సమీక్ష : రన్ రాజా రన్ – రిఫ్రెషింగ్ రొమాంటిక్ ఎంటర్టైనర్.!

సమీక్ష : రన్ రాజా రన్ – రిఫ్రెషింగ్ రొమాంటిక్ ఎంటర్టైనర్.!

Published on Aug 2, 2014 1:00 AM IST
run_raja_run_review విడుదల తేదీ : Aug 01, 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వంసుజీత్
నిర్మాత : వంశీకృష్ణ రెడ్డి – ప్రమోద్ ఉప్పలపాటి
సంగీతం  : జిబ్రాన్
నటీనటులు : శర్వానంద్, సీరత్ కపూర్, సంపత్..

 

ఇప్పటివరకూ ఎక్కువగా సీరియస్ పాత్రల్లో కనిపించి ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్ మొదటి సారి తన గెటప్ మరియు లుక్ మార్చి లవర్ బాయ్ లుక్ లో చేసిన సినిమా ‘రన్ రాజా రన్’. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ డైరెక్టర్ గా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాని మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన యువి క్రియేషన్స్ వారు నిర్మించారు. జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ ‘రన్ రాజా రన్’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద రన్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం…

కథ :

రాజా హరిశ్చంద్ర ప్రసాద్ (శర్వానంద్) ఎప్పుడూ నిజాలే మాట్లాడడం వలన ప్రతి అమ్మాయితోనూ బ్రేకప్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రియ(సీరత్ కపూర్) ఎవరికన్నా ప్రపోజ్ చెయ్యాలి అనుకుంటే అనుకోకుండా వాళ్ళకి పెళ్ళై పోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ అనుకోకుండా కలిసుకొని ముందు ఫ్రెండ్స్ అయ్యి, ఆ తర్వాత లవర్స్ అవుతారు. కట్ చేస్తే ప్రియ వాళ్ళ నాన్న దిలీప్ కుమార్(సంపత్) సిటీ పోలీస్ కమీషనర్ అని తెలుస్తుంది. దాంతో దిలీప్ కుమార్ తమ పెళ్ళికి ఒప్పుకోడని రాజా ఫిక్స్ అవుతాడు. కానీ ఓ మెలిక పెట్టి దిలీప్ కుమార్ రాజా – ప్రియ పెళ్ళికి ఒప్పుకుంటాడు.

ఈ స్టొరీ పక్కన పెడితే సిటీలో ఓ కిడ్నాప్ గ్రూప్ ప్రముఖులను కిడ్నాప్ చేస్తూ డబ్బులు రికవర్ చేస్తుంటారు. ఆ గ్రూప్ ని పట్టుకోవడం కోసమే దిలీప్ కుమార్ సిటీకి వస్తాడు. చివరికి దిలీప్ కుమార్ ఆ కిడ్నాప్ ముఠాని పట్టుకోగలిగాడా? లేదా? అసలు రాజా పెళ్ళికి దిలీప్ కుమార్ పెట్టిన మెలిక ఏమిటి? ఆ మెలికకి కిడ్నాప్స్ కి ఏమన్నా సంబంధం ఉందా? అనేది మీరు తెరమీదే చూడాలి…

ప్లస్ పాయింట్స్ :

ఇలాంటి ఓ రొమాంటిక్ థ్రిల్లర్ కి శర్వానంద్ న్యాయం చెయ్యగలడా? సినిమా రిలీజ్ కి ముందు అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న ఇదే.. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి శర్వానంద్ హీరోగా పర్ఫెక్ట్ అని అంటారు. థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని రాజాగా శర్వానంద్ థ్రిల్ చేసాడని చెప్పాలి. శర్వానంద్ స్టైలిష్ లుక్, పెర్ఫార్మన్స్ మరియు వన్ లైన్ పంచ్ డైలాగ్స్ అందరినీ బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో శర్వానంద్ ఒక్కడే సోలోగా ఆడియన్స్ ని నవ్విస్తాడు. ఇది ఈ సినిమా మేజర్ హైలైట్స్ లో ఒకటి..

ఇక సీరత్ కపూర్ కి ఇది మొదటి సినిమా అయినా, తెలుగు రాకపోయినా పెర్ఫార్మన్స్ పరంగా మాత్రం బాగా చేసింది. సీరత్ కపూర్ లో ఎనర్జీ లెవల్స్ బాగున్నాయి. అలాగే డాన్సులు చాలా బాగా చేసింది. అలాగే సినిమా మొత్తం మోడ్రన్ లుక్ లో కనపడుతూ గ్లామరస్ టచ్ కూడా ఇచ్చింది. మొదటి సినిమా తనకి మంచి బూస్టప్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక సంపత్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూనే కామెడీని కూడా బాగా పండించాడు. అమాయకంగా కనిపిస్తూ, ఇంటలిజెన్స్ ఉన్న వ్యక్తిలా బిహేవ్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అడవి శేష్ నటన చాలా బాగుంది.

ఇక మొదటి సారి డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించిన జయప్రకాశ్ పెర్ఫార్మన్స్ చాలా డీసెంట్ గా ఉంది. కోట శ్రీనివాసరావు, అలీ తదిఅతరులు తమ పాత్రలకి న్యాయం చేసారు. నటీనటుల గురించి పక్కన పడితే సినిమా పరంగా ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ చాలా మేజర్ హైలైట్. ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ కి చాలా ఫ్రెష్ ఫీల్ ఇవ్వడం కాకుండా, బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇక క్లైమాక్స్ 20 నిమిషాలు బాగా ఆసక్తికరంగా ఉంది. సినిమాలో రెండు సార్లు స్టార్ హీరోల మాస్క్ లని ఉపయోగించుకొని చేసిన కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటి మైనస్ పాయింట్ సెకండాఫ్.. చివరి 20 నిమిషాలు తీసేస్తే మిగతా 30 – 40 నిమిషాలతో సినిమాని బాగా సాగదీశారు. ఇంటర్వల్ తర్వాత సినిమా థ్రిల్లింగ్ గా ఉంటుంది అని వచ్చి కూర్చున్న ప్రేక్షకుడి సహనానికి పరీక్ష మొదలవుతుంది. ఎందుకంటే సినిమాలో వరుసగా రెండు పాటలొస్తాయి, కామెడీ మిస్ అవుతుంది, వీటన్నిటికంటే మించి డైరెక్టర్ అసలు కథలోకి వెళ్ళకుండా పక్కకి ఎందుకు వెళ్తున్నాడా అనే ఫీలింగ్ ఆడియన్స్ కి వస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ సెకండాఫ్ లో లేకపోవడం సినిమాకి మైనస్.

ఇకపోతే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి కమీషనర్ పాత్రని పరిచయం చేసినా ఆతర్వాత పవర్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళలేదు. చివరి వరకూ పోలీసుల ట్రాక్ ని చాలా సిల్లీగా చేసేసినట్టు అనిపిస్తుంది. దొంగకి పోలీసు పర్ఫెక్ట్ చెక్ పెట్టగలిగితేనే ఆడియన్స్ కి సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ మొదలవుతుంది. ఆ ఉత్కంఠని డైరెక్టర్ క్రియేట్ చెయ్యలేకపోయాడు. అందువల్లే దొంగతనాలు ఎవ్వరు చేస్తున్నారు అనేది ఆడియన్స్ కి ముందే తెలిసిపోతుంది. అందుకే దొంగ ఇతనే అని ట్విస్ట్ రివీల్ చేసినా పెద్దగా కిక్ ఉండదు. వెన్నెల కిషోర్ పాత్ర కూడా కామెడీ పరంగా సినిమాకి పెద్ద హెల్ప్ అవ్వలేదు.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ టీంలో మెచ్చుకోదగిన విషయాలు చాలానే ఉన్నాయి.. కానీ ఈ సినిమాతో డైరెక్టర్ గా సుజీత్ పరిచయం అయ్యాడు కాబట్టి మొదటగా అతని నుంచే మొదలు పెడదాం.. సుజీత్ కి ఇది తొలి సినిమానే అయినా ఎక్కడా తడబడకుండా సినిమాని చాలా పర్ఫెక్ట్ గా డీల్ చేసాడు. ఒక థ్రిల్లర్ సినిమాలో పర్ఫెక్ట్ గా ఉండాల్సిన లాజిక్స్ ని బాగా ప్లాన్ చేసుకున్నాడు, కానీ థ్రిల్స్ ని ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ఆడియన్స్ కి థ్రిల్స్ రివీల్ చెయ్యగానే వావ్ ఏమన్నా ఉందా.? ఈ ట్విస్ట్ అనాలి కానీ ఇందులో ఆ రేంజ్ ఫీలింగ్ కలిగించలేకపోయాడు. తదుపరి సినిమాల్లో ఇలాంటి విషయాల్లో కేర్ తీసుకుంటే ఇంకా బెటర్ సినిమా ఇవ్వగలడు. చివరిగా సుజీత్ తీసుకున్న కథ – కథ పాతదే కానీ ప్రెజెంటేషన్ బాగుంది. స్క్రీన్ ప్లే – లాజిక్స్ మిస్ కాకుండా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా రాసుకున్నాడు, డైలాగ్స్ – వన్ లైన్ పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. డైరెక్టర్ గా ఫస్ట్ సినిమాతో ఫస్ట్ క్లాస్ లోనే పాసయ్యాడని చెప్పాలి.

ఇక మధి సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. హైదరాబాద్లోని లోకేషన్స్ ని చాలా గ్రాండ్ గా చూపించాడు. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కి సూపర్బ్ మ్యూజిక్ తోడైతే ఆడియన్స్ మైమరచిపోతారు. అదే ఫీల్ ని జిబ్రాన్ తన మ్యూజిక్ తో క్రియేట్ చేసాడు. జిబ్రాన్ సాంగ్స్ ఎంత పెద్ద హిట్టో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే హిట్ అయ్యింది. మధి సినిమాటోగ్రఫీ, జిబ్రాన్ మ్యూజిక్ అనుకున్న కాన్సెప్ట్ కి పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఎడిటర్ మధు సెకండాఫ్ ని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. యువి ప్రొడక్షన్స్ నిర్మాతలైన వంశీకృష్ణ రెడ్డి – ప్రమోద్ ఉప్పలపాటి మరోసారి టేస్టున్న నిర్మాతలని నిరూపించుకున్నారు. ఈ సినిమాని కూడా బాగా రిచ్ ఫీల్ వచ్చేలా నిర్మించారు.

తీర్పు :

యంగ్ హీరో శర్వానంద్ టోటల్ గా తన లుక్ మార్చుకొని చేసిన ‘రన్ రాజా రన్’ సినిమా తనకొక కొత్త ఇమేజ్ ని తెచ్చి పెట్టడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద కాసులు రాబట్టుకొని, చాలా కాలంగా తను ఎదురు చూస్తున్న కమర్షియల్ హిట్ ని కూడా అందిస్తుంది. డైరెక్టర్ సుజీత్ కి తోలి సినిమా కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి కామన్, అవి పక్కన పెడితే సినిమాని చాల బాగా హాండిల్ చేసి మంచి మార్కులు కొట్టేసాడు, కాన్సెప్ట్ పరంగానే కాకుండా ప్రధాన నటీనటులందరినీ డిఫరెంట్ గా ప్రెజెంట్ చెయ్యడంలోనూ సక్సెస్ అయ్యాడు. శర్వానంద్ ఫ్రెష్ లుక్ అండ్ పెర్ఫార్మన్స్, ఫస్ట్ హాఫ్, చివరి 20 నిమిషాలు, మధి సినిమాటోగ్రఫీ, జిబ్రాన్ మ్యూజిక్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ అయితే సెకండాఫ్ ని డ్రాగ్ చెయ్యడం, అలాగే సినిమాలో వచ్చే ట్విస్ట్ లు ఆడియన్స్ గెస్ చేసేలా ఉండడం సినిమాకి మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా ‘రన్ రాజా రన్’ సినిమా శర్వానంద్, డైరెక్టర్ సుజీత్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ మాత్రమే కాకుండా యువి క్రియేషన్స్ వారికి బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ కూడా తెచ్చిపెట్టే సినిమా అవుతుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు