సమీక్ష : కాలా – ప్రజల కోసం పోరాడే నాయకుడి కథ

సమీక్ష : కాలా – ప్రజల కోసం పోరాడే నాయకుడి కథ

Published on Jun 8, 2018 11:35 PM IST
Kaala movie review

విడుదల తేదీ : జూన్ 07, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : రజనీకాంత్‌, హ్యూమా ఖురేషి, నానా పాటేకర్‌

దర్శకత్వం : పా. రంజిత్‌

నిర్మాత : ధనుష్‌

సంగీతం : సంతోష్‌ నారాయణన్‌

సినిమాటోగ్రఫర్ : మురళి జి

ఎడిటర్ : శ్రీకర్‌ప్రసాద్‌

స్క్రీన్ ప్లే : పా. రంజిత్‌

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘కాలా’. రజనీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి పా.రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ:

ముంబై నడిబొడ్డున ఉన్న పేద ప్రజల మురికివాడ (ధారావి). ఆ మురికివాడకి తిరుగులేని నాయకుడు కరికాలుడు (రజనీకాంత్). ఎన్ని ఆపదలొచ్చినా ఆ ప్రదేశాన్ని, ప్రజల్ని కాపాడుతుంటాడు కాలా. కానీ ముంబైలోని ప్రముఖ రాజకీయ పార్టీ లీడర్ హరిదాస్ (నానా పటేకర్) ఎన్నో ఏళ్ల నుండి ధారావిని సొంతం చేసుకోవాలని ట్రై చేస్తుంటాడు.

అధికారం తన చేతిలోకి రాగానే ప్రజల్ని మభ్యపెట్టి ధారావిని ఆక్రమించాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. కానీ అక్కడి ప్రజలు, వాళ్ళ నాయకుడు కాలా హరిదాస్ కు అడ్డుపడుతారు. దాంతో హరిదాస్ కాలాపై పగబడతాడు. అలా కాలాను టార్గెట్ చేసిన హరిదాస్ అతన్ని ఎలా కష్టపెట్టాడు, వాటన్నిటినీ ఎదుర్కొని కాలా తన వాళ్ళని, ధారావిని ఎలా కాపాడుకున్నాడు, ఆ పోరాటంలో అతను ఏం కోల్పాయాడు అనేదే సినిమా.

ప్లస్:

సినిమాకి ప్రధాన బలం సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన నటన కేవలం అభిమానుల్ని మాత్రమే కాకుండా ఇతర ప్రేక్షకుల్ని కూడ ఆకట్టుకునేలా ఉంది. గత చిత్రం ‘కబాలి’లా కాకుండా ఈ సినిమాలో రజనీ చాలా ఎనర్జిటిక్ గా ఉన్నారు. సినిమాలో పూర్తిగా నలుపు దుస్తుల్లో కనిపిస్తూ తన స్టైల్ ను స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో ప్రదర్శించి ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా చేశారు.

దర్శకుడు పా.రంజిత్ కూడ రజనీ పాత్రలో రొమాన్స్, కామెడీ, యాక్షన్ వంటి అన్ని అంశాలను ఉండేలా జాగ్రత్తపడ్డారు. రజనీ లాంటి ప్రజాదరణ కలిగిన స్టార్ ప్రజల కోసం పోరాడే నాయకుడి పాత్రలో కనిపించడంతో సినిమాకు కొంత హుందాతనం లభించింది. విలన్ నానా పటేకర్ తో నడిచే సన్నివేశాల్లో అయన నటన ఇంప్రెస్ చేసింది.

ప్రతినాయకుడి పాత్ర చేసిన నానా పటేకర్ నటన బాగుంది. రజనీ భార్యగా నటించిన ఈశ్వరి రావ్, మాజీ ప్రేయసిగా హ్యూమా ఖురేషి తమ పెర్ఫార్మెన్స్ తో చాలా చోట్ల ఆకట్టుకున్నారు. కాలా తన శత్రువుని పూర్తి స్థాయిలో ఢీకొనే ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. ద్వితియార్థంలోని ఫైట్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు పా.రంజిత్ రజనీ స్థాయికి సరిపడా స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా తయారుచేయలేకపోయారు. కొన్ని కొన్ని చోట్ల మినహా ఎక్కడా గొప్ప కథనం కనబడదు. ఇంటర్వెల్ సీన్, హీరో విలన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు మినహా మిగతావన్నీ చాలా సాధారణంగా సాగిపోయాయి. కథనంలో చాలా చోట్ల రజనీని ఎంతో గొప్పగా ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నా రంజిత్ ఎందుకో వాటిని వాడుకోలేదు.

ఇక రజనీ పాత్రను ఎంతో హుందాగా తీర్చిదిద్దిన ఆయన అభిమానులు పూర్తిగా సంతృప్తి చెందే స్థాయిలో అయితే రజనీని చూపలేకపోయారు. ఇక మధ్యలో వచ్చే కాలా కుటుంబ సన్నివేశాలు కొన్ని బాగున్నా ఇంకొన్ని నీరసాన్ని తెప్పించాయి. సినిమా మొత్తం మీద రజనీ, నానా పటేకర్ మినహా మిగిలిన పాత్రల్లో దేన్ని ప్రముఖంగా చూడాలో ప్రేక్షకులకు అర్థంకాని రీతిలో వాటిని డిజైన్ చేశారు రంజిత్.

ఒక సామాజిక పరమైన అంశాన్ని తీసుకుని, దాన్ని రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ద్వారా హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు చూసేవారిని ఎగ్జైట్ చేసేలా, ఆలోచింపజేసేలా సంభాషణలు, సన్నివేశాలు అందులో ఉండేలా జాగ్రత్తపడాలి. కానీ ఇందులో ప్రీ క్లైమాక్స్ తప్ప ప్రేక్షకుడ్ని అంత ఎమోషనల్ గా కదిలించే సన్నివేశాలు ఎక్కువ కనబడవు.

సాంకేతిక విభాగం :

పైన చెప్పినట్టు దర్శకుడు పా.రంజిత్ మంచి స్టోరీ లైన్ తీసుకుని, అందులో రజనీ పాత్రను స్టైలిష్ గా, నానా పటేకర్ పాత్రను రాజ్ఞేని డీ కొట్టే స్థాయిలో డిజైన్ చేసినా అభిమానులు, ప్రేక్షకులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా రజనీకి ఎలివేషన్ సీన్స్ రాయలేకపోయారు. అంతేగాక ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ మినహా ఆకట్టుకునే కథనాన్ని, ఎగ్జైట్ చేసే సన్నివేశాల్ని కూడ అందించలేకపోయారు.

సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కానీ పాటల సంగీతమే అంతగా ఆకట్టుకోలేకపోయింది. మురళి.జి సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలు రియలిస్టిక్ గా కనబడ్డాయి. శ్రీకర్ ప్రసాద్ తన ఎడిటింగ్ ద్వారా కొన్ని ఫ్యామిలీ సీన్లను తొలగించాల్సింది. నిర్మాత ధనుష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించారు.

తీర్పు :

‘కబాలి’ లాంటి పరాజయం తర్వాత కూడ రజనీకాంత్ దర్శకుడు పా.రంజిత్ కు ‘కాలా’ ద్వారా రెండవ ఛాన్స్ ఇచ్చారు. కానీ రంజిత్ మాత్రం ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదనే చెప్పాలి. ఆయన సినిమాను ‘కబాలి’ కంటే ఉత్తమంగానే తీసినా ఆ చిత్ర పరాజయాన్ని మరిపించే గొప్ప రీతిలో అయితే రూపొందించలేదు. ప్రజల కోసం పోరాడే కాల పాత్ర, అందులో రజనీ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్ ఫైట్, హీరో విలన్ల ట్రాక్ ఈ సినిమాలో మెప్పించే అంశాలు కాగా ముఖ్యమైన కథనం భావోద్వేగపూరితంగా, కదిలించే విధంగా లేకపోవడం, సన్నివేశాల్లో బలం లోపించడం, అవసరంలేని పాత్రలు, రజనీకి ఉండాల్సిన స్థాయిలో ఎలివేషన్ లేకపోవడం నిరుత్సాహపరిచే విషయాలు. ఒక్క మాటలో చెప్పాలంటే రజనీ అభిమానుల్ని మెప్పించే ఈ సినిమా ఇతర ప్రేక్షకులకి మాత్రం పర్వాలేదనిపిస్తుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు