సమీక్ష : శమంతకమణి – నలుగురు హీరోల కోసం చూడొచ్చు

Shamanthakamani movie review

విడుదల తేదీ : జూలై 14, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య

నిర్మాత : ఆనంద్ ప్రసాద్

సంగీతం : మణి శర్మ

నటీనటులు : నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది సాయికుమార్

మొదటి సినిమా ‘భలే మంచి రోజు’ తో ఆకట్టుకున్న దర్సకుడు శ్రీరామ్ అదిత్య చేసిన తాజా చిత్రం ‘శమంతకమణి’. నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది సాయికుమార్ లతో చేసిన ఈ మల్టీ స్టారర్ ఈరోజే విడుదలైంది. ఒకేసారి నలుగురు యంగ్ హీరోలు కలిసి నటించడంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :
కృష్ణ (సుధీర్ బాబు) తండ్రికి చెందిన రూ. 5 కోట్ల విలువైన ఓల్డ్ మోడల్ రోల్స్ రాయిస్ కారు దొంగతనానికి గురవుతుంది. ఆ ఇష్యూని పోలీసుస్ శాఖ సీరియస్ గా తీసుకుని కారుని కనుగొని దొంగల్ని పట్టుకునే పనిని ఎస్సై రంజిత్ కుమార్ (నారా రోహిత్) కు అప్పగిస్తారు. పై అధికారుల ఒత్తిడితో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన రంజిత్ కుమార్ మెకానిక్ అయిన రాజేంద్ర ప్రసాద్, కోటి పల్లి శివ (సందీప్ కిషన్), కార్తిక్ (ఆది) లను అరెస్ట్ చేస్తాడు.

ఆ కారుకి కోటి పల్లి శివ, కార్తిక్, మెకానిక్ రాజేంద్ర ప్రసాద్ లకు లింకేంటి ? ఆ కారు వలన వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి ? అసలు ఆ ఖరీదైన కారుని దొంగతనం చేసింది ఎవరు ? రంజిత్ కుమార్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది ? అనేదే ఈ సినిమా కథ…

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ కథలోని సస్పెన్స్. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఆఖరు వరకు కారు దొంగతనం విషయాన్ని తేల్చకుండా కారు దొంగతనం ఎలా జరిగింది, ఎవరు చేసుంటారు అనే ప్రశ్నలను పదే పదే సినిమా చూస్తున్న ప్రేక్షకుల మెదళ్లలో మెదిలేలా చేసి సినిమాపై దాదాపు చివరి దాకా ఆసక్తిని నిలిపి ఉంచాడు. ఇక ఐదుగురు జీవితాలను ఒక కారుతో ముడిపెట్ట ఆయన రాసుకున్న కథనం కూడా సెకండాఫ్లో ఆకట్టుకుంది. అలాగే ప్రతి ముఖ్య పాత్రను కారుకు చాలా దగ్గరగా తీసుకెళ్లిన తీరు కూడా శ్రీ రామ్ ఆదిత్య స్క్రీన్ ప్లే టాలెంట్ ను రుజువు చేసింది.

హీరోల పాత్రల్లో ఆది సాయికుమార్ పాత్ర అన్నింటిలోకి ఆకట్టుకుంది. ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ కుర్రాడిగా అతని చిత్రీకరణ, నటన కనెక్టయ్యాయి. అలాగే సుధీర్ బాబు పాత్ర వెనకున్న ఎమోషన్ ఆకట్టుకుంది. నారా రోహిత్ చేసిన ఎస్సై క్యారెక్టర్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయింది. సెకండాఫ్లో అతను ఒక్కోక్క ప్రధాన పాత్రని ఇన్వెస్టిగేషన్ చేసే సన్నివేశాలు కథను ముందుకు నడిపించడంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ను కూడా అందించాయి. ఎస్సైగా నారా రోహిత్ నటన ఆకట్టుకోగా, అతని పక్కన కానిస్టేబుల్ గా చేసిన రఘు కామెడీ కూడా నవ్వించింది.

ఇక చివరగా కారు దొంగతనం వెనకున్న అసలు వ్యక్తి ఎవరు, దొంతనం ఎలా జరిగింది, ఆ కారుతో ప్రధాన పాత్రల జీవితాలు ఎలా మలుపులు తిరిగాయి అనే అంశాలకు దర్శకుడిచ్చిన క్లైమాక్స్ సమాధానపరిచేదిగా ఉంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఫస్టాఫ్ అంతా అసలు కథ జోలికి వెళ్లకుండా పాత్రల పరిచయం, వారి జీవితాలను వివరించడం వంటి విషయాలతోనే నడిపించడంతో ఏదో అలా సాగిపోతున్నట్టు అనిపించింది తప్ప ఇవ్వాల్సిన ఎంటర్టైన్ చేయలేదు. ఇక చిత్ర క్లైమాక్స్ రీజనబుల్ గానే ఉన్నప్పటికీ కాస్త రొటీన్ గా తోచడంతో పెద్దగా ఎగ్జైట్మెంట్ కలుగలేదు. అలాగే ఎస్సై రంజిత్ కుమార్ కారు దొంగతాన్ని కనుగొనడానికి వేరే దారులున్నప్పటికీ ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కేవలం ప్రధాన పాత్రలకు మాత్రమే పరిమితం చేయడం కొంచెం లాజిక్ లెస్ గా ఉంటుంది.

కథ పక్కదారి పట్టకూడదనే దర్శకుడి ఉద్దేశ్యం మెచ్చుకోదగ్గదే అయినప్పటికీ మిగతా ఎంటర్టైనింగ్ అంశాలను కొంచెం నిర్లక్ష్యం చేయడంతో సినిమా చాలా చోట్ల ఫ్లాట్ గా సాగిపోయింది. ఫస్టాఫ్లో కథనంలో ఇంకొంచెం ఫన్, కొన్ని పాటల్ని జతచేసే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు అలాంటివేమీ చేయకపోవడం బి, సి సెంటర్ల ప్రేక్షకులను కొంచెం నిరుత్సాపరుస్తుంది. వీటి వలన మొదటిసారి సినిమా చూసి ట్విస్ట్ తెలుసుకున్న ప్రేక్షకుడికి రెండవసారి సినిమా చూడటానికి కనీస కారణాలు కూడా దొరకవు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తీసుకున్నది సాధారణమైన కథే అయినప్పటికీ దాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ చేయడానికి యంగ్ హీరోలను ఎంచుకోవడం, ముఖ్యమైన సెకండాఫ్ ను ఎంటర్టైనింగా రాసుకోవడం, ప్రేక్షకులు సూపర్ అనకపోయినా సమాధానపడేలా క్లైమాక్స్ ఇవ్వడం వంటివి అంశలతో ఆకట్టుకున్నాడు. సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

కెమరా పనితనం ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ క్లియర్ గా, రిచ్ గా కనిపించింది. నిర్మాత ఆనంద్ ప్రసాద్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే శ్రీరామ్ ఆదిత్య పాత్రలకు రాసిన డైలాగులు, పాత్రల చిత్రీకరణ, నాలుగు హీరోలను ఎక్కువ తక్కువలు లేకుండా సమానంగా హ్యాండిల్ చేయడం ఆకట్టుకున్నాయి.

తీర్పు :

నలుగురు హీరోలు కలిసి చేసిన ఈ మల్టీ స్టారర్ చిత్రం వారి స్క్రీన్ ప్రెజెన్స్ వలన ఆసక్తికరంగా తయారైంది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రాసిన సెకండాఫ్ స్క్రీన్ ప్లే, అందులోని ఎంటర్టైన్మెంట్, హీరోల పాత్రలు కథలో ఇమిడిపోయిన తీరు, కన్విన్స్ అవగల క్లైమాక్స్ ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు కాగా అసలు కథలోకి వెళ్లకుండా సాదా సీదాగా సాగే ఫస్టాఫ్, ఇన్వెస్టిగేషన్లో పరిమితులకు అతుక్కుపోవడం, బి, సి సెంటర్లను ఆకట్టుకునే కొన్ని కమర్షియల్ అంశాలు లేకపోవడం, రెండవసారి చూదగిన స్థాయిలో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే నలుగురు హీరోలున్నారు కాబట్టి ఈ ‘శమంతకమణి’ ని ఒక్కసారి చూడొచ్చు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook