సమీక్ష : జులాయి – స్టైలిష్ స్టార్ స్టైలిష్ ఎంటర్టైనర్

విడుదల తేది : 9 ఆగష్టు 2012
123తెలుగు.కాం రేటింగ్: 3.25/5
దర్శకుడు : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు : ఎస్. రాధాకృష్ణ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
నటీనటులు : అల్లు అర్జున్, ఇలియానా, రాజేంద్రప్రసాద్, సోనూ సూద్

మొదటి సారిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘జులాయి’. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. ఇప్పటివరకూ అల్లు అర్జున్ కెరీర్లో ఏ చిత్రాన్ని విడుదలచేయనంత భారీగా ఈ చిత్రాన్ని విడుదలచేశారు. ఇలియానా కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ హారికా మరియు హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘జులాయి’ చిత్రంలో బన్నీ జులాయిగా చేసిన అల్లరి పనులేంటో మరియు సినిమా ఎలా ఉందో చూసేద్దామా…

కథ :

రవీంద్ర నారాయణ్ (అల్లు అర్జున్) తొందరగా డబ్బు సంపాదించే విధానాన్ని బాగా నమ్మే తెలివితేటలుగల అబ్బాయి. అతని తండ్రి నారాయణ మూర్తి(తనికెళ్ళ భరణి) మాత్రం రవీంద్ర భావాలకు పూర్తి విరోధం మరియు ఆయన తన కష్టాన్ని నమ్ముకొని బతికే స్వభావం కలవాడు. రవీంద్ర అనుకోకుండా బిట్టూ (సోనూ సూద్) కి తారసపడతాడు. ఆ తర్వాత అతనితో కలిసి 1500 కోట్లు కాజేయాలని ఒక బ్యాంకు రోబరీకి ప్లాన్ చేస్తారు. సిటీ పోలీసు కమీషనర్ రాజ మాణిక్యం (రావు రమేష్) రవి టీం మీద నిఘా పెంచి తన టీం ద్వారా బిట్టూ ని అరెస్ట్ చేస్తారు. ఈ విషయంతో రవి మీద బిట్టూ పగ తీర్చుకోవాలనుకుంటాడు.

కమీషనర్ రాజ మాణిక్యం అప్రూవల్ గా మారిన రవిని సురక్షితంగా ఉంచడం కోసం హైదరాబాద్ కి పంపుతాడు. రాజ మాణిక్యం తన స్నేహితుడైన ఎ.సి.పి సీతారామ్ ఇంట్లో రవిని ఉంచుతాడు. హైదరాబాద్లో రవి మధు (ఇలియానా) ని చూసి ప్రేమలో పడతాడు. ఇదిలా జరుగుతుండగా బిట్టూ తన మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలని ప్లాన్స్ వేస్తుంటాడు. బిట్టూ తనకి తెలిసిన ఎం.ఎల్ ఎ వరదరాజు (కోట శ్రీనివాస రావు) మరియు ట్రావెల్స్ మూర్తి (బ్రహ్మాజీ) తో కలిసి ప్లాన్స్ వేస్తుంటాడు.
రవి మరియు బిట్టూ ఒకరినొకరు ఎలా ఎదుర్కున్నారు? ఇద్దరిలో చివరికి ఎవరు గెలిచారు ? రవి తన ప్రేమలో విజయం సాదించాడా? లేదా? అనేదే మిగిలిన కథ. ఈ కథని తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రానికి అల్లు అర్జున్ ఎనర్జీ మరియు స్టైలిష్ లుక్ ప్రధాన హైలైట్. ఈ చిత్రంలో అతని కాస్ట్యూమ్స్ మరియు అతను చేసిన అలవాట్లు చాలా బాగున్నాయి. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ కూడా బన్నీ చాలా బాగా చెప్పారు. అల్లు అర్జున్ ఫైట్స్ మరియు డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ డాన్సర్ లలో తను కూడా ఒకరని మళ్ళీ నిరూపించుకున్నాడు.

ఇలియానా ఈ చిత్రంలో చాలా బాగుంది మరియు ఫస్ట్ హాఫ్ లో అల్లు అర్జున్ మరియు ఇలియానాల మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ చాలా బాగుంది. ‘జల్సా’ చిత్రం కంటే ఈ చిత్రంలో ఎక్కువ నటనకు ఆస్కారమున్న పాత్రని చేశారు. రాజేంద్ర ప్రసాద్ నటన చాలా బాగుంది మరియు ఆయన నటనకి ఎందుకు అంత విలువనిస్తారో ఆయన నటన చూస్తే మనకు అర్థమవుతుంది. ఎ.సి.పి సీతారామ్ పాత్రలో చాలా బాగా నటించారు. కోట శ్రీనివాస రావు గారి నటన కూడా బాగుంది.
ఎం.ఎస్ నారాయణ ప్రేక్షకులను బాగా నవ్వించారు మరియు బ్రహ్మానందం ఈ చిత్రంలో దొంగగా కనిపించారు. సెకండ్ హాఫ్ లో హేమ మరియు బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు మరియు అతను ప్రదర్శించే అలవాట్లు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. సోనూ సూద్ విలన్ గా నటించిన సన్నివేశాలు మరియు క్లైమాక్స్ వద్ద వచ్చే కామెడీ సన్నివేశాలు చాలా బాగా చేశారు. బ్రహ్మాజీ మరియు తనికెళ్ళ భరణి కూడా వారి పరిధి మేర నటించారు.
త్రివిక్రమ్ డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే డైలాగ్స్ చాలా ప్రభావితంగా ఉన్నాయి. సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది మరియు ఈ చిత్రంలోని పాటలను చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు, పాటలు కూడా ఫస్ట్ హాఫ్ కి చాలా ప్లస్ అయ్యాయి. అలీ మరియు పోసాని కృష్ణ మురళి చేసిన అతిధి పాత్రలు చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెంకండ్ హాఫ్ కొంత తగ్గినట్టు అనిపిస్తుంది. మొదటి అర్ధభాగం చాలా వేగంగా ముందుకు సాగుతుంది మరియు రెండవ అర్ధ భాగంలో అంత వేగం ఉండదు. మామూలుగా త్రివిక్రమ్ సినిమా అంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది మరియు ఫైట్స్ చాలా బాగుంటాయని ప్రేక్షకులు భావిస్తారు. ‘జులాయి’ లో ఫైట్స్ సన్నివేశాలు ఇంకొంచెం బాగుంటే బాగుండేది. ఈ చిత్రంలో కార్లని ద్వంశం చేసే సన్నివేశాలు మరియు స్కార్పియోలను గాల్లోకి లేపడం లాంటి సన్నివేశాలు త్రివిక్రమ్ గారికి సెట్ అవ్వవు మరియు ఆయన అభిమానులు కూడా అవి ఆశించారు .
ఇలియానా మరియు అల్లు అర్జున్ రొమాంటిక్ ట్రాక్ కొంచెం అసంపూర్తిగానే ముగించేశారు. ధర్మవరపు కామెడీ రొటీన్ గానే ఉంది. సెకండ్ హాఫ్ లోని కామెడీ బి మరియు సి సెంటర్స్ వారికి అంత తొందరగా అర్థం కాదు. వాస్తవానికి దగ్గరగా లేని కొన్ని సన్నివేశాలు ఈ కథలో ఉన్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ రాజ్యాంగ అధికారాన్ని మీరి ప్రవర్తిస్తుంటాడు. పట్టపగలే పోలీసులతో కలిసి రోడ్డు మీదే నేరస్తులను కాల్చి చంపేస్తుంటాడు. సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ని ఎ.సి.పి గా పెట్టుకొని బన్నీతో అలా ఎందుకు చెయ్యిపించారా? అని అనిపిస్తుంది.

ఈ చిత్రంలోని క్లైమాక్స్ సన్నివేశాలు రొటీన్ గా ఉన్నాయి మరియు కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దగ్గరగా ఉండవు. బహుశా త్రివిక్రమ్ ఈ చిత్రాన్నిమాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయాలనుకున్నాడేమో. సెకండ్ హాఫ్ లో వచ్చే పాటలు సందర్భానుసారంగా వచ్చి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మొదటి అర్ధ భాగంలో ఎడిటింగ్ బాగున్నా రెండవ అర్ధ భాగంలో మరింత శ్రద్ద తీసుకోవలసింది. కోరియోగ్రఫీ బాగుంది . దర్శకుడిగా త్రివిక్రమ్ మొదటి అర్ధ భాగంలో సఫలం అయ్యారు. రెండవ అర్ధ భాగంలో కూడా అటువంటి శ్రద్ద తీసుకొని ఉంటే మరింత బాగుండేది. డైలాగ్స్ విషయంలో త్రివిక్రమ్ నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ప్రతి పదంలో పంచ్ ని జత చేస్తూ ఆయన రచించిన సంభాషణలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరియు నేపధ్య సంగీతం చాలా బాగుంది.

తీర్పు :

జులాయి చిత్రంలో మొదటి అర్ధ భాగం అద్భుతంగా ఉంది. ప్రతి సన్నివేశంలో త్రివిక్రమ్ శైలి కనిపిస్తుంటుంది మొదటి అర్ధ భాగం ప్రేక్షకుడికి కావలసినంత వినోదాన్ని పంచుతుంది. మొదటి అర్ధ భాగంతో పోలిస్తే రెండవ అర్ధ భాగం కాస్త నెమ్మదించినట్టు అనిపిస్తుంది. మొత్తానికి జులాయి మంచి ఎంటర్టైనింగ్ చిత్రం అనిపించుకుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మరియు రాజేంద్ర ప్రసాద్ కనబరించిన నటన అద్భుతం అని చెప్పుకోవాలి వీరిద్దరి కోసమే ఈ చిత్రాన్ని చూడవచ్చు. కమర్షియల్ అంశాల విషయానికి వస్తే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను బి మరియు సి సెంటర్స్ జనం ఎలా రిసీవ్ చేసుకుంటారనే అంశం మీదే ఈ చిత్ర కలెక్షన్లు ఆధారపడి ఉన్నాయి.

123తెలుగు.కామ్ రేటింగ్: 3.25/5

అనువాదం : రాఘవ


Click Here For ‘Julayi’ English Review

సంబంధిత సమాచారం :