సమీక్ష : పిశాచి – నో హారర్, ఓన్లీ థ్రిల్లింగ్ మూమెంట్స్

Pisachi

విడుదల తేదీ : 27 ఫిబ్రవరి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : మిస్కిన్

నిర్మాత : సి.కళ్యాణ్ – కోనేరు కల్పన

సంగీతం : అర్రోల్ కరేల్లి

నటీనటులు : నాగ, ప్రయాగ, రాధారవి….

తమిళంలో వైవిధ్యభరిత సినిమాల దర్శకుడు బాల నిర్మించిన సినిమాను తెలుగులో ‘పిశాచి’గా సి.కళ్యాణ్ – కోనేరు కల్పనలు సంయుక్తంగా అనువదించారు. మిస్కిన్ దర్శకుడు. ఈ సినిమా నేడు విడుదలయింది. గత ఏడాది ‘చంద్రకళ’ అంటూ తెలుగు ప్రేక్షకులకు చక్కటి హారర్ సినిమాను అందించారు నిర్మాత సి.కళ్యాణ్. మరి ఈ ‘పిశాచి’ ఎలా ఉంది..? భయపెట్టిందా..? లేదా..? ఈ సమీక్ష చదివి తెలుసుకోండి.

కథ :
సిద్దార్ధ్ (నాగ) ఒక వయోలిన్ ప్లేయర్ గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేస్తూ సిటీలోని తన ఫ్లాట్లో ఒక్కడే ఉంటాడు. ఒకరోజు రోడ్ మీద యాక్సిడెంట్ కి గురయిన భవాని(ప్రయాగ) అనే అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. అయితే, ఆ అమ్మాయి సిద్దార్థ్ చేతిలోనే చనిపోతుంది. ఈ ఘటన వలన సిద్దార్ధ్ చాలా డిస్టర్బ్ అవుతాడు. అనూహ్యంగా భవాని దెయ్యమై సిద్దార్ధ్ ఫ్లాట్ కి వస్తుంది. ఆ దెయ్యం తనను వేధిస్తుందని సిద్దార్ధ్ బాధపడతాడు. ఆ దెయ్యాన్ని తన ఇంటి నుండి బయటకు పంపించాలని తీవ్రంగా ప్రయత్నిస్తాడు.

సహాయం చేయడానికి ప్రయత్నించిన సిద్దార్ధ్ ఇంటిలో దెయ్యం ఎందుకు తిష్ట వేసింది..? నిజంగా సిద్దార్ధ్ ను దెయ్యం వేదిస్తుందా..? లేక అతనికి మేలు చేస్తుందా..? దెయ్యాన్ని ఇంటి నుండి పంపించే ప్రయత్నంలో సిద్దార్ధ్ ఏం తెలుసుకున్నాడు..? అనే మిగిలిన కథని మీరు చూసి థ్రిల్ అయ్యి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

‘పిశాచి’ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు కాస్తయినా పరిచయం ఉన్న నటులు గానీ, గ్లామరస్ హీరోయిన్లు, మంచి పాటలు, కళ్ళు చెదిరే లొకేషన్లు… వగైరా… వగైరా.. ఏమి లేవు. కానీ… స్టార్టింగ్ నుండి ఎండ్ కార్డు పడేవరకు థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేసే కథ, కథనం ఉన్నాయి. అక్కడక్కడా సన్నివేశాలలో మంచి వినోదం కూడా ఉంది. అవే సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్.

సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దర్శకుడు రాసుకున్న కథను తెరపై ఆవిష్కరించడంలో 100% సహాయపడ్డాయి. సన్నివేశానికి తగ్గట్టు తన లైటింగ్, షాట్ డివిజన్ తో సినిమాటోగ్రాఫర్ రవీ రాయ్ ఇంప్రెస్ చేశాడు. ప్రతి సన్నివేశంలో ఆ ఫీలింగ్ ను ఎలివేట్ చేశాడు. కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా థియేటర్లో జనాలను భయపెడుతుంది, నెక్స్ట్ ఎం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి, ఆత్రుత ప్రేక్షకులలో కలిగిస్తుంది. సంగీత దర్శకుడు అర్రోల్ కరేల్లి ఈ టెక్నిక్ ను బాగా ఉపయోగించాడు. థ్రిల్లింగ్ మూమెంట్స్ కు మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

కథకు అనుగుణంగా హీరో హెయిర్ స్టైల్, వేషధారణ కొంచం చిత్రంగా ఉంటాయి. అతను బాగా నటించాడు. బాడీ లాంగ్వేజ్ బాగుంది. హీరోయిన్ ప్రయోగ పాత్ర కేవలం రెండు సన్నివేశాలకే పరిమితం అయ్యింది. అయినా, ఆమె నటన బాగుంది. రాధారవి మరియు హీరో తల్లిగా, స్నేహితులుగా నటించిన ఇతర ఆర్టిస్టులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

మైనస్ పాయింట్స్ :

‘పిశాచి’ పేరులో, పోస్టర్ డిజైన్ లో ఉన్నంత భయం సినిమాలో లేదు. దానికి కారణం ఇప్పటి వరకూ చూపించిన అన్ని దెయ్యాల సినిమా కన్నా ఈ కాన్సెప్ట్ ని డిఫరెంట్ గా డీల్ చెయ్యడం. దెయ్యం కనిపించే సన్నివేశాలు ఎఫెక్టివ్ గా లేవు. ప్రీ – క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలలో భయపెట్టడానికి చాలా అవకాశం ఉంది. కానీ, దర్శకుడు కేవలం థ్రిల్లింగ్ మూమెంట్స్ తో సరిపెట్టాడు. దెయ్యంతో తండ్రి మాట్లాడే సన్నివేశాలలో హారర్ లేదా సెంటిమెంట్ ఏది వర్కౌట్ కాలేదు. రెగ్యులర్ గోస్ట్ సినిమాల్లానే ఈ సినిమాలో కూడా హర్రర్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయని, ఎంజాయ్ చేయవచ్చు అని థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకులు సినిమాను చూసి కాస్త నిరాశ పడతారు.

సాధారణంగా హారర్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు చూస్తుంటారు. 1990లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘ఘోస్ట్’కు ఫ్రీమేక్ ఈ ‘పిశాచి’. ఘోస్ట్ చూసిన వారిని సైతం ఈ సినిమా నిరాశపరుస్తుంది.

సాంకేతిక విభాగం :

కథను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు మిస్కిన్ 100% సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులు చివరి వరకు సినిమాతో ప్రయాణమవుతారు. కానీ, దర్శకుడు భయపెట్టడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. సినిమాకు ది బెస్ట్ టెక్నికల్ టీం కుదిరింది. ముందుగా చెప్పినట్టు సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. గోపీనాథ్ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. ఒక్క సన్నివేశంలో కూడా నిడివి పెరగలేదు. బాల నిర్మాణ విలువలు, ఆర్ట్ వర్క్ బాగున్నాయి.

తీర్పు :

రెగ్యులర్ హారర్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన సినిమా ‘పిశాచి’. రెగ్యులర్ హర్రర్ సినిమాల్లా ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టలేదు, కానీ సూపర్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆకట్టుకునే కథ, కథనం ఉన్నాయి. వైవిధ్యమైన కథ ఇది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎండ్ కార్డు వరకు సినిమాతో ట్రావెల్ అయ్యేలా చేస్తాయి. థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. మిస్కిన్, బాల వంటి పేర్లు చూసి ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వెళ్తే ఎంజాయ్ చేయవచ్చు.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

 
Like us on Facebook