సమీక్ష : వెన్నెల 1 1/2 – ఫలించని సీక్వెల్ మంత్ర

సమీక్ష : వెన్నెల 1 1/2 – ఫలించని సీక్వెల్ మంత్ర

Published on Sep 21, 2012 10:00 PM IST
విడుదల తేదీ: 21 సెప్టెంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : NA
దర్శకుడు : వెన్నెల కిషోర్
నిర్మాత : వాసు, వర్మ
సంగీతం: సునీల్ కష్యప్
నటీనటులు : చైతన్య, మోనాల్ గజ్జర్

2005 లో వెన్నెల సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన యువత మనోభావాలు చూపిస్తూ దేవకట్ట డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా యువతని బాగా ఆకట్టుకుంది. వెన్నెల సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయిన కిషోర్ అనుకోకుండా ఆ సినిమాలో నటించాల్సి వచ్చింది. ఆ సినిమాలో ఖాదర్ అనే క్యారెక్టర్ చేసిన కిషోర్ ఆ సినిమా తరువాత వెన్నెల కిషోర్ గా మారిపోయాడు. ఆ తరువాత కమెడియన్ గా సినిమాలు చేస్తూ మంచి పొజిషన్ కి ఎదిగాడు. డైరెక్టర్ అవ్వాలన్న కోరిక ఎలాగైనా తీర్చుకోవాలనుకున్నాడు. దాదాపు 7 సంవత్సరాల తరువాత వెన్నెల సినిమాకి సీక్వెల్ గా వెన్నెల 1 1/5 అనే సినిమా తీయాలని డిసైడ్ ఐపోయాడు. దాదాపు రెండు సంవత్సరాలు తీసిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజే విడుదలైంది. ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

వెన్నెల సినిమాలో ఉన్న నవీన్, పవన్ ఇద్దరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోగా ఇక మిగిలింది ఖాదర్ (వెన్నెల కిషోర్), సునీల్ (మధు రెడ్డిబోయిన). ఆ సినిమా చివర్లో జరిగిన గొడవలో ఈ ఇద్దరు ఇరుక్కోవడం హాస్పిటల్లో జాయిన్ కావడం వరకు మాత్రమే వెన్నెల సినిమాలో చూపించారు. అక్కడి నుండి వెన్నెల 1 1/2 కథ మొదలవుతుంది. ఆ గొడవ వాళ్ళ ఖాదర్, సునీల్ ఇద్దరు అమెరికా విడిచి వెళ్ళిపోవలసి వస్తుంది. ఇద్దరు అమెరికా నుండి థాయిలాండ్ వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. థాయిలాండ్లో యూట్యూబ్ యువక్ (హరీష్) తో కలిసి ఒకే ఫ్లాట్లో ఉంటారు. ఖాదర్, సునీల్, యూట్యూబ్ యువక్ ముగ్గురి మధ్య సరదా సన్నివేశాలు నడుస్తుంటే, ఇంకో వైపు మరో స్టొరీ ఎంటర్ అవుతుంది. లవ్ గురు అయిన కృష్ణ కృష్ణ అలియాస్ రింపోచే (చైతన్య కృష్ణ) అప్పటికే నిశ్చితార్ధం అయిన వెన్నెల (మోనాల్ గజ్జర్), శ్రవణ్ (శ్రవణ్) ని విడగొట్టాలని కాంట్రాక్టు కుదుర్చుకుంటాడు. కృష్ణ కృష్ణ ఆ ఇద్దరినీ ఎందుకు విడగోట్టాలనుకున్నాడు. మిగతాది తెర మీద చుడండి.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో ప్లస్ గురించి మాట్లాడుకుంటే తాగుబోతు రమేష్ క్యారెక్టర్ కొంత నవ్విస్తుంది. తన తాగుబోతు స్టైల్ కంటిన్యూ చేస్తూ బాగానే నవ్వించాడు. ఇంకా పామ్ పచాక్ గా బ్రహ్మానందం ట్రాక్ కూడా కొంత రిలీఫ్ ఇచ్చింది. లైవ్ ఇంటర్వెల్లో తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్ తో కలిసి డైలాగ్స్ లేకుండా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ బానే ఉన్నాయి. ఇక నటీ నటుల విషయానికి వస్తే కృష్ణగా చైతన్య కృష్ణ, వెన్నెలగా మోనాల్ గజ్జర్ తన వంతు ప్రయత్నం చేసారు.

మైనస్ పాయింట్స్ :

వెన్నెల సినిమా ఎందుకు హిట్ అయింది అంటే అందులో కేవలం కామెడీ మాత్రమే లేదు. ఫస్టాఫ్ అంతా సరదాగా సాగి సెకండాఫ్లో కథ సెంటిమెంట్ వైపు తిరిగి ప్రేక్షకులకు దగ్గరైంది. వెన్నెల 1 1/5 విషయానికి వస్తే కిషోర్ డైరెక్షన్ గురించి పూర్తి అవగాహన లేకుండా ఈ సినిమాని స్టార్ట్ చేసారని సినిమా ప్రారంభంలోనే అర్ధమవుతుంది. డైరెక్షన్ అంటే కామెడీ చేసినంత ఈజీ కాదు. స్క్రీన్ ప్లే మీద కూడా కనీస పరిజ్ఞానం లేకపోవడంతో ఏ సన్నివేశం ఎందుకు వస్తుందో కూడా తెలియని గందరగోళం ఏర్పడింది. ఒక్క పాత్రకి కూడా సీరియస్నెస్ లేకపోవడంతో కథ సినిమా మీద ఆసక్తి కలగించకపోగా చిరాకు తెప్పించాడు. చాలా కామెడీ సన్నివేశాల్ని ఇంగ్లీష్ కామెడీ సినిమాల నుండి ఇన్స్పైర్ అయి తీసారు.

శ్రవణ్ ని పూర్తిగా బఫూన్ ని చేసారు. వెన్నెల కిషోర్ కి డైరెక్షన్ మీద కాకుండా నటన మీదే దృష్టి పెట్టడం బెటర్. మాస్టర్ నుండి మిస్టర్ భరత్ గా మారిన కామెడీ కూడా పెద్దగా పండించలేకపోయాడు. మిగతా వారిలో హరీష్ కి కామెడీ పేరుతో చాలా ఇబ్బంది పెట్టాడు. సునీల్ కశ్యప్ సంగీతంలో పాటలు వినడానికి బాగానే ఉన్న స్క్రీన్ మీద పెద్దగా పండలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఈ విభాగాల గురించి మాట్లాడుకోకపోవడమే ఉత్తమం.

తీర్పు :

వెన్నెల సినిమా చూసి ఆ సినిమా సీక్వెల్ అనగానే చాలా మంది ఆ సినిమాని దృష్టిలో పెట్టుకుని వస్తారు. హిట్ అయిన సినిమాకి సీక్వెల్ అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత కాదు అన్నా కూడా మొదటి భాగంతో పోలుస్తారు. కిషోర్ దర్శకుడిగా పెద్దగా అనుభవం లేకపోవడంతో తడబడ్డాడు. కమెడియన్ గా మీరు వెన్నెల కిషోర్ కి పెద్ద ఫ్యాన్ అయితే వెన్నెల సినిమా చూసి లైట్ తీస్కోండి.

123తెలుగు.కాం రేటింగ్ : వెన్నెల 1 1/2 చిత్రానికి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు. వెన్నెల 1 1/2 చిత్రం బావుంది చూసి ఎంజాయ్ చేయండి.

అశోక్ రెడ్డి. ఎమ్


Click Here For ‘Vennela one and half’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు