సమీక్ష : రొమాన్స్ – అంత రొమాంటిక్ గా లేదు..

Romance-Movie-Poster విడుదల తేదీ : 02 ఆగష్టు 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకుడు : డార్లింగ్ స్వామి
నిర్మాత : ఎస్.కె.ఎన్, జి. శ్రీనివాసరావు
సంగీతం : సాయి కార్తీక్
నటీనటులు : ప్రిన్స్, డింపుల్, మానస..


మొదటి సినిమా ‘ఈ రోజుల్లో..’ తో హిట్ అందుకున్న గుడ్ సినిమా బ్యానర్ వారు తమ ద్వితీయ ప్రయత్నంగా ‘డార్లింగ్’, ‘రెబల్’ సినిమాలకు డైలాగ్స్ రాసిన డార్లింగ్ స్వామిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రొమాన్స్’. ఈ సినిమాని యూత్ కి బాగా దగ్గరైన మారుతి సమర్పణలో నిర్మించారు. ప్రిన్స్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా డింపుల్, మానస హీరోయిన్స్ గా నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాతో డార్లింగ్ స్వామీ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడా, లేదా?, గుడ్ సినిమా బ్యానర్ వారు రెండో సినిమాతో హిట్ అందుకున్నారా? లేదా? ఇప్పుడు చూద్దాం..

కథ :

సిటీలో రౌడీ యిజం చేసి బాగా సంపాదించిన వేణు గోపాల్ ఓ సినిమా తియ్యాలని అనుకుంటాడు. అందుకోసం అప్పటికే ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ(ప్రిన్స్) అలియాస్ మన సినిమాలో హీరోని పిలిపిస్తాడు. మన హీరో తన లైఫ్ లో జరిగిన స్టొరీనే కథగా చేసి సినిమా స్టొరీ చెప్పడం మొదలు పెడతాడు. ఓపెన్ చేస్తే … కెజి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, అందులో మన హీరో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంటాడు. మన హీరోకి ఇప్పుడున్న అమ్మాయిల్లో పర్ఫెక్ట్ గా ఉన్న ఓ అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అందుకోసం మొదట ఇద్దరిని ప్రేమించి వారిలో ఎవరు పర్ఫెక్ట్ గా ఉంటె వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అందులో భాగంగా మొదటగా లలిత అలియాస్ లోలా(మానస)ని ప్రేమిస్తాడు. ఒక సందర్భంలో తను కరెక్ట్ కాదని తెలుసుకొని కృష్ణ లోలా విడిపోతారు.

ఆ తర్వాత కృష్ణ అనురాధ(డింపుల్) ని చూసి ప్రేమలో పడతాడు. కానీ ఇద్దరు ఒకటి కావాల్సిన టైములో అనురాధకి కృష్ణ గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అదే సందర్భంలోనే లోల మళ్ళీ కృష్ణ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అసలు లోల మళ్ళీ కృష్ణ లైఫ్ లోకి ఎందుకు వచ్చింది? కృష్ణ అనురాధ ప్రేమని దక్కించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి లోల – కృష్ణ – అనురాధ ట్రై యాంగిల్ లవ్ స్టొరీలో ఎవరు ఒకటయ్యారు? అనేది తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి హీరో ప్రిన్స్, ప్రిన్స్ నటన ఓకే. తన గత సినిమాతో పోల్చుకుంటే నటనలో ఈ సినిమాలో చెప్పుకోదగిన మార్పు ఏమీ కనపడలేదు. ఈ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన డింపుల్ చూడటానికి బాగుంది. ఒక పాటలో, కొన్ని సీన్స్ లో గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. నటన పరంగా చూసుకుంటే తనకు ఇచ్చిన పాత్రకి న్యాయం చేసింది. ఇక సెకండ్ హీరోయిన్ గా నటించిన మానస జస్ట్ యావరేజ్. ఈ రోజుల్లో సినిమాతో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సాయికుమార్ ఈ సినిమాలో బ్లూ టూత్ బాబీ గా కొన్ని సీన్స్ లో అడల్ట్ కామెడీతో బాగానే నవ్వించాడు.

సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ బాగుంది. అలాగే సెకండాఫ్ లో హీరోని సిగరెట్ తాగమన్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ‘నా పేరు ముకేష్, నాకు నోటి కాన్సర్ అనే’ చిన్న ఎపిసోడ్ బాగా నవ్వించింది. అలాగే మొత్తం మీద ఒకటి రెండు కామెడీ ఎపిసోడ్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి మొదటి హీరో కథ అంటారు కానీ ఈ సినిమా కథలో ఆడియన్స్ ని మెప్పించేంత దమ్ము లేదు. అలాగే స్క్రీన్ ప్లే కూడా అంత ఆసక్తికరంగా లేదు. సినిమా చాలా వరకూ ఊహాజనితంగా సాగడమే కాకుండా మొదటి నుంచి చివరి వరకు బాగా నెమ్మదిగా సాగుతుంది. సెకండాఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ బాగా స్లోగా ఉంది. అలా అని సెకండాఫ్ సూపర్ అని కాదు ఏదో గుడ్డి మీద మెల్ల మేలన్నట్టు అని నా ఉద్దేశం. సినిమా క్లైమాక్స్ మరీ రొటీన్ గా కాకుండా ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. సినిమాలో కామెడీ చాలా తక్కువగా ఉంది అందువల్లే సినిమా చాలా వరకూ బోర్ కొడుతుంది.

సెకండాఫ్ లో చూపించిన కాన్సెప్ట్ దాదాపుగా ఇది వరకే వచ్చిన ‘సరదాగా అమ్మాయితో’ అనే సినిమాలో కూడా ఉంటుంది. అలాగే చాలా సీన్స్ ఇది వరకు వచ్చిన ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ సినిమాల్లో ఉన్నట్లే ఉంటాయి. నాకు తెలిసి టైటానిక్ సినిమా గురించి చూపించింది కూడా చాలా మంది జీర్ణించుకోలేరు. మిమిక్రీ ఎపిసోడ్ రొటీన్ గా ఉంది, అలాగే ‘జనవరి మాసం, రగులుతోంది మొగలి పొద’ పాటల పై చేసిన స్పూఫ్ కాస్త ఎబ్బెట్టుగా ఉంది.

సాంకేతిక విభాగం :

జె. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగింది. ఎడిటర్ సినిమా మీద ఇంకాస్త దృష్టి పెట్టుకొని కొన్ని బోరింగ్ సీన్స్ ని లేపేసి సినిమాని ఇంకాస్త వేగవంతం చేసి ఉండాల్సింది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సాయి కార్తీక్ టాలెంట్ పరవాలేదు అనుకునేలా ఉంది.

సినిమాకి సంబందించిన 24 శాఖల్లో కీలకమైన కథ- స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం విభాగాలను ఒక్క డార్లింగ్ స్వామి మాత్రమే డీల్ చేసాడు. కానీ ఎ ఒక్క డిపార్ట్ మెంట్ లో కూడా పాస్ కాలేకపోయాడు. కథ పెద్దగా చెప్పుకునేంత లేదు, స్క్రీన్ ప్లే బాలేదు, ఓవరాల్ గా కొన్ని సీన్స్ ని పక్కన పెడితే చాలా సీన్స్ లో డైరెక్షన్ పరంగా పెర్ఫెక్షన్ మిస్ అయ్యింది. మాములుగా డార్లింగ్ స్వామి అందరికీ డైలాగ్ రైటర్ గా తెలుసు, అలాటింది తను డైరెక్ట్ చేస్తున్న సినిమా అంటే ఇంకా మంచి డైలాగ్స్ ఆశిస్తారు కానీ డైలాగ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకొని మెప్పించే స్థాయిలో లేవు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తీసిన ‘రొమాన్స్’ సినిమా యూత్ ని ఆకట్టుకునే స్థాయిలో లేదు. ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ తరహాలో తీసిన ఈ సినిమా ఆసినిమాల స్థాయిలో లేదు. డింపుల్ లుక్ మరియు గ్లామర్, పరవాలేదనిపించిన ప్రిన్స్ నటన, కొన్ని అడల్ట్ కామెడీ సీన్స్ తప్ప ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేవు. వీక్ స్క్రీన్ ప్లే, ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం, సినిమా స్లోగా సాగడం చెప్పదగిన మెయిన్ పాయింట్స్. మాములుగానే ఇలాంటి సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ రారు, కానీ బి,సి సెంటర్ ప్రేక్షకులని ఒక మాదిరిగా ఆకట్టుకున్నా చివరికి ఆశించినంత విజయాన్ని అందుకోవడం మాత్రం కష్టమైన పని.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :