సమీక్ష : ప్రేమ లీల పెళ్లి గోల – గోల గోలగా ఉంది !

సమీక్ష : ప్రేమ లీల పెళ్లి గోల – గోల గోలగా ఉంది !

Published on Jul 4, 2017 10:49 PM IST
Prema Leela Pelli Gola movie review

విడుదల తేదీ : జూలై 1, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : ఎస్. ఎజ్హిల్

నిర్మాత : పరస్ జైన్

సంగీతం : సి. సత్య

నటీనటులు : విష్ణు విశాల్, నిక్కీ గల్రాని

గతేడాది తమిళంలో విడుదలైన ‘వేలైను వందుత్త వెళ్ళెకారన్’ ను ఇప్పుడు తెలుగులో ‘ప్రేమ లీల పెళ్లి గోల’ పేరుతో రిలీజ్ చేశారు. విష్ణు విశాల్, నిక్కీ గల్రానిలు జంటగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం…

కథ :

లోకల్ ఎమ్మెల్యే జాకెట్ జానకికి రైట్ హ్యాండ్ గా ఉండే మురళి (విష్ణు విశాల్) తప్పనిసరి పరిస్థితుల్లో అదే ఊరిలో ఉండే తన ఫ్రెండ్ కరక్కాయ్ (సూరి)కి రికార్డ్ డాన్సర్ పుష్పను ఇచ్చి పెళ్లి చేస్తాడు. అలా మురళీ చేతిలో మోసపోయిన సూరి ఎలాగైనా పుష్పను వదిలించుకోవాలని రక రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు.

ఇంతలో మురళి కూడా అర్చన (నిక్కీ గల్రాని) ని ప్రేమిస్తాడు. అంతలోనే ఎమ్మెల్యే జానకి ప్రమాదంలో పడతాడు. అలా తన స్నేహితుడి సమస్యను తీర్చడానికి, తన ప్రేమను గెలిపించుకోవడానికి, తన అన్న జానకిని శత్రువుల నుండి కాపాడుకోవడానికి మురళీ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? చివరికి తన ప్రేమను గెలుచుకొని అందరి సమస్యలను తీర్చగలిగాడా లేదా ? అనేదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో చెప్పుకోదగిన ఆహ్లాదకరమైన అంశాల్లో కామెడీ ప్రధానమైనది. హీరో ఫ్రెండ్ గా సూరి చేసిన కామెడీ, ఎమ్మెల్యే జాకెట్ జానకిగా రోబో శంకర్ పంచిన ఎంటర్టైన్మెంట్ బాగా పండింది. ముఖ్యంగా రికార్డ్ డ్యాన్సర్ పుష్పని పెళ్లి చేసుకుని సూరి ఎదుర్కునే అవమానాలు, ఆమె నుండి విడాకులు తీసుకోవడానికి అతను చేసే ప్రయత్నాలు, అవి బెడిసికొట్టి అతను పడే ఇబ్బందులు వంటివి సినిమా ఆద్యంతం వస్తూ చాలా చోట్ల నవ్వించాయి.

ఇక సెకండాఫ్లో గతం మర్చిపోయిన ఎమ్మెల్యేగా రోబో శంకర్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అతన్ని కొందరు కిడ్నాప్ చేసి వాళ్లకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి నానా కష్టాలు పడటం, రోబో శంకర్ చెప్పిందే చెప్పి వాళ్ళను ముప్పుతిప్పలు పెట్టే కామెడీ ట్రాక్ ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో ఒక్క కామెడీ మినహా మిగతా అంశాలేవీ కనీసం తట్టుకునే విధంగా కూడా లేవు. ముఖ్యంగా సినిమాలోని కథకు ఒక పద్దతి, ఒక గమ్యం అంటూ ఏమీ ఉండవు. ఆరంభం నుండే కథ మొత్తం చీలికలు పేలికలుగా అయిపోయి సినిమా ఎటుపోతుందో, అసలు దేన్ని కథనుకోవాలో, ఏ పాత్ర వైపు నుండి సినిమా చూడాలో సినిమా మొత్తం పూర్తయ్యాక కూడా అర్థం కాదు. కాసేపు కరక్కాయ్ పాత్ర చుట్టూ కథను తిప్పి, ఇంకాసేపు హీరోయిన్ మీదికి వెళ్లి, ఆ తరవాత ఎమ్మెల్యే దగ్గర వాలి చివరికి ఎటూ కాకుండా పోయింది.

ఫస్టాఫ్ అంతా సూరి, పుష్పల పెళ్లి ట్రాక్, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ మీద దృష్టి పెట్టిన దర్శకుడు సెకండాఫ్ కు వచ్చేసరికి కూడా కథను ఒక కొలిక్కి తీసుకురాకుండా మళ్ళీ మరో కామెడీ పాత్ర రోబో శంకర్ ను నమ్ముకుని చివరికి క్లైమాక్స్ లో హర్రర్ జానర్లోకి కూడా తీసుకెళ్లి తలపట్టుకునేలా చేశాడు. ముఖ్యంగా సెకండాఫ్ ఎక్కువైన రన్ టైమ్ తో మరీ భారంగా తోచి శుభం కార్డు కోసం ఎదురుచూసేలా చేసింది.

హీరో విష్ణు విశాల్ నటించడానికి ట్రై చేసినా, రోబో శంకర్, సూరిలు కామెడీతో అక్కడక్కడా నవ్వించినా పసలేని కథ, చెత్త స్క్రీన్ ప్లే కారణంగా అవి కూడా ఏమాత్రం ప్రయోజనం లేకుండా తేలిపోయాయి. ఇక మధ్యలో వచ్చే పాటలైతే వినడం కాదు కదా కనీసం స్క్రీన్ మీద చూదగిన విధంగా కూడా లేవు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ఎజ్హిల్ కేవలం ఒకటి రెండు జానర్లకు పరితమవకుండా రొమాంటిక్, కామెడీ, థ్రిల్లర్, చివరికి హర్రర్ జోలికి కూడా వెళ్లి ఒక అర్థం లేని కథను, గమ్యం లేని కథనాన్ని తయారుచేసుకుని ఏమాత్రం చూసే విధంగాలేని సినిమాను మనముందుంచాడు. శక్తి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. సి. సత్య సంగీతం ఏ కోశానా ఆకట్టుకోలేకపోయింది. ఆనందం లింగకుమార్ తన ఎడిటింగ్ ద్వారా సెకండాఫ్ లో చాలా భాగం కత్తిరించి ఉండాల్సింది. సినీ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

మొత్తం మీద ఒక పద్దతి, లక్ష్యం లేకుండా వివిధ జానర్లను కలిపి దర్శకుడు ఎజ్హిల్ చేసిన ఈ ప్రయత్నం మన తెలుగు వాళ్ళ దగ్గర చాలా వరకు విఫలమైంది. సూరి, రోబో శంకర్ల కామెడీ ట్రాక్స్ బాగానే ఉన్నా మిగతా చూడ సాధ్యతరం కానీ కంటెంట్ వలన అవి కూడా తేలిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గోల గోలగా ఉన్న ఈ ‘ప్రేమ లీల పెళ్లి గోల’ ఎవరి లీలో, ఎందుకోసం గోలో అస్సలు అర్థం కాదు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు