సమీక్ష : శతమానం భవతి – మెప్పించే కుటుంబ కథా చిత్రం!

Shatamanam Bhavati review

విడుదల తేదీ : జ‌న‌వ‌రి 14, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : వేగేశ్న సతీష్

నిర్మాతలు : దిల్‌రాజు

సంగీతం : మిక్కీ జే మేయర్

నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ

కథ :

ఆత్రేయపురం అనే ఊర్లోని రాజుగారు (ప్రకాష్ రాజ్), జానకమ్మ (జయసుధ) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పిల్లలంతా విదేశాల్లో స్థిరపడితే, రాజుగారు మాత్రం తన ఊర్లోనే భార్య జానకమ్మ, మనవడు రాజు (శర్వానంద్)తో కలిసి ఉంటారు. విదేశాల్లో స్థిరపడిపోయి ఎప్పుడూ తమను చూడడానికి కూడా రాని పిల్లల కోసం రాజు గారు ఎప్పుడూ కలత చెందుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఆయన ఓ పథకం వేసి, తన పిల్లలంతా సంక్రాంతికి వచ్చేలా చేస్తాడు. ఇలా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆయన మనవరాలు నిత్యా (అనుపమ పరమేశ్వరన్), రాజుతో పరిచయం పెంచుకొని అతడితో ప్రేమలో కూడా పడిపోతుంది. సంక్రాంతి సంబరాలు ఇలా జరుగుతుండగానే, రాజుగారు వేసిన పథకం ఆయన భార్యకు తెలిసి గొడవ జరుగుతుంది. కుటుంబంలోనూ పలు విబేధాలు వస్తాయి. రాజుగారు వేసిన ఆ పథకం ఏంటి? అసలు ఆయన తన పిల్లలకు ఏం చెప్పాలనుకొని ఆ పథకం వేశాడు? రాజు, నిత్యాల ప్రేమకథ ఏమైంది? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే క్లీన్ ఫ్యామిలీ ఎమోషన్స్ అనే చెప్పాలి. ఎక్కడా అతికి పోకుండా కుటుంబమంతా ఆస్వాధించేలా ఆద్యంతం ఎమోషన్స్‌తో కట్టిపడేసేలా సన్నివేశాలను రాసుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కుటుంబ విలువల గురించి చెప్పే సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఫ్యామిలీ డ్రామా అయినా కూడా సినిమాలో వీలైనంత మేర కామెడీ ఉండేలా చూడడం కూడా ఓ ప్లస్ పాయింట్‌గానే చెప్పాలి. నరేష్ కామెడీ బాగా ఆకట్టుకుంది.

శర్వానంద్ తన స్టైల్లో ఎనర్జిటిక్‌గా బాగా నటించాడు. అనుపమ పరమేశ్వరన్ తన పాత్రలో ఒదిగిపోయి నటించేసింది. వీరిద్దరి పెయిర్ చూడముచ్చటగా ఉండడంతో పాటు, ఇద్దరూ పోటీపడి నటించడంతో మంచి ఫీల్ వచ్చింది. ఇక ప్రకాష్ రాజ్, జయసుధలు తమ స్థాయికి తగ్గ నటన ప్రదర్శించారు. నరేష్, ఇంద్రజ ఇలా మిగతా తారాగణమంతా తమ పరిధిమేర బాగానే నటించారు. సినిమా పరంగా చూస్తే సెకండాఫ్‌తో పోలిస్తే ఫస్టాఫ్ బాగా ఆకట్టుకుందని చెప్పొచ్చు.

మైనస్ పాయింట్స్ :

పెద్దగా ట్విస్ట్‌లేమీ లేకుండా అన్ని ఫ్యామిలీ సినిమాల్లో కనిపించే కథనే చూస్తూ ఉన్నట్లనిపించడం మైనస్‌గానే చెప్పాలి. ఇక సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా లేకున్నా, ఫ్యామిలీ సినిమా ఫార్మాట్‌లో సాగిపోవడం కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. కొన్నిచోట్ల కావాలని ఇరికించిన కామెడీ సన్నివేశాలు అస్సలు ఆకట్టుకునేలా లేవు.

ఇక సెకండాఫ్‌లో సినిమా వేగం తగ్గడం కూడా మైనస్‌గానే చెప్పాలి. కథా అవసరానికి మించి నెమ్మదిగా నడుస్తూ అక్కడక్కడా సినిమా కాస్త బోర్ కొట్టించింది. ఇక రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాల్లోని అంశాలు ఈ సినిమాలో లేకపోవడం అలాంటి వాటినే కోరేవారిని నిరుత్సాహపరచే అంశం.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా దర్శకుడు సతీష్ అనవసరమైన అంశాల జోలికి పోకుండా చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేశాడు. కుటుంబ విలువలను తెలియజేస్తూ ఆయన రాసుకున్న పలు సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. చిన్న ట్విస్ట్‌తోనే కథను బాగానే నడిపించాడు. ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని అందించడంలో మంచి విజయం సాధించిన సతీష్, సెకండాఫ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది.

మిక్కీ జే మేయర్ అందించిన పాటలన్నీ సినిమా మూడ్‌కు తగ్గట్టు బాగున్నాయి. అదేవిధంగా ఆ పాటల చిత్రీకరణ కూడా బాగుండడంతో తెరపై ఈ పాటలే మరింత అందంగా కనిపించాయి. సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి పనితనాన్ని మెచ్చుకోవచ్చు. విజువల్‌గా సినిమా ఎక్కడా తగ్గకుండా, గ్రామీణ వాతావరణాన్ని చక్కగా చూపిస్తూ ఆయన చూపిన ప్రతిభ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. దిల్‌రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కు వంక పెట్టడానికి లేదు.

తీర్పు :

విదేశాల్లో స్థిరపడిపోయి ఇంటిని మరిచిపోయిన పిల్లలు, వారిని చూడాలని రోజూ కలలు కనే తల్లిదండ్రులు.. ఈ రెండు ఆలోచనలను కలుపుతూ, కుటుంబ విలువల గురించి చెప్పే ప్రయత్నం చేసిన సినిమాయే ‘శతమానం భవతి’. కుటుంబ విలువలను చెప్పే క్రమంలో వచ్చే సన్నివేశాలు, బలమైన ఎమోషన్స్, ప్రధాన తారాగణం నటన, వీటన్నింటి మధ్యనే సరదాగా నవ్వించే కామెడీ లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో సెకండాఫ్ కాస్త నెమ్మదించడం లాంటి మైనస్‌లు కూడా ఉన్నాయి. చివరగా, ఒక్కమాటలో చెప్పాలంటే.. కుటుంబ కథా చిత్రాలన్నీ ఒకేలా ఉన్నట్లనిపించినా, అందులోనే ఏదైనా కొత్తదనం చూపే ప్రయత్నం చేస్తే, అలాంటి సినిమాలు విజయం సాధించడం చాలాసార్లు చూశాం. ‘శతమానం భవతి’ సరిగ్గా అలాంటి ఒక కుటుంబ కథా చిత్రం!

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :