సమీక్ష : శిరిడి సాయి – మైమరిపించిన శిరిడి సాయి

సమీక్ష : శిరిడి సాయి – మైమరిపించిన శిరిడి సాయి

Published on Sep 6, 2012 2:40 AM IST
విడుదల తేదీ: 06 సెప్టెంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకుడు : కే. రాఘవేంద్ర రావు
నిర్మాత : మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డి
సంగీతం: కీరవాణి
నటీనటులు : నాగార్జున, శ్రీకాంత్, శ్రీహరి

భక్తిరసమైన సినిమాలు చేయడం మెప్పించడం నాగార్జునకి కొత్తేమి కాదు. గతంలో అన్నమయ్య, శ్రీ రామదాసు సినిమాలు చేసి మెప్పించాడు. కాకపోతే అవి రెండు భక్తుడిగా చేసినవి. మొదటి సారిగా సాయి బాబాగా దేవుడి పాత్రలో నటించాడు. అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాలకు దర్శకత్వం వహించిన కె. రాఘవేంద్ర రావు, సంగీతం అందించిన కీరవాణి శిరిడి సాయి చిత్రానికి కూడా పని చేయగా ఎ. మహేష్ రెడ్డి నిర్మించారు. సాయి బాబాగా కూడా నాగార్జున మెప్పించారా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం.

కథ :

సాయి బాబా చరిత్ర గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందరికి తెలిసిన కథే అయినా ఈ సినిమాలో ఎలా చెప్పారు అన్నదే ఇక్కడ ముఖ్యం. షిరిడి అనే గ్రామంలోకి వచ్చిన ఒక బాలుడు ఆ గ్రామంలో అక్కడే ఉండి ఆ ఊరి ప్రజలకి ఏ ఆపద వచ్చిన ఆదుకుంటూ ఉంటాడు. దేవుళ్లంతా ఒక్కటే అంటూ ‘సబ్ కా మాలిక్ ఏక హై’ అనే నినాదాన్ని అందరితో చెప్పిస్తాడు. తనకంటూ ఏ పేరు లేని ఆయన్ని ప్రజలు సాయి బాబాగా (నాగార్జున) పిలుచుకుంటారు. సాయి బాబాకి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఆ వూరిలో ఉండే భాటియా (షాయాజీ షిండే) అయన మీద లేని పోనీ నిందలు వేసి వూరి నుండి పంపించే ప్రయత్నాలు చేస్తాడు. అలా చాలా మందికి తన మీద ఉన్న సందేహాలు తీరుస్తూ ప్రజలను ఆదుకుంటూ ఉంటాడు. అలా సాయి బాబా చరిత్ర అంతా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేసారు.

ప్లస్ పాయింట్స్ :

సాయి బాబా పాత్రలో నాగార్జున నటించాడు అనడం కన్నా జీవించారు అని చెప్పొచ్చు. భక్తి సినిమాలు చేయడం ఆయనకి కొత్తేమి కాకపోయినా మొదటి సారిగా దేవుడిగా సాయి బాబా పాత్రలో ఎలా మెప్పిస్తాడు అన్న వారందరికీ అయన నటనతోనే సమాధానం చెప్పారు. బాబాగా మారిన తరువాత నుండి ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ప్రతి ఒక్కరితో కంట తడి పెట్టించారు. బాబా భక్తుడిగా దాసగను పాత్రలో శ్రీకాంత్ కూడా బాగానే నటించాడు. నానవాలి పాత్రలో నటించిన సాయి కుమార్ తన వాయిస్ తో ఆ పాత్రని అధ్బుతంగా పండించాడు. బాయిజా భాయిగా నటించిన వినయా ప్రసాద్, భాటియా కూడా బాగా నటించారు. మిగతా వారిలో మహాల్సాపతి గా శరత్ బాబు, తాత్యాగా కౌశిక్ బాబు పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్ :

కామెడీ కోసం పెట్టిన ఎపిసోడ్స్ చూస్తే నవ్వు రాకపోగా చిరాకు వస్తుంది. రాఘవేంద్ర రావు గారి కమర్షియల్ సినిమాల్లో ఉండే సోది కామెడీ ఈ సినిమాలో కూడా కంటిన్యూ చేసారు. అలీ, అనంత్, చివరికి బ్రహ్మానందంతో కూడా వెకిలి కామెడీ పండించాడు దర్శకుడు. ఈ వెకిలి కామెడీ స్థానంలో బాబా గురించిన ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పించి ఉంటే బావుండేది. వేల్స్ పాత్రలో నటించిన శ్రీహరి అస్సలు మెప్పించలేకపోయాడు. సెకండాఫ్ మొదలైన సమయం నుండి ఒక 30 నిమిషాల పాటు స్క్రీన్ప్లే ఆసక్తికరంగా లేక బోర్ కొట్టించింది.

సాంకేతిక విభాగం :

ఎమ్. ఎమ్ కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసే ప్రయత్నం చేసారు కాని ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు. అమరా రామ, ఒక్కటే దేవుడు, శరణు శరణు, రామ నవమి, సాయి అంటే తల్లి, పాటలు బావున్నాయి. నేపధ్య సంగీతం కూడా కొన్ని సన్నివేశాల్లో భక్తుల చేత కంటి తడి పెట్టించింది. ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి హెల్ప్ అయింది. వేల్స్, భాటియా లాంటి పాత్రలకి రాసిన పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్ చిరాకు తెప్పించాయి.

తీర్పు :

సాయి బాబాగా నాగార్జున చేసిన ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ అభినందించి తీరాలి. సాయి బాబా భక్తులు బాగా మెచ్చే చిత్రం అవుతంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కమెడియన్స్ తో చేయించిన వెకిలి కామెడీ తప్ప సినిమాలో ఎంచడానికి పెద్దగా ఏమీ లేదు. పైన చెప్పుకున్నట్లు ఆ కామెడీ స్థానంలో బాబా గురించిన ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పించి ఉంటే బావుండేది. కమర్షియల్ పరంగా ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుంది, ఎంత లాభాలు వస్తాయి అనే విషయాలను పక్కన పెట్టి ఈ సినిమాని చూడండి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

అశోక్ రెడ్డి. ఎమ్

Click Here For ‘Shirdi Sai’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు