తిగా అలసత్వాన్ని ప్రదర్శించారు. ముఖ్యమైన హీరో పాత్ర దగ్గర్నుంచి కీలకమనిపించే అన్ని పాత్రల్ని ఊహించలేనంత తక్కువ స్థాయిలో రాసి ఎక్కువ భాగం సినిమాను బోర్ కొట్టించేశాడు. ఈ బలహీనత ముందు పవన్ ఛరీష్మా కూడా సినిమాను కాపాడలేకపోయింది.

ఇక తన ప్రతి కథలో కూడా హీరోయిన్లకు ఏదో ఒక ప్రత్యేకతను ఆపాదించి ఆసక్తికరంగా చూపించే త్రివిక్రమ్ ఇందులో మటుకు కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ ఇద్దరికీ కథలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా కథనంలో, కామెడీలో బలవంతంగా ఇరికిస్తూ చిరాకు తెప్పించారు. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్ వంటి స్టార్ కమెడియన్లు ఉన్నా కూడా వారిని సరిగా వాడకపోవడంతో ఎంటర్టైన్మెంట్ పెద్దగా పండలేదు.

ఇక కథకు కీలకమైన ప్రతినాయకుడి పాత్ర కూడా బలహీనంగా ఉండటంతో కథనంలో బలం లోపించడమేగాక పవన్ పాత్ర అనవసరమైన హాస్యానికి తప్ప అసలు సరైన లక్ష్యమనేదే లేక తేలిపోయింది. దీంతో అభిమానులు సైతం చాలా చోట్ల నీరసానికి, అసహనానికి లోనవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. వీటన్నింటికీ తోడు హీరో విలన్ ను కనిపెట్టే ప్రయత్నాల్లో ఎక్కడా ఎగ్జైట్మెంట్, సీరియస్నెస్ లేకపోవడంతో సినిమా మొత్తం చప్పగా తయారైంది.

సాంకేతిక విభాగం :

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా, దర్శకుడిగా తన వంతు భాద్యతను సక్రమంగా నిర్వహించలేదు. ఒక్క ముక్కలో చెప్పదగిన స్టోరీ లైన్ ను తీసుకుని సరైన కథనం, పాత్రలు, సన్నివేశాలు రాసుకోకుండా అలసత్వం ప్రదర్శించి ఏదో కొన్ని చోట్ల మినహా అభిమానులు కూడా పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయదగిన విధంగా లేకుండా సినిమాను తయారుచేశారు. కనీసం మాటల్లో కూడా తన మ్యాజిక్ ను చూపలేకపోయారు.

ఇక అనిరుద్ రవిచందర్ సంగీతం క్లాస్ గానే ఉన్నా ఊపు తెప్పించే విధంగా లేకపోవడంతో సినిమాకది పెద్దగా ఉపయోగపడలేకపోయింది. వి. మణికంధన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ క్వాలిటీగా కనిపించింది. కోటగిరి వెంకటేశ్వరరావ్ గారి ఎడిటింగ్ పర్వాలేదు. ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ బాగానే ఉన్నాయి. నిర్మాత ఎస్.రాధా క్రిష్ణగారు నిర్మాతగా ఒక సినిమాకు ఎంత చేయాలో అంతా చేసి సాంకేతికంగా మంచి నాణ్యత గల సినిమాను అందించారు.

తీర్పు :

ఈ ‘అజ్ఞాతవాసి’ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోవడవంలో చాలా వరకు విఫలమైంది. త్రివిక్రమ్ కథా కథనాల రచనలో, టేకింగ్లో, పాత్ర చిత్రీకరణలో, కనీసం మాటల్లో కూడా తన సహజమైన మార్కును చూపించలేదు. దీంతో సినిమా స్థాయి చాలా వరకు పడిపోయింది. అక్కడక్కడా పవన్ పెర్ఫార్మెన్స్, కొంత కామెడీ, కొంతమేర పర్వాలేదనిపించిన పాటలు, ఫైట్స్, చిన్నపాటి ఇంటర్వెల్ ఎలిమెంట్, తల్లి, కొడుకుల సెంటిమెంట్ మినహా ఈ సినిమాలో ఎంజాయ్ చేయడానికి, ఎగ్జైట్ ఫీలవ్వడానికి ఏమీ దొరకదు. మొత్తం మీద చెప్పాలంటే పవన్, త్రివిక్రమ్ ల హార్డ్ కోర్ అభిమానులకు ఈ చిత్రం పర్వాలేదనిపింవచ్చు కానీ మిగతా వాళ్లను పెద్దగా మెప్పించదు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review


సంబంధిత సమాచారం :